లోకల్ క్లాసిక్స్ – 48: గుర్రాల మౌన రోదన

0
1

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా గుర్విందర్ సింగ్ దర్శకత్వం వహించిన పంజాబీ సినిమా ‘అన్హే ఘొరే డా దాన్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘అన్హే ఘొరే డా దాన్’ (పంజాబీ)

[dropcap]హ[/dropcap]రిత విప్లవంతో, రాజకీయ బలంతో, ధనిక రైతాంగంగా ఎదిగిన పంజాబ్ జాట్ సిక్కులు ప్రారంభించిన శక్తివంతమైన రైతు ఆందోళన ఇప్పుడొక పక్కనుంటే, మరో పక్క పేదరికంలోనే మగ్గుతున్న పంజాబ్ సిక్కు దళితుల మౌన రోదన వుంది. పంజాబ్‌లో దళితులు 30 శాతం, జాట్‌లు 20 శాతమే వున్నా, దళితులు రాజకీయ నిర్ణాయక శక్తిగా ఎదగలేక పోయారు. కారణం రెండు ఉప కులాలుగా విడిపోవడం. పంజాబ్ ఎంత ధనిక రాష్ట్రమో అంత పేద రాష్ట్రం కూడా. కానీ బాలీవుడ్ సినిమాలు సబ్ చంగాసీ అంటూ ఎగిరెగిరి పంజాబ్‌ని గ్లామరైజ్ చేస్తున్నాయి. రాష్ట్రాలు ఆర్థికంగా ఎదిగితేనే చాలదు, సామాజికంగా కూడా ఎదగాలి. సామాజిక వికాసం లేని ఆర్థిక వికాసం అసభ్యంగా వుంటుంది.

ఈ అసభ్య సన్నివేశం 1960లలో హరిత విప్లవం నుంచి కూడా అలాగే వుంది. మూడొంతుల జనాభాతో దళితులలాగే వున్నారు. ఈ పంజాబ్ రెండో ముఖ చిత్రాన్ని ప్రపంచానికి ఎత్తి చూపుతూ ముందు కొచ్చాడు దర్శకుడు గుర్విందర్ సింగ్. గుర్విందర్ సింగ్ గతంలో పంజాబ్ తీవ్రవాదం మీద ‘చౌతీకూట్’ తీశాడు (లోకల్ క్లాసిక్స్ 15). దీనికి ముందు సామాజిక స్థితి మీద ‘అన్హే ఘొరే డా దాన్’ తీశాడు. బాలీవుడ్ ప్రభావంతో వ్యాపార సినిమాలే తప్ప పంజాబ్ నుంచి సమాంతర సినిమాలు రాని పరిస్థితుల్లో, గుర్విందర్ సింగ్ సమాంతర సినిమాలొక సామాజికార్థిక అధ్యయనాలయ్యాయి.

‘అన్హే ఘొరే డా దాన్’ (గుడ్డి గుర్రం పేర అన్నదానం- 2011) ఉత్తమ దర్శకత్వానికి, ఉత్తమ ఛాయాగ్రహణానికీ జాతీయ అవార్డులు పొందింది. ఇంతేగాక వెనీస్, లండన్, న్యూయార్క్, బుసాన్, అబుధాబీ, గోవా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా పురస్కారాలు పొందింది. పంజాబ్‌లో సామాన్యుల పరిస్థితి కనా కష్టంగా మారిందనీ, కొద్ది మందే ఆర్థిక, అధికార బలాలతో వున్నారనీ, ఇతరులు కనీసావసరాలు తీర్చుకోవడంలో విఫమవుతున్నారనీ, ఉపాధి కోసం వీళ్ళే౦ చేస్తూంటారన్నది తనకెప్పుడూ అంతుపట్టని విషయంగానే వుంటుందనీ చెప్పాడు గుర్విందర్ సినిమా విడుదల సందర్భంగా.

కథ

దళిత రైతు కూలీ ధార్మా (మాల్ సింగ్) ఒక భూస్వామి పొలంలో పని చేసుకుంటూ ఉపాధి పొందుతూంటాడు. అక్కడే ఇల్లు వేసుకుని వుంటాడు. ఇంకొందరు కూలీలు కూడా ఇళ్ళు వేసుకుని వుంటారు. ఓ తెల్లారే ఇళ్ళు కూల్చేస్తున్నట్టు వార్త వస్తుంది. భూస్వామి తన పొలాల్ని పరిశ్రమకి అమ్మేశాడు. పరిశ్రమ ఈ భూముల్ని స్వాధీనం చేసుకోబోతోంది. దీంతో ఆందోళనకి గురై తోటి కూలీలతో బృందంగా వెళ్ళి సర్పంచ్‌కి చెప్పుకుంటాడు ధర్మా. సర్పంచ్ ఖాళీ చేసిపోవాల్సిందేనంటాడు, తన చెరో పక్క సాయుధులైన అనుచరుల్ని వుంచుకుని. చేసేది లేక ధర్మా సహా కూలీలు బాధని దిగమింగుకుంటూ వెళ్లిపోతారు. ఏం చేయాలో తోచని స్థితిలొ వుంటే, పోలీసులొచ్చి హెచ్చరించి పోతారు. ఓ నాయకుడొచ్చి బెదిరించి పోతాడు. ఇక పూర్తిగా దిక్కు తోచని స్థితిలో పడతారు.

ధర్మా కొడుకు మెలూ సింగ్ (శామ్యూల్ జాన్) ఎప్పుడో కుటుంబంతో భటిండా వలస వెళ్ళాడు. రిక్షా నడుపుకుంటూ బతుకుతూంటాడు. బతకడానికి సంపాదన చాలక కష్టాలు పడుతూంటాడు. ఇంతలో రిక్షా కార్మికులందరూ పెద్ద ఎత్తున నిరవధిక సమ్మె చేయడంతో, మూలకి పడ్డ రిక్షాతో అయోమయంలో పడతాడు. బ్రతుకు దుర్భరమైపోతుంది. ఇంకొక్క క్షణం పట్టణంలో వుండలేక గ్రామంలో బతకొచ్చని బయల్దేరతాడు.

అటు గ్రామంలో తండ్రి ధర్మా, ఇల్లూ ఉపాధీ కాపాడుకోడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేసి, పట్టణంలో బ్రతకొచ్చని పట్టణానికి బయల్దేరతాడు. పట్టణం కాకపోతే, గ్రామం, గ్రామం కాకపోతే పట్టణం, ఆశాకిరణంలా కన్పించడం కేవలం భ్రమ అని తెలుసుకోలేని, ప్రత్యామ్నాయాలు చూడలేని, మూస పరిభ్రమణంలో మసై పోతున్న గుడ్డి గుర్రాల జీవితాలకి సంబంధించి స్థూలంగా ఇదీ కథ.

ఎలా వుంది కథ

ఇదే పేరుతో 1976లో గురుదయాళ్ సింగ్ రాసిన నవల దీనికాధారం. దీన్ని నవల కాలం నాటి పీరియెడ్ మూవీగా తీయలేదు. నాటి పరిస్థితే నేడూ వుండడంతో సమకాలీన సినిమాగానే తీశాడు. దశాబ్దాలు మారినా 30 శాతం దళిత జనాభా ఆ రాష్ట్రంలో యథాపూర్వ స్థితిలోనే వుంది. రిజర్వేషన్లున్నా ప్రభుత్వోద్యోగాల్లో లేరు. రెండు ఉప కులాలుగా విడిపోవడం, ప్రాబల్య వర్గాల రాజకీయాల కుపయోగపడుతోంది. హరిత విప్లవంలో లేరు, పారిశ్రామికి విప్లవంలో లేదు, రాజకీయ రంగులరాట్న పరిభ్రమణంలో పావులుగా వుంటున్నారు. వేదన వుంది. ఉద్యోమాల్లేక, ఆందోళనల్లేక మౌన రోదనే  అయ్యింది. జవాన్లని, కిసాన్లని ఇస్తున్న రాష్ట్రంలో తమ స్థాన మెక్కడో తెలీదు.

నటనలు – సాంకేతికాలు

ఎవరూ వృత్తి నటులు కారు. స్థానికులకే శిక్షణ నిచ్చి నటింపజేశారు. హావ భావాలు, ఆ విషాదం, స్పష్టత, సహజత్వం ఎంత అద్భుతంగా వున్నాయంటే వీళ్ళలో కొందరికైనా అవార్డులు రావాలి. కన్నడ ‘తిధి’ లో నటించిన స్థానికులూ వీళ్ళూ ఒకే ప్రతిభా పాటవాలతో వున్నారు. ‘తిధి’ లో ఎవరికీ అవార్డులు రాలేదు, ఇప్పుడిందులో ఎవరికీ రాలేదు. వృత్తి నటుల్ని తప్ప ఇతరుల్ని పరిగణన లోకి తీసుకోరేమో.

నటీ నటుల తర్వాత చెప్పుకోవాల్సింది చిత్రీకరణ గురించి. తెల్లారినప్పట్నుంచీ రాత్రి వరకూ ఒక రోజు జరిగే ఈ కథకి గుర్విందర్, మణికౌల్ (‘ఉస్కీ రోటీ’ ఫేమ్- లోకల్ క్లాసిక్స్ – 35) ని శైలిని అనుసరించినట్టు చెప్పుకున్నాడు. కథ నిశ్చలమైనప్పుడు కథనం వుండదని, అప్పుడు కథ చూపించాలే గానీ, కథని మర్చిపోయేట్టు కథనం చేయకూడదనేది మణికౌల్ కూడా బ్రెసన్ నుంచి నేర్చుకున్న కళ. బ్రెసన్ దర్శకత్వ శైలి శ్వేతం, నిశ్శబ్దం, నిశ్చలం. కథ చెప్పడానికి నటులు నటించనవసరం లేదు. వాళ్ళ ఛాయాచిత్రాలే కథ చెప్తాయి. ఇలా గుర్విందర్ చిత్రీకరణ నిశ్చల ఛాయా చిత్రాల సమాహారమయింది. అతడి కెమెరాలో సినిమా షాట్స్ ఫోటోలై పోతాయి. ఫోటోలన్నీ పేర్చుకుంటూ చూస్తే ఒక ఆల్బమ్ ఈ సినిమా.

దృశ్యాల్లో పొగమంచు ఒక పాత్రే. ఘనీభవించిన జీవితాలకి సింబాలిక్‌గా. పొగమంచు తొలగించుకుంటే మంచి ఉషోదయాలు కనబడతాయి. కానీ ఆ ధ్యాసే లేని మరమనుషులు. సినిమా సాంతం మార్పులేని విషాదం తాండవిస్తూంటుంది. చిమ్మ చీకట్లో టార్చి లైట్లతో తాత్కాలిక దారి వెతుక్కునే బ్రతుకు పోరాటమే కన్పిస్తుంది గానీ, సమస్యకి శాశ్వత పరిష్కార మార్గం నిర్మించుకునే స్పృహ ఇంకెన్నాళ్ళకి కలుగుతుందో తెలీని ముగింపు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here