లోకల్ క్లాసిక్స్ – 46: సిండికేట్‌లో ఇంకో శక్తి

0
2

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా జస్బీర్ భాటీ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘భౌరీ’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘భౌరీ’ (హిందీ)

ఒకే రోజు పట్టపగలు నాటు పిస్తోళ్ళతో ఐదు చోట్ల అయిదు హత్యలు జరుగుతాయి. ఒకే రోజు ఆరు చోట్ల ఆరుగురు బాలికల మానభంగాలు జరుగుతాయి. ఒకే రోజు ఇంకెన్నో చోట్ల చెరిచి చంపిన స్త్రీల మృత దేహాలు దొరుకుతాయి…ఇవి ఆగవు. రోజూ ఏదో ఒక సంఖ్యలో వార్తల్లో వుంటాయి. ఒకమ్మాయిని డాబా మీద తల్లి మందలిస్తే, ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి పిస్తోలు తీసుకుని కాల్చుకుని చచ్చిపోతుంది. ఇంకో అమ్మాయిని ఆమె తల్లి ప్రియుడే తనని లైంగికంగా వేధిస్తున్నాడని పిస్తోలు తీసి కాల్చి పారేస్తుంది. పిస్తోళ్ళు ఇళ్ళల్లో, జేబుల్లో నిత్యావసర వస్తువులయ్యాయి. జాతీయ మీడియాలో ఈ వార్తలు రావు, ప్రతీ రోజూ యూ ట్యూబ్ ఛానెల్స్‌లో వస్తాయి. ఇదే రాష్ట్రమో చెప్పాల్సిన అవసరంలేదు.

ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా అక్కడి గ్రామాల్లో బలవంతుల గుప్పెట్లో భోగ వస్తువులుగా స్త్రీల అగచాట్లు ఇవ్వాళ కొత్త కాదు. గ్రామాల్లో స్త్రీల బ్రతుకులు లైంగిక బానిసల కంటే ఎక్కువ కాదు. అయితే గ్రామాల్లో బలవంతుల్ని చూసి బరితెగిస్తున్న యువత అంతటా పాల్పడుతున్న మూకుమ్మడి మానభంగాలు ఇవ్వాళ కొత్త పరిస్థితి. దీని మీద సినిమా ఇంకా రావాల్సి వుంది. గ్రామాల్లో బలవంతుల వికృత మనస్తత్వాల మీద జగ్ ముంద్రా 2000 లో నందితాదాస్ తో తీసిన రాజస్థాన్ నిజ కథ ‘బవందర్’ ఒక సంచలనం. ఇలాటి నిజ కథలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం 2016లో జస్బీర్ భాటీ తను చూస్తున్న పరిస్థితులతో ‘భౌరీ’ అనే కాల్పనికం తీశాడు. వేశ్యా గృహాల్లో పడతులు బిక్కుబిక్కుమంటూ గడిపినట్టు, గ్రామాల్లో సంసార స్త్రీలు గడిపితే ఎలా వుంటుంది. గ్రామాన్ని ఒక పెద్ద వేశ్యాగృహంగా మార్చేస్తే ఎలా వుంటుంది. అప్పుడు సంసార స్త్రీలు 30 రూపాయలకి బలవంతుడి పక్కలోకి చేరే దృశ్యాలుంటాయి. చేరేదాకా వదలని బలవంతుల సిండికేట్స్ వుంటాయి.

అలాటి బాధితురాలే భౌరీ (మాషా పోర్) అనే స్త్రీ. ఈమెకి ఇరవై మూడేళ్ళ ప్పటికే ముగ్గురు భర్తలు చనిపోయి, నాల్గో పెళ్ళితో ధనువా (రఘువీర్ యాదవ్)కి భార్య అయి కాపురానికొస్తుంది. షరా మామూలుగానే నష్ట జాతకురాలని అవమాన పడుతుంది. గ్రామంలో తాజాగా వస్తువుగా సిండికేట్ కళ్ళల్లో పడుతుంది. ధనువా ఇటుక బట్టీలో పనిచేస్తూంటాడు. ఇటుక బట్టీ యజమాని (ముఖేష్ తివారీ) ధనువా కొత్త కాపురం గురించి అసభ్య జోకులేస్తూంటాడు. షావుకారి (మనోజ్ జోషి) దగ్గరికి సరుకుల కోసం పోతే, అతనూ అసభ్యంగా మాట్లాడతాడు. ధనువా జీతం డబ్బుల కోసం పోతే సర్పంచ్ (మోహన్ జోషి) కూడా ఇదే ధోరణి. వూళ్ళో డాక్టర్ (శక్తి కపూర్) అయితే ధనువా ఇంటి ముందు చక్కర్లు కొడుతూ పిచ్చి కూతలు కూస్తూంటాడు. ధనువాకి వొంట్లో బాగా లేక భౌరీ గుడికి పోతే, అక్కడి పూజారి (సీతారాం పంచల్) కూడా ద్వందార్ధాలతో మాట్లాడతాడు.

సర్పంచ్, షావుకారు, పూజారి, ఇటుకబట్టీ యజమాని, డాక్టర్ ఇలా ఈ అయిదుగురూ సిండికేట్‌గా ఏర్పడి, ఆర్థికంగా వెనుకబడిన ప్రజల బలహీనత మీద తమ కోర్కెలతో స్వారీ చేస్తూంటారు. ఆ స్త్రీలు కూడా 30 రూపాయలకి అలవాటుపడిపోయారు. వాళ్ళ భర్తలు నిస్సహాయులై పోయారు. ఇప్పుడు ధనువా – భౌరీల వంతు వచ్చింది. భౌరీ కోసం ధనువాని లొంగదీయడానికి చేయని ప్రయత్న ముండదు. ధనువాకి ఎలా వీళ్ళకి బుద్ధి చెప్పాలో అర్థమవదు. జీతం అడగడానికి సర్పంచ్ దగ్గరికి పోతే, భౌరీని పంపిస్తే జీతమిస్తానంటాడు సర్పంచ్.

దీంతో మండిపోయిన ధనువా, నీ పెళ్ళాని పంపు నేనే జీతం వదులుకుంటా నంటాడు. ఇక సర్పంచ్ ఇష్టమొచ్చినట్టు కొట్టే సరికి రక్తం కక్కుకుని మంచాన పడతాడు ధనువా. డాక్టర్ కి అవకాశం చిక్కుతుంది. భౌరీ తనతో గడిపితే ఉచితంగా వైద్యం చేస్తానంటాడు. భౌరీ వైద్యం డబ్బులు మొహాన కొట్టేసరికి, ధనువాకి ఎయిడ్స్ వుందని రిపోర్టు ఇస్తాడు డాక్టర్.

దీంతో సిండికేట్ పంచాయితీ పెట్టి, ఎయిడ్స్ రోగి ధనువాని గ్రామం నుంచి బహిష్కరిస్తున్నామని ప్రకటిస్తారు. గాయాలకి చికిత్స అందక మంచాన పడ్డ ధనువాని తీసుకుని, వూరవతల పాక వేసుకుని వుంటుంది భౌరీ. భర్తని పోషించడానికి అదే బట్టీకి కూలీగా పోతుంది. ఇక బట్టీ యజమాని తన పంజరం లోకి వచ్చిందని అనుకుంటాడు. ఇంతలో వూళ్ళోకి సినిమా తీస్తాడని ఒకడు వస్తాడు. వాడితో భౌరీకి సంబంధం అంటగట్టి అల్లరి చేస్తారు సిండికేట్. ఇది నమ్మిన జనం ముందు భౌరీకి దిక్కు తోచదు. ఇక ఒక నిర్ణయం తీసుకుంటుంది. సిండికేట్‌ని పిలిచి తనని వేలం పాడుకోమని అంగడి బొమ్మలా నిలబడుతుంది.

ఎందుకీ నిర్ణయం తీసుకుంది భౌరీ? తనని వేలం పాడుకున్నాక వాళ్ళతో ఏం చేద్దామనుకుంది? ఆమె పథకమేమిటి? ఆమె విసిరిన వలలో పడి సిండికేట్ ఏమయ్యారు? ఇదీ మిగతా కథ. బలవంతుల ఇష్టారాజ్యంతో వాస్తవ పరిస్థితిని చూపడం బావుంది. పొట్ట కోసం పోరాడే వాళ్ళు ఎవరికీ వ్యతిరేకంగా పోలేరని చెప్పడం కూడా బావుంది. అయితే భౌరీ తీసుకున్న నిర్ణయం చెప్పిన దానికి వ్యతిరేకంగా, వాస్తవ దూరంగా, సినిమాటిక్‌గా వుంది. ఒకప్పుడు ‘దస్తక్’, ‘జరూరత్’ వంటి నగర కథలతో కమర్షియల్స్ వచ్చినప్పుడు ఫార్ములాతోనే వున్నాయి. వాస్తవిక సినిమా ‘భౌరీ’తో ఇలా వుండాల్సింది కాదు. భౌరీ తీసుకున్న నిర్ణయం లాంటి సాహసం జీవితంలో చేయలేరు. చూపాల్సింది ఆమె చేసే పరిష్కారం కాదు, వ్యవస్థకి ప్రశ్న. బలవంతుల మీద బాధితురాళ్ళ తిరుగుబాటుకి ఆస్కారమే లేదు. ప్రభుత్వమే పూనుకోవాలి. పారంపర్యంగా వస్తున్న ఈ సామాజిక పీడన మీద ప్రభుత్వమే చర్య తీసుకుని రూపు మాపాలి. కానీ ఇప్పుడు కూడా హాథ్రస్ లాంటి ఘటనల్లో ప్రభుత్వమే బలవంతులకి కొమ్ముకాస్తూంటే, సిండికేట్లో ఇంకో శక్తిగా వుంటే, ఇదేమంత సులభంగా రూపుమాసిపోయే పీడ కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here