Site icon Sanchika

ఎం.హెచ్‌.కె.-7

[box type=’note’ fontsize=’16’] సన్నిహిత్ గారు వ్రాసిన ‘ఎం.హెచ్.కె.’ అనే మినీ నవలని పాఠకులకు అందిస్తున్నాము. పల్లెటూరి రాజకీయాలు, అంతరిక్షపు కుట్రలతో ఆసక్తి చదివించే కథనంతో నడిచే సీరియల్‍లో ఇది 7వ భాగం. [/box]

[dropcap]జ[/dropcap]నని మనసు సందిగ్ధావస్థలో పడింది. కళ్యాణ్‌ కోసం హాస్పిటల్‌కి వెళ్ళమని మనసు చెబుతుంటే.. తాతయ్య ఇచ్చిన వార్నింగ్‌ వద్దని చెబుతోంది. కని పెంచిన పెద్దలను ఎదిరించేంత సాహసం చేసే మూర్ఖత్వం ఆమెకు లేదు. అందుకే సావిత్రమ్మ దగ్గరకు వెళ్ళింది.

సావిత్రమ్మ గారు జననిని చూసి “ఏంటమ్మా ..” అని అడిగింది.

“నేను హాస్పిటల్‌కి వెళతాను అమ్మమ్మా..” అంది జనని.

“మీ తాతయ్య రాత్రే కదా నీకు అన్నీ చెప్పారు. ఇప్పుడు వెళితే ఆయన మాటను ధిక్కరించినట్టు కాదా?” అంది.

“అందుకే నీ సహాయం కావాలి.. కొంచెం తాతయ్యకు సర్ది చెప్పు.”

“సరే.. నేను చెబుతానులే.. నువ్వెళ్ళు.. కానీ జాగ్రత్త” అంది సావిత్రమ్మ. జనని సంతోషంగా ఎగురుకుంటూ హాస్పిటల్‌వైపు వెళ్ళిపోయింది.

“పిచ్చి పిల్ల” అనుకుంటూ సావిత్రమ్మ నవ్వుకుంది.

హస్పిటల్‌లో కళ్యాణ్‌ దగ్గరకి వెళ్ళి బెడ్‌పక్కన కూర్చుంది జనని.

నెమ్మదిగా కళ్ళు తెరిచిన కళ్యాణ్‌జనని చూసి ఆనందాశ్రువులు కార్చాడు. ఎవరూ లేరనుకున్న తనకి ‘నీ కోసం నేనున్నాను’ అన్నట్టు జనని సాహచర్యం అతనికి భరోసాను ఇస్తోంది.

కానీ పెళ్ళికాని ఒక కన్నెపిల్ల ఇలా తనలాంటి పరాయివాడి దగ్గరకి రావడం సరి కాదని అతని మనసు చెబుతోంది.

అందుకే “ఎందుకు జననీ నువ్వు నా దగ్గరకు రావడం.. ఎవరైనా ఇంకోలా భావించే అవకాశం ఉంది కదా” అన్నాడు నెమ్మదిగా.

చిరునవ్వి నవ్వింది జనని. “మా తాతయ్య ఈ ఊళ్ళో అందరికీ పెద్ద. ఎందరికో న్యాయం చెబుతుంటారు. ఆయన కూడా నీ దగ్గరకు రావద్దని హెచ్చరించారు. కానీ నీ వ్యక్తిత్వం మీద నమ్మకంతో దాన్ని తోసి పుచ్చి వచ్చాను… నేను నిన్ను నమ్ముతున్నాను కళ్యాణ్‌. నా నమ్మకాన్ని వమ్ము చెయ్యకు.. పిచ్చి పిచ్చి ఆలోచనలని పక్కన పెట్టి తొందరగా కోలుకో.. అదే నాకు చాలు” అని నవ్వింది.

“సరే నీ ఇష్టం జననీ.. నీ ధైర్యమే నాకు రక్ష” అన్నాడు కళ్యాణ్‌.

ఇంతలో రశ్మి వచ్చింది. “అయిపోయాయా మీ ప్రేమ కబుర్లు” అంటూ గట్టిగా నవ్వింది.

జనని సిగ్గుతెర కమ్మి తల వాల్చింది.

రశ్మి, జనని భుజం పై చెయ్యి వేసి “కళ్యాణ్‌ నీ వాడు.. నిన్ను వదిలి ఎక్కడికీ పోడు… ఓకేనా” అని చెప్పింది.

“నన్ను క్షమించు రశ్మీ.. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను” అంది జనని.

“ఇట్స్‌ ఓకే … టేకిట్‌ ఈజీ” అని తేలిగ్గా నవ్వేసింది రశ్మి. తర్వాత ‘నర్స్‌’ అని పిలిచి కళ్యాణ్‌కి ఇవ్వాల్సిన మెడికేషన్‌ గురించి వివరించింది.

జనని “కళ్యాణ్‌ని ఎప్పుడు డిస్చార్జ్‌ చేస్తారు?” అని అడిగింది.

“ఇంకో మూడు రోజుల్లో డిస్చార్జ్‌ చేస్తాం… సరేనా.. బాగా తొందరగా ఉన్నట్టుంది నీకు” అని జోక్‌ చేసింది.

“ఛీ.. పొండి” అని సిగ్గు పడింది జనని. నవ్వుల పువ్వులు విరిసాయి అక్కడ.

***

ఊరి ప్రెసిడెంట్‌ రఘురామయ్య గారిని కలవడానికి వచ్చాడు. మర్యాదలు పూర్తయ్యాక తను ఎందుకొచ్చాడో విన్నవించుకోసాగాడు.

“అయ్యా.. రఘురామయ్యగారూ.. ఇంతకాలంగా జరుగుతున్న సంఘటలు మీకు తెలిసే ఉంటాయి కదా…” అన్నాడు

“అవును… అన్నీ గమనిస్తూనే ఉన్నాను” అన్నారు రఘురామయ్య.

“మన ఊరి వాళ్ళ పొలాలు కొనుక్కుంటానని విష్ణువర్ధనరావ్‌గారు ఎప్పటినుండో అడుగుతున్నారు. ముఖ్యంగా మన ఊరి పొలాల్లో సింహ భాగం మీవే ఉన్నాయి. కనుక మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని సహకరించాలి అని నా ప్రార్థన.”

చిన్నగా దగ్గారు రఘురామయ్య. “ప్రెసిడెంట్‌గారూ మీరు ఏమనుకుంటున్నారు? ఎవరి స్వార్థం కోసమో మనల్ని నమ్ముకున్న గ్రామ ప్రజలని నట్టేట్లో వదిలేస్తామా? ఇప్పుడు ఈ పొలాలని అమ్మేస్తే బోలెడంత డబ్బు ముడుతుందేమో.. కానీ ఊరి ప్రజల భవిష్యత్తు మాత్రం అంధకారం అవుతుంది. ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే ఆ ఆలోచన విరమించుకోమని ఆయనకు చెప్పండి.”

“అదేంటండి? ఊరికి దగ్గర్లో ఫేక్టరీ వస్తే మనకి ఎంతో లాభం. మన కుర్రాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. గ్రామం అభివృద్ధి చెందుతుంది” అన్నాడు ప్రెసిడెంట్‌ కొంచెం ఆవేశంగా.

“కావచ్చు.. మీ ఆవేశం నాకు అర్థమైంది. కానీ మీరు ఒకవైపే చూస్తున్నారు… అయితే నష్టాలు కూడా చాలా ఉన్నాయి… ఆలోచించండి” అని లేచిపోయారు రఘురామయ్య. “ఎన్నో సమస్యలు ఊరి చుట్టూ ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి..” గట్టిగా హెచ్చరించారు.

ఇక తను సెలవు తీసుకోవచ్చని అర్థమైంది ప్రెసిడెంట్‌కు.

లేచి నిలబడి “సరేనయ్యా ..వెళ్ళొస్తాను” అని చెప్పి ‘ఈ రఘురామయ్య బహు మొండివాడు..’ అని మనసులో తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు.

ప్రెసిడెంట్‌ తిన్నగా భుజంగం దగ్గరకి వచ్చాడు. అతడి మనసంతా చిరాగ్గా ఉంది. అనుకున్నదొకటి… అవుతున్నదొకటి. అందుకే ఈ ఒళ్ళు మంట.

భుజంగం తన అనుయాయులతో కూర్చుని మందుకొడుతూ సమావేశం పెట్టుకున్నాడు. ప్రెసిడెంట్‌ని చూసి “రండి …రండి” అంటూ కుర్చీ చూపించాడు.

ప్రెసిడెంట్‌ “అబ్బ.. నీ మర్యాదలకేం గానీ మనం అనుకున్న పనులు ఏవీ ముందుకు సాగడం లేదు. ఆ రఘురామయ్య చూస్తే ప్రజలు… సమాజం అంటూ ఏవేవో నీతులు చెబుతున్నాడు. నువ్వు మాత్రం కులాసాగా కూర్చుని మందు కొడుతున్నావా?” అన్నాడు.

“అయ్యా బాబోయ్‌… అంత మాట అనకండి. పడుకున్నా కూసున్నా నాకు అదే ఆలోసనండీ.. నన్ను నమ్మండి” అన్నాడు.

“ఏం నమ్మడమో ఏంటో ..ఏదో ఒకటి చేసి పని కానీ” అన్నాడు. పక్కనున్న అనుచరుడు మందు గ్లాసు ప్రెసిడెంట్‌గారికి అందించాడు. దాన్ని అందుకుని సిప్‌ చేస్తూ –

“ఏం భుజంగం …ఆ విష్ణువర్ధనరావ్‌ మన బుట్టలో పడ్డాడా?” అనడిగాడు

“పూర్తిగా పడినట్టే ..మన పంకజం ఎలాగూ ఉందిగా.”

“కొంచెం జాగ్రత్త. అతన్ని తక్కువ అంచనా వెయ్యడానికి వీల్లేదు.”

“అట్టాగే …కానీ ముందు మన ఊరి ఎదవలు ఒప్పుకుంటే పని తొందరగా అయ్యేది. డబ్బు ఆ ఇష్ణువర్దనరావ్‌ది …పొలాలు మనవి.. ఎట్టా ఉంది మన అగిడియా?” అంటూ నవ్వాడు భుజంగం.

“అంటే నాక్కొంచెం అర్థం అయ్యేలా చెప్పు” అన్నాడు ప్రెసిడెంట్‌. భుజంగం తన అనుచరులని చూసాడు. వాళ్ళు అర్థం చేసుకుని బయటకు వెళ్ళిపోయారు.

భుజంగం చెప్పాడు. “ఆ ఇష్ణువర్దనరావ్‌ని మనం రెచ్చగొట్టి డబ్బులు తెమ్మందాం. ఊరి వాల్లకి ఏదో ఆశ చూపించి నమ్మించి పొలాలని అమ్మకానికి పెట్టిద్దాం. ఆల్లు ఒప్పుకున్నాక పొలాల రిజిస్తేషన్‌ జాగత్తగా మన పేరు మీద సెయ్యించుకుందాం. ఆ ఇష్ణువర్దనరావ్‌కి డబ్బులు బొక్క. మన ఊరోల్లకి పొలం బొక్క.. పొలాలు మాత్రం మన సొంతమవుతాయి” అన్నాడు.

ప్రెసిడెంట్‌ అదిరిపడ్డాడు. పాము పక్కన కూర్చున్నట్టు ఫీల్‌ అయ్యాడు. ‘భుజంగం నిజంగా విషం పామే!’ అనుకున్నాడు ప్రెసిడెంట్‌.

కొంచెం మందు ఎక్కాక ప్రెసిడెంట్‌ “ఆ పంకజం విష్ణువర్ధనరావ్‌ దగ్గరకి ఎందుకు వెళ్ళడం లేదురా..” అనడిగాడు.

“దానికి ఆసలెక్కువ… గొంతెమ్మ కోరికలు కొరుతోంది… అందుకే ఇంకా పని అవడం లేదు.”

“ఆహా… ఏదో ఒక ఆశ పెట్టి దాన్ని వాడి పక్కలో కి పంపించు. తర్వాత మన పని సులభం అవుతుంది.”

“అట్టాగే… తొందరగా ఆ పని కానిచ్చేత్తా” అనాడు భుజంగం. కాసేపు సరదాగా గడిపాక ప్రెసిడెంట్‌ తూలుకుంటూ వెళ్ళిపోయాడు.

లోనికొచ్చిన అనుచరులని చూస్తూ “… ఈ పెసిడెంట్‌గాడికి ఆస ఎక్కువైపోనాది… పని సేసేది మనం… లాభం దొబ్బేది వీడా …అమ్మా …అంతదాకా రానిస్తానా..!” అని అన్నాడు.

అనుచరులు భుజంగం మనస్తత్వం చూసి ఖంగు తిన్నారు. ఇప్పటిదాకా ఎంతో బాగా మాట్లాడినవాడు, ప్రెసిడెంట్‌ పక్కకు వెళ్ళగానే ..అతన్ని పడగొట్టే పథకం వేస్తున్నాడు. ‘దేవుడా ..వీడి దగ్గర పనిచెయ్యడం తమకు క్షేమమేనా’ అనుకున్నారు.

***

కళ్యాణ్‌ హాస్పిటల్‌ నుండి డిస్చార్జ్‌ అయి ఇంటికి వచ్చాడు. జనని మొహంలో ఆనందం తాండవిస్తోంది. సావిత్రమ్మ అతన్ని సాదరంగా ఆహ్వానించింది. రఘురామయ్య గారు మాత్రం అంత ప్రసన్నంగా లేరు. ఏదో తెలియని అయిష్టత. కానీ మర్యాదకు కట్టుబడి పైకి తేలలేదు.

తన రూములో సెటిల అయ్యాక కళ్యాణ్‌ ఒక్కసారిగా బోరున విలపించాడు. ఇన్నాళ్ళూ ఉగ్గబట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుని ప్రవహించసాగింది. దానికి ఒక కారణం ఉంది. నిజానికి అతడు ఎవరూ లేని అనాథ! చిన్నప్పటి నుండీ సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో చదువుకుంటూ పెరిగాడు. తనకంటూ ఒక కెరీర్‌ని నిర్మించుకున్నాడు. ఒక గమ్యాన్ని పెట్టుకుని అది చేరుకోవడానికి కృషి చేస్తున్నాడు. ఇంతవరకు అతని జీవితంలో ఎప్పుడూ ఎవరూ అతన్ని ప్రేమగా మాట్లాడి దగ్గరకు తీసుకున్న దాఖలాలు లేవు. కాబట్టి అభిమానం, ఆప్యాయత అన్న పదాలకు అర్థం కానీ… వాటి రుచి గానీ తెలీదు. ఈ ఊరు వచ్చి రఘురామయ్య గారి ఇంట్లో ఉన్నప్పటి నుండి వాటి రుచి తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు.. హాస్పిటల్‌ పాలై మంచం పట్టినప్పుడు అందరూ వచ్చి చూపిస్తున్న అభిమానం మనుషుల మీద అతనికున్న అభిప్రాయం మారిపోయేలా చేసింది. తనలాంటి వాడిని జనని ప్రేమించడం అతని ఊహలకి అందని కల. అలాంటిది జనని అతన్ని కంటికి రెప్పలా కాచుకోవడంతో పూర్తిగా సెన్సిటివ్ అయిపోయాడు. అంతులేని ఆ అభిమానాన్ని తట్టుకోలేక ..ఆనందంతో ఏడ్వసాగాడు.

జనని వస్తున్న చప్పుడవడంతో కళ్ళు తుడుచుకొని నార్మల్‌గా అయ్యాడు.

జనని వస్తూనే “కళ్యాణ్‌…ఇక మీదట ఎప్పుడూ ఆ పొలాల వైపు ఒంటరిగా వెళ్ళొద్దు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.

“పిచ్చి జననీ.. నన్నెవడూ ఏం చెయ్యలేడు.. అనుకున్నది సాధించే దాకా వదిలేదే లేదు” అన్నాడు కళ్యాణ్‌.

“నీకు చెప్పడం నాదే పొరపాటు.. బట్‌ బీ కేర్‌ఫుల్‌..” అంది . ‘అమ్మా జననీ’ అని తాతగారు పిలవడంతో పరుగున వెళ్ళిపోయింది.

***

నిద్రపోతున్న కుక్క ఏదో అలికిడికి గబుక్కున లేచినట్టు.. మత్తులో ఉన్న కుర్రాడు రాము ఒక్క ఉదుటున ఉలిక్కిపడి లేచాడు.

యథావిధిగా చుట్టూ చీకటి. ఏదో వాసన. ఎన్ని రోజులుగా అతడు అపస్మారక స్థితిలో ఉన్నాడో అతనికి తెలీదు. పగటికీ రాత్రికీ తేడా తెలీదు. ఆకలి అన్నది అతను ఎప్పుడో మర్చిపోయాడు. కానీ ఒంట్లో శక్తి మాత్రం ఉంటోంది. అంత బలహీనంగా అనిపించడం లేదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో… ఎలా మేనేజ్‌ చేస్తున్నారో అతనికి తెలీదు.

మానసికంగా ఒక రకమైన స్తబ్ధమైన స్థితికి చేరుకున్నాడు అతను.

ఎవరో వస్తున్న అలికిడి కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటించసాగాడు.

“ఏరా.. వీడు ఇంక లేవడా..” అన్నాడు ఒకడు

“ఏమోరా… చాలా రోజులుగా ఇలాగే పడి మత్తులో ఉన్నాడు.. వీడిని ఇలా ఎన్ని రోజులు కాపలా కాయాల్రా బాబు?” విసుక్కున్నాడు ఇంకొకడు

“మనకు అంత డబ్బు ఇచ్చి పెట్టుకున్నది అందుకోసమే కదా.. తప్పదు మరి.”

“సరే… నాకు అర్థం కావడం లేదు గానీ వీడిని ఇక్కడ ఎందుకు పెట్టినట్టురా..”

“అదా.. వీడి మీద ఒక పరిశోధన జరుగుతోందట.. మన సైంటిస్ట్‌లు ఎలకల మీద… కుందేళ్ళ మీద పరిశోధన చేస్తారు కదా.. అట్టా అన్న మాట.”

“ఆహా.. అలాగా.. మరి ఇక్కడ ఏ సైంటిస్టూ కనపడ్డ లేదెందుకని?”

“ఏమోరా… అదే నాకూ అర్థం కావడం లేదు.. పైగా ఈ విషయం ఊరి వాళ్ళకి తెలిస్తే మనందరినీ చంపేస్తారు. మనకెందుకు.. నోరు మూసుకుని ఉండటం మంచిది.”

“ఆహా.. సరేలే.. ఇక్కడ అంతా ఓకే ఉంది కదా ఇక పోదామా?”

“సరే పద..”

ఇద్దరూ వెళ్ళిపోయారు.

నెమ్మదిగా కళ్ళు తెరిచాడు రాము. ‘తన మీద ఏదో పరిశోధన జరుగుతోందన్న మాట… పరిశోధన అంటే ఏమిటి..ఎవరు చేస్తున్నారు?’ అనుకున్నాడు. అయినా అదేదో ప్రమాదకరం అని మాత్రం వాళ్ళ మాటల బట్టి అతనికి అర్థం అయింది. ‘ఎలా తప్పించుకోవాలి ఇక్కడి నుండి’ అని ఆలోచించసాగాడు. అది దాదాపు అసాధ్యం అని అతనికి తెలీదు.

(సశేషం)

Exit mobile version