లోకల్ క్లాసిక్స్ – 47: రాజ్యాంగపు రోదన

0
1

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా సనల్ కుమార్ శశిధరన్ దర్శకత్వం వహించిన మలయాళం సినిమా ‘ఒళివు దివసతే కలి’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘ఒళివు దివసతే కలి’ (మలయాళం)

[dropcap]అ[/dropcap]చ్చయి ప్రాచుర్యంలో వున్న సాహిత్యాన్ని సినిమాగా చెక్కడం సినిమాని రీమేక్ చేయడం కన్నా కష్టమే. నవలని అలా వుంచుదాం, అదెలాగూ దృశ్యాల దొంతరగా వుంటుంది. మూడు నాల్గు దృశ్యాలతో వుండే ఓ కథని రెండు గంటల సినిమాగా మల్చాలంటే నాటక రచన తెలిసి వుండక తప్పదు. అందులోని వస్తు స్థల కాలాల ఐక్యతని సినిమాకి సాధించక తప్పదు. మలయాళ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ 59 పేజీల ఒక ప్రసిద్ధ కథని, కథ చెడకుండా, 144 నిమిషాల సినిమాగా ఎలా మార్చాడంటే, ఎలా మార్చాడో అతడికే తెలీదు. స్క్రిప్టే రాసుకోకుండా ఒక వూహకందని సృజనాత్మకతని ప్రదర్శించాడు. అయితే దృశ్య మాధ్యమమైన ఏ సినిమా నిలబడాలన్నా సింపుల్‌గా పాత్ర ఉద్దేశం – సంఘర్షణ – పరిష్కారం అనే మూడంకాల నిర్మాణంలోకి రావాల్సిందే కాబట్టి, ఒక చిన్న కథలోని విషయాన్ని వస్తు స్థల కాలాల ఐక్యత సాధిస్తూ, ఈ చట్రంలోకి తీసుకొస్తే పని పూర్తయినట్టే. ఈ పనికి సనల్ కుమార్‌కి ఒక జాతీయ అవార్డు, ఇంకో మూడు అంతర్జాతీయ అవార్డులూ దక్కాయి.

అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భారతీయ జీవితమంటే కేవలం బెంగాల్ నుంచి బెంగాలీ సినిమాలు, ఉత్తరాది నుంచి హిందీ సమాంతర సినిమాలే. తెలుగు సినిమాలంటే తమిళనాడులో కూడా తెలీని తెలుగు మసాలాలే కాబట్టి, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఎంట్రీ లేదు. భారత దేశంలో తెలుగు జీవితం కూడా ఇలా వుందని తెలుపుకుని గౌరవం పొందే ఛాన్సు లేదు. మలయాళ దర్శకులు మలయాళ జీవితాల్ని ఎప్పుట్నుంచో అంతర్జాతీయులకి గౌరవప్రదంగా పరిచయం చేసుకుంటున్నారు. 2001 నుంచి ఇండిపెండెంట్ ఫిలిమ్ మేకర్ సనల్ కుమార్ విడవకుండా పదే పదే పరిచయం చేస్తున్నాడు. ఈ క్రమంలో 15 అంతర్జాతీయ, జాతీయ అవార్డుల గ్రహీతగా ఘనత సాధించాడు. 2015లో ఇందులో ‘ఒళివు దివసతే కలి’ (ఇంగ్లీషు టైటిల్: ‘ఏన్ ఆఫ్ డే గేమ్’) ఒక భాగం. దీన్ని రాజ్యాంగమేమిటి, ప్రజలు చేస్తున్నదేమిటీ ప్రశ్నించే ఆందోళనకర విషయంతో తెరకెక్కించాడు…

కథ

కేరళలో ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తుంది. ఐదుగురు మధ్య వయస్కులైన మిత్రులు పోలింగ్ రోజున సెలవుని ఎక్కడికైనా వెళ్ళి గడుపుదామని నిర్ణయించుకుంటారు. ఎక్కడో అడవి మధ్య గెస్ట్ హౌస్‌కి వెళ్తారు. ధర్మన్ నంబూద్రి (నిసార్ అహ్మద్), తిరుమణి (గిరీష్ నాయర్), వినయన్ (ప్రదీప్ కుమార్), నారాయణన్ (రెజూ పిళ్ళై), దాసన్ (బైజీ నెట్టో) – అనే ఈ అయిదుగురూ వంటగత్తె గీతూ (అభిజా శ్రీకళ) కి వంట పని అప్పజెప్పి, షికారు వెళ్ళి మద్యం తాగుతూ కుంటలో చేపలు పట్టి, కొలనులో ఈతకొట్టి, అల్లరల్లరి చేసుకుని వస్తారు.

వస్తూ దారిలో పనస చెట్టు కన్పిస్తే, దాసన్‌ని చెట్టెక్కించి పనస కోయిస్తారు. గెస్ట్ హౌస్‌కి రాగానే తెచ్చుకున్న కోడి పారిపోతూంటే, దాని మీద పడి పట్టుకుని దాసన్ కిచ్చి కోయమంటారు. దాసన్ కోయలేనని అంటే, మోటు మనసోడిగవి నువ్వే కోయగలవని బలవంతంగా కోయిస్తారు.

గీతూ ఆ కోడి కూర వండుతూంటే, అయిదుగురూ మద్యం మొదలెట్టి కబుర్లాడు కుంటారు. దాసన్ తప్ప మిగిలిన నల్గురూ తలా ఓసారి గీతూని లొంగదీయాలని ప్రయత్నించి విఫలమవుతారు. ధర్మన్ ఇంకోసారి ప్రయత్నిస్తే చెంప ఛెళ్ళు మన్పిస్తుంది గీతూ. కూర వండి పడేసి డబ్బు తీసుకుని వెళ్లిపోతుంది.

టీవీలో పోలింగ్ విశేషాలు పెట్టుకుని, కూర నంజుకుని పూటుగా తాగుతూ పిచ్చాప్పాటీ మొదలెడతారు. ఎన్నికల గురించి ఒక్క దాసన్‌కే ఆసక్తి వుంటుంది. మిగిలిన బృందానికి చెత్తలా తోస్తుంది. ఓటు కూడా వేసి రాలేదు. చర్చపెట్టుకుని, భార్యలు సహా ఆడవాళ్ళ గురించి చులకనగా మాట్లాడతారు. శృంగారంలో స్త్రీ కింద, పురుషుడు పైన వుండే ఏర్పాటులోనే, మగాడు జయించేవాడని అర్థం జేసుకోవాలని సూత్రీకరణ చేస్తారు. దాసన్ మౌనంగా వింటూ వుంటాడు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ మీదికి మళ్ళుతుంది. ధర్మన్‌కి ఎమర్జెన్సీ గొప్ప విషయంగా తోస్తే, వినయన్‌కి మండిపోయి గొడవపడతాడు. ఇది ఘర్షణ కిందికి మారి, విందు నుంచి ఇంటికెళ్ళి పోతూంటే, కురుస్తున్న వర్షంలో ఈడ్చుకొస్తారు.

ఈ మొత్తం వ్యవహారంలో దాసన్‌ని నల్లోడా అని పిలుస్తూంటారు. వాతావరణాన్ని తేలికబర్చడానికి పాట పాడమంటారు. నేను పుడితే నలుపు, పెరిగితే నలుపు, ఎండలో నలుపు, రోగంలో నలుపు, చావులో నలుపు- మీరు పుడితే గులాబీ వర్ణం, పెరిగితే శ్వేత వర్ణం, రోగంలో నీలి వర్ణం, మరణంలో గోధుమ వర్ణం – మీకు ఇన్ని రంగులు మారుతున్నాయి, నన్ను నల్లోడు అంటారా – అని విరుచుకుపడి పాడతాడు.

నల్గురూ బయటికెళ్ళిపోయి మొహాలు అటు తిప్పుకుని నిలబతారు. దాసన్ వెళ్ళి సారీ చెప్తాడు. ఇలా కాదని, చిన్నప్పుడు ఆడుకున్న పోలీసు – దొంగాట ఆడుకుందామంటారు. ఆట మొదలెడతారు. ఈ ఆటలో తాగిన మత్తులో ఏం చేసేశారో, అసలు స్వరూపాలేమిటో, బయటపడి వూహించని మలుపు తీసుకోవడం మిగతా కథ.

ఎలావుంది కథ

ఇదే పేరుతో ఉన్ని ఆర్ రాసిన ప్రసిద్ధ మలయాళ కథకి ఇది చిత్రానువాదం. కథాపుస్తకం అమెజాన్లో అమ్మకానికుంది. సినిమా యూట్యూబ్‌లో ఉచితంగా వుంది. వ్యవస్థలు కాదు, ముందు పౌరులే ఎలా రాజ్యాంగాన్ని పరిహసిస్తున్నారో దృష్టికి తెచ్చే కథ. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్గాల్లో కులమెలా పని చేస్తుందో వివరించే కథ. కులం చెప్పకు, కులం అడక్కు, కానీ చేసేది కులం మర్చిపోకుండా చెయ్- అన్న అంతరాత్ధం పెల్లుబికే కథ. రాజ్యాంగ నీడలో శిక్ష నుంచి తప్పించుకునే వాళ్ళెవరో, తప్పించుకోలేక శిక్ష అనుభవించే వాళ్ళెవరో, నిర్మొహమాటంగా కళ్ళముందుంచే పోలీసు- దొంగాట ముగింపుతో షాకిచ్చే కథ. ఇంతకంటే చెబితే షాక్ వేల్యూ పోతుంది.

నటనలు- సాంకేతికాలు

ఇందులో నటించిన వాళ్ళందరూ నాటక నటులే. నటిస్తున్నట్టు వుండరు, ప్రవర్తిస్తున్నట్టు వుంటారు. మాటలు వాళ్ళ వాళ్ళ ఫ్లోలో వచ్చేస్తూంటాయి. ఎవరి ముఖ భావాలూ కనపడవు. క్లోజప్స్ వుండవు. కెమెరా థీమ్‌కి లోబడి పనిచేస్తూంటుంది. ఎక్కడా క్లోజప్ షాట్స్ పాత్రలకీ, మరి దేనికీ వుండవు. కెమెరా రాజ్యాంగం పాత్రలో వుంటుంది. రాజ్యాంగ దృష్టికి అందరూ సమానమే. ఎవరూ ఎక్కువ కాదు కోజప్స్ వేసుకోవడానికి. కెమెరా కదలికలు కూడా వుండవు. రాజ్యాంగం తటస్థం కాబట్టి. మిడ్ షాట్స్‌తో కెమెరా తటస్థంగా, స్టాటిక్‌గా వుండిపోతూంటుంది. తటస్థ ఫ్రేముల్లోకి పాత్రల వ్యవహారాలు, సన్నివేశ పరిస్థితీ నిశబ్దంగా గమనిస్తూంటుంది కెమెరా. ఒక సీన్లో వీళ్ళ వ్యవహారాన్ని కెమెరా ఆరు నిమిషాలపాటు కదలకుండా గమనిస్తూ వుండిపోతుంది. పతాక సన్నివేశమంతా ఒకే మిడ్ షాట్ లో గమనిస్తుంది కెమెరా. జరగాల్సిన దారుణం జరిగిపోయాక, దిక్కుతోచనట్టు అడవిలో తిరుగాడుతుంది కెమెరా. తిరిగి తిరిగి వచ్చి దారుణాన్ని దీనంగా చూస్తూ నిలబడుతుంది కెమెరా అనే రాజ్యాంగం…. కానీ కదిలేదెవరు, కదిలించే దెవర్నీ, మారేదెవరూ ఇదీ సమాధానం దొరకని ప్రశ్న. దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ ఆందోళన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here