[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘లోపలి కవిత’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఒ[/dropcap]క బొమ్మ పోసింది
ప్రాణం
రవివర్మ కుంచెల దిద్దిన
కలగా పొంగి
ఊయలలే ఊహలై
కనుల ఊగే
బయటి భావోద్వేగమై
లోపలి కవిత
వాకిలి తెరువని
కిటికీల పిలుపులగని
హృదయపు లోగిలి పంచే
లోపలి కవిత బయటి భావోద్వేగం
కాలంలో
కరచాలనం కలానికీ కుంచెకూ
అందానికీ భావానికీ
తెలియని పెనవేసిన జుగల్బందీ
లోపలి కవిత
చూపుల
గుసగుసలైన మిసమిసలు
మనసున మనసు పారాడే
నింగీ నేలా కలిపే సరళరేఖ శిఖ
లోపలి కవిత
ఆవేశమైన ఆవేదన
రేకెత్తిన ఒక భావనలో
పొటమరించే ఆలోచన జ్వాల
లోపలి కవిత
చెమ్మగిల్లిన గుండెలో
అంకురించింది ఉమ్మనీరై అమ్మ
బయటి భావోద్వేగమై
లోపలి కవిత