[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా కెన్నీ బాసుమటారీ దర్శకత్వం వహించిన అస్సామీ సినిమా ‘లోకల్ కుంగ్ ఫూ’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘లోకల్ కుంగ్ ఫూ’ (అస్సామీ)
వ్యాపారాన్ని వ్యాపార మనస్తత్వంతో ఢీ!
మణిపూర్ రాష్ట్రంలో బాలీవుడ్ సినిమాలు మణిపూర్ సంస్కృతిని ధ్వంసం చేస్తున్నాయని తీవ్రవాద దళాలు కల్పించుకుని బాలీవుడ్ సినిమాలు విడుదల కాకుండా చూశాయి. అక్కడ్నించీ మణిపురీ సాంస్కృతిక సినిమాలతో మణిపూర్ సినిమా పరిశ్రమ ఎదుగుతూ వచ్చింది. కానీ అస్సాంలో బాలీవుడ్‌తో బాటు హాలీవుడ్ సినిమాలూ రాజ్యమేలుతూ అస్సామీ సినిమాలకి నిలువ నీడ లేకుండా చేశాయి. ప్రేక్షకులు అస్సామీ వాస్తవిక సినిమాలకిక వీడ్కోలు చెప్పేసి బాలీవుడ్, హాలీవుడ్ వ్యాపార సినిమా ఆకర్షణల వెంటపడ్డారు. ఇలాటి పరిస్థితుల్లో అస్సామీ సినిమా ఏం తీసి సాధిస్తాడు ఔత్సాహిక దర్శకుడు?
ఈ బడా వ్యాపారంలో తను ఓ బడుగు వ్యాపారిగా తోసుకు వెళ్లడమే మార్గంగా ఉత్తమమని తల్చాడు కెన్నీ. తోవ దొరక్కపోతే తోసుకు వెళ్లడమే. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో కుర్రకారు వేటికి దాసోహమయ్యారో అవే మాతృ భాషలో అందిస్తే సరి అనుకున్నాడు. అస్సాంలో బాలలు ఏం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా తల్లిదండ్రులు మార్షల్ ఆర్ట్స్ తప్పక నేర్పిస్తారు. కరాటే, కుంగ్ ఫూ నేర్చుకోకుండా పెరిగిన వాళ్ళుండరు అస్సాంలో. దీన్ని టార్గెట్ చేశాడు కెన్నీ.
ముందుగా స్క్రిప్టు రైటింగ్ నేర్చుకుందామని ఇనిస్టిట్యూట్‌లో చేరాడు. అక్కడ సినిమాల కోసం స్క్రిప్టుల మీద పనిచేయించుకుని వదిలేశారు. ఎడిటింగ్ వైపుకి వెళ్లిపోయి డాక్యుమెంటరీ ఎడిటింగ్ చేశాడు. ముంబాయిలో అన్న టోనీ సంగీత రంగంలో వున్నాడు. అన్నతో కలిసి మ్యూజిక్ ఆల్బం చేశాడు. ఇలా ఒక గోల్ అంటూ లేకుండా ఏది పడితే అది చేయసాగాడు
చిట్ట చివరికి ఇక కుంగ్ ఫూ కామెడీ తీయడానికి డిసైడ్ అయిపోయాడు. నిర్మాతల కోసం కాలం వృథా చేయకూడదు. తనే నిర్మాత, తనే దర్శకుడు, హీరో, రచయిత, మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్ కంపోజర్, అప్పుడపుడు మేకప్ మాన్, అప్పుడప్పుడు కెమెరా మాన్, అప్పుడప్పుడు ఎలక్ట్రీషియన్, కుక్, డ్రైవర్ కూడా!
అన్న ఆడియో స్టూడియో వుండనే వుంది, ఒక చిన్న కానన్ ఎసెల్లార్ కెమెరా కొనుక్కుంటే సరిపోతుంది. కుంగ్ ఫూ కామెడీయే ఎందుకు తీయాలంటే, పైన చెప్పుకున్నట్టు, తను టార్గెట్ చేసినట్టు, అస్సాంలో కుంగ్ ఫూ నేర్చుకోని మగ పిల్లలు, ఆడ పిల్లలు అంటూ ఎవరూ లేరు. వాళ్ళందరూ చూస్తారు. తను చిన్నప్పట్నుంచీ కుంగ్ ఫూలో ఆరితేరిన వాడే. ఇరవై ఏళ్లుగా కుంగ్ ఫూ మాస్టర్‌గా వుంటున్న మేనమామ నేర్పాడు. ఒక ఆరు కుంగ్ ఫూ ఫైట్లు పెట్టుకుని, వాటి మధ్య లవ్ స్టోరీ పెట్టుకుని, కామెడీగా తీస్తే వర్కౌట్ అవుతుంది. దేశం లోనే ఇంత వరకూ కుంగ్ ఫూ కామెడీ ఎవరూ తీయలేదు. కాబట్టి అందరి దృష్టిలో పడుతుంది.
అమ్మదగ్గర అరవై వేలు అడుక్కున్నాడు. తన దగ్గర ముఫై ఐదు వేలున్నాయి. ఇంతకి మించి ఒక్క రూపాయీ పెట్టదల్చు కోలేదు వెంచర్‌కి. 95 వేల అల్ట్రా అత్తెసరు బడ్జెట్ మూవీ, అంతే. 44 వేలు పెట్టి కానన్ కెమెరా కొన్నాడు. 55 – 250 ఎంఎం లెన్సులకి 11 వేలు అయింది. 5 వేలు పెట్టి వీడియో మిక్సర్ కొన్నాడు. మెమరీ కార్డులు, బ్యాటరీ, ఫిల్టర్లు మొదలైన వాటికి మరో 7 వేలు ఖర్చయ్యాయి. చేతిలో 28 వేలు మిగిలాయి. ఇవి నటీనటులకి, ప్రాపర్టీస్‌కి, చిలరమల్లర వాటికీ వుంచుకోవాలి.
ప్రొఫెషనల్ గా ఫైట్స్
నటీనటులందరూ బంధువులే, స్నేహితులే. లొకేషన్స్ వాళ్ళ ఇళ్లే. నయాపైసా ఖర్చు లేదు. వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళ తిండి వాళ్ళే తిని, వాళ్ళ బట్టలే వాళ్ళు వేసుకుని వస్తారు. ఒక్క హీరోయిన్ గా ఒప్పుకున్న లోకల్ మలయాళీ యాంకర్ సంగీతా నాయర్‌కే పారితోషికమివ్వాలి. ఆమె ఒక్కతే అత్యధిక పారితోషికం పొందింది. ఆమె మూడు వేలు గౌరవంగా తీసుకుంది. ఉదయం పూట టిఫిన్ బదులు రెండు గుడ్లు పెడుతూంటే హాయిగా తింటూ పోయింది.
ఒక్కడికీ నటన రాదు. కథ మొత్తం కామెడీయే. కాబట్టి కామిక్ టైమింగ్ నేర్పడం కోసం రిహార్సల్స్ పెట్టాల్సి వచ్చింది. ఇది కొన్ని రోజుల పాటు సాగింది. ఎక్స్‌ప్రెషన్లు ఇవ్వడం, పంచులివ్వడం విరగబడి నేర్చుకున్నారు. సినిమాలో వీళ్ళని చూస్తే కొత్త వాళ్ళని ఎవరూ అనుకోరు. ఒక్కరూ డబ్బులు అడగలేదు. నూడుల్స్ పెడితే చాలన్నారు.
ఇక ఫైట్స్ విషయం. ఇది చాలా కీలకం. దీనికోసం మాత్రం డిటైల్డ్‌గా స్టోరీ బోర్డు వేసుకోవాల్సి వచ్చింది. ప్రతీ పంచ్, ప్రతీ కిక్ కనెక్ట్ అయ్యేట్టు, టైట్‌గా వుండేట్టు, కష్టపడి షాట్స్ లిస్టు తయారు చేసుకోవాల్సి వచ్చింది. కుంగ్ ఫూ మాస్టర్ మేనమామ ఫైట్స్ కంపోజ్ చేస్తే, ఆయన స్టూడెంట్స్ కొందరు ఫైటర్స్‌గా పనిచేశారు. మేనమామ ‘ది మాస్టర్’ అనే పాత్ర కూడా వేశాడు. ఫైట్ సీన్స్‌కి వైర్ వర్క్, స్పెషల్ ఎఫెక్ట్స్ వంటి వాటికి బడ్జెట్ లేదు. స్వయంగా గాలిలోకి ఎగిరి కిక్ లిచ్చుకునే షాట్స్ గాల్లోకే ఎగిరి కిక్ లిచ్చుకున్నారు. హీరోగా తను కుంగ్ ఫూ నేర్చుకున్న ఫైటరే అయినా, గాల్లోకి ఎగిరి నప్పుడు మాత్రం కిక్ మిస్ అయ్యింది. తనూ విలన్ ఎదురెదురు పైకి గాల్లోకి జంప్ చేసినప్పుడు, తన ఛాతీ మీద విలన్ కిక్కివ్వాలి. ఆ మొదటి టేకులోనే ఆ కిక్ మిస్ అయ్యి, తన తొడకి ఫెడీమని తగిలింది. రెండు వారాలు హాస్పిటల్లో పడ్డాడు.
తర్వాత 28 టేకులు తీస్తే, పర్ఫెక్టుగా అనుకున్న విధంగా షాటు వచ్చింది. ఈ షాట్‌నే పోస్టర్ మీద లీడ్ విజువల్ గా వాడుకోవడం జరిగిందన్నమాట. ఫైట్ సీన్లు కన్విన్సింగ్‌గా, ప్రొఫెషనల్‌గా అన్పించడానికి, ఒక్కో షాట్ కోసం మూడ్రోజులు ఉదయానే మూడేసి గంటలు ప్రాక్టీసు చేయాల్సి వచ్చేది. ఎక్కువ లెంత్ వుండే కాంప్లికేటెడ్ షాట్స్‌కి ఇంకా ఎక్కువ రోజులు ప్రాక్టీసు చేయాల్సి వచ్చేది. రెండు వేల రూపాయలు ప్యాడ్స్‌కీ, ఇతర ప్రొటెక్షన్ గేర్స్‌కీ ఖర్చయ్యాయి.
ఇలా కెన్నీ కన్నీ సవాళ్ళే. ఇక నటీనట వర్గం చూస్తే, బయట ఫ్రెండ్స్‌తో బాటు, యాంకర్ సంగీతాతో బాటు, తన కుటుంబం అంతా తారాతోరణమై కదలివచ్చింది. ఒక్క అమ్మ తప్ప, నల్గురు కజిన్లు, ఇద్దరు అంకుల్సు, ఇద్దరు ఆంటీలు, తన అన్న, ఓ ఎనభై ఏళ్ల తాతగారూ! ఇలా మూడుతరాల కుటంబ వారసత్వాన్ని ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసి పారేసి నట్టయింది.
విడుదల విజయం
అతి పెద్ద సవాలు టెక్నికల్‌గా వుంది. ఇంతకి ముందు కెమెరాలతో పనిచేసిన అనుభవం లేదు. ఎండ దంచుతున్నప్పుడు బర్నవుట్స్‌ని ఎలా హేండిల్ చేయాలో తెలీలేదు. ఫ్రేములో ఒకవైపు తెల్లగా వస్తే, ఇంకో వైపు నల్లగా వస్తోంది. ఇంటర్నెట్‌లో చదివి తెలుసుకున్నాడు పరిష్కారం. కొందరు ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్స్‌ని కూడా అడిగాడు. దాంతో వాళ్ళ సలహా మీద న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్లు వాడడడం మొదలెట్టాడు. మెరుపు వేగపు యాక్షన్ సీన్స్‌కి తనే ప్రయోగాలూ అవీ చేసి చేసి, దీనికి హై షటర్ స్పీడ్స్ వాడాలని మర్మం తెలుసుకున్నాడు. ఇక ఇండోర్ లైటింగ్ విషయానికొస్తే, గదుల్లో 200 వాట్స్ బల్బులు మూడువేసి షూట్ చేసేశాడు.
మొత్తానికి నెలరోజుల్లో షూటింగ్ అంతా పూర్తయ్యింది. ఎడిటింగ్ తనే ఇంటి దగ్గర చేసుకున్నాడు. సౌండ్ కోసం, మ్యూజిక్ కోసం ముంబాయిలో అన్న స్టూడియో కెళ్ళాడు. స్క్రీనింగ్ చేసి చూసుకుని సంతృప్తి చెంది, ట్రైలర్ తయారు చేసి యూ ట్యూబ్‌లో పెట్టాడు. ఆ ట్రైలర్ చూసిన పివిఆర్ ఎగ్జిక్యూటివ్ దర్లోవ్ బారువా, దీనికి కమర్షియల్ సినిమా విలువలున్నాయని గుర్తించి, కెన్నీని పిలిపించుకున్నాడు. అస్సాంతో బాటు ఇతర నగరాల్లో విడుదల చేద్దామని, ఒక వెర్షన్ హిందీ డబ్బింగ్ చేయమని కోరాడు. హిందీ డబ్బింగ్‌కి డబ్బులు లేనే లేవని చెప్పేశాడు కెన్నీ. దాంతో సబ్ టైటిల్స్ వేసి విడుదల చేశారు.
ఈ జరిగిందంతా 2013లో. ఈ 83 నిమిషాల తొలి కుంగ్ ఫూ కామెడీకి అన్ని చోట్ల నుంచీ పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. కెన్నీ పెట్టింది 95 వేలే అయినా, పబ్లిసిటీకి మరో ఆరులక్షలు పీవీఆరే భరించింది. మొత్తం కలిపి 30 లక్షల వరకూ వసూలు చేసింది. ఇందులో సుమారు యాభై శాతం కెన్నీకి వస్తే, యూనిట్ లో అందరికీ తలా కొంత పంచాడు.
అప్పటికి అస్సాంలో వున్నవే 45 థియేటర్లు. వీటిలో 12 థియేటర్లే దొరికాయి. దీంతో అన్ని ప్రాంతాల వాళ్ళూ చూడలేకపోయారు. చూసిన వాళ్ళు మాత్రం విపరీతంగా అభిమానించారు. కొన్నేళ్లుగా హిట్లే లేక నష్టాల్లో వున్న అస్సాం సినిమా పరిశ్రమ ఒక్కసారిగా పులకించింది ఈ విజయంతో. నటులు కాని కొత్త నటీనటులందరికీ ప్రజల్లో మంచి క్రేజ్ వచ్చింది. వాళ్ళు బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. గుర్తుండి పోయే పాత్రలతో యూత్ కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది ఈ మూవీ. దీని తర్వాత ‘లోకల్ కుంగ్ ఫూ 2’ అని సీక్వెల్ తీసినా విజయమే లభించింది. అయితే అదే సమయంలో (ఏప్రెల్ 2017) ‘బాహుబలి-2’ విడుదల కావడంతో ‘కుంగ్ ఫూ 2’ ని అర్ధాంతరంగా థియేటర్ల నుంచి ఎత్తేసి అన్యాయమే చేశారు. ‘కుంగ్ ఫూ 2’ తీయడానికి 30 లక్షలు మాత్రమే ఖర్చయ్యింది. షేక్స్ పియర్ నాటకం ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ ఆధారంగా దీన్ని తీశాడు.
బాలీవుడ్‌కి బాట
సున్నా నుంచి మొదలైన ఈ విజయ గాథ చూసినప్పుడు ఇందులో ప్రధానంగా ఐదు కన్పిస్తాయి: షార్ట్ మూవీస్ వ్యయంతో షార్ట్ మూవీస్ కాదు, సినిమా తీయవచ్చని. ఒక నిర్మాత దొరికి సినిమా తీయాలనుకుంటే, ఎక్కువలో ఎక్కువ 30 లక్షల్లో తీయవచ్చని, ఈ సెగ్మెంట్‌ని రెగ్యులర్ సినిమాల మేకింగ్ అద్దాలతో చూడవద్దని. తమకు తామే అవకాశాలు సృష్టించుకోవచ్చనీ. ఇక అయిదవది ఈ నాల్గూ చేయడానికి ఏ నామోషీ ఫీలవనవసరం లేదని.
ఈ ఘన విజయం తర్వాత కెన్నీ ‘లోకల్ కుంగ్ ఫూ -2’, ఆ తర్వాత ‘సస్పెండెడ్ ఇన్స్‌పెక్టర్ బోరో’ తీశాడు 2018 లో. అయితే 2014 నుంచే నటుడుగానూ చేస్తూ వచ్చాడు. ‘రాగ్’, ‘మేరీకోమ్’, ‘లవ్ కా ది ఎండ్’ వంటి అస్సామీ, హిందీ సినిమాల్లో నటించాడు. తిగ్మాంశూ ధూలియా తీసిన ‘రాగదేశ్’ లో నేతాజీ సుభాస్ చంద్ర బోస్‌గా నటించాడు. ‘కమ్మర సంభవం’ అనే మలయాళంలోనూ నటించాడు. తాజాగా ఈ సంవత్సరం విద్యుత్ జామ్వల్, శృతీ హాసన్ లు నటించిన ‘యారా’ లో కూడా నటించాడు.
ఇంతకీ ‘లోకల్ కుంగ్ ఫూ’ కథేమిటి? కామెడీగా సాగే యాక్షన్ కథే. రెండు లోకల్ గ్యాంగులు, మధ్యలో ప్రేమ కథ. ప్రేక్షకులకి దగ్గరయ్యే చాలా ఇన్నోసెన్స్‌తో కూడిన ఫన్నీ క్యారక్టర్స్. రోటీన్ కథకే నూతన కల్పన చేశాడు. దేశం లోనే మొదటి కుంగ్ ఫూ కామెడీ తీయాలన్న ఇన్నోవేటివ్ ఆలోచనే ఫిలిమ్ ఫేర్ అవార్డులకి కూడా నామినేట్ అయ్యేలా చేసింది. అంటే ఇన్నోవేటివ్ ఐడియా వుంటే ఎంత రిచ్ గా తీశారని ప్రపంచం చూడదన్న మాట. ఇక ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ‘చాక్లెట్ గిటార్ మొమోస్’ అనే రోమాంటిక్ కామెడీ నవల రాసి పేరు తెచ్చుకున్న నేపథ్యముంది కాబట్టి, సినిమా కథ రాయడం కష్టం కాలేదు కెన్నీకి.