ఎం.హెచ్‌.కె.-4

0
1

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత సన్నిహిత్ వ్రాసిన “ఎం.హెచ్.కె.” అనే మినీ నవలని పాఠకులకు అందిస్తున్నాము. పల్లెటూరి రాజకీయాలు, అంతరిక్షపు కుట్రలతో ఆసక్తి చదివించే కథనంతో నడిచే సీరియల్‍లో ఇది నాల్గవ భాగం. [/box]

[dropcap]”రే[/dropcap]య్‌… ఎవడ్రా అది” అంటూ ఎదురుదాడికి దిగాడు అతను. పెనుగులాట ప్రారంభమైంది. శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు కళ్యాణ్‌. కాసేపటి తర్వాత… అదృష్టవశాత్తు అతన్ని విడిచిపెట్టి పారిపోయారు శతృవులు. బలంగా ఊపిరి వదులుతూ “నా కొడకల్లారా మిమ్మల్ని వదిలేదే లేదు” అని సెల్‌ ఫోన్‌ టార్చ్‌ ఆన్‌ చేసి చుట్టూ చూసాడు. ఎవ్వరూ కనపడలేదు. కాసేపు అక్కడే ఉండి వెనుదిరిగి వచ్చేసాడు. ఇప్పుడు అతని అనుమానం మరింత బలపడింది. ఇంటికొచ్చి తన రూములోకి వెళుతున్నప్పుడు చూసాడు. జనని ఇంకా మెలకువగా ఉంది. అతని రాక చూసాక తన గదికి వెళ్ళిపోయింది

***

తెల్లారింది.

బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని బయటకు వచ్చాడు కళ్యాణ్‌. జనని అతని దగ్గరకు వచ్చింది.

“ఏంటి… రాత్రి ఏదో రాచకార్యం మీద  బయటకు వెళ్ళినట్టున్నారు?” అంది.

“అవును… అయినా ఎంత జాగ్రత్తగా వెళ్ళినా  నీ దృష్టి నుండి తప్పించుకోవడం సాధ్యం కాలేదు కదా!” చిన్నగా అన్నాడు కళ్యాణ్‌ .

“…అయినా నాకు బోలెడన్ని పనులు ఉంటాయి. అవన్నీ గమనించడం మీకు అవసరమా?” అన్నాడు.

“అవసరమే… నాకు మాత్రం అవసరమే…” చాలా ఫర్మ్‌గా అంది.

“అబ్బో… చాలా స్ట్రాంగ్‌ తమరు” అనుకుంటూ బాత్రూం వైపు దారి తీసాడు కళ్యాణ్‌. జనని వంటగది వైపు వెళ్ళింది.

యథావిధిగా రఘురామయ్య గారి ముందు గ్రామస్తులంతా గుమిగూడారు. తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు.

ఎవరో అంటున్నారు. “అయ్యా… రాత్రి పొలాలవైపు ఎవరో వెళ్ళారంట… మనవాళ్ళు ఒకరిద్దరు చూసారు. అసలు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో మాకెవ్వరికీ అర్థం కావడం లేదు. నిన్న గాక మొన్న ఒక చిన్న పిల్లాడు కనిపించకుండా పోయాడు. పోలీసు కంప్లెయింట్‌ ఇద్దామంటే మీరే ఆపారు… అసలేంటయ్యా ఇదంతా” అని అడిగాడు ఒక రైతు.

రఘురామయ్య గారు ఏం చెప్పాలో తెలీక మౌనంగా తల వంచుకుని ఆలోచిస్తున్నట్టు ఉండిపోయారు. ‘ఊరి ప్రజలు ఇప్పటికే చాలా భయపడి పోయి ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పినా అది వాళ్ళని మరింత భయపెట్టినట్టే అవుతుంది’ అనుకుని గ్రామస్తుల నుద్దేశించి – “ఎన్నో విపత్తులని చూసి తట్టుకుని నిలబడిన ఊరు రా మనది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి భయపడకండి” అన్నారు.

“అట్టాగే సామీ… మీ దయ… ఆ పైన భగవంతుడి దయ” అంటూ అక్కడి నుండి లేచి వాళ్ళు ఇళ్ళ వైపు వెళ్ళిపోయారు.

అప్పుడే వచ్చిన కళ్యాణ్‌ ఇదంతా చూసి “ఏంటండీ… జనాలు బాగా బెదిరిపోయినట్టున్నారు” అన్నాడు.

“అవును బాబూ… అమాయకత్వం… ఆప్యాయతకు రూపాలైన ఆ రైతు జనాన్ని మనమే ఆదుకోవాలి. వాళ్ళకో దారి చూపాలి” అన్నారు రఘురామయ్య గారు.

కళ్యాణ్‌ మనసు చేదుగా అయిపోయింది. ఏదో రకంగా ఈ రహస్యాన్ని ఛేదించాలి అని మనసులో గట్టిగా మరోసారి అనుకున్నాడు.

***

మెడికల్‌ కాలేజీ ఆవరణ… ఉరకలెత్తే కుర్రాళ్ళతో… రంగు రంగుల సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలతో కళ కళ లాడుతూ… ఒక అందమైన పూలతోటలా ఉంది. ఆ అందమైన తోటలో రెండు పక్షులు… ప్రేమ పక్షులు… రవి… రశ్మి. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ… ప్రపంచాన్ని మర్చిపోయి… అందమైన కలల్లో విహరిస్తూ… ఓహ్‌… ఒక అద్భుతమైన లోకంలో సంచరిస్తున్నారు.

ఎవరో గట్టిగా నవ్విన చపుడవ్వడంతో ఈ లోకంలోకి వచ్చారు.

రశ్మి ఏదో చెప్పడానికి సంసిద్ధమయింది. “చూడు రవీ… ఎప్పటినుండో మనం  ప్రేమించుకుంటున్నాం. నువ్వు నా మనసుతో పాటూ నా ఆలోచనలని కూడా ప్రేమించాలి” అంది.

రవి చిన్నగా నవ్వాడు. “రశ్మీ… ఈ రవిని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. నేను కేవలం నీ శరీరాన్నే ప్రేమించడం లేదు… నీ అభిరుచులని… ఇష్టాలని కూడా ప్రేమిస్తున్నాను” ఫర్మ్‌గా చెప్పాడు.

“సరే… అయితే నేను చెప్పేది విను. మెడిసన్‌ కంప్లీట్‌ కాగానే ఏదైనా పల్లెటూరు వెళ్ళి ప్రాక్టీసు పెడతాను. దానికి నువ్వు అడ్డు చెప్పకూడదు.”

“అదేంటి?… ఇంత చదువుకొని పల్లెటూర్లో ప్రాక్టీసు పెడతావా?” కంగారుగా అడిగాడు.

“అవును… పేద ప్రజలకి సేవ చెయ్యాలన్నది నా కల…”

“కొంచెం ప్రాక్టికల్‌‌గా ఆలోచించు రశ్మీ… అవన్నీ ఊహల్లోనూ, సినిమాల్లోనూ బాగుంటాయి. నిజ జీవితంలో అలాంటివి సాధ్యం కావు.”

“ఎందుకు సాధ్యం కావు. పట్టుదల ఉంటే అన్నీ అవుతాయి” స్థిరంగా చెప్పింది.

చాలా సేపు సైలెంట్‌‌గా ఉండిపోయాడు రవి. తర్వాత “సరే… నీ ఇష్టం… నువ్వు అంత గట్టిగా చెబితే నేను అనేదేముంది” అని లేచి వెళ్ళిపోయాడు.

వెళ్తున్న అతని వైపు చూస్తూ అలాగే ఉండిపోయింది రశ్మి… ది గ్రేట్‌ ఇండస్ట్రియలిస్ట్‌ విష్ణువర్ధనరావ్‌ గారి ఏకైక పుత్రిక రశ్మి!

సాయంత్రం ఇంటికి వచ్చి సోఫాలో వాలిపోయింది రశ్మి. అలసిపోయి వచ్చిన కూతురిని ప్రేమగా చూస్తూ “ఏమ్మా… బాగా స్ట్రెయిన్‌ అయినట్టున్నవు” అడిగారు విష్ణువర్ధనరావ్‌.

“అవును డాడీ…” అని చెప్పి కళ్ళు మూసుకుంది. పనమ్మాయి కాఫీ, మంచి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. వాటిని అందుకొని తండ్రితో మాటలు కలిపింది రశ్మి.

“నాన్నా… కొంచెం నేను చెప్పేది వినాలి” అంది కాఫీ సిప్‌ చేస్తూ

“చెప్పమ్మా… నా దగ్గర నీకెందుకు దాపరికం?”

“త్వరలోనే నా మెడిసన్‌ పూర్తవ్వగానే ఏదైనా పల్లెటూరికి వెళ్ళి ప్రాక్టీసు పెడతాను… దానికి మీ సహకారం కావాలి” గోముగా అంది.

“అయ్యో… దానికేమమ్మా… నీ ఇష్టం” అని “…అయినా పల్లెల్లో ఏముంటుందమ్మా? అంతా మట్టి పేడ తప్ప! ఇక్కడే సిటీలో హాయిగా ప్రాక్టీసు చేసుకో” అన్నాడు.

“వద్దు డాడీ… పల్లెల్లో ఉన్న పేదలకు సేవ చెయ్యాలని నా కల. ఈ విషయంలో మాత్రం నాకు అడ్డు రాకండి” అంది.

“సరే… నువ్వు అంతగా అడిగితే నేను కాదంటానా!” అని లేచి వెళ్ళిపోయాడు. అయితే రశ్మి వెళ్ళాలనుకుంటున్నది, తను ఫేక్టరీ కోసం  పొలాలు కొనాలని కలగంటున్న ఊరు ఒకటే అని తెలిస్తే మాత్రం కలలో కూడా ఒప్పుకునేవాడు కాదు.

***

రంగడు! రఘురామయ్య గారి ఇంట్లో ఎన్నో ఏళ్ళుగా పని చేస్తున్న సేవకుడు. కాలు లోపం ఉన్న వికలాంగుడు. ఆయన నీడలో బ్రతుకుతున్న పనివాడు. అనాథలా ఆ ఇంటికి  చేరి అక్కడే ఆశ్రయం పొందిన సామాన్యుడు. ఏనాడూ అతన్ని పనివాడిలా చూడలేదు ఆ కుటుంబం. తమ ఇంటి సభ్యుడిలానే ట్రీట్‌ చేస్తారు. వాడు కూడా తన పరిధులకు లోబడి ఎంతో ఒద్దికగా ఉంటాడు. సావిత్రమ్మ గారు దిగులుగా కూర్చోవడం చూసి ఆమెను సమీపించాడు.

“ఎందుకమ్మగారూ అంత బాధ పడతారు” అని పరామర్శించాడు.

“బాధ కాక ఇంకేం మిగిలిందిరా?” అని కన్నీరు పెట్టుకుంది సావిత్రమ్మ.

“ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడెందుకమ్మా బాధపడటం” అని ఓదార్పుగా అన్నాడు.

ఇంతలో రఘురామయ్య గారు అక్కడికి వచ్చారు. వాళ్ళ సంభాషణ విని ఆయనకు కొంచెం కోపం వచ్చింది.

రంగడిని చూస్తూ “ఏరా… నువ్వు దగ్గరుండి మరీ అమ్మగారిని ఏడిపిస్తున్నావా?” అని మందలించారు. వాడు నెమ్మదిగా అక్కడి నుండి జారుకున్నాడు.

“ఏమిటి సావిత్రీ ఇది… గతాన్ని తలచుకుని బాధ పడుతూ వర్తమానాన్ని పాడు చేసుకుంటావా? అన్నీ మరచి హాయిగా ఉండు. మన జననిని బాగా చూసుకో” అని వాలు కుర్చీలో కూర్చున్నారు.

“మీకేం మగమహారాజులు ఎన్నైనా చెబుతారు. కఠినంగా ఉండగలరు. నా వల్ల కాదు” అని వంటింట్లోకి వెళిపోయింది.

నెమ్మదిగా కళ్ళు మూసుకున్నారు ఆయన. మాగన్నుగా నిద్రపట్టింది.

‘అందమైన చిట్టి చేతులు తన బుగ్గలని నిమురుతున్న స్పర్శ… పసిపాప బోసి నవ్వు… అంతలోనే యవ్వనంతో కళ కళ లాడుతున్న యువతి… పెరిగి పెద్దదైన వ్యక్తిత్వం… వెళ్ళొస్తాను… వీడ్కోలు  అని చెపుతూ దూరంగా పారి పోతున్న దృశ్యం…’

కన్నీటి చుక్కలు ఆయన చెంపలపైకి జారాయి. వాటిని కండువాతో తుడుచుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచారు. ఎదురుగా సావిత్రమ్మ గారు… చేతిలోని కాఫీ కప్పుతో… దొరికిపోయాను అన్నట్టు తుళ్ళిపడ్డారు ఆయన

‘పర్వాలేదు… నేను అర్థం చేసుకున్నాను’ అన్నట్టు ఆయన చేతిని ప్రేమగా స్పృశించింది.

బాధ ఎవరికైనా బాధే… కొంతమంది బయటపడతారు… కొంతమంది బయటపడరు… అంతే తేడా!

***

ఊరంతా సందడి గా ఉంది… చిన్న పిల్లలు పరిగెత్తుకుంటూ వెళుతున్నారు. పెద్ద వాళ్ళు నిదానంగా నడుస్తూ కదులుతున్నారు.

“మన ఊరికి ఇన్నాళ్ళకి వైద్య సౌకర్యం వచ్చింది” అని సంతోషంగా చెబుతున్నాడు ఒకతను. పక్కనున్న వాళ్ళు “అవును నిజమేరా…” అంటూ వంత పాడారు.

ఊర్లోనే ఉన్న ఒక పాడుబడ్డ భవనాన్ని హాస్పిటల్‌‌గా మార్చారు విష్ణువర్ధనరావ్‌ గారు. కూతురి కోరిక తీర్చకపోతే ఎలా మరి. అ భవనానికి రంగులు వేసి… రంగు కాగితాలు కట్టి… గుమ్మాలకి పూలదండలు వేసి శోభాయమానంగా తయారు చేసారు.  ఆ భవనం రూపు రేఖలు మారిపోవడంతో ఊరికే ఒక కళ వచ్చింది.

మేల తాళాల మధ్య… పూజా పునస్కారాల నేపథ్యంలో… విష్ణువర్ధనరావ్‌ గారి చేతుల మీదుగా హాస్పిటల్‌ ప్రారంభించబడింది. ఆయన కుమార్తె రశ్మి ముఖంలో ఆనందం వెల్లి విరిసింది. కానీ రశ్మితో పాటే ఉన్న రవి ముఖం మాత్రం అంత ప్రసన్నంగా లేదు… ఏదో అసహనం! ఈ పల్లెటూరు ఎందుకొచ్చాంరా బాబూ అన్న ఫీలింగ్‌. కానీ ప్రియురాలి కోసం రావడం తప్పదు కదా అన్న సెల్ఫ్‌ జస్టిఫికేషన్‌. మొత్తానికి అదోలా ఉన్నాడు. రవి అసహనాన్ని ఒక వ్యక్తి పసిగట్టాడు. అతను భుజంగం. పైగా… ఊరి లోని రైతులను లొంగదీయదానికి కంకణం కట్టుకున్న విష్ణువర్ధనరావ్‌ ఇప్పుడు ఆ ఊరికి ఉపయోగపడే పని చెయ్యడం వెనుక ఉన్న ఆంతర్యం అతనికి అంతుబట్టడం లేదు. ఈ విషయం ఆయన తోనే తర్వాత తేల్చుకోవాలని అనుకున్నాడు. నెమ్మదిగా రవి పక్కన చేరాడు.

“ఎవరు బాబూ తమరు…” అని మాటలు కలిపాడు.

రవి అతన్ని పురుగులా చూసాడు. “నేనెవరైతే మీకెందుకండీ” విసుగ్గా అన్నాడు.

“ఓసోస్‌… అట్టా ఇసుక్కోకండి సారూ… బవిచత్తులో నాతో మీకు సానా పనుంటాది” అని మీసం తిప్పాడు.

“ఆహా… అలాగా…” అని “…రశ్మికి  స్నేహితుడిని. నేను కూడా డాక్టర్‌‌” అన్నాడు.

“అయ్యబాబోయ్‌… ఇంకేంటండి… మంచి జోడీ మీది… ఇక మా ఊరికి మంచి రోజులొచ్చినట్టే.”

“అంటే ఏంటి నీ ఉద్దేశం?”

“ఇంకేముందండీ… మీరిద్దరూ మా ఊళ్ళో ఉంటే రోగాలన్నీ పారిపోవా?”

“అంత సీన్‌ లేదు… నేను సిటీలో ఉన్న హాస్పిటల్‌‌లో పని చేస్తున్నాను… రశ్మి మాత్రమే ఇక్కడ ఉంటుంది” అని చెప్పాడు.

“అట్టాగా… సరే సారూ” అని చెప్పి, విషయం తెలిసింది అన్న సంతోషంతో వెళ్ళిపోయాడు భుజంగం.

“వీడెవడో జిడ్డులా ఉన్నాడ్రా బాబూ” అని నెత్తి కొట్టుకున్నాడు రవి.

తర్వాత రశ్మిని వెతుక్కుంటూ హాస్పిటల్‌ లోనికి వెళ్ళాడు. రోగులతో చాలా బిజీగా ఉంది రశ్మి. తొలి రోజు కాబట్టి ఊర్లో జనం అంతా తమ ఆరోగ్య సమస్యలని ఆమెకు చెప్పుకుంటున్నారు. రవి చాలా డిజప్పాయెంట్‌ అయ్యాడు. హాస్పిటల్‌ బయటకు వచ్చి కారు దగ్గరకు వెళ్ళి డ్రైవింగ్‌ సీట్‌‌లో కూర్చుని స్టార్ట్‌ చేసాడు. భుజంగం పరుగెత్తుకుంటూ వచ్చి “సారూ… నా అవుసరం ఉంటే సెప్పండి…” అని అంటున్నాడు. ఆ మాటలు విననట్టు కారుని ముందుకు దూకించాడు రవి.

పేషెంట్స్‌ అందరూ వెళ్ళిపోయాక స్టెత్‌ తీసి పక్కన పెట్టింది రశ్మి. అప్పుడు గుర్తొచ్చాడు రవి. బయటకు వచ్చి చూసింది. అతని జాడ లేదు. నిస్సత్తువుగా అనిపించింది.

పనమ్మాయి వచ్చి “రండి అమ్మగారూ… భోంచేద్దురు గాని” అని  పిలిచింది. డైనింగ్‌ టెబుల్‌ ముందు కూర్చుని రెండు మెతుకులు కెలికి లేచిపోయింది రశ్మి. మనసు బాగోలేక హాస్పిటల్‌ నుండి బయటపడి ఊరు చూద్దామని బయలుదేరింది.

ఆమె నడుస్తుంటే “దండాలు డాక్టరమ్మగోరూ…” అంటూ నమస్కారాలు పెడుతున్నారు. యాంత్రికంగా అందరికీ స్పందిస్తూ నడుస్తోంది.

ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న ఆమె ఊరి దాటి పొలాలవైపు వచ్చేసింది. పచ్చటి పొలాలు… వాటి గట్ల మీద ఠీవిగా నిలబడిన చెట్లు… దూరంగా నిద్రపోతున్నట్టున్న కొండలు… దృశ్యం చూడ్డానికి ఆ దేవుడు గీసిన అందమైన తైలవర్ణ చిత్రంలా ఉంది. మైమరపుతో ముందుకు సాగుతూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దానికి కారణం జర జరా పాక్కుంటూ వెళుతున్న ఒక బురద పాము. భయపడి అదుపు తప్పి పొల్లల్లో పడబోయింది. ఇంతలో… ఒక బలమైన చెయ్యి ఆమెను గట్టిగా పట్టుకుంది. తుళ్ళిపడి చూసింది రశ్మి. ఎదురుగా ఒక అందమైన యువకుడు. నవ్వుతూ చూసున్నాడు.

“ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు… కొంచెం జాగ్రత్తగా నడవాలండీ” అని నవ్వుతున్నాడు.

“మీ సలహాకి చాలా థాంక్స్‌. కొంచెం వదులుతారా…” అంది.

“ఓహ్‌… సారీ” అని ఆమెను వదిలేసాడు. “ఇంతకీ తమరెవరు?”

“ఈ ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్‌‌ని. హాస్పిటల్‌ కూడా పెట్టాను… ఆ మాత్రం తెలీదా” అంది.

“ఓహ్‌… సారీ అండి… ఎవరో చెప్పారు… విన్నాను… మీరేనన్న మాట… ఆ కొత్త డాక్టర్‌.”

“అన్నిసార్లు సారీ అక్కర్లేదు… ఇంతకీ మీరెవరు… చదువుకున్న వ్యక్తిలా ఉన్నారు… ఈ ఊళ్ళో ఏం పని?” అడిగింది

“నా పేరు కళ్యాణ్‌… రీసెర్చ్‌ పని మీద ఈ ఊరు వచ్చాను. పెద్దాయన రఘురామయ్య గారి ఇంట్లో ఉంటున్నాను” చెప్పాడు కళ్యాణ్‌.

“ఓహో… వెరీ నైస్‌! ఇంకేం… నాకు తగ్గ జోడీ… అప్పుడప్పుడు మనం విషయాలు షేర్‌ చేసుకోవచ్చు. వీలున్నప్పుడు హాస్పిటల్‌ వైపు రండి” అంది.

“ఓహ్‌… ష్యూర్‌… ఇట్స్‌ మై ప్లెజర్‌…” అన్నాడు కళ్యాణ్‌.

“బై…” అని చెప్పి ఆమె వెనుతిరిగి ఊరి వైపు వెళ్ళిపోయింది.

“షి ఈజ్‌ వెరీ గుడ్‌…” అనుకుంటూ పొలాల వైపు కదిలాడు కళ్యాణ్‌.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here