ఎం.హెచ్‌.కె.-6

0
2

[box type=’note’ fontsize=’16’] సన్నిహిత్ గారు వ్రాసిన “ఎం.హెచ్.కె.”అనే మినీ నవలని పాఠకులకు అందిస్తున్నాము. పల్లెటూరి రాజకీయాలు, అంతరిక్షపు కుట్రలతో ఆసక్తి చదివించే కథనంతో నడిచే సీరియల్‍లో ఇది 6వ భాగం. [/box]

[dropcap]నిం[/dropcap]పాదిగా నడుచుకుంటూ పంకజం దగ్గరకి వచ్చాడు భుజంగం.

అతన్ని చూడగానే ముస్తాబవుతున్న ఆమె మొహం చేటంత అయింది. “రండి బాబు గారూ… రండి” అంది. ఆమె మర్యాదపూర్వక ఆహ్వానానికి ఖుషీ అయ్యాడు భుజంగం.

“ఎక్కడికో వెళ్ళడానికి రడీ అవుతున్నట్టు ఉన్నావు…” అడిగాడు

“ఆ.. కొంచెం సిటీకి వెళ్ళే పని ఉంది …” హస్కీగా అంది.

“అబ్బో… అయితే పెద్ద పనే… రాత్రికి అక్కడే ఉంటావన్నమాట!” అదోలా అన్నాడు.

“మీకు తెలీని విషయమా ఏంటి? ఏవో మా బాధలు మేం పడాలి కదా” అంది.

“సరే… నీ బాధల సంగతి నాకెందుకు గానీ నేను చెప్పిన ఇసయం ఏం చేసావు?”

పంకజం చిన్నగా నవ్వింది. భుజంగం అడుగుతున్న సంగతి ఆమెకు అర్థం అయింది. విష్ణువర్ధనరావ్‌ పక్కన పడుకోమని అడుగుతున్నాడు. శీలం పట్ల ఆమెకు పెద్ద నమ్మకం లేదు. తన అందమైన శరీరాన్ని ఉపయోగించి లాభపడాలని… సామాజికంగా పైకి ఎదగాలని ఆమె తాపత్రయం. కానీ విష్ణువర్ధనరావ్‌ చాలా పెద్ద స్థాయి మనిషి. సంఘంలో ఎంతో హోదా ఉన్నవాడు. అలాంటి వాడితో లింక్‌ పెట్టుకోవడం కొంచెం రిస్కే… కానీ బతుకులు తమ బాగుపడాలంటే ఇదే మార్గంలా కనిపిస్తోంది. భర్త బక్క చిక్కిన రైతు. ఏ విధంగానూ కుటుంబాన్ని ఆదుకోలేని అశక్తుడు. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకుందామె.

“సరే… నువ్వు అడిగిన దానికి ఒప్పుకుంటున్నాను. మరి నాకేంటి లాభం?” అంది.

“లాభమా… ఓసి పిచ్చిదానా… ఆయనంటే ఎవరనుకుంటున్నావు? ఆయన చెయ్యి పడితే సాలు నీ దశ తిరిగిపోద్ది” నవ్వుతూ అన్నాడు.

చిన్నగా నిట్టూర్చింది పంకజం. “సరే… సమయం కుదిరినప్పుడు చూద్దాం” అంది.

“అట్టా అంటే ఎలా పంకజం… ఆయన నీ గురించి కబురు మీద కబురు పెడుతున్నాడు… కొంచె దయ తలచు” బ్రతిమాలాడు.

“చూద్దాం అన్నానా …” అంటూ హేండ్‌బేగ్‌ భుజాన వేసుకుని వెళ్ళిపోయింది.

“తస్సాదియ్యా… దీని సంగతి తొందరగా తేల్చాలి” అనుకుంటూ అక్కడి నుండి పోయాడు భుజంగం.

***

రాత్రి అయింది… ఊరు నిద్రపోతోంది.

మేడ మీద నిలబడి జాగ్రత్తగా చూస్తున్నాడు కళ్యాణ్‌. ఎందుకో అతని సిక్స్త్‌సెన్స్ ఈ రోజు కొంచెం దృష్టి పెట్టమని చెబుతోంది. అందుకే చాలా సేపటి నుండి మాటు వేసాడు.

అనుకున్నట్టుగానే అర్ధరాత్రి దాటాక ఒక సన్నటి వెలుగు రేఖ పొలాల్లోకి జాలువారింది. ఒక కొండపై నుండి కిందికి నీటి ద్వారా జారిపడుతున్న వస్తువులా… ఒక ఆకారం నెమ్మదిగా పై నుండి జారి పొలాల్లోకి లేండ్‌ అయింది. తర్వాత ఆ తెల్లని వెలుగు రేఖ మాయం అయింది.

కళ్యాణ్‌ ఇక ఆలస్యం చెయ్యలేదు. వెంటనే కిందికి దిగి కావాల్సిన వస్తువులు తీసుకుని పొలాల వైపు నిశ్శబ్దంగా పరుగు తీసాడు.

అతడు పొలాలని చేరుకునేటప్పటికి… అంతా చాలా మామూలుగా ఉంది. కటిక చీకటిలో అతనికి ఏమీ కనిపించడం లేదు. మరి కాస్త వెదుకుతూ అలా పక్కనే ఉన్న తోపు లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడో దూరంగా ఒక వెలుగు చుక్క. అటువైపుగా దారి తీసాడు. మళ్ళీ ఆ వెలుగు చుక్క మాయమయింది. కొంచెం ధైర్యం చేసి అలాగే లోనికి వెళ్ళాడు. అదే అతను చేసిన తప్పు!

నెత్తి మీద పడిన దెబ్బ ఊహించని అశనిపాతంలా అతన్ని కూలబడేలా చేసింది. “అమ్మా…” అంటూ చిన్నగా కేక పెట్టాడు.

“ఎన్ని సార్లు చెప్పాల్రా నీకు… మా విషయాల్లో వేలు పెట్టొద్దని…” బొంగురుగా ఒక గొంతు వినపడింది. అతని కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి… నెమ్మదిగా స్పృహ కోల్పోయాడతను. అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అలా వదిలి వెళ్ళడానికి వారి రీజన్స్ వాళ్ళకున్నాయి.

కాసేపటికి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ‘తానెక్కడున్నాను’ అని ఒకసారి చూసుకున్నాడు. హాస్పిటల్‌లో బెడ్‌మీద అతను… పక్కనే జనని.

అతను కళ్ళు తెరవడం చూసి “లేచావా కళ్యాణ్‌..” అంటూ కన్నీరు పెట్టుకోసాగింది. తొలిసారిగా విపరీతమైన దుఖానికి లోనయ్యాడు కళ్యాణ్‌. తన కోసం జనని ఏడవడం అతన్ని కదిలించింది. జననై వైపు బేలగా చూసాడు. ఇంతలో రశ్మి అక్కడికి వచ్చి “ఇప్పుడే కదా కళ్యాణ్‌కి మెలకువ వచ్చింది… అతన్ని డిస్టర్బ్‌చెయ్యకండి “అని వారించింది. తర్వాత కళ్యాణ్‌ని చూస్తూ

“తలకి చిన్న గాయం తగిలింది కళ్యాణ్‌.. కుట్లు పడ్డాయి. కొన్ని రోజులు రెస్ట్‌ తీసుకుంటే తగ్గిపోతుంది. అంతవరకు మీ రీసెర్చ్‌కి కొంచెం బ్రేక్‌ఇవ్వండి” అని నవ్వింది.

స్వచ్ఛమైన రశ్మి చిరునవ్వు కళ్యాణ్‌ మనసుని తేలిక చేసింది. రశ్మి ఒక ఇంజెక్షన్‌ చేసి వెళిపోయింది. జరిగిన విషయాలని నెమరు వేసుకుంటూ నెమ్మదిగా మగత లోకి జారాడు కళ్యాణ్‌.

***

రఘురామయ్య గారు వాలు కుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్నారు.

కళ్యాణ్‌ ఈ ఊరికి రావడం… తన ఇంట్లో ఆశ్రయం పొందడం… రాత్రిళ్ళు ఎక్కడికో వెళ్ళడం… ఇప్పుడు గాయపడి హాస్పిటల్‌ పాలవడం… ఏమిటి ఇదంతా?

కొంపదీసి ఇదంతా ఒక గూడుపుఠాణీ కాదు కదా! ఎన్నో సందేహాలు ఆయన మదిలో! కానీ అవన్నీ తీర్చగలిగే కళ్యాణ్‌…. పేషెంట్‌ బెడ్‌ మీద ఉన్నాడు.

సావిత్రమ్మ కాఫీ కప్పుతో వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. కాఫీ తాగుతూ ఆయన ఎటో చూడసాగారు.

“ఎందుకండీ అంత దీర్ఘాలోచన?” నెమ్మదిగా అడిగింది.

చిన్నగా నిట్టూర్చి “ఏం చెప్పమంటావు సావిత్రీ… ఊళ్ళో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనకు తెలియని ఏవో కార్యక్రమాలు జరుగుతున్నాయని అనిపిస్తోంది. ముఖ్యంగా మన ఇంట్లో ఉంటున్న కళ్యాణ్‌ సరైన మనిషేనా అన్న అనుమానం కలుగుతోంది. కొంపదీసి ఏ సంఘ విద్రోహ శక్తికో మనం ఆశ్రయం ఇవ్వడం లేదు కదా!” అన్నారు

“ఊరుకోండి… అవేం మాటలు… ఆ అబ్బాయిని చూస్తే అలా అనిపించడం లేదు… పైగా మన జనని అతన్ని ఇష్టపడుతున్నట్టుగా ఉంది” అంది.

“ఆహా… అంత దూరం వచ్చిందా వ్యవహారం. సరే ఇద్దరి పైన ఒక కన్నేసి ఉంచాలి” అన్నారాయన దీర్ఘంగా ఆలోచిస్తూ.

“సరేనండీ… అలాగే” అని చెప్పి వంటగదిలోకి వెళ్ళారావిడ

రంగడు వచ్చి “అయ్యా… ఇప్పుడే హాస్పిటల్‌ నుండి వస్తున్నాను… కళ్యాణ్‌బాబు కొంచెం కోలుకున్నారు” అని చెప్పాడు.

“ఆహా… జనని అక్కడే ఉందా?” అడిగారు.

రంగడు చిరునవ్వు నవ్వుతూ “…అక్కడ కాక ఇంకెక్కడ ఉంటుంది అయ్యా…” అన్నాడు.

రఘురామయ్య గారికి కోపం వచ్చింది. “అంటే ఏంట్రా నీ ఉద్దేశం?” గద్దించారు.

“అంత కోప్పడకయ్యా… ఇద్దరూ వయసులో ఉన్నారు. ఒకరికొకరు ఇష్టపడటం సహజమే కదా..” భయం భయంగా అన్నాడు.

సాలోచనగా చూసారు రఘురామయ్య. “సరే లేరా… అందరూ చెప్పేవారే నాకు…” అని వాలు కుర్చీలో వెనక్కు వాలారు. ఆయన పాదాలు వత్తుతూ నిశ్శబ్దాన్ని ఆశ్రయించాడు రంగడు.

***

బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చింది జనని. తిన్నగా తన రూములోకి వెళుతుంటే రఘురామయ్య గారు పిలిచారు.

“ఏమ్మా… జననీ… హాస్పిటల్‌ నుండి ఇప్పుడేనా రావడం?” అని అడిగారు.

“అవును తాతయ్యా…” అంది జనని

“ఎలా ఉంది ఆ అబ్బాయికి?”

 “బాగానే ఉంది తాతయ్యా… కొంచెం కోలుకున్నారు.”

“అయినా ఆ పరాయి కుర్రాడి దగ్గర అంతసేపు ఉండటం నీకు అవసరమా జననీ?” కొంచెం నెమ్మదిగా అడిగారు.

తాతయ్య కోపంగా ఉన్నారని జననికి అర్థం అయింది.

“లేదు తాతయ్యా… అతను మన కుటుంబ సభ్యుడే అని మీరే కదా అన్నారు… అందుకే కొచెం కేర్‌ తీసుకుంటున్నాను” అంది.

“తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు… అతడు మనకు పరాయివాడే… ఇంట్లో ఉన్నంత మాత్రాన దగ్గరివాడు అయిపోతాడా?”

జనని మౌనంగా ఉండిపోయింది. రఘురామయ్య గారు కొనసాగించారు

“చూడమ్మా… ఎంతో జీవితాన్ని చూసాను. అనుభవ సారాన్ని పొందాను. కష్టం… సుఖం… ఎదురు దెబ్బలు… నమ్మక ద్రోహాలు… అన్నీ… అన్నీ చూసాను. ఆ నమ్మకంతోనే నీకు కొన్ని విషయాలు చెబుదామనుకుంటున్నాను. ఈ వయసులో నీకు ప్రపంచమంతా ఎంతో మంచిగా… అందంగా కనిపిస్తుంది. అందరూ మనవాళ్ళే అన్న భ్రమ ఉంటుంది. ఇక ప్రేమ గురించి చెప్పేదేముంది… కనిపించిన ప్రతీ మగాడూ అందంగానే ఉంటాడు… సజ్జనుడిలానే అనిపిస్తాడు. కానీ వాస్తవం అలా ఉండదమ్మా. గోముఖ వ్యాఘ్రాలు… మేక వన్నె పులులూ ఉంటాయమ్మా… అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంతమాత్రాన నీ మీద నాకు నమ్మకం లేదని అనుకోవద్దు. నా పెంపకంలో పెరిగిన నువ్వు ఏ తప్పూ చెయ్యవని నాకు తెలుసు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా… ఒక్కోసారి మనం చెయ్యని తప్పులకి కూడా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అందుకే ఇంతగా చెబుతున్నాను” అని ఆగారు.

“…అంటే నేను కళ్యాణ్‌కి దగ్గరవడం మీకు ఇష్టం లేదా తాతయ్యా…”

“అవునమ్మా… అతను ఎవరో… ఎలాంటివాడో మనకు తెలియదు… అందుకే నీ హద్దుల్లో నువ్వు ఉండాలి… అంతే” అని వెళ్ళిపోయారు.

పరుగు లాంటి నడకతో తన రూములోకి వెళ్ళి బెడ్‌ మీద బోర్లా పడి వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఆమె కన్నీటికి దిండు పూర్తిగా తడిసిపోయింది. ఇదంతా గమనించిన రఘురామయ్యగారు ‘అయ్యో… అనవసరంగా పిల్లని బాధ పెట్టానా?’ అని క్షణం సేపు అనుకున్నారు.

“…లేదు  లేదు… అంత్య నిష్టూరం కన్నా… ఇప్పుడు సరిచెయ్యడమే మంచిది” అనుకుని సర్ది చెప్పుకున్నారు.

సావిత్రమ్మ గారు మింగలేక కక్కలేక కొంగు నోట్లో కుక్కుకుని మౌనంగా రోదించసాగారు.

***

భుజంగం విష్ణువర్ధనరావ్‌ని కలిసి ఊళ్ళో జరుగుతున్న పరిణామాలని చెబుతున్నాడు.

విష్ణువర్ధనరావ్‌ అసహనంగా మొహం పెట్టి “ఆ కళ్యాణ్‌గాడు కోలుకున్నాడా?” అనడిగాడు.

“ఆఁ కోలుకుంటున్నాడంటయ్యా… వాడిని వదిలిపెట్టి చాలా తప్పు చేసాం… పూర్తిగా లేపేస్తే అయిపోయేది.”

“అయినా దెబ్బలు తిని పడి ఉన్న వాడిని హాస్పిటల్‌కి తీసుకొచ్చిన వాళ్ళని అనాలి… వాడు అలా పడి ఉంటే ఎప్పుడో చచ్చేవాడు.”

“దాడి జరిగిన మరసటి రోజు ఊరి వాళ్ళు ఎవరో చూసి హాస్పిటల్‌లో జాయిన్‌ చేసారటయ్యా… అయినా అదీ మన మంచికే… ఖర్మకాలి వాడు చచ్చి ఉంటే అది మన మెడకు చుట్టుకునేది” భయంగా అన్నాడు భుజంగం.

చిన్నగా నవ్వాడు విష్ణువర్ధనరావ్‌. “ఇలాంటి చిన్న చిన్న పాములు మనల్ని ఏమీ చెయ్యలేవురా… ఈ దెబ్బకు వాడు భయపడి ఊరు వదిలిపోతాడ్లే” అన్నాడు.

“ఏమో అయ్యా… చూద్దాం… ముందు ముందు ఎలాగుంటాదో?”

“సరే గానీ… పంకజంని కలిసావని విన్నాను… ఏమందిరా… వస్తానందా?” ఆత్రంగా అడిగాడు విష్ణువర్ధనరావ్‌.

“ఒప్పుకుంది గానీ కొంచెం బెట్టు చేస్తుందయ్యా… ఇంకో సారి మీరు నన్ను అడిగే అవసరం ఉండదు లెండి.”

“అంటే?”

“అంటే ఏముందయ్యా… తప్పకుండా అది మీ చెంత వాలిపోద్ది” అని చెప్పాడు.

“సరే… నువ్వెళ్ళు… నాకు వేరే పనుంది” అన్నాడు విష్ణు.

భుజంగం నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు.

రశ్మి తన తండ్రి కలుద్దామని వచ్చింది. అప్పటికే ఆయన భుజంగంతో మాట్లాడటం చూసి అనుమానంగా పక్కకు తప్పుకుంది. భుజంగం వెళ్ళిన కాసేపటికి తండ్రి ముందుకు వచ్చింది.

“నాన్నా బాగున్నావా?” ప్రేమగా అడిగింది.

“ఆ… ఏదో ఇలా ఉన్నానమ్మా… నువ్వెలా ఉన్నావు?” అడిగాడు.

“పర్వాలేదు నాన్నా… ఊరి వాళ్ళ సహకారంతో బాగానే ఉన్నాను. ఆ పైన నీ దయ” అంది.

“పోనీ లేమ్మా… పల్లె ప్రజలకు సేవ చెయ్యాలన్న నీ కోరిక తీర్చానన్న సంతోషం నాకుంది. ఆ పైన నీ ఇష్టం” అన్నాడు.

“సరే గానీ ఊరికి దగ్గర్లో ఫేక్టరీ కడతానన్నావు… ఆ పని ఎంత వరకు వచ్చింది నాన్నా?”

“అవుతుందమ్మా… ఫేక్టరీకి ఇంకా స్థలం కావాలి… అందుకోసం ఆ ఊరివాళ్ళ పొలాలు అడిగాను. కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు… అందుకే పని ముందుకు కదలడం లేదు” అన్నాడాయన.

“అయినా… అక్కడే ఫేక్టరీ కట్టకపోతే ఏమయింది నాన్నా…” నెమ్మదిగా అంది.

“అలా అనకమ్మా… అది చాలా మంచి స్థలం… అన్ని వనరలు చక్కగా సమకూరుతాయి… అందుకే ప్రయత్నిస్తున్నాను…”

“సరే నాన్నా… కానీ అనవసర చిక్కుల్లో ఇరుక్కోకు నాన్నా…” అంది.

“అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం… నేనేదో చెడు చేస్తున్నాననా నీ అభిప్రాయం…?” కోపంగా అన్నాడు.

“అబ్బ ఊరికే అన్నాను నాన్నా… నీ క్షేమమే నాకు కావాల్సింది… సరే రండి భోంచేద్దాం” అని మాట మార్చింది.

“నేను వస్తాను పద…” అన్నాడాయన.

లేచి అక్కడి నుండి లోనికి వెళ్ళిపోయింది రశ్మి. ఎందుకో ఆమె మనసు చాలా బాధకు లోనయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here