లోకల్ క్లాసిక్స్ – 44: ఛాన్సు కొద్దీ స్వేచ్ఛ!

2
2

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన మరాఠీ/హిందీ సినిమా ‘అస్తిత్వ’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘అస్తిత్వ’ (మరాఠీ/హిందీ)

[dropcap]బా[/dropcap]లీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించిన తొలి రెండు సినిమాల తోనే తన స్కూలేమిటో స్పష్టం చేశాడు. ‘వాస్తవ్’ (1999), ‘అస్తిత్వ’ (2000) రెండూ సమాంతర సినిమా ధోరణులతో తీశాడు. ఆ తర్వాత నేటి 2021 వరకూ తీస్తూ వచ్చిన ఇంకో పాతిక సినిమాలు కూడా ఇదే బాట పట్టాయి. ఈ మొత్తం 27 సినిమాల్లో ఒకదానికే జాతీయ అవార్డు లభించింది. అది ‘అస్తిత్వ’. దీన్ని మరాఠీ, హిందీ భాషల్లో తీశాడు. టబు ప్రధాన పాత్ర పోషించింది. స్త్రీ స్వేచ్ఛ, అస్తిత్వ పోరాట కథలతో అనేక సినిమాలొచ్చాయి. ఐతే దర్శకుల్లో కొత్త కెరటంగా ప్రవేశిస్తూ ఈ కథతో తను ఏం తేడా చూపించి వుంటాడన్నది ఆసక్తి కల్గించే అంశం. తేడా చూపించడానికి తీసుకున్న అరువు కథ ఎంత మేరకు ఉపయోగ పడిందనేదీ ప్రశ్నే. వీటి కెలా న్యాయం చేశాడో చూద్దాం…

కథ

1999లో పుణెలో అదితీ పండిత్ (టబు) 50 ఏళ్ల గృహిణి. ఓ కంపెనీ అధిపతి అయిన భర్త శ్రీకాంత్ పండిత్ (సచిన్ ఖెడేకర్), అనికేత్ (సునీల్ బార్వే) అనే కొడుకూ వుంటారు. గృహిణిగా 27 ఏళ్లూ భర్త సేవలో, కొడుకు పెంపకంలో, ఇతర ఇంటి బాధ్యతల్లో గడిపేసింది అదితి. కొడుకు అనికేత్, రేవతి (నమ్రతా శిరోద్కర్) ని ప్రేమిస్తూంటాడు. రేవతి ఆధునికురాలు, తనకంటూ ఓ వ్యక్తిత్వముంటుంది. ఇలా వుండగా, ఓ రోజు శ్రీకాంత్ స్నేహితుడు డాక్టర్ రవీ బాపట్ (రవీంద్రా మల్కనీ), అతడి భార్య మేఘన (స్మితా జయకర్) గోవా నుంచి వస్తారు. వాళ్ళతో విందు కార్యక్రమంలో వుండగా, ఒక రిజిస్టర్డ్ పోస్టు అందుతుంది శ్రీకాంత్‌కి. విప్పి చూస్తే, మల్హర్ కామత్ (మోహనీష్ బహల్) అనే సంగీతకారుడు చనిపోతూ రాసిన వీలునామా అది. కోట్లాది రూపాయల ఆస్తిని అదితికి రాసేశాడు. దీంతో శ్రీకాంత్‌కి అనుమానం వచ్చి, పాతికేళ్ళ క్రితం రాసుకున్న డైరీ తీసి చూసుకుంటాడు. అప్పట్లో తను పని చేస్తున్న కంపెనీ తరపున విదేశీ ప్రయాణాల్లో వున్నాడు. తిరిగొచ్చాక తను గర్భవతైనట్టు చెప్పింది అదితి. ఆ ఆనందంలో ఇంకేమీ ఆలోచించలేదు తను. సెలబ్రేట్ చేశాడు. ఇప్పుడు చూస్తే మల్హర్ ఇలా అదితికి వీలునామా రాయడంలో అర్థమేమిటి? ఇద్దరూ ప్రేమలో పడ్డారా? కొడుకు అనికేత్ వాళ్ళకే పుట్టాడా? ఈ అనుమానాలతో అదితిని నిలదీస్తాడు.

దీనికి అదితి ఏం సమాధానం చెప్పింది? మల్హర్‌తో సంబంధం ఒప్పుకుందా? ఒప్పుకుంటే ఏం జరిగింది? తనకంటూ ఓ జీవితం లేకుండా కుటుంబం కోసం ధారబోసిన ఇరవై ఏడేళ్ళూ ప్రశ్నార్థకమయ్యాయా? తన అస్తిత్వం కోసం, స్వేచ్ఛ కోసం ఇక నిర్ణయం తీసుకోక తప్పలేదా? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ.

ఎలా వుంది కథ

ప్రసిద్ధ ఫ్రెంచి రచయిత గైడి మపాసా 1888 లో రాసిన ‘పియర్ ఎట్ జీన్’ నవలిక ఈ సినిమా కాధారమని సమాచారం. ఈ నవలిక తెరానువాదాల వివరాలు చూస్తే, 1943లో ఇదే టైటిల్‌తో ఫ్రెంచి సినిమా, 1955లో ‘వుమన్ వితౌట్ లవ్’ అన్న మెక్సికన్ సినిమా తీశారు. తిరిగి ఇటీవల 2015లో ‘పీటర్ అండ్ జాన్’ అని హాలీవుడ్ సినిమా తీశారు. మంజ్రేకర్ ‘అస్తిత్వ’ పేరుతో 2000లో తీశారు. ఫ్రెంచి, హాలీవుడ్ సినిమాలని నవలికలోని 19 శతాబ్దపు కథ గానే తీస్తే, మెక్సికన్ సినిమా 1955 కథా కాలానికి మార్చి తీశారు. ఫ్రెంచి సినిమాని ఫ్రాన్సు నేపథ్యంతో తీస్తే, హాలీవుడ్‌ని ఇంగ్లాండు నేపథ్యంతో తీశారు. మెక్సికన్‌ని మెక్సికన్ నేపథ్యంతో తీశారు. ఫ్రెంచి, హాలీవుడ్ సినిమాలు నవలికలో లాగే అన్నదమ్ముల కథలైతే, మెక్సికన్ సినిమాని అన్నదమ్ములతో పాటు, నవలిక లోని భార్యాభర్తలతో కలిపి ఉమ్మడి కథగా తీశారు. ‘అస్తిత్వ’ని మంజ్రేకర్ కేవలం భార్యాభర్తల కథగా మార్చి తీశారు. రచనా కోవిదుడు మపాసా మేధస్సుకి మెరుగులు దిద్ది, తన సంతృప్తి మేర పాళీ అరగా మపాసా క్లాసిక్ నవలికని సంస్కరించి, తన దృశ్య కావ్యంగా ఆవిష్కరించారు. ఉత్తమ సినిమా బహుమతి నందుకున్నారు. సినిమా లోని అదితి పాత్రకి లాగే బహుమతిని ప్రశ్నార్ధకం చేశారు.

నటనలు – సాంకేతికాలు

టబుకిది ఫిలిమ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డు పాత్ర. ఆమె ప్రతిభ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యువ పాత్రలో కాసేపే కన్పిస్తుంది గానీ యాభై యేళ్ళ సంఘర్షణాత్మక పాత్ర నిడివి ఎక్కువ. చీరలు మార్చడం కూడా ఎక్కువ. కేవలం కళ్ళద్దాలు పెట్టుకుని యాభయ్యేళ్ళ పాత్రయి పోకుండా, ఓ రెండు నెరసిన శిరోజాలు కూడా మెరిపిస్తే బావుండేది. గుల్జార్ తీసిన ‘ఆంధీ’ (1975)లో సుచిత్రా సేన్‌లా. అప్పుడు కష్టాల్లో పడిన ఒంటరి గృహిణిగా ఎక్కువ సానుభూతి కల్గించేది. ఆత్మ రక్షణలో పడినప్పుడు, అహం దెబ్బతిన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో పడ్డప్పుడు, ఎదురు తిరిగినప్పుడూ ప్రదర్శించిన నటన నీటుగా వుంది. అయితే ఒప్పుకున్న కథతో, పాత్రచిత్రణతో వచ్చింది సమస్య. ఈ రెండూ కుంటుపడితే ఎంతబాగా నటించీ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకోలేదు. కథ, స్త్రీ పాత్ర అర్థరహితంగా వున్న విషయం తన స్త్రీ హృదయంతో గ్రహించి దర్శకుడికి చెప్పి వుండాల్సింది. మపాసా మనస్సుతో చూడమనాల్సింది.

శ్రీకాంత్ పాత్రలో సచిన్ ఖెడేకర్‌ది కూడా మంచి నటనే. మంచి క్లోజప్స్ ఇచ్చాడు. కెమెరామాన్ విజయ్ అరోరా సచిన్ భావప్రకనలు బాగా ఎలివేటయ్యే యాంగిల్స్‌లో కెమెరాతో పట్టుకున్నాడు. కొన్ని క్లోజప్స్ గుర్తుండి పోతాయి. అయితే సచిన్ పాత్రకూడా లోపాలమయమే. ఆధునిక యువతి రేవతిగా నమ్రతా శిరోద్కర్ పాత్ర చాలా కృత్రిమ ఫార్ములా పాత్ర నటించింది. పాత్ర నిడివి తక్కువ. సంగీత కారుడు మల్హర్ గా మోహనీష్ బహల్ వీలునామా రాసే ముసలివాడుగా సినిమా ప్రారంభిస్తాడు. ఆ తర్వాత యువపాత్రలో ఫ్లాష్‌బ్యాక్‌లో కన్పిస్తాడు. రెండు సహాయ పాత్రల్లో రవీంద్రా మల్కనీ, స్మితా జయకర్ ఇద్దరే కాస్త అర్ధవంతమైన పాత్రల్లో కన్పిస్తారు.

లొకేషన్ పుణె పరిసర విల్లాలో పచ్చదనాల మధ్య వుంది. ఎక్కడా నగర దృశ్యాలు తీసుకోలేదు. ఈ కెమెరా వర్క్ అంతా ప్లెజంట్‌గా వుంది. రాహుల్ రణడే, సుఖ్విందర్ సింగ్‌ల సంగీతం మృదువుగా వుంది. ఈ తిరుగుబాటు కథని అరుపులతో తీయకపోవడమొక రిలీఫ్.

మపాసా మనసు – మంజ్రేకర్ సొగసు

ఈ సినిమాకి ఉత్తమ సినిమా బహుమతే ప్రశ్నార్ధక మన్నప్పుడు, ఇంకా ‘లోకల్ క్లాసిక్స్’ శీర్షికకి రాయడమేమిటి? 2000 సంవత్సరపు ఉత్తమ మరాఠీ చలన చిత్రంగా జాతీయ అవార్డు పొందిన దీని పాత్రలు, కథా కథనాలు అంత గందరగోళంగా వున్న విషయం తెలియజేయాలిగా? మపాసా నవలిక ఇంగ్లీషు అనువాదం పిడిఎఫ్ అందుబాటులో వుంది. దీన్ని చదవ లేదు. దీని కథా సంగ్రహాన్ని, దీని మీద వచ్చిన కొన్ని సమీక్షల్నీ చూస్తే, మపాసా ఈ కథని ఎందుకు అన్నదమ్ముల కథగా రాశాడో తెలుస్తుంది. వాళ్ళ అమ్మ తప్పు చేస్తే ఇద్దరు కొడుకుల్లో చిన్న కొడుకు అక్రమ సంతాన మయ్యాడు. వాళ్ళు పెద్ద వాళ్ళయ్యాక ఈ నిజం తెలిస్తే, ఎప్పుడో పాతికేళ్ళ క్రితం తప్పు చేసిన వాళ్ళమ్మ శీలం గీలం ఇప్పుడు ప్రశ్న కాబోదు, ఆమె జీవితం గడిచిపోయింది. ఆమెని నిలదీయడం, శిక్షించడం అవివేకం. ఇక ముందు గడవాల్సింది ఇప్పటి అన్నదమ్ముల జీవితాలు, వాళ్ళ మధ్య సంబంధాలు. ఇదీ కథకి డ్రమటిక్ క్వశ్చన్. దీని గురించి కథ చెప్పాలి. కనుక నవలిక పేరు కూడా అన్నదమ్ముల మీద ‘పియర్ ఎట్ జీన్’ అని పెట్టి రాశాడు. అంతే తప్ప, ఆ వయస్సులో వాళ్ళమ్మ స్వేచ్ఛా విముక్తుల గురించి అసందర్భ కథ చేయలేదు.

వాళ్ళమ్మ జీవితం కూడా ఎలా వుండేదో చూపించాడు. అప్పటి ఫ్రాన్సు పెట్టీ బూర్జువా కుటుంబాల్లో ఆడదాని జీవితం. భర్తతో ఏ సుఖమూ లేదామెకు. దాంతో ఒకడి ప్రేమలో పడింది. అతడితో లేచిపోదామనుకుని కూడా ప్రయత్నించింది. భర్త ఆరోగ్యం పాడయిపోవడంతో, అప్పటికే వున్న కొడుకు అనాథ అవుతాడని ఆగిపోయింది. అంటే విముక్తి కోసం ఆనాడే విఫల యత్నం చేసింది. అంతేగానీ, ‘అస్తిత్వ’లో అదితి లాగా ప్రేమించిన సంగీతకారుడితో ఆనాడే లేచిపోక, కొడుకుని కూడా కనీ, భర్తని వంచిస్తూ గడపలేదు. తీరా పాతికేళ్ళ తర్వాత భర్త ఆమె తప్పుని పట్టుకుంటే, అప్పుడు స్త్రీ శక్తీ విముక్తీ అంటూ వాకౌట్ చేయలేదు.

***

ఈ నవలికలో మపాసా నేచురలిజం సాహిత్య ప్రక్రియతో అద్భుత పాత్ర చిత్రణలు చేశాడు. ఈ పాత్ర చిత్రణల్ని టాల్ స్టాయ్, హెన్రీ జేమ్స్ వంటి మహా రచయితలే కొనియాడారని విశ్లేషకులు రాశారు. భూమ్మీద ప్రతీ జీవి మానసిక సంచలనాలూ ప్రకృతిలోని పంచభూతాల లయల్ననుసరించే వుంటాయనేది నేచురలిజం ప్రతిపాదించే సిద్ధాంతం. దీంతో పాత్రల మానసిక సంచలనాలని చుట్టూ పరిసర వాతావరణ వర్ణణల ద్వారా వెల్లడిస్తాడు మపాసా. సైకలాజికల్‌గా ఈ ప్రయోగం మణిరత్నం తీసిన కొన్ని పాటల చిత్రీకరణల్లో కన్పిస్తుంది. మంజ్రేకర్ అవకతవకగా వున్న అదితి పాత్రకి ఈ ప్రయోగమైనా చేసి మపాసాకి విజువల్ నివాళి అర్పించలేదు.

నవలికలో తల్లి పాత్రతో ఉదాహరణ : … for anything; for a very long time she had not ventured to ask Roland to take her out in the boat. So she had joyfully hailed this opportunity, and was keenly enjoying the rare and new pleasure.

From the moment when they started she surrendered herself completely, body and soul, to the soft, gliding motion over the waves. She was not thinking; her mind was not wandering through either memories or hopes; it seemed to her as though her heart, like her body, was floating on something soft and liquid and delicious which rocked and lulled it.

***

పియర్, జీన్ అన్నదమ్ములు. పియర్ డాక్టర్, జీన్ లాయర్. తండ్రి రోలాండ్ ఇదివరకు నగల వర్తకం చేసేవాడు. తల్లి లూయిస్. మధ్య తరగతి కుటుంబం. పియర్, జీన్ లిద్దరూ రోజ్మిల్లి అనే అమ్మాయి పట్ల ఆకర్షితులవుతారు. ఇలావుండగా, ఒకరోజు పాత కుటుంబ మిత్రుడు మెఫెషల్ రాసిన వీలునామా అందుతుంది. చనిపోతూ తన ఆస్తి సమస్తం జీన్‌కి రాసేశాడు. దీన్ని తండ్రి పెద్దగా పట్టించుకోడు. తల్లికి విషయం తెలుసు. మౌనంగా వుండిపోతుంది. పియర్‌కే అనుమానాలొస్తాయి. మెఫెషల్ జీన్‌కి ఎందుకు వీలునామా రాశాడు? అంత కుటుంబ మిత్రుడైతే తామిద్దరికీ కలిపి రాయొచ్చుగా? ఇది ఇంట్లో అడగడానికి సంస్కారం అడ్డొచ్చి బయట చెప్పుకుంటే, జీన్ మెఫెషల్‌కే పుట్టి వుంటాడని సమాధానం వస్తుంది. దీంతో తీవ్ర మానసిక క్షోభకి గురవుతాడు. ఇంత మాట కన్నతల్లిని అడగలేడు. అల్లరవుతుంది. కుటుంబ పరువు పోతుంది. జీన్‌కే చెప్పేస్తాడు. జీన్ షాక్ తింటాడు. కానీ తల్లి వల్ల ఆస్తిపరుడైనందుకు ఆమెని ఇంకా ప్రేమిస్తాడు. రోజ్మిల్లి కూడా ఇతడ్నే ప్రేమిస్తుంది. జీన్ జీవితం పచ్చగా మారుతూంటే, పియర్ జీవితం మసక బారుతుంది. క్షోభ భరించలేక నిష్క్రమిస్తాడు. నిష్క్రమించడం కాదు, కుటుంబమే బహిష్కరిస్తుంది.

ఆనాటి ఫ్రాన్సు సమాజంలో పెట్టీ బూర్జువా మధ్య తరగతి కుటుంబాలిలాగే వుండేవి. డబ్బు సంపాదించడం, వ్యక్తిగత పరువు ప్రతిష్ఠల్ని కాపాడుకోవడం ఇవే ముఖ్యం. చెప్పుకోలేని క్షోభతో ఇంట్లో సమస్య కాలేక, కక్ష తీర్చుకోవడానికి కుటుంబ ప్రతిష్ఠని పణంగా పెట్టలేకా, వెళ్లిపోయాడు పియర్. అక్రమ సంతానం జీన్ కుటుంబ వారసుడయ్యాడు, వంశాంకురం పియర్ స్థానభ్రంశుడయ్యాడు. జీవితం ఇలా కూడా వుంటుంది. తీపికి పుట్టిన చెరకు ఆకులా సర్రున కోసేస్తుంది. ఇలాటి కథలే గుర్తుంటాయి.

***

 ‘అస్తిత్వ’ కథాకాలం 1999. అంటే 27 ఏళ్ళూ కాపురం చేసిన అదితి వివాహం 1972లో అయివుండాలి. ఆ కాలంలో స్త్రీలు కుటుంబానికి పరిమితమై వుండే వాళ్ళేమో. ‘80ల నుంచీ క్రమంగా న్యూక్లియర్ కుటుంబాలు ఏర్పడుతూ వున్నాక, ఉద్యోగాల్లో చేరడం పెరిగింది. భర్త శ్రీకాంత్ ఉద్యోగరీత్యా తరచూ విదేశాలకి వెళ్తూంటే, ఏకాకిగా వుండలేక ఉద్యోగం చేసుకుంటానంటుంది. ‘నా ఇంట్లో ఆడది సంపాదించకూడదు, నేను పోషించగలను’ అంటాడు. మరీ పట్టుబడితే పొద్దుపోవడానికి సంగీతం నేర్చుకోమంటాడు. అలా సంగీతకారుడు మల్హర్ రంగంలో కొస్తాడు. అలా ‘సుర్ ఔర్ తాళ్ కా సాథ్ నహీ, గానా మేరీ బస్ కీ బాత్ నహీ’ అంటూ అతడితో గళం కలిపి సంగీత సాధన చేస్తూ వుంటుంది. నిజమే శ్రీకాంత్‌తో సుర్ లేదు, తాళ్ లేదు. అతడితో కలిసి సాగడం తన వల్ల కాదు. ఇక సరిగమలే మల్హర్‌తో.

శ్రీకాంత్ తిరిగొచ్చేటప్పటికి నెల తప్పి వుంటుంది. ఎగిరి గంతేస్తాడు. కాస్త చెప్పేది వినూ అని అసలు విషయం చెప్పేద్దామనుకుంటే, చెప్పనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసేస్తాడు. ఇక జీవితంలో చెప్పే అవకాశమే రాలేదన్నట్టుగా కన్వీనియెంట్ గా దాట వేస్తాడు కథకుడు. శ్రీకాంత్‌కి కూడా తను విదేశాల్లో వుంటే నెలెలా తప్పిందని అనుమానం రాదు. పాయింటుని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఒక సీను వేస్తాడు కథకుడు. అతను విదేశాలకి వెళ్ళే ముందు రాత్రి, ఆమె పడక మీదికి ఆహ్వానిస్తే అలసటగా వుంది వద్దంటాడు. ఇప్పుడు తిరిగొస్తే గర్భమేమిటని అనుమానం రాదు అతడికి. వస్తే ఇక్కడే కథ అయిపోతుందని కథకుడి బాధ. ఆ సీనుతో ఈ అనుమానం పాతికేళ్ళ తర్వాత రావడానికి అట్టి పెట్టాడు.

పుట్టిన అనికేత్‌కి పాతికేళ్లు వచ్చాక, చనిపోతూ మల్హర్ ఆస్తిని అదితికి రాసేస్తాడు. దీంతో అనుమానం వచ్చి శ్రీకాంత్ డైరీ తీసి ఛూసుకుని, ఆనాడు తాను విదేశంలో వున్నప్పుడు అదితి కడుపులో అనికేత్ పడ్డాడని లెక్కలు కడతాడు. దీన్ని పట్టుకుని నిలదీస్తే ఇప్పుడు చెప్పేస్తుంది. తుఫాను రేగుతుంది. పుట్టిన కొడుకు అనికేత్ అసహ్యించుకుని పొమ్మంటాడు. మపాసా కథలో నిజం తెలుసుకున్న పెద్ద కొడుకు పియర్, తల్లిని కూడా నిలదీయడు. తుఫాను రేపడు కుటుంబ పరువు దృష్ట్యా. శ్రీకాంత్ మాత్రం గోవానుంచి వచ్చిన మిత్రుల ముందే రభస చేస్తాడు. మిత్రుడి భార్య – ఇది మీ భార్యాభర్తల మధ్య విషయం, మా ముందు చెప్పొద్దన్నా విన్పించుకోడు, అదితి వంచన తెలుసుకుని తీరాలంటాడు. ఇది శ్రీకాంత్ చేస్తున్న రభసలా వుండదు, కథ కోసం కథకుడు చేస్తున్నట్టు వుంటుంది. కథని పాత్రలు నిర్ణయిస్తాయి, పాత్రలు నడిపిస్తాయి, పాత్రలే ముగిస్తాయి. పాత్రల్నికాదని కథకుడు చేస్తే ఎటు పోతుందో తెలీదు. పాత్రలకి కథకుడు సేవకుడే గానీ, దేవుడు కాదు. ఫీలయిపోతే ఫెయిలవుతాడు.

శ్రీకాంత్ ఆమెని వెళ్లి పొమ్మనడు. ఇంట్లోనే వుండమంటాడు. అయితే భార్యాభర్తలుగా వుండ లేమంటాడు. వుండనంటుంది. ప్రశ్నలు కురిపిస్తుంది. అనికేత్‌కి ముందు రెండేళ్లూ నువ్వు తండ్రి కాలేదు, అనికేత్ తర్వాత ఈ పాతికేళ్లూ తండ్రివే కాలేదు- నీ సంగతేంటి? నీ వంధ్యత్వాన్ని నేనెందుకు భరించాను? నువ్వేం భర్తవో ఇప్పుడు తేల్చు- అంటుంది. అతడి దగ్గర సమాధానముండదు.

ఇంతలో శ్రీకాంత్ మిత్రుడందుకుని, ‘ఆమె తప్పు చేసిందంటావ్, నువ్వు చేయలేదా వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకునీ తప్పూ?’ అంటాడు. ఇవన్నీ అదితి వాదాన్ని బలపర్చడానికి, ఆమె తిరుగుబాటుని జస్టిఫై చేయడానికి, ఇప్పటికిప్పుడు కథకుడు శ్రీకాంత్‌కి కల్పిస్తున్న లోపాలు.

దీంతో మగాడివి నీకు లైంగిక స్వేచ్ఛ వుంటే, నాకుండదా – అని ఓపెనై పోతుంది.

27 ఏళ్ళూ చేసిన సేవ తర్వాత తనకేం మిగిలిందంటుంది. తన అస్తిత్వం, స్వేచ్ఛా, విముక్తీ గురించి మాట్లాడి వెళ్లి పోతానంటుంది. ఎక్కడికి వెళ్తావంటే, అనికేత్ ప్రేమించిన ఆధునికురాలు రేవతి వచ్చేసి, అనికేత్ ని నాల్గు దులుపుళ్ళు దులిపి, అదితిని తీసుకుని తను కూడా వాకౌట్ చేస్తుంది. అనికేత్, శ్రీకాంత్ లు గుమ్మంలో నిలబడి అలా చూస్తూ వుం టారు. అదితిది స్త్రీ విజయంగా చెప్తూ పాట వస్తూంటుంది…శుభం పడుతుంది.

***

ఇంతకీ వీలునామా ఏమైంది? వీలునామా వుందన్న ధైర్యంతో అస్తిత్వం, స్వేచ్ఛ, విముక్తీ అంటూ మాట్లాడి వెళ్లిపోయిందా? ఒక పురుషుడి ఆసరా నుంచి ఇంకో పురుషుడే కల్పించిన సుఖవంతమైన ఆర్థిక ఆసరాలోకి? లేకపోతే వెళ్ళేది కాదా? వెళ్తే అదెలాటి స్వాతంత్ర్యమయింది ? Is a woman’s destiny …a man? అని టైటిల్ కింద క్యాప్షన్ ఇచ్చారు. man కాక ఇంకేం చూపించారని? శ్రీకాంత్ కి కూడా ఇంట్లోనే వుండమని చెప్పే జాలి ఎందుకు, నీకు ఆస్తి ఇచ్చాడుగా వెళ్లి పొమ్మనక? ఆ ఆస్తి తను వేసుకుందా మనుకున్నాడా?

కథకి ఉత్ప్రేరక పరికరంలా వున్న కోట్లాది రూపాయల విలువైన అదితికి మల్హర్ రాసిన వీలునామా ప్లాట్ డివైస్ అనుకుంటే, అది రావడమే గానీ ఆ తర్వాత కథలో దాని పాత్రే వుండదు. కథకి అడ్డమని కన్వీనియెంట్‌గా మొదట్లోనే దాచేశాడు కథకుడు తన బల్ల కింద. మపాసా కథలో వీలునామాతో కలిసొచ్చిన సంపద కుటుంబ సంబంధాల్ని ప్రభావితం చేస్తుంది, వాళ్ళ నిజ స్వరూపాల్ని బయటపెడుతూ. డబ్బు ముందు విలువలేమై పోతాయో చెప్పడానికి వీలునామా వాడేడు మపాసా. లేకపోతే కథలో వీలునామా ఎందుకు? ఆ వీలునామాయే పెద్ద కొడుకు పియర్‌ని ఇంట్లోంచి వెళ్లి పోయేలా చేస్తుంది. తల్లి గురించిన నిజాన్ని కడుపులో దాచుకుని అలాగే వెళ్ళిపోతాడు పాపం పియర్.

‘అస్తిత్వ’ కథలో వీలునామా పరిచయంతో ఇంకో సమస్య వుంది. వీలునామా చూడగానే శ్రీకాంత్‌కి అదితి మీద అనుమాన మెందుకు రావాలి. తను ఇలాటి మొగుడా అంటే కాదు. భార్యని ఉద్యోగం చేసుకో నివ్వలేదు తప్ప, ఆమెని అన్నివిధాలా ప్రేమిస్తూనే వున్నాడు, బాధ పెట్టలేదు. ఒకప్పటి శిష్యురాలిగా మల్హర్ వీలునామా రాసి వుండొచ్చని అనుకోవచ్చుగా, డైరీలు తిరగేసేంత అనుమానమెలా వస్తుంది. పాత్ర చెడిపోలేదా? కార్యకారణ సంబంధం సరీగ్గా లేకుండా కథనమెలా వుంటుంది? పాత్రని ఆలోచించ నివ్వకుండా, పాత్ర కోసం కథకుడాలోచించి పడేస్తే ఇలాగే వుంటుంది. మపాసా కథలో పియర్‌కి అనుమాన మెందుకొస్తుందంటే, తనకి కూడా రాయకుండా తమ్ముడికే వీలునామా రాసినందుకు. ఇదీ సహేతుక కార్యకారణ సంబంధమంటే.

సరే, వీలునామాతో అదితిని వరించిన సంపద కథకి కేంద్ర బిందువు కాకుండా పోదు. కథని పాత్ర నడుపుకోపడానికి వదిలేస్తే, శ్రీకాంత్ డిఫెన్స్‌లో పడతాడు. ఒక పక్క డైరీ ద్వారా తెలుసుకున్న నిజం, ఇంకో పక్క అదే నిజం వల్ల అదితికి సంక్రమించిన ఆస్తి. ఏం చెయ్యాలి? ఇదీ డ్రమెటిక్ క్వశ్చన్. దీంతో కథ సాగాలి. నిర్ణయం తీసుకోవాల్సింది శ్రీకాంతే.

అతడికి వంధ్యత్వముందనే అనుకుందాం. ఈ నిజం అనికేత్ పుట్టుకతో ఇలా ఇప్పుడే తనకి తెలిసొస్తోంది. ఇది అదితికి తెలియకుండా వుండదు. అయినా తెలియనట్టే వుంది. ఇప్పుడామె తప్పు పట్టుకుంటే, తన లోపం కూడా బయట పెడుతుంది. ఏం చెయ్యాలి? ఇవన్నీ పక్కనబెట్టి డబ్బుకి దాసోహమైపోవాలా? నిర్ణయం తీసుకోవాల్సింది తనే. ఇది అదితి అస్తిత్వ కథ అవదు. వీలునామా కేంద్రబిందువుగా ఇద్దరి మోరల్ డైలమా కథవుతుంది. ప్రాథమికంగా మపాసా స్టోరీ ఐడియా కిందికి రావాల్సిందే. కానీ వీలునామా సృష్టించిన సంక్షోభంతో పియర్ నిజాన్ని కడుపులో పెట్టుకుని అలా వెళ్లిపోతే, అదితి పాతికేళ్ళు నిజాన్ని కడుపులో గుట్టుగా దాచేసి, తీరా దొంగతనం బైట పడ్డాక, వీలునామాతో దొరికిందే ఛాన్సు అనుకుని అస్తిత్వ ఆలాపనలు చేస్తూ వెళ్లి పోయినట్టుంది. ఫుల్ ఖుష్. పూరా జోష్. మంజ్రేకర్ మస్త్. మరి కొడుకు కాని కొడుకు అనికేత్, తండ్రి కాని తండ్రి శ్రీకాంత్, ఎలా కలిసుందామని గుమ్మంలో నిలబడి జంటగా అలా క్లోజింగ్ షాట్ ఇచ్చారు? వాళ్ళిద్దరూ కలిసుంటే ఆమె కలిసి వుండకూడదా? చాలా కామెడీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here