Site icon Sanchika

లోకల్ క్లాసిక్స్ – 54: కార్యకర్తలకి టీకా

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా టియా కుమ్జుక్ ఆయేర్ దర్శకత్వం వహించిన నాగమీస్ సినిమా ‘నానా – ఏ టేల్ ఆఫ్ అజ్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘నానా – ఏ టేల్ ఆఫ్ అజ్’ (నాగమీస్)

ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు, హింస సర్వసాధారణమై పోయిన రాష్ట్రాల్లో నాగాలాండ్ కూడా ఒకటి. ఈశాన్యంలో కేవలం ఇరవై లక్షల జనాభాతో అతి చిన్న వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. 1963లో రాష్ట్రం ఏర్పాడ్డాక కూడా తీవ్రవాదం ఆగలేదు. ఈ తీవ్రవాదం అభివృద్ధికి ఆటంకమై కూర్చుంది. అన్ని రంగాల్లో మౌలిక సదుపాయల లేమి, నిరుద్యోగం, పేదరికం మొదలైన సమస్యల్ని తీవ్రవాదం ఏమీ పరిష్కరించలేక పోయింది. రాజకీయ వర్గం అవినీతిలో కూరుకుపోయింది. ఈ ఇరవై లక్షల జనాభాగాల అభివృద్ధికి నోచుకోని చిన్న రాష్ట్రంలో, ఎన్నికల్లో గెలవడానికి గ్రామీణ ప్రాంతాల్లో అయిదు కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 20 కోట్లూ నాయకులు ఖర్చు పెడుతున్నారంటే, దోపిడీ ఏ స్థాయిలో వుందో అర్థం జేసుకోవచ్చు. డబ్బులు వెదజల్లి ఓట్లు కొనుక్కోవడం, హింసకి పాల్పడడం ఎన్నికల్లో రివాజుగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 968 కోట్లు తగలేశారని గూగుల్ చేస్తే తెలుస్తోంది. ఇలా ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో పాలన బాధ్యతా రహితంగా తయారైంది. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొందరు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, నాగాలాండ్ బాప్టిస్టు చర్చి కౌన్సిల్ పేరిట పరిశుద్ధ ఎన్నికల నినాదంతో ఉద్యమమం చేపట్టారు. నీతిమంతమైన ఎన్నికలు కావాలి, నీతిమంతుల్ని ఎన్నుకోవాలి. ఇది సాధ్యమవుతుందా? సాధ్యమైతే ఎక్కడ్నించి ప్రారంభమైతే సాధ్యమవుతుందనేది ఎన్నికల ముందు, ‘నానా – ఏ టేల్ ఆఫ్ అజ్’ తీసి తెలియజేశాడు కొత్త దర్శకుడు టియా కుమ్జుక్ ఆయేర్.

ఈ రెండు నెలల కాలంలో తమిళం నుంచి ‘మండేలా’, మలయాళం నుంచి ‘ఒన్’ ఎన్నికల గురించి సినిమాలుగా వచ్చాయి. ఓటు హక్కుని ‘మండేలా’ దర్శకుడు వాస్తవిక కోణంలో తీసుకుంటే, రైట్ టు రీకాల్ గురించి ‘ఒన్’ దర్శకుడు రొటీన్ ఫార్ములా కోణం తీసుకున్నాడు. ‘నానా – ఏ టేల్ ఆఫ్ అజ్’ దర్శకుడు ఇంకాస్త ముందుకెళ్ళి, మూలాల మీద దృష్టి సారించాడు. నీతిమంత నాయకుడు కావాలంటే నీతిమంతులైన కార్యకర్తలుండాలని అసలు విషయం చెప్పే ప్రయత్నం చేశాడు. నాగాలాండ్‌లో మాట్లాడే నాగమీస్ భాషలో చేసిన ఈ ప్రయత్నం, 2018లో తొలి అతర్జాతీయ ప్రదర్శన కెళ్ళిన మంచి ప్రయత్నంగా నమోదైంది.

కథ చాలా సరళంగా వుంటుంది. చాలా తక్కువగా కూడా వుంటుంది. ఈ ఎన్నికల కథ కూడా రాజకీయ దృశ్యాలతో వుండదు. చెప్పాలనుకున్నది పరిశుద్ధ ఎన్నికల గురించే కాబట్టి, దీని ప్రతీకలతో కుటుంబ కథగా వుంటుంది. ఇలాటి తక్కువ మోతాదులో కొత్తాలోచనలు చేసినప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం పెరిగిపోతుంది. విషయాన్ని తట్టి, మిగతాది మన ఆలోచనలకి వదిలేసినప్పుడు, అది చెప్పకుండా చెప్పేసిన కథైపోతుంది- గత వారం చూసిన ‘గమక్ ఘర్’ లాగా.

మలయ్ (జోహియో చూహో) ఇతడి స్నేహితుడు టిరు (అరెన్సా లోంగ్చార్) నిరుద్యోగులు. ఇంకొన్ని రోజులకి సరిపోనూ ఇల్లు గడవడానికి డబ్బులున్నాయి. పని చూసుకుందామంటే గ్రామంలో పనులేవీ లేవు. సోమరిగా కాలక్షేపం చేస్తూంటారు. మలయ్‌కి కొండమీద ఇల్లు. ఆ ఇంట్లో భార్య అనో (మెంగూ సోక్రీ), ఏడేళ్ళ కూతురు నానా (వటిపొంగ్లా సికిచూ) లతో వుంటాడు. ఒక బావమరిది ఆటో (ఇంకాంగ్ లోంగ్చార్) వుంటాడు. కూతురు నానా చదివే స్కూల్లో టీచర్‌గా గ్రేస్ (ఇమ్లసెన్ల ఆయర్) వుంటుంది. ఈమె ప్రభుత్వ డాక్టర్ రమోక్ (బొకాబీ స్వూ) తో ప్రేమలో వుంటుంది.

కూతురు నానాకి సైకిలు కొనిచ్చే కల మలయ్‌కి తీరేలా వుండదు. కూతురికి రెండే కావాలి – సైకిలు, చాక్లెట్లు. చాక్లెట్లు బావమరిది చూసుకుంటాడు, సైకిలు తాను చూసుకోలేక పోతున్నాడు. కూతురితో ఆడుకుంటూ మాత్రం ఆర్థిక బాధల్ని మర్చిపోగల్గుతున్నాడు. నేస్తం టిరు ఏదో వొకటి చేసి బాగా డబ్బు సంపాదించాలని తరచూ గుర్తు చేస్తూంటాడు. ఇంతలో ఎన్నికలొస్తాయి. ఎన్నికల్లో డబ్బు సంపాదించే పని చేయాలంటాడు.

ఇద్దరూ కలిసి మంత్రి పియ్యే దగ్గరి కెళ్తారు. పియ్యే ఐదు లక్షల రూపాయలిచ్చి, పరిశుద్ధ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్న స్కూల్ టీచర్ గ్రేస్ తండ్రి సంగతి చూసుకోమంటాడు. దీంతో ఆయుధాలు కొని, ఓ రాత్రి అడ్డగించి గ్రేస్ కళ్ళ ముందే ఆమె తండ్రి మీద కాల్పులు జరుపుతారు. ఆ తర్వాత పియ్యే చెప్పిన ఇతర పనులు చేపడతారు. పరిశుద్ధ ఎన్నికలుండవని, మంత్రికే ఓటేయ్యాలని ఓటర్లని బెదిరించడం, డబ్బులిచ్చి ఓటర్లు కార్డులు సొంతం చేసుకోవడం, పోలింగ్ బూత్ దగ్గర హింసకి దిగడం, ఆ కార్డులతో మంత్రికి ఓట్లేయడం. ఇలా మంత్రిని గెలిపించేస్తారు. వచ్చిన డబ్బుని తాగి ఖతం చేస్తారు.

ఇప్పుడు మొదలవుతుంది అసలు సమస్య. కూతురు నానా జబ్బున పడుతుంది. ఆమెని బతికించుకోవడానికి సాయం కోసం తను హింసకి దిగిన వాళ్ళనే అడుక్కునే పరిస్థితి వస్తుంది. తండ్రి మీద కాల్పులు జరిపింది వీడేనని గ్రేస్‌కి తెలిసిపోతుంది. భార్య అనో అసహ్యించుకుంటుంది. గ్రామంలో దిక్కుండదు. వైద్యం చేస్తున్న డాక్టర్ కూతుర్ని బ్రతికించడానికి విఫల యత్నం చేస్తాడు…

ఇలా ఈ ఎన్నికల కథలో కూతురు నానా పరిశుద్ధ ఎన్నికలకి ప్రతీక. ఆమె దృష్టి కోణంలోనే పచ్చటి ప్రకృతి అందాలతో స్వచ్ఛమైన కుటుంబ దృశ్యాలుంటాయి. ఈ దృశ్యాల్లో ఎన్నికల నినాదాలు, ప్రచార హోరు వుండవు. మలయ్ హింసకి పాల్పడే రెండు చోట్ల తప్ప, పోలింగ్ బూత్ దగ్గర తప్ప, వేరే రాజకీయ దృశ్యాలే వుండవు. ఇలా నానా ఆధారంగా, నానాయే పరిశుద్ధ ఎన్నికల సింబల్‌గా కన్పడుతున్న నేపథ్యం, బయట మలయ్ పాల్పడ్డ చర్యల వల్ల చెదిరిపోయింది. డబ్బుకోసం అతను హింసకి పాల్పడి మంత్రిని గెలిపించి వుండవచ్చు, ఆ చేసిన తప్పుకి ఫలితం ఇంట్లో స్పష్టగా కనపడుతోంది… పరిశుద్ధ ఎన్నికలు చెదిరిపోయిన దృశ్యం… ఇక నానా లేని ఇల్లు.

కర్మ సిద్ధాంతం చెబుతున్నఈ సున్నిత, సింబాలిక్ కథ కార్యకర్తలకి ఎంతవరకు అర్ధమై మారతారో గానీ, మారితే ఇప్పుడున్న నాయకుల్లో 90 శాతం వుండరు. ఎక్కడ కొట్టాలో అక్కడ బాగానే కొట్టాడు దర్శకుడు టియా కుమ్జుక్ ఆయేర్. తగిలిందో లేదో కార్యకర్తలు చూసుకోవాలి. వాతలు కనపడి అది టీకాలా అన్పిస్తే నడకలు మార్చుకోవాలి. ఈ గంటా 40 నిమిషాల సినిమాని మొదటి నలభై నిమిషాలు ఓపికతో చూడాలి. విషయం లేని కుటుంబ దృశ్యాలే పునరావృత మవుతూ వుంటాయి. ఎన్నికల ప్రకరణం మొదలైతేగానీ ఊపందుకోదు. నటనలు, సాంకేతికాలు ఉన్నతంగా వుంటాయి. దీనికి 2019 లో నాగాలాండ్ ప్రభుత్వ అవార్డుతో బాటు, ఎడిన్‌బర్గ్ చలన చిత్రోత్సవాల్లో రెండు అవార్డులు లభించాయి. 2021 ఫ్రాగ్ ఫెస్టివల్లో ఒక అవార్డు లభించింది.

Exit mobile version