లోకల్ క్లాసిక్స్ – 5: బారువా ఊహాల్లో ఆమె!

0
2

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా జాహ్నూ బారువా అస్సామీ సినిమా ‘అపరూప’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘అపరూప’ (అస్సామీ)

[dropcap]8[/dropcap]6 ఏళ్ల సుదీర్ఘ చరిత్రగల ఆస్సామీ చలనచిత్ర సీమ (జాలీవుడ్)లో దర్శకుడు జాహ్నూ బారువాది ప్రత్యేక అధ్యాయం. 1982లో ప్రారంభించిన చలనచిత్ర జీవితంలో 12 సార్లు జాతీయ అవార్డులు, 10 సార్లు అంతర్జాతీయ అవార్డులూ సాధించుకున్న ఘనత తనది. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల బిరుదాంకితుడు కూడా. భారత సినిమా దర్శకుల సంఘానికి మాజీ ఛైర్మన్ కూడా. మొత్తం 37 ఏళ్ల కెరీర్‌లో 18 సినిమాలే నిర్మించినా, అవెంత విశిష్టమైనవో పై అవార్డుల సంపద చూస్తే అర్ధమవుతుంది. 18 సినిమాల్లో మూడు హిందీ కూడా వున్నాయి. హిందీలో అనుపమ్ ఖేర్, ఊర్మిళా మతోండ్కర్ లతో తీసిన ‘మైనే గాంధీకో నహీ మారా’ ప్రధానమైనది. తాజాగా ఇప్పుడు అస్సామీ – ఇంగ్లీషు భాషల్లో ‘అన్ రెడ్ పేజెస్’ నిర్మిస్తున్నాడు.

రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా అయిన జాహ్నూ బారువా 1982లో తలపెట్టిన మొదటి చలన చిత్రం ‘అపరూప’. సమాజంలో, కుటుంబంలో ఆదివాసి స్త్రీ, బ్రాహ్మణ స్త్రీల జీవితాల్ని సమాంతర కథలుగా చేసి చూపెట్టాడు. చూపించిప్పుడు ఇద్దరికీ అన్యాయమే చేశాడన్నది ఒక అంశం. సర్వసాధారణంగా ఆర్ట్ సినిమాలు విముక్తి కథలు చెబుతాయి. తను రాజీ బాట పట్టినట్టు ఈ రెండు కథలకీ ముగింపు లిచ్చాడు. అయినా ‘అపురూప’ జాతీయ, అంతర్జాతీయ అవార్డులకి అర్హమై, క్లాసిక్ హోదా కూడా పొందింది.

సుహాసినీ మూలే తల్లి విజయా మూలే డాక్యుమెంటరీ ఫిలిం మేకర్, చరిత్రకారిణి. తల్లి అభిరుచులే తనకొచ్చి సినిమా నటి అయింది. సుహాసినీ మూలే హిందీ సినిమాల్లో క్యారక్టర్ నటిగా మనకి బాగా తెలుసు. అయితే ఆమె సత్యజిత్ రే, మృణాల్ సేన్‌లకి అసిస్టెంట్‌గా పనిచేసిన సంగతి చాలా మందికి తెలీదు. 60 డాక్యుమెంటరీలు నిర్మించి, నాల్గిటికి జాతీయ అవార్డులు పొందిన సంగతి కూడా. 1969లో మృణాల్ సేన్ నిర్మించిన ప్రసిద్ధ ‘భువన్ షోం’లో నటి అయింది. తర్వాత ‘అపురూప’ సహా రెండు మూడు సినిమాల్లో నటించినా, మనసు మార్చుకుని కెనడా వెళ్ళిపోయి అగ్రికల్చరల్ టెక్నాలజీ చదివింది. అదే మెక్‌గిల్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ చదివింది. తిరిగి ఇండియా కొచ్చేసి ‘భువన్ షోం’ నటించిన 30 ఏళ్ల తర్వాత, హిందీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడం మొదలెట్టింది. తాజాగా ఆమె నటించిన ‘పీడా’ త్వరలో విడుదల కానుంది.

బిజూ ఫుకాన్ 80 సినిమాలతో బాటు అయిదు నాటకాలాతో పేరు తెచ్చుకున్న అస్సామీ నటుడు. ఇవి కాక నాల్గు బెంగాలీ సినిమాల్లో కూడా నటించాడు. 2017లో అతడి మరణానంతరం అస్సాం ప్రభుత్వం ‘బిజూ ఫుకాన్ సినిమా అవార్డు’ నెలకొల్పింది.

జాహ్నూ బారువా దర్శకత్వంలో నిర్మించిన ‘అపురూప’లో సుహాజిని, బిజూ లిద్దరూ నటించారు. దీనికి జాహ్నూ బారువా, జేఎస్ రావులు రచన చేశారు. ప్రసిద్ధ అస్సామీ సంగీత కారుడు భూపేన్ హజారికా సంగీత దర్శకత్వం వహించారు. అనంతర కాలంలో రంగ్ దే బసంతీ, మున్నాభాయ్ ఎంబీబీఎస్, దేవదాస్ వంటి భారీ సినిమాలకి పనిచేసిన బినోద్ ప్రధాన్ ఛాయాగ్రహణం అందించారు. ఇకపోతే ఎడిటింగ్ జాహ్నూ బారువాయే.

ఇంకా కన్నడ నటుడు గిరీష్ కర్నాడ్, హిందీ నటి సుష్మా సేథ్, గోపీ దేశాయ్ ఇందులో నటించారు. సుహాసినీ మూలే బ్రాహ్మణ స్త్రీగాను, రూణూ దేవీ ఠాకూర్  గిరిజన స్త్రీ గానూ నటించారు. బిజూ ఫుకాన్ ఆర్మీ కెప్టెన్ పాత్ర పోషిస్తే, గిరీష్ కర్నాడ్, సుశీల్ గోస్వామిలు టీ ఎస్టేట్ యజమానులుగా నటించారు. ఇక ఈ కథ ఎలా వుందో చూద్దాం…

కథ:

ఆర్మీ కెప్టెన్ రాణా (బిజూ ఫుకాన్) స్వగ్రామానికి వస్తాడు తల్లి అనారోగ్య కారణాలతో. తల్లి (సుష్మా సేథ్) మంచాన వుంటుంది. వైద్యుడితో వైద్యం ఇప్పిస్తూ నిద్రాణంగా వుండే గ్రామంలో లేజీగా కాలక్షేపం చేస్తూంటాడు. గ్రామంలోనే చెల్లెల్లా చూసుకునే రాధ (రూణూ దేవీ ఠాకూర్) ఇంటికి వెళ్తాడు. ఆమె తండ్రి ఆమె గురించి చెప్పుకుని బాధపడతాడు. చిన్నప్పట్నుంచీ నాటకాలంటే ఇష్టమున్న రాధ, ఒక టూరింగ్ నాటకాల గ్రూపులో నటిస్తూంటుంది. దీంతో గ్రామస్తులు ఆమె గురించి పుకార్లు పుట్టిస్తూంటారు. ఆమె వేశ్య అని ముద్ర వేయడంతో పెళ్లి సంబంధాలు తప్పిపోతూంటాయి. రాధ కూడా ఇది చెప్పుకుని వాపోతుంది. అప్పుడు రాణా, సమాజాన్ని మార్చలేమనీ, మంచీ చెడుల విచక్షణా జ్ఞానం లేనంత వరకూ సమాజం మారదనీ ఓదారుస్తాడు. సంబంధాలు చూడ్డం మొదలెడతాడు.

బారువా (సుశీల్ గోస్వామి) ధనికుడైన, ఆధునిక జీవన శైలిలో ఓలలాడే టీ ఎస్టేట్ యజమాని. ఎప్పుడూ టీ, టీపొడి ఉత్పత్తి వ్యవహారాలతో ప్లాంట్ లోనే బిజీగా వుంటాడు. ఇంటికొచ్చినా మళ్ళీ ఆఫీసు పనులే ముందేసుక్కూర్చుంటాడు. అవతలి టీ ఎస్టేట్ యజమాని ఖన్నా (గిరీష్ కర్నాడ్) తో పార్టీలు చేసుకుంటూ గడుపుతాడు. ఖన్నా భార్య ప్రమాదంలో చనిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు.

రూప (సుహాసినీ మూలే) బారువా భార్య. భర్తకి టీ ఎస్టేటే సర్వస్వం కావడంతో, లంకంత బంగళాలో ఒంటరిగా, నిస్సారంగా జీవితం గడుపుతూంటుంది. ఈ పెళ్లి చేసుకుని తప్పే చేశానని భావిస్తూంటుంది. దీనికి తోడూ తల్లిదండ్రులు మభ్య పెట్టి ఈ పెళ్లి చేశారని తెలియడంతో, వాళ్లతో తెగతెంపులు చేసుకుంటుంది. అప్పుల్లో వున్న తండ్రి డబ్బుల కోసం వయసు మీరిన రెండో పెళ్లి వాడికి కట్టబెట్టాడని కోపం పెంచుకుంటుంది. కిటికీల్లోంచి బయట పక్షుల్ని చూస్తూ, వాటిలా ఎగిరిపోవాలని ఉద్వేగాలకి లోనవుతూంటుంది.

ఈ నేపథ్యంలో భర్త బారువాకి కెప్టెన్ రాణా పరిచయమవుతాడు. అతడి గురించి భార్య రూపకి చెప్తాడు. మేం కలిసి చదువుకున్నామని చెప్తుందామె. అతణ్ణి ఇంటికాహ్వానిస్తాడు. వాళ్ళిద్దరూ ఏకాంతంలో మాట్లాడుకుంటారు. నువ్విలా చేస్తావని అనుకోలేదంటుందామె. నీలా బోల్డ్‌నెస్‌తో నేను సత్వర నిర్ణయాలు తీసుకోలేనంటాడు అతను. నేనెంచుకున్న ఆర్మీ ఉద్యోగం నీకు సూట్ కాదంటాడు. ఆ తర్వాత నీకు ఎఫైర్ లేదా అంటుంది. లేదంటాడు. ఇలా అతడితో తన గతాన్నే తల్చుకుంటూ ఆలోచనల్లో వుంటుందామె.

“ఆ బ్రాహ్మణ అమ్మాయిని నువ్వు చేసుకుంటావని అందరూ అనుకున్నారు. ఆమెకి రెండో పెళ్లి వాడితో పెళ్ళయిపోయింది. నీ పెళ్లి నేను కళ్ళారా చూడాలని వుంది. నగలు దాచి పెట్టాను…” అని రాణా తల్లి నగలు చూపిస్తుంది. ఇలా డబ్బెందుకు వేస్ట్ చేస్తున్నావని అంటాడు.

వెళ్లి రాధకి సంబంధం నిశ్చయం చేసి పెళ్లి జరిపిస్తాడు. ఖన్నా ఇచ్చిన ఒక పార్టీలో బారువా తన గురించి బాధగా చెప్పుకుంటాడు రాణాకి, “రూపా సుఖంగా లేదు, నేను కూడా. ఆమె జీవితాన్ని పాడుచేశా నన్పిస్తోంది” అని. తరచూ రాణా రూపాలు కలుసుకుంటున్నా అభ్యంతరం చెప్పడు. కలిసి బయట కూడా వ్యాహ్యాళికి పోతూంటారు ఇద్దరూ. ఇది చూసి పుకార్ల బ్యాచి పంచాయితీ పెద్ద చెవిన వేస్తారు.

రూపా తల్లి రూప దగ్గరికి వచ్చి మందలించబోతే ఈసడించు కుంటుంది రూప. రూపా తల్లి వెళ్లి బారువాకి చెప్పేస్తుంది. ఇలాటి విషయాలు వినడానికి బావుండవని సున్నితంగా రూపకి చెప్తాడు బారువా. పిల్లల్లేని ఆడదాని బాధ నీకేమర్థమవుతుందని దెప్పుతుంది రూప. తను తప్పే చేస్తున్నానంటాడు. ఇప్పుడొచ్చేసి తప్పయిందంటే ఏం లాభమంటుంది. “నువ్వు ఓడిపోయావని ఎందుకొప్పుకోవు?” అని ప్రశ్నిస్తుంది.

ఇలా ముదిరి ముదిరి పాకన పడుతుంది. ఇద్దరి మధ్యా మాటలు కరువవుతాయి. ఇక బారువా పని మీద కలకత్తా బయల్దేరతాడు. రూప కిటికీ తెరచి ఆకాశంలో పక్షి ఎగిరిపోవడాన్ని తదేకంగా చూస్తూ వుంటుంది. రాణాతో స్వేచ్ఛగా గడుపుతుంది. చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్కూలుకి అతడితో వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. ఇంతలో రాణా తల్లి మరణిస్తుంది.

అటు రాధా భర్తని వదిలి తండ్రి దగ్గరి కొచ్చేస్తుంది. అక్కడా అత్తామామలు తన గురించి అవే పుకార్లు నమ్మి హింసిస్తున్నారని వాపోతుంది. “అయినా నువ్వక్కడే వుండాలి, ఇది నీ ఇల్లు కాదు” అని తేల్చేస్తాడు తండ్రి. రాధ కనపడడం లేదని వెతుక్కుంటూ వెళ్ళిన రాణాకి ఉరేసుకుని కన్పిస్తుంది.

రాణా పంచాయితీ ముందు హాజరవుతాడు. రూపతో తన సంబంధం గురించి ఏం చెప్తాడో ఎదురు చూస్తారందరూ. తల్లి మరణించింతర్వాత ఈ వూరితో తన సంబంధం ముగిసిందని, ఇల్లూ పొలమూ పనివాడి కొప్పజెప్పేసి ఉద్యోగాని కెళ్ళి పోతున్నాననీ చెప్పేసి బయల్దేరతాడు. స్టేషన్ దగ్గరికి రూప వచ్చేసి తనతో తీసికెళ్ళ మంటుంది.

నటనలు సున్నితం:

ఇలాటి కథలకి సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో చూపించే బరువైన పాత్రలు, భారీ డైలాగులు, నాటు ఎమోషన్లు, మెలోడ్రామాలు, ఏడ్పులూ, కేకలూ, చావు కేకలూ  ఇక్కడ కన్పించవు. జీవితం చావుకేక కాదు, పొలికేక. అప్పుడెప్పుడో ఓషో అన్నాడు – భద్రత మరణమనీ, అభద్రత చైతన్యమనీ. జీవితంలో భద్రత అనేది ఎక్కడా లేదనీ, అది మరణంలోనే ఫీలవుతామనీ. జీవితంలో భద్రత వెతుక్కుంటూ బోలెడు డబ్బూ సుఖాలూ కూడేసుకుని ఆ భద్రమైన జీవితంతో వాడింకేం చేస్తాడు? ఇంకా చేయడాని కేమీ లేక ఆ సంపద -భద్రత – అనే  పంజరంలో పక్షి అయిపోతాడు. జీవచ్ఛవంలా బతుకుతాడు. అదే భద్రత గురించి ఆలోచించని వాడు నిత్య చైతన్యంతో నిరంతర పథికుడిలా పనులు చేస్తూ ఆనందం పొందుతాడు. భద్రత చావుకేక, అభద్రత పొలికేక!

ఇదే రూప పాత్ర తీరు. చుట్టూ ఎంత సంపదవున్నా ఆమెకి సుఖం లేదు. ఆ సంపద ఆమెకి కావాల్సినంత భద్రత నిస్తుంది. కానీ ఆమె కోరుకుంటున్నది ఈ భద్రతా శృంఖలాల్ని తెంచుకుని, అభద్రతా పూర్వకమైన చైతన్యాన్ని పొందడం. పక్షిలా ఎగిరిపోవడం. భౌతిక సుఖాలు కాదు, ఆత్మిక సుఖం కావాలామెకి.

ఈ పాత్రలో సుహాసినీ మూలే సున్నిత నటనతో కనబడుతుంది. రాణా పాత్ర అన్నట్టు బోల్డ్‌గా ఆలోచిస్తుంది. అందుకని ఎక్కడా కన్నీళ్లు కూడా పెట్టుకోదు. విచారవదనంతో మరీ విషాద పాత్రలా వుండదు. ఆమె చుట్టూ నిశబ్ద వాతావరణమే విషయ గాంభీర్యాన్ని సబ్ టెక్స్ట్‌గా వెల్లడిస్తుంది. అయితే భర్తతో ఆమెకున్న సమస్యని సరైన సీక్వెన్స్‌లో దర్శకుడు పెట్టకపోవడం వల్ల పాత్ర చిత్రణ ఒక చోట దెబ్బ తింది: భర్త ఆమెని సరిగా చూసుకోవడం లేదనే దానికి ఆ సంబంధమైన కొన్ని సపోర్టింగ్ దృశ్యాలు బయట చూపించి, అప్పుడు బెడ్రూమ్ లోకి రావాల్సింది. నేరుగా బెడ్ రూమ్ లోనే విషయ ప్రస్తావన జరిగితే అది వేరే రూటులో ఎబ్బెట్టుగా వుంటుంది.

అతను బెడ్రూంలో తన వర్క్ తను చేసుకుంటూ వుంటాడు. బెడ్ మీద కూర్చున్న ఆమె పిలిస్తే వెళ్లడు. “ఆఫీసు వర్క్ ఇంటి కెందుకు? నీకు వర్క్ ఇంపార్టెంట్, నేను కాదు” అంటుంది. “టీ ఎస్టేట్ నడపడం మాటలు కాదు” అంటాడు. “మరి నన్ను? నువ్వు శాటిస్‌ఫై అవడానికి ఆఫీసు వుంది… నేను నీ భార్యని, నువ్వు నా భర్తవి. ఇది బెడ్ రూమ్…”  అని గుర్తు చేస్తుంది.

ఇలా నేరుగా వాళ్ళ మధ్య మౌలిక సమస్యని ఆమె శారీరక సుఖంతో ముడి పెట్టి చూపించినట్టయింది. పాత్ర దిగజారి మాటాడినట్టయింది. ఆమె శారీరక – భౌతిక సుఖాలు కాకుండా ఆత్మిక సుఖం వైపు సీను మళ్ళించి వుంటే – ఆ  సీను ఏ హాల్లోనో పెట్టి- అపరాత్రయి ఆమె ఎదురు చూస్తూంటే, అతనొచ్చి ఆమెని పట్టించుకోకుండా వెళ్లిపోతూంటే – ఆమె నిలదీసి అతడి నిర్లక్ష్యాన్ని అడిగితే, పరిస్థితి మనకి నీటుగా అర్ధమైపోయేది. బెడ్ రూమ్ లో సీనుకి, హాలులో సీనుకీ ఇంత తేడా వుంది. మొదటిది బూతు, రెండోది నీతి.

రాణాగా బిజూ ఫుకాన్‌ది కూడా సున్నిత నటనే. అతను కమర్షియల్ నటుడైనప్పటికీ ఈ సమాంతర సినిమా పాత్ర మేరకు సెన్సిబుల్ గానే నటించాడు. అయితే పాత్ర దృక్పథం స్పష్ట మవదు. చిట్ట చివరి వరకూ ఆమెని ప్రేమించనట్టే కన్పిస్తాడు. తన వల్ల ఆమె భర్త దూరమవుతున్నప్పుడు తను దూరంగా వుండాలని కూడా అనుకోడు. చివరికి తన మీద పుకార్లకి పంచాయితీ పెట్టినప్పుడు – ఆమెతో తన వ్యవహారం గురించి ఏ విషయం చెప్పకుండా- తల్లి మరణంతో వూరితో సంబంధమే ముగిసిందని వూరొదిలేసి వెళ్ళిపోతాడు. స్టేషన్ కొచ్చేసిన ఆమెని స్వీకరించి తీసికెళ్ళి పోతాడు. పంచాయితీని తప్పించుకోవడానికి ప్లానింగ్‌తో ఇద్దరూ కలిసే ఇలా చేసినట్టు అన్పించేలా. పంచాయితీకే ఆమెతో వెళ్లి, చెప్పాల్సింది చెప్పేసి, చేయి పట్టుకుని తీసికెళ్ళి పోతే పాత్ర బలంగా వుండేది.

ఇది దర్శకుడి తొలి కథా రచన కావడం వల్ల ఇలా జరిగి వుండొచ్చు. ఇక భర్త పాత్రలో సుశీల్ గోస్వామి పాశ్చాత్య పోకడలతో హుషారుగా కన్పిస్తాడు. తన హుషారు భార్యకి కల్పించడానికేం చేయాలో అది చెయ్యడు. చివరికి తన తప్పు తెలుసుకుని వాళ్ళిద్దరి మధ్య నుంచి తప్పుకుంటాడు. ఐతే ఈ ముగింపు విడాకులతో ముగియలేదు, విడాకుల ప్రస్తావనే రాదు.

ఆదివాసి రాధగా రూణూ దేవీ ఠాకూర్‌ది బాధిత పాత్ర. పుకార్ల బాధితురాలిగా ప్రాణాలు తీసుకునే తిరోగమనం సాధారణంగా ఆర్ట్ సినిమా లక్షణం కాదు. 1980 లనాటి ఈ కథా కాలానికి అభ్యుదయ పాత్రగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని దర్శకుడు గుర్తించలేదు.

సాంకేతికాలు సాధారణం:

సాంకేతికంగా ఇంకా అద్భుతంగా వుండొచ్చు. దర్శకుడి తొలి ప్రయత్నానికి ఇంత కంటే ఆశించకూడదేమో. అటవీ ప్రాంతపు లొకేషన్స్ మాత్రం బావున్నాయి. కెమెరా వర్క్, కళా దర్శకత్వం కొన్ని చోట్ల అద్భుత దృశ్యాల్ని ఆవిష్కరిస్తూనే, కొన్ని చోట్ల పేలవమైన స్థితికి జారుకుంటాయి. భూపేన్ హజారికా సంగీతం జానపద స్వరాల్ని సవరించింది. రాధా పెళ్లి సందర్భంగా ఆదివాసీల ఆచార వ్యవాహారాలు చూపెట్టారు. పెళ్లి కూతుర్ని స్నానించడానికి అమ్మలక్కలు నది నుంచి కడివెల్లో నీళ్ళు తోడ్కొని రావడం, బియానా అనే వాళ్ళ పాట పాడుకోవడం, భావనా జానవో అనే నాటకాన్ని ప్రదర్శించడం, అందులో దుర్యోధనుణ్ణి భీముడు చావగొట్టడం వగైరా వుంటాయి.

సృజనాత్మకత కొంత:

ఈ సినిమాలో విశేషంగా కిటికీలూ తలుపులూ సింబాలిక్‌గా కనపడతాయి. రైలు రాకతో సినిమా ప్రారంభమై, రైలు పోకడతో సినిమా ముగుస్తుంది. అంటే రాణా గ్రామానికి రావడంతో ప్రారంభమై, వెళ్లిపోవడంతో ముగింపు. కొన్ని కీలక సన్నివేశాల్లో రూప, రాధల పాత్రలు కిటికీల దగ్గర నిలబడే మాట్లాడతాయి. కిటికీలు బందిఖానాలు సినిమాటిక్ పరిభాషలో. ఇది ఫిలిం నోయర్ సినిమాల ఎలిమెంట్. ఫిలిం నోయర్ జానర్ థ్రిల్లర్ సినిమాల్లో పాత్రలు క్లిష్ట సమయాల్లో కిటికీల బ్యాక్ డ్రాప్ లోనే వుంటాయి.

కిటికీలతో బాటు రూప పాత్రకి  పక్షుల్ని కూడా సింబాలిక్‌గా జోడించారు. ఐరనీ ఏమిటంటే, ఆమె భర్త పక్షి ప్రేమికుడు. పక్షుల ఫోటో గ్రాఫులు తీస్తూంటాడు! ఇక చివర్లో రైలు పెట్టెల తలుపులు విముక్తికి సంకేతాలు.

ఐతే చివరికి రూప విముక్తి పొందిందా? అతడితో రైలెక్కి వెళ్ళిపోయి విముక్తే పొందింది. కానీ ఈ విముక్తి భర్తకి తెలియకుండా లేచిపోవడం లాగే వుంది. ఆ తర్వాత ఈ విముక్తయినా విముక్తి కాలేదు. రైల్లో ఆమెతో వెళ్ళిపోయాక రాణా స్వగతం వస్తుంది…

“నాతో వచ్చేసింది… ఆమె నాకెంతో అవసరమని తర్వాత గుర్తించాను. ఆమె వాళ్ళ వూరుకి తిరిగి వెళ్ళలేదు, బారువానీ కలవలేదు. ఏడాది గడిచిపోయింది… అకస్మాత్తుగా జబ్బున పడి ఈ లోకాన్ని విడిచింది… కానీ ఆమె ఏం కోరుకుందో అది పొందింది…”

ఇదీ ఈ కథకి ఉపసంహారం. రాధకి అదే న్యాయం, రూపాకీ అదే న్యాయం. పితృస్వామ్య పరికల్పన. అడుగు ముందుకేశారో నరికి వేయబడును…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here