Site icon Sanchika

ఎం.హెచ్‌.కె.-1

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత సన్నిహిత్ వ్రాసిన “ఎం.హెచ్.కె.” అనే మినీ నవలని పాఠకులకు అందిస్తున్నాము. పల్లెటూరి రాజకీయాలు, అంతరిక్షపు కుట్రలతో ఆసక్తి చదివించే కథనంతో నడిచే సీరియల్‍లో ఇది మొదటి భాగం. [/box]

ప్రారంభం:

[dropcap]వి[/dropcap]శాలమైన అంతరిక్షం…

గ్రహాంతరవాసుల సమావేశం జరుగుతోంది.

అపారమైన మేధస్సుతో అలరాలే జీవులన్నీ ఒక చోట సమావేశమయ్యాయి. ఏదో ఒక కార్యానికి పథకరచన చేస్తున్నాయి.

ముందుగా వాళ్ళ నాయకుడు మాట్లాడటం మొదలు పెట్టాడు.

“మిత్రులారా!

మనం ఎప్పటి నుండో కంటున్న కల ఇప్పుడు తీరబోతోంది. భూగ్రహాన్ని పూర్తిగా నాశనం చేసి మన వశం చేసుకునే సమయం ఆసన్నమయింది. దానికోసం మనం ఏం చెయ్యాలో మీకందరికీ సందేశం పంపబడుతుంది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. సీక్రెట్‌గా ఒక ఆపరేషన్ మనం చెయ్యబోతున్నాం. దాని పేరు ‘ఎం.హెచ్.కె.’ ఆ ఆపరేషన్ సక్సెస్ అయి మన చిరకాల వాంఛ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. బై” అని ముగించాడు.

చప్పట్లు మారుమోగాయి. పచ్చగా కళకళలాడే భూమి పైన ఆ గ్రహాంతరవాసులందరికీ ఒక కన్ను ఉంది. ఏ నాటికైనా వశం చేసుకోవాలనే కోరిక ఉంది. ఇప్పుడు ఆ కోరిక తీరబోతోందని తెలియడంతో ఆనందాతిరేకం పెరిగిపోయింది వారిలో. సమావేశం అయిపోగానే ఉత్సాహంగా తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు.

“ఎం.హెచ్.కె.”

అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్.

మన భూమిని ఇక ఆ భగవంతుడే రక్షించాలి.

***

పొద్దున్న నాలుగ్గంటలు కావస్తోంది. అందమైన ఆ పల్లెటూరు కోడి కూతతో మేల్కొంది. కాలకృత్యాలు ముగించుకొని వడి వడిగా నడుచుకుంటూ పొలం వైపు దారి తీసారు అరవయ్యేళ్ళ ‘రఘురామయ్య’ గారు.

ఆ ఊళ్ళో మోతుబరి రైతు ఆయన. తనకంటూ ఇంట్లో ఇల్లాలు తప్ప ఇంకెవ్వరూ లేరు. లంకంత ఇల్లు, బోలెడంత ఆస్తి. తనవాళ్ళంటూ ఎవ్వరూ లేకపోవడంతో ఊళ్ళోని అమాయక జనాన్ని తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఉంటారు. వారినే అభిమానంగా చూస్తూ ఉంటారు. ఊరికి ఏ కష్టం వచ్చినా తీర్చడానికి ముందుంటారు. ఊరి ప్రజలు కూడా ఆ దంపతులని తమ స్వంత వాళ్ళుగా చూసుకుంటారు.

సన్నగా చినుకులు పడటం మొదలైంది. ఊరికి పక్కనే ఉన్న పొలంలోకి ప్రవేశించారు రఘురామయ్య గారు. పొలాలకి కొంచెం దూరంలో రైలు కట్ట. ఏదో రైలు కూత పెట్టుకుంటూ వెళుతోంది. వేకువ వెలుతురులో ఎవరినో వెతుకుతున్నట్లుగా పరుగెడుతోంది ఆ రైలు.

పొలంలో దిగి పని చేసుకోసాగారు రఘురామయ్య. ఇంతలో ‘కేర్‌..కేర్‌..’ మని ఏడుస్తున్న పసిపాప గొంతు వినపడింది. ఉలిక్కిపడి చూసారు రఘురామయ్య. ఆ శబ్దం వస్తున్న వైపు వెతుక్కుంటూ వెళ్ళారు. ఆశ్చర్యంగా అక్కడ గుడ్డలతో అల్లిన ఒక బుట్టలో… ఒక పసిపాప కనపడింది. విపరీతమైన ఆశ్చర్యంతో ఆత్రంగా ఆ పాపను చేతుల్లోకి తీసుకున్నారు. వర్షపు చినుకులు ఆ పాప ముఖం మీద పడుతున్నాయి. గబ గబా తన కండువాను ఆ పాపకి గొడుగులా పట్టారు.

“అయ్యయ్యో! ఎవరు చేసారు ఈ పని” అనుకుంటూ బుట్టను తీసుకుని వెంటనే ఇంటి ముఖం పట్టారు.

“సావిత్రీ… సావిత్రీ” అంటూ ఇంట్లోకి ప్రవేశించారు.

“అబ్బబ్బ… ఈయనకి అన్నీ తొందరే! అయినా పొలం వెళ్ళి వెంటనే వచ్చేసారేంటి?” అనుకుంటూ ఎదురొచ్చింది. భర్త చేతిలోని పసికందుని చూసి ఆశ్చర్యపోయింది.

“అబ్బ… ఎంత చక్కగా ఉందో.. ఎవరి పాప అండీ” అంది పాపను చూస్తూ

“ఎవరి పాపా కాదు… మన పాపే … ఆ దేవుడిచ్చిన పాప… మన మనవరాలు” అంటూ ఆమె చేతుల్లో పెట్టాడు. ఆనందంగా ఆ పసిపాను అందుకుంది సావిత్రమ్మ.

ఆ విధంగా ఆ పసికందు ఆ కుటుంబంలో సభ్యురాలైంది.

***

పాపకు ‘జనని’ అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు.

జనని బాగా చురుకు. ఒకసారి చెబితే ఏ విషయాన్ని అయినా గుర్తుపెట్టుకునేది. ఏకసంథాగ్రాహి అన్న మాట! ఆడుతూ పాడుతూ హుషారుగా ఉండేది. పల్లెటూళ్ళో పెరుగుతూ ఉండటం వల్ల… అందులోనూ రఘురామయ్య దంపతుల పెంపకం కావడం వల్ల… అన్నీ మంచి బుద్ధులే అబ్బినవి ఆ అమ్మాయికి. పెద్దలను బాగా గౌరవిస్తూ… తోటి వారితో సహనంగా… సమానంగా మెలుగుతూ మంచి పిల్ల అన్న పేరు తెచ్చుకుంది.

కాలంతో పాటూ వయసు పెరగసాగింది జననికి. ఒక రోజు క్లాసులో జరిగిన చిన్న సంఘటన ఆమె మనస్తత్వాన్ని మనకు చూపెడుతుంది.

అయిదో క్లాసు చదువుతోంది జనని. పరీక్షల టైము. కూర్చుని ఇంగ్లీషు పరీక్ష వ్రాస్తోంది. ‘వాచ్‌’ స్పెల్లింగ్‌ వ్రాయమని ప్రశ్న వచ్చింది. జననికి ఆ సమాధానం కొంచెం డౌట్‌. డబ్ల్యూ.. ఏ.. సి.. హెచ్‌ అని స్పెల్లింగ్‌ వ్రాసింది.

పక్కన కూర్చున్న కుర్రాడు అది చూసి “జననీ… నీ స్పెల్లింగ్‌ తప్పు… అందులో ‘టి’ వ్రాయడం మర్చిపోయావు” అని చెప్పాడు. కానీ జనని ఆ అబ్బాయి చెప్పినది వ్రాయలేదు. ‘కాపీ చెయ్యడం తప్పు’ అని గాంధీ గారు వ్రాసినది ఆమె చదివింది. ఆ వాక్యాలు బలంగా ఆమె మనసులో ముద్రింపబడ్డాయి.

అందుకే “నేను వ్రాయను…” అని చెప్పింది. ఆ కుర్రాడు ఆశ్చర్యపోయాడు. ఇదంతా గమనిస్తున్న టీచర్‌ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ సాయంత్రం రఘురామయ్య గారితో ఆ టీచర్‌ “మీ మనవరాలు చాలా గొప్పదండీ… గాంధీ గారు చెప్పినది అక్షరాలా పాటిస్తోంది” అని చెప్పారు. సంబరపడిపోయారు రఘురామయ్య.

యుక్తవయసుకి వచ్చింది జనని. అందాల బొమ్మలా తయారయింది. ఆమెను చూస్తుంటే రఘురామయ్యగారికి ఎంతో సంతృప్తిగా ఉండేది. గతంలో ఒక విషాద సంఘటనతో తీరని లోటు చేసిన భగవంతుడు జననిని తమకిచ్చి ఈ విధంగా ఓదార్చాడా అని అనుకోసాగారు.

“తాతయ్యా… నేను అలా తోట దాకా వెళ్ళొస్తాను” అడిగింది జనని.

“వెళ్ళమ్మా… కానీ ఒంటరిగా వెళ్ళకు. నీ స్నేహితురాళ్ళతో వెళ్ళు… జాగ్రత్త” అని చెప్పారు

“సరే తాతయ్యా…” అంటూ తుర్రున పారిపోయింది. ఏదో గుర్తుకొచ్చి కళ్ళు తుడుచుకున్నారు రఘురామయ్య. ‘జీవితం గొప్పది. దానికంటే విలువలు గొప్పవి’ అని నమ్మే వ్యక్తి ఆయన. ఆ నమ్మకంతోనే ఇప్పటి దాకా జీవిస్తున్నారు. ఆ నమ్మకం తనకు ఎంత నష్టం కలిగిస్తున్నా సరే తన పంథా మార్చుకోలేదు!

అలాగే శూన్యం లోకి చూస్తూ ఏదో ఆలోచనలో పడిపోయారు ఆయన!

***

భార్య సావిత్రమ్మ వైపు ప్రేమగా చూడసాగారు రఘురామయ్య. ఆయన మనసంతా అదోలా ఉంది. సావిత్రమ్మ తమ కూతురి ఫోటో ఒళ్ళో పెట్టుకుని నిశ్శబ్దంగా కన్నీళ్ళు కారుస్తోంది.

“ఎప్పుడో చనిపోయిన వాళ్ళ గురించి ఎందుకు ఏడుస్తావు… ఊరుకో సావిత్రీ” అంటూ ఓదార్చారాయన.

“నేను మీ అంత కఠినంగా ఉండలేను. ఉన్న ఒక్కగానొక్క కూతురు మనల్ని వదిలి ఆ దేవుని దగ్గరకు వెళ్ళిపోయింది. నాకు గుండె కోతను మిగిల్చింది” అంటూ బాధ పడింది.

విషయమేంటంటే… ఆ దంపతుల ముద్దుల కూతురు చనిపోయి చాలా కాలం అయింది. ఎంతో అపురూపంగా పెంచారు ఆ అమ్మాయిని. కానీ దేవుడు నిర్దాక్షిణ్యంగా ఆమెను వాళ్ళకు కాకుండా చేసాడు. రఘురామయ్య గారు వేరే విషయాల మీద దృష్టి మరల్చి ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. కానీ ఎప్పుడూ ఇంటిపట్టున ఉండే సావిత్రమ్మ గారు మాత్రం కూతురిని తలచుకోకుండా ఉండలేకపోతున్నారు. భార్య పడుతున్న బాధ చూసి విచలితులయ్యారు రఘురామయ్య.

“పోనీ లేవే… ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు” అంటూ లేచి వెళ్ళిపోయారు.

“మీకేంటి… ఇలాగే వేదాంతం చెబుతారు… నవమాసాలు మోసి కంటే మీకు తెలిసేది” అనుకుంటూ చెంపల మీదకు జారిన కన్నీటిని తుడుచుకోసాగింది సావిత్రమ్మ.

***

సమయం సరిగ్గా మిట్ట మధ్యాహ్నం కావస్తోంది. ఊరి చివర గుట్ట మీద ఉన్న పురాతన గుడి వైపు వడి వడిగా దారి తీసింది జనని. ఒంటరిగా వెళ్ళసాగింది. ఆ గుడి లోపలికి వెళ్ళి అరగంట తర్వాత అదే వేగంతో ఊళ్ళోకి వచ్చేసింది.

ఏమీ ఎరగనట్టు ఇంట్లోకి వెళుతున్న జననిని చూసి “ఎక్కడికి వెళ్ళావమ్మా?” అంటూ అప్యాయంగా అడిగారు రఘురామయ్య గారు.

“నా ఫ్రెండ్‌ దగ్గరికి వెళ్ళాను తాతయ్యా” అంటూ నోటికొచ్చిన అబద్ధం చెప్పేసింది జనని. చిన్నగా నిట్టూర్చారు రఘురామయ్య.

“వయసులో ఉన్న పిల్ల… ఒక కన్నేసి ఉంచాలి” అని మనసులో అనుకున్నారు.

(సశేషం)

Exit mobile version