[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా సమర్థ్ మహాజన్ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ ‘ది అన్‌రిజర్వ్‌డ్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘ది అన్‌రిజర్వ్‌డ్’ (డాక్యుమెంటరీ)
క్రిక్కిరిసిన జనరల్ బోగీ రైలు ప్రయాణం సామాన్యుల సమరం. సీటు సవాలు. సీటు దొరికిందా కడదాకా సింహాసనం. ఎడతెగని సంభాషణం, లోకాభి రామాయణం. సీటు దొరకలేదా బిత్తర చూపుల ద్వారపాలకాభినయం. జనరల్ బోగీ శ్రామిక భారతం. ఈ శ్రామిక భారతానికి న్యూ ఇండియా వుండదు. 1917లో గాంధీజీ రాసిన మూడో తరగతి రైలు ప్రయాణ వ్యాసం మక్కీకి మక్కీ అమలవుతూ నూరేళ్ళు దాటి అదే దృశ్యం- బ్రిటీషు వాడిచ్చిపోయిన వారసత్వం – జనరల్ బోగీ యోగం.
జనరల్ బోగీలో సామాన్యుల జీవనాడి పెనవేసుకుపోయి సాగుతుంది. కలవని రైలు పట్టాలు కలివిడి జీవనాడికి గమ్య స్థాన రేఖలై పటం గీస్తూంటాయి. ఆ పటంలో చెట్లు చేమలు, మైదానాలూ కొండలు, నదులూ వంతెనలు, పల్లెలూ పట్టణాలు కొత్త రూపాలతో స్వాగతం పలుకుతూంటాయి, వీడ్కోలు చెబుతూంటాయి. మారని రూపం ఒక్కటే – జనరల్ బోగీ. దీనికి అభివృద్ధి లేదు, వుండదు, వుండకూడదు. సామాన్య వర్గ అభివృద్ధితో జనరల్ బోగీయే తొలగిపోయే రోజుల్ని భారం మోస్తున్న పట్టాలు కోరుకుంటాయి.
లోకల్ క్లాసిక్స్ శీర్షిక సత్యజిత్ రే రైలు ప్రయాణ కథ ‘నాయక్’తో ప్రారంభమయింది. తిరిగి తిరిగి మళ్ళీ రైలు ప్రయాణానికే వచ్చాం. సత్యజిత్‌ది సంపన్నుల ఏసీ ట్రైను. ఇప్పుడు మనం చూస్తున్నది అసంపన్నుల నడిచే బస్తీ. దేశమంతా తిప్పుతూ పట్టాల మీద బస్తీ భారత పెరేడ్. రెండు పట్టాలు, పదిహేడు రోజులు, పది రైళ్ళు, 265 గంటలు పరిగెత్తే చక్రాలు, ముంబాయి నుంచి కాశ్మీరు దాకా, అస్సాం నుంచి కన్యాకుమారి దాకా సమర్థ్ మహాజన్ కెమెరా యానం.
దర్శకుడు సమర్థ్ మహాజన్ జనరల్ బోగీల్లో ప్రయాణాల మీద డాక్యుమెంటరీ తీసినప్పుడు ప్రయాణికుల ఇబ్బందులు, సమస్యలు కాదు చెప్పింది. రైల్వే శాఖ లోపాలు కాదు చూపించింది. రైల్వేల చరిత్ర కాదు, రైల్వేల పరిపాలనా కాదు – బయటి ఏ అంశమూ కాదు – ‘ది అన్ రిజర్వ్‌డ్’ -జనరల్ బోగీల్లోపల వివిధ ప్రాంతాల సామాన్యుల వ్యక్తిగత జీవితాలు, అభిప్రాయాలూ, అనుభవాలూ. సామాన్యుల సంగతులకి మీడియాలో చోటు చెదిరిపోయాక ఈ డాక్యుమెంటరీ వాళ్ళ మనోభావాల డిక్షనరీ.
ఒక క్రమ పద్ధతిలో ఒక్కొక్కరితో సంభాషణాలుంటాయి: 81 ఏళ్ళ పెద్దాయన యోగా సనాలేయడంతో, మిమిక్రీ కళ ప్రదర్శించడంతో ప్రారంభించి, ప్రేమలు, అన్నదమ్ముల అనుబంధం, కార్మిక జీవితం, విద్య, కుటుంబం, కాపురంలో కలతలు, వృద్ధాప్యం, సామాజికం, భ్రూణ హత్యలు, మత సామరస్యం… ఇలా 10 అంశాలుగా స్త్రీ పురుష ప్రయాణికుల అభిప్రాయాలుంటాయి.
ఒక మాస్ కుర్రాడు ఎలా అమ్మాయిలు తనకి కాల్స్ చేస్తూంటారో సగర్వంగా చెప్తాడు. ఈ విషయం గర్ల్ ఫ్రెండ్‌కి తెలిసినా పట్టించుకోదంటాడు. నర్సింగ్ చేస్తున్న యువతి తల్లి చూసిన సంబంధమే చేసుకుంటానంటుంది. కనుక బాయ్ ఫ్రెండ్స్ గురించి ఆలోచనలు చేసే ప్రసక్తే లేదంటుంది. ఇంకో ఎనిమిది సెకన్లు ఎడంగా పుట్టిన కవలల అనుబంధం స్నేహబంధంలా వుంటుంది. ఇద్దరూ స్నేహితుల్లాగే అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు. ఒక కార్మికుడు కూతురి బ్రెయిన్ ట్యూమర్‌కి మూడు లక్షలు ఖర్చు పెట్టి పరరాష్ట్రంలో సంపాదన కోసం తిరుగుతున్నాడు. ఒక కశ్మీరీ ముస్లిం యువకుడు క్రికెట్‌లో పాకిస్తాన్ వైపు వుంటాడు, భద్రతా దళాల్లో పనిచేస్తున్న తమ్ముడు ఇండియా వైపు వుంటాడు. ఒక ఢిల్లీ హిందూ యువకుడు జామా మసీదులో సేదదీరి వస్తూంటాడు…
ఇలా వాళ్ళ జీవితాలు, ఆశ నిరాశలు, జయాపజయాలు వాళ్ళ మాటల్లో వెల్లడవుతాయి. అయితే అందరికీ ముందు జీవితం బావుంటుందనే ఆశాభావమే వుంటుంది. ఎవరినీ బాధ్యుల్ని చేయరు, ఫిర్యాదులు చేయరు. జీవితంపట్ల అందరికీ ఆత్మవిశాసమే. ఆత్మనిర్భర్ ఉపన్యాసాలు వాళ్ళకి అవసరం లేదు. ఇది 2018 నాటి దృశ్యమనేది వేరే విషయం.
వివిధ ప్రాంతాల ఈ ప్రయాణికులు హిందీయే మాట్లాడడం కన్పిస్తుంది. కెమెరా బోగీ దాటి బయటికెళ్ళదు. కదిలిపోయే ప్రకృతి దృశాలు, రైల్వే స్టేషన్లు కిటికీల్లోంచే కనిపిస్తూంటాయి. రైలు కూతలు, పట్టాల చప్పుళ్ళూ వుండవు. ఎలాటి నేపథ్య సంగీతం వుండదు. మధ్యలో కొందరు భజన్ పాడడం మాత్రం వుంటుంది.
డాక్యుమెంటరీ అంటే ముందుగా పడిపోయే ఎలిమెంట్ వాయిసోవర్. ఈ డాక్యుమెంటరీకి ఈ వాయిసోవరే వుండదు. నేపథ్య వ్యాఖ్యానం నిల్. ఇది కొత్తగా అనిపిస్తుంది. ప్రయోగమని చెప్పొచ్చు. డైజెటిక్ సౌండ్ లేని డాక్యుమెంటరీ. దీనికి 2018 ఉత్తమ డాక్యుమెంటరీ జాతీయ అవార్డు లభించింది.