[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా కౌషిక్ గంగూలీ దర్శకత్వం వహించిన బెంగాలీ సినిమా ‘శబ్దో’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘శబ్దో’ (బెంగాలీ)
కళ వేరూ జీవితం వేరూనా, లేక కళే జీవితమూ జీవితమే కళా? జీవితం ఎక్కువైన కళ కళ అవదా? కళ ఎక్కువైన జీవితం జీవితం కాదా? తూకం తప్పితే రెండూ అభాసేనా? మొదటిది చెత్తబుట్ట లోకి, రెండోది పిచ్చాసుపత్రి కేనా? అంతా కళాకారుడి దయ. ఎలావున్నా లేకపోయినా కళాకారుడనే వాడు తూకం తప్పితే ఇంటా బయటా కల్లోలమే. తనొక సమస్యే. కుడి ఎడమ మెదడుల నిర్వహణ అసలు సమస్య.
డబ్బింగ్ ఆర్టిస్టుకి వాయిస్ రికార్డింగే. సౌండ్ రికార్డిస్టుకి స్పెషల్ ఎఫెక్ట్సే. స్పెషల్ ఎఫెక్ట్స్ వేయాలంటే వాయిస్‌ని మ్యూట్ చేయాలి. కళ కోసం. వాయిస్ వేయాలంటే శబ్ద కాలుష్యాన్ని మ్యూట్ చేయాలి. జీవితం కోసం.
సినిమాల్లో శబ్ద ఫలితాల్ని అభివృద్ధి పర్చిన జాక్ డొనోవన్ ఫోలే (1881-1967) పేరు మీదే శబ్ద గ్రాహకుణ్ణి ఫోలే ఆర్టిస్టు అంటున్నారు. సినిమా శబ్దాలు రెండు రకాలు – సహజ శబ్దం, స్టూడియో శబ్దం. ఫోలే ఆర్టిస్టు సినిమా సన్నివేశాల్లో అవసరమైన అన్ని రకాల శబ్దాల్ని పోస్ట్ ప్రొడక్షన్లో స్టూడియోలో పునరుత్పత్తి చేస్తాడు. అడుగుల చప్పుడు, పక్షుల రెక్కల చప్పుళ్ళు, మోటారు వాహనాల చప్పుళ్లూ మొదలైన అన్ని మానవ, ప్రాకృతిక, యాంత్రిక శబ్దాల్నీ స్టూడియోలో పునః సృష్టి చేస్తాడు. ఇతను కొన్నిఇతర సాంకేతిక శాఖల కళాకారుల్లాగా ప్రజలకి తెలీక అనామకంగా వుండిపోతాడు. కారణం, ప్రముఖ సౌండ్ ఇంజనీర్ ఇ. రాధాకృష్ణ మాటల్లో చెప్పుకుంటే – పాటలూ, నేపథ్య సంగీతం సహా సినిమాల్లో విన్పించే అన్నిరకాల శబ్దాల సృష్టికర్త, సమ్మేళనకర్తా సంగీత దర్శకుడనే ప్రజలు నమ్మేవారు మరి. బావుంది. తర్వాత డీటీస్ వచ్చాక, శబ్దాల సౌజన్యం డీటీఎస్ ఇంజనీర్లదే అని భావించే ప్రేక్షకులు తయ్యారయ్యారు. ఎటొచ్చీ శబ్దగ్రాహకుడు అనామక కళాకారుడు. తెరమీద ఇన్ని రకాల శబ్దాల సృష్టికర్త, ఎక్కడో నిశ్శబ్దంగా వుండిపోతాడు. ఇతణ్ణి వెలుగులోకి తెస్తే?
ఈ పనే చేశాడు ప్రసిద్ధ బెంగాలీ దర్శకుడు కౌషిక్ గంగూలీ. శబ్ద గ్రాహకుడి నిశ్శబ్ద ప్రపంచాన్ని, ఆ ప్రపంచంలో సృష్టించుకున్న మానసిక రుగ్మతల్ని, దాంతో దూరమైన వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్నీ దర్శించాడు. ఇదెలా వుందో చూద్దాం…
కథ
బెంగాలీ సినిమా పరిశ్రమ టాలీవుడ్‌లో తారక్ దత్తా (రుత్విక్ చక్రవర్తి) శబ్ద గ్రాహకుడు. భార్య రత్న(రైమా సేన్) తో సగటు జీవితం గడుపుతూంటాడు. సినిమాల్లో అతడి శబ్దగ్రహణం తొమ్మిది జాతీయ అవార్డులు సంపాదించి పెట్టింది. ఇంకోటి కూడా సాధించుకుని 10 కి చేరాలని ఆలోచన. రికార్డింగ్ థియేటర్లో అతను సౌండ్ ఎఫెక్ట్స్ వేస్తూ ప్రతి సూక్ష్మ శబ్దంలో సంగీతం చూసి తాదాత్మ్యం చెందుతాడు. ఎంతగానంటే బయటికి వెళ్ళినా సరే పరిసరాల శబ్దాల మీదే పూర్తి ధ్యాసంతా పెడతాడు. మనుషుల మాటల మీద ధ్యాస నిలపడు. తనతో ఎవరేం మాట్లాడుతున్నారో విన్పించదు. ఇది ఇంట్లో భార్యతో కూడా సమస్యల్ని సృష్టిస్తుంది. ఆమె ఏమంటోందో తనేమంటున్నాడో పొంతన వుండదు. కప్పుకింద పెడితే ఆ శబ్దం వింటాడు. అందులో సృజనాత్మకత ఆలోచిస్తాడు. ఖాళీ కప్పు ఒక శబ్దం చేస్తే, నిండు కప్పు ఇంకో కప్పు శబ్దం చేయడాన్ని గమనించి, రెండు కప్పుల్నీ లయబద్దంగా తాటిస్తూ గడియారం ముళ్ళ శబ్దాన్ని సృష్టిస్తాడు. చూసి చూసి ఇతడికి పిచ్చిపట్టిందనుకుని మానసిక వైద్యురాలి దగ్గరికి తీసికెళ్తుంది.
డాక్టర్ స్వాతి (చుర్నీ గంగూలీ) ఏమంటోందో తన కనవసరం. తను మాత్రం బయట రోడ్డు మీద వినిపిస్తున్న రకరకాల ట్రాఫిక్ శబ్దాల్లో సౌండ్ ఎఫెక్ట్స్‌ని బాగా బేరీజు వేస్తూంటాడు. ఆమె మాటలు విన్పించవు గానీ, ఆమె చేతిలో తిప్పుతున్న రూబిక్ క్యూబ్ కిర్రుకిర్రుల్ని మాత్రం పాము చెవులతో బాగా వింటాడు. అతడి చెవి అత్యంత పవర్ఫుల్ సెన్సార్. కాగితం కిందపడ్డా కాగితానికే తెలీని శబ్దం అతడి కర్ణేంద్రియాలు చటుక్కున పసిగట్టేస్తాయి. మనిషి ముందుంటాడు, మనసు శబ్దాల్లో వుంటుంది. ఏమంటే ఇది తన వృత్తి అని దబాయింపు.
నీకు చాలా సీరియస్ ప్రాబ్లముందిరా బాబూ అని డాక్టర్ స్వాతి చెప్పి చూస్తుంది. అస్సలు నమ్మడు. రికార్డింగ్ థియేటర్లో అతను పెట్టుకున్న హెడ్ ఫోన్స్ లోకి నేరుగా, బలంగా చెప్పి మరీ చూస్తుంది. హెడ్ ఫోన్స్ తీసి విరగ్గొట్టి పారేస్తాడు. ఇక లాభం లేదని అలా ఓసారి సిలిగురికి హాలిడే తీసికెళ్ల మంటుంది భార్యతో. రైల్లో ప్రయాణిస్తూంటే, పక్క బెర్తులో భోజనాలకి క్యారేజీ విప్పుతూ చేస్తున్న గిన్నెల చెంచాల కంచాల శబ్దాలు అతణ్ణి ఒకటే థ్రిల్ చేస్తాయి. ఇక నిద్రపట్టదు.
సిలిగురిలో ఇంకో కొత్త ప్రపంచం చెవుల్లోకి బార్లా తెర్చుకుంటుంది. భళ్ళుమని ఒలికిపోయి ప్రకృతి విన్పించే రకరకాల అద్భుత స్వర ఝరులు, జలపాతాల గలగలలూ సహా నిలువెల్లా అతణ్ణి శబ్ద స్నానమాడించేస్తాయి. పులకించిపోతాడు. డాక్టర్ స్వాతి ఇలా ప్రకృతిలోకి తీసికెళ్ళ మని చెప్పి చాలా పెద్ద పొరపాటే చేసింది. తారక్ కిప్పుడు కావాల్సినంత శబ్ద స్వేచ్ఛ లభించింది. మనుషుల చెత్త మాటలు ఎడిట్ అయిపోయి, ప్యూర్ పరిసరాల శబ్దాలే శ్రవణానందకరంగా అనుభవిస్తున్నాడు. ఈ స్వేచ్ఛా విహారంతో చెట్టు పుట్టల్లో ఎటు మాయమై పోయాడో మానవుడని గాభరా పడి వెతుక్కోవడం భార్య ఖర్మైంది.
ఇక తన గురువు డాక్టర్ సేన్ (విక్టర్ బెనర్జీ) సాయాన్ని అర్థిస్తుంది డాక్టర్ స్వాతి. అతడితో సైకో ఎనాలిసిస్ సైంటిఫిక్ చర్చ. ఈ చర్చలో ఏం తేల్చారు? ఏం చికిత్స అందించారు? ఈ లోగా మతి భ్రమించిందని ఉద్యోగం కూడా పోగొట్టుకున్న తారక్ పరిస్థితి ఏమైంది? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
ఈ సినిమా కథా నాయక పాత్ర తారక్ దత్తా, ఫ్రెంచి దర్శకుడు రాబర్ట్ బ్రెసన్ సినిమాని గుర్తుకు తెస్తాడు. రాబర్ట్ బ్రెసన్ శబ్ద సౌందర్యమే సినిమాగా ప్రేక్షకుల్ని కట్టేసి కూర్చోబెట్టేసి నిర్బంధంగా శబ్దాన్ని వినిపిస్తాడు. చెవుల్లో ధ్వని తరంగాల్ని నూరి మరీ పోస్తాడు. దీంతో ప్రేక్షకులు పిచ్చివాళ్లయి పోలేదు. అదే శబ్ద శ్రవణం దుర్వ్యసనంగా చేసుకున్న తారక్ పిచ్చోడై పోయాడు. 1956లో బ్రెసన్ తీసిన ‘ఏ మాన్ ఎస్కేప్డ్’ లో ప్రతీ సూక్ష్మ శబ్దం కథ చెబుతుంది. ఒకోసారి బొమ్మని కూడా డామినేట్ చేస్తూ శబ్దం హడావిడి చేస్తుంది. తారక్ ఎలాగైతే మనుషుల మాటల్ని బేఖాతరు చేసి ఇతర శబ్దాల్ని వింటాడో, బ్రెసన్ సినిమా చూస్తూంటే మనం కదిలే బొమ్మల్ని బేఖాతరు చేసి అలా శబ్దాల్ని వినడంలో పడిపోతాం. సేమ్ తారక్ సిట్యుయేషనే మనదీ, పిచ్చోళ్ళవడం తప్పించి.
తారక్‌ని కళ డామినేట్ చేసి సమస్య తెచ్చిపెట్టింది. అతడి జీవితంలోకి సినిమా జొరబడి కల్లోలం రేపింది. కళే ఒక వ్యసనమైనప్పుడు, అది దుర్వ్యసనమైతే ఏమవుతుందో ఈ కథ చెప్తుంది. కళకి తగ్గ ఉపాధి లేక చితికిపోయే జీవితాల్ని చూస్తాం గానీ, కళ ఎక్కువై పోయి కుక్కలు చింపిన విస్తరయ్యే జీవితాల్ని ఇలాటి తారక్ లాంటి అరుదైన నమూనాల్లో చూస్తాం. ఈ అరుదైన కథకి, తెరవెనుక గుర్తింపు లేకుండా మిగిలిపోయిన కళాకారుడు – శబ్ద గ్రాహకుణ్ణి పాత్రగా చేసి, దర్శకుడు కౌషిక్ గంగూలీ చిత్రణ చేయడం ఒక అరుదైన ప్రయోగమే.
మధ్యమంతోనూ ప్రయోగమే
సాధారణంగా మూడంకాల స్క్రీన్ ప్లేలుంటాయి సినిమాలకి. ప్రారంభం, మధ్యమం, ముగింపు. ప్రారంభం పరిచయం, మధ్యమం సమస్య ఏర్పాటుతో కథా ప్రారంభం, ముగింపు సమస్యకి పరిష్కారం. ఈ సినిమాకి రెండంకాలే వున్నాయి: మధ్యమం, ముగింపు. చాలా హాయిగా వుంటుంది- ఎందుకంటే ప్రారంభాలు పాత్రల పరిచయాలతో పదేపదే అవే మార్పు లేని బోరు ప్రహసనాలు. ఈ బోరు అరగంటో, లేదా ఈ రెండు దశాబ్దాలుగా వస్తున్న తెలుగు సినిమాల్లోనైతే గంటో, గంటం పావో భరించాలి. ఇంతసేపూ కథే వుండదు, కథే ప్రారంభం కాదు. కౌషిక్ గంగూలీ ఈ ప్రారంభాన్ని కత్తిరించేశాడు. నేరుగా సమస్యతో మధ్యమం ఎత్తుకున్నాడు. ఇది కథనంతో కొత్తగా అన్పించే ప్రయోగం. ప్రారంభం లేని లోటు అన్పించదు, కథకేం నష్టం లేదు, పాత్రలకేం అస్పష్టత రాలేదు.
శబ్ద గ్రాహకుడిగా కథానాయకుడు తారక్ వినికిడితో కొని తెచ్చుకున్న మానసిక సమస్య తాలూకు దృశ్యాలతో, నేరుగా మధ్యమంతో సినిమా ప్రారంభమై పోతుంది. అతడి సమస్యతో సంఘర్షణ చివరంటా సాగి, పరిష్కారం లభిస్తుంది. ఇలా ప్రారంభం లేకపోవడంతో కథ అనే ప్రధానాంశానికి మధ్యమంతో ఇంత సుదీర్ఘంగా చోటు లభించింది. ఇక్కడొక విశేషం చెప్పుకుంటే, ఈ రెండు దశాబ్దాలుగా వస్తున్న చాలా తెలుగు సినిమాల్లో మధ్యమం వుండడం లేదు. కథా నిర్మాణం పట్ల అవగాహన లేని తరం వచ్చేసి, మధ్యమం లేని ప్రారంభాల సినిమాలే ఇప్పటికీ తీస్తున్నారు. చివరంటా కథే ప్రారంభం కాని ప్రారంభాలు చూపిస్తూ అదే సినిమా కథ అనుకుని ఆనందిస్తున్నారు. ఈ రెండు దశాబ్దాలుగా పట్టుబట్టి తీస్తున్న 90 శాతం తెలుగు అట్టర్ ఫ్లాపుల్లో, మధ్యమం లేని ప్రారంభాల వికృత రూపాలు చాలా వుంటున్నాయి. దీనికి భిన్నంగా కౌషిక్ సుకృతమైన ప్రారంభం లేని మధ్యమంతో, రెండంకాల సినిమా తీసేశాడు.
మూడంకాల్లో మధ్యమంతో ప్రారంభించే సినిమాల్లేక పోలేదు. వాటిలో ఫ్లాష్‌బ్యాక్ రూపంలో మధ్యమం నడి మధ్య ఎక్కడో ప్రారంభాన్ని చూపించి, పరిచయాల తంతుని భర్తీ చేస్తారు. కౌషిక్ ఇది కూడా చేయలేదు. ఎక్కడా ప్రారంభం తాలూకు ఫ్లాష్ బ్యాక్ జోలికి పోయి, నాన్ లీనియర్ కథనం కూడా చేయలేదు.
ఒక్క సీను చాలు
ఈ పాత్రలో రుత్విక్ చక్రవర్తిని తప్ప ఇంకొకర్ని వూహించడం కష్టమే. అతడి ముఖాకృతి, హావభావాలు కళోన్మత్తుడి పాత్రకి అతికినట్టు సరి పోయాయి. పూర్తిగా అంతర్ముఖీన పాత్ర కావడంతో భుజాల మీద పాత్ర నిర్వహణా భారం కూడా చాలానే పడింది. ఒక కలగంటాడు. ఆ కలలో బీచిలో సముద్రపు ధాటికి చెప్పుల షోరూం కొట్టుకు పోయి వుంటుంది. అతను సముద్రపు నీట్లో పడుంటాడు. చేతికి కట్టుకున్న తాయెత్తు హైలైట్ అవుతూ వుంటుంది. కళ్ళు తెరుస్తాడు. ఒడ్డుకి కొట్టుకొచ్చిన ఒక ఎర్రని రబ్బరు బంతి కన్పిస్తుంది. లేచి దాన్ని చేతిలోకి తీసుకుంటాడు. చేతిలో బంతినీ, చెప్పుల షోరూం శిథిలాలనీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ చూస్తూ అలా వుంటాడు.
భద్రతనేది దుర్వ్యసనంగా మార్చుకున్న కళలోనే వుందని అతనెంచుకున్న మార్గానికి చెప్పుల షోరూం సంకేతం. ఇది కాస్తా కొట్టుకుపోయింది. చేతికి తాయెత్తు దుర్వ్యసనంగా మార్చుకున్న కళ పట్ల అతడికున్న ప్రబల నమ్మకానికి గుర్తు. ఎరుపు రంగు బంతి, ఆ నమ్మకానికి చెక్ పెడుతూ అతడిలో డిమాండ్ చేస్తున్న మార్పుకి సంకేతం.
ఇది కల రూపంలో అతడి అంతరంగ సంభాషణ. సంభాషణే కాదు, ఘోష కూడా. సముద్రమంటే ఘోష. ఇదే పరిష్కారం. దీన్ని అర్థం జేసుకోడు. కొత్త జీవిత ఆరంభానికి అక్కడే మోటారు సైకిలు కూడా సిద్ధంగా వుంటుంది దూసుకుపొమ్మని. ఇంతలో డాక్టర్ సేన్ వచ్చి- ఆ బంతి నీకవసరం లేదు, రేపట్నుంచి నువ్వు సౌండ్‌కి దూరంగా వుండాలనీ చెప్పి, బంతి తీసుకుని వెళ్ళిపోతాడు. చాలా నిగూఢార్థమున్న కల. ఈ దృశ్యంలో రుత్విక్ చక్రవర్తి మొహం పసి బాలుడి మొహంలా వుండి, వెంటాడుతుంది మనల్ని(జీవితంలో కొచ్చేసరికి కళాకారుడు పసివాడేనేమో). నటుడిగా అతనేంటో చెప్పడానికి ఈ ఒక్క సీను చాలు. కౌషిక్ సృష్టించిన ఈ డ్రీమ్ సీక్వెన్స్ అద్భుత సైకో థెరఫీ.
భార్య రత్న పాత్రలో రైమా సేన్ కళ్ళే నటిస్తాయి. కళ్ళే ఆమె పాత్ర సంఘర్షణని అభినయిస్తాయి. కళ్ళతో ఆమె పలికించే భావాలు నటిగా ఆమె సగం పనిని సునాయసం చేసేస్తాయి. భర్తని కాపాడుకోవడమే ఆమె సంకల్పమైతే, ఎలా కాపాడాలన్న సవాలు డాక్టర్ గురువు, డాక్టర్ శిష్యులది. డాక్టర్ స్వాతి పాత్రలో చుర్నీ గంగూలీ అత్యంత చలాకీగా వుంటుంది. షెర్లాక్ హోమ్స్‌కి కూడా అంత రీజనింగ్ పవరుండదేమో, అలా చకచకా చేసేస్తుంది మూల్యాంకన రోగం గురించి. డాక్టర్ సేన్‌గా సీనియర్ నటుడు విక్టర్ బెనర్జీ ఇంకో ఆకర్షణ. ఇక సీరియస్‌గా కన్పించే సౌండ్ ఇంజనీరుగా శ్రీజిత్ ముఖర్జీ వుంటాడు. ఛాయాగ్రహణం శిరీషా రే. సంగీతం లేదు. సంగీతముంటే శబ్దాల విలువ తెలియదు. శబ్దం గురించి తీసిన ఈ సినిమాకి శబ్దకారులు దీపాంకర్ చకీ (సౌండ్), అదీప్ సింగ్ మంకీ (సౌండ్ రికార్డిస్ట్), అనిందిత్ రాయ్ (సౌండ్ ఎఫెక్ట్స్ ఎడిటర్), భాస్కర్ రాయ్ (రీ రికార్డింగ్ మిక్సర్), అనిర్బన్ సేన్ గుప్తా (సౌండ్). వీళ్ళు ఉత్తమ శబ్దగ్రహణానికి జాతీయ అవార్డు నందుకున్నారు. సినిమాకి 2012 ఉత్తమ బెంగాలీ చలనచిత్రం అవార్డు లభించింది.
నార్మలేనా ముగింపు?
వినికిడితో అతడి సమస్య నిజంగా సమస్య కాకపోవచ్చు. అతణ్ణొక మానసిక రోగిగా నిర్ధారించి నార్మల్‌కి తెచ్చే చికిత్స అవసరం లేదేమో. ప్రపంచానికో దురలవాటుంది. మనుషులు నార్మల్‌గా వుండాలని. ప్రపంచానికి నచ్చినట్టే మనుషులుండాలి. అయితే ప్రపంచానికి నచ్చినట్టు తారక్ వుండనవసరం లేదు, ప్రపంచమే అతడికి నచ్చినట్టు వుండొచ్చు. వినికిడితో అతడి అతి సమస్య కానవసరం లేదు. ఆ అతితో అతనొక జీనియస్ అయివుండొచ్చు. రేపెప్పుడైనా ముంచుకొస్తున్న ఏదైనా ప్రమాదం నుంచి తన వినికిడి టాలెంట్‌తో మానవాళిని అతను కాపాడొచ్చు. సమస్య అని చెప్పి, నార్మల్ కి తెచ్చే మూస ప్రయత్నంతో, అతడిలో దాగున్న జీనియస్‌ని చంపేయనవసరం లేదు. కళాకారుడు కళతో పిచ్చివాడే అవడు, పిచ్చివాడిలా అన్పించే జీనియస్ కూడా అవొచ్చు.
ప్రధాన స్రవంతి సినిమా, సమాంతర సినిమా, తప్పితే ప్రత్యామ్నాయ సినిమా అనేదొకటుంది. రెబెల్, రాడికల్, రియలిస్టిక్ ముగింపులున్నాయి. అన్నీ జరిపించే ప్రకృతి ఆలోచన లేకుండా ఏదీ జరిపించదన్న అర్ధంలో కిషోర్ కుమార్ పాట కూడా తయారుగా వుంది. లోకం చూస్తున్న తారక్ ‘వినికిడి సమస్య’ కూడా ఒక అర్థం తోనే ప్రాప్తించి వుండొచ్చు. కలలో ఎర్రబంతి దొరికినప్పుడు – నా సోకాల్డ్ సమస్యతో నేను జీనియస్‌ని, మీ మూస నార్మల్ చట్రంలో నేను ఇమడను పొండి – అని డాక్టర్‌కి బంతి ఇవ్వకూడా – మోటారు సైకిలు మీద జామ్మని దూసుకుపోయుంటే – ఈ సమాంతర సినిమా కథ, ప్రత్యామ్నాయ సినిమా కథగా ఇంకో మెట్టు పై స్థాయిలో వుండేది. జీనియస్ @ మోడరన్ టైమ్స్.