Site icon Sanchika

ఎం.హెచ్‌.కె.-9

[box type=’note’ fontsize=’16’] సన్నిహిత్ గారు వ్రాసిన ‘ఎం.హెచ్.కె.’ అనే మినీ నవలని పాఠకులకు అందిస్తున్నాము. పల్లెటూరి రాజకీయాలు, అంతరిక్షపు కుట్రలతో ఆసక్తి చదివించే కథనంతో నడిచే సీరియల్‍లో ఇది 9వ భాగం. [/box]

[dropcap]ర[/dropcap]ఘురామయ్య గారు అడిగారు “నువ్వు చనిపోయావని అందరూ చెప్పారమ్మా… కానీ నువ్వు బ్రతికుండి కూడా ఇప్పటిదాకా మా దగ్గరికి రాలేదు… ఇప్పుడు గుర్తొచ్చామా?” అని.

“నీ దయవల్ల… ఆ భగవంతుడి దయవల్ల ఆ ప్రమాదంలో మేము గాయాలతో బయటపడ్డాం నాన్నా… ఆ తర్వాత ఏటికి ఎదురీది మా జీవితాల్ని నిర్మించుకున్నాము. అయినా ఇప్పుడు నేను వచ్చింది నా కూతురి కోసం” అంది పల్లవి.

“కూతురా… ఎవరు నీ కూతురు?” ఆశ్చర్యంగా అన్నారు రఘురామయ్య.

“ఇంకెవరు… మీ పక్కన ఒదిగి నిలబడి ఉన్న ఆ జనని… మీ మనవరాలు. జనని మా కూతురు నాన్నా”

“జనని మీ కూతురా… అదెలా?”

పల్లవి చిన్నగా నవ్వింది. “జనని మీ ఇంటికి ఎలా వచ్చిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి” అంది.

రఘురామయ్య గారికి ఆ రోజు పొలాల్లో పసిగుడ్డు దొరకడం… ఆమెను ఇంటికి తెచ్చుకోవడం గుర్తొచ్చింది.

పల్లవి “అమ్మాయి పుట్టగానే మీ పాదాల చెంత పెట్టాం నాన్నా… మీరు ఎంతో ప్రేమించే ఆ పొలాల్లోనే వదిలిపెట్టాం. మీరు జాగ్రత్తగా అమ్మాయిని పువ్వుల్లో పెట్టి పెంచారు. మీ వ్యక్తిత్వాన్ని రంగరించి పెంచారు. నేను మీకు దూరమైనా నా ‘అంశ’ మీ దగ్గర ఉండాలని నేను ఆశ పడ్డాను నాన్నా. కానీ ఆ తర్వాత బిడ్డను మాకు దూరంగా ఉంచుకున్నందుకు ఎంతో బాధ పడ్డాము. అందుకే అప్పుడప్పుడు ఈ ఊరి చివర గుట్ట మీద ఉన్న గుడి దగ్గరకు వచ్చి జననిని కలిసి వెళుతుండేవాళ్ళం” అంది.

ఆయన అశ్చర్యంగా చూసారు. రంగడు వచ్చి “అయ్యా… నన్ను క్షమించండి… పల్లవమ్మ ఆ తర్వాత వచ్చి నాకు అమ్మాయి జనని గురించి చెప్పారు. జననిని పల్లవమ్మతో కలిపింది నేనే అయ్యా. అయితే ఈ విషయాలన్నీ పల్లవమ్మ గారు మీకు కొంతకాలం పాటు చెప్పొద్దన్నారు… అందుకే మీకు చెప్పలేదు” అన్నాడు.

“ఏడిసావ్‌… దొంగవెధవ” అని వాడ్ని తిట్టి జనని వైపు చూసారు. తల దించుకుంది జనని.

ఇన్నేళ్ళపాటు అల్లారు ముద్దుగా పెంచిన జననిని ఇప్పుడు వదులుకోవడం ఆయనకు ఇష్టం లేదు. అసలు ఆ ఆలోచనే మనసుని మెలి పెట్టేలా ఉంది. అందుకే పల్లవిని చూస్తూ –

“నేను జననిని మీతో పంపించను” అన్నారు.

“ఎందుకు నాన్నా…” అంది పల్లవి

“ఎందుకంటావేంటి… మా పంచ ప్రాణాలు పెట్టి జననిని పెంచాం. ఇప్పుడొచ్చి నువ్వు కావాలంటే ఇచ్చేస్తామా?”

“ఎందుకు ఇవ్వవు నాన్నా?”

“ఎందుకంటే… ఎంతో ప్రేమగా పెంచుకున్నాం కాబట్టి” అన్నారు గట్టిగా.

పగలబడి నవ్వింది పల్లవి.

“ప్రేమగా పెంచారా నాన్నా… మీ ప్రేమ గొప్పది. కానీ నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తే అది తప్పు… అవునా?” అంది.

“దానికీ దీనికీ ఏం సంబంధం? నీ ప్రేమ వేరు… మా ప్రేమ వేరు”

“అలా మీరు అనుకుంటున్నారు నాన్నా… ప్రేమ ఎప్పుడూ ఒకటే! దాన్ని త్యాగం చెయ్యడం ఎప్పుడూ కష్టమే… మీరు నా ప్రేమను అంగీకరించి ఉంటే నేను మీ కళ్ళ ముందే పడి ఉండేదాన్ని. కానీ మీరు ఒప్పుకోలేదు. అందుకే దూరంగా పారిపోయాం. బ్రతుకు తెరువు చూసుకున్నాం” అంది.

“నువ్వెన్ని చెప్పు… మేము జననిని మీకు ఇవ్వం” అని ఆయన జనని వైపు తిరిగి “జననీ… నువ్వు వాళ్ళతో వెళ్తావా?” అని అడిగారు.

జనని చిన్నగా నవ్వి “లేదు తాతయ్యా… ఎప్పటికీ వెళ్ళను. నా తల్లిదండ్రులు చేసిన తప్పు నేను చెయ్యను. మీ అంగీకారం పొందే వరకు ఇక్కడే ఉంటాను” అంది.

ఆనందంతో ఛాతీ ఉప్పొంగింది రఘురామయ్యగారికి. “శెభాష్ జననీ…” అని మెచ్చుకుని పల్లవితో

“చూడమ్మా… ఇప్పుడు జననిని ఎలా పెంచామో నిన్ను కూడా అలాగే పెంచాం. నీ మీద ఎంతో ప్రేమను పెట్టుకున్నాం. కానీ మా గుండెల మీద తన్ని నువ్వు వెళ్ళిపోయావు. మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసావు. మీ అమ్మా నేనూ కుళ్ళి కుళ్ళి ఏడ్చాం. పరువు పోయి ఊళ్ళో తలెత్తుకోలేకపోయాం. కానీ కాలంతో పాటే ఆ గాయాలను మర్చిపోయాం. ఆ భగవంతుడి దయవల్ల ఇన్నాళ్ళకి మళ్ళీ నువ్వు మా దగ్గరికి వచ్చావు. ఇక మాతోనే ఉండిపోవమ్మా” అన్నారు.

సావిత్రమ్మ గారి మొహంలో ఆనందం తాండవించింది. జనని చూసి “మంచి పని చేసావమ్మా” అంది. అప్పటికే పల్లవి మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. తండ్రి కాళ్ళ మీద పడి

“మమ్మల్ని క్షమించు నాన్నా… ఇక ఎక్కడికీ వెళ్ళం. మీతోనే ఉంటాం” అని ఏడుస్తూ చెప్పింది.

అందరూ విభ్రాంతిగా జరుగుతున్నదానిని చూస్తున్నారు. ఆ ఇంటికి మళ్ళీ శుభఘడియలు వచ్చినట్టు భావించారు. ఒక పెద్ద ఆనందపు కెరటం ఆ ఇంటిని కమ్మేసినట్టయింది.

***

గ్రహాంతరవాసులు తలపెట్టిన ఆపరేషన్‌ పేరు.. ఎం.హెచ్‌.కె.! అంటే… మిషన్‌ హ్యుమేనిటీ కిల్లింగ్‌.

మానవజాతి మొత్తాన్ని నాశనం చెయ్యాలంటే దానికి చాలా ప్లానింగ్‌ కావాలి. బయటకు కనపడే దాడులు చేస్తే అవి వేరే ప్రమాదాలకు దారి తీయవచ్చు. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా మానవజాతిని వినాశనం చెయ్యాలని గ్రహాంతరవాసులు నిర్ణయించుకున్నారు. దానికి ఒక పరిశోధనశాల ఊరికి దగ్గరలో ఏర్పరుచుకున్నారు. అవసరమైన కుర్రాడు రాముని లోకల్‌గా ఉన్న విష్ణువర్ధనరావ్‌గారి సాయంతో కిడ్నాప్‌ చేయించారు. ఇన్ని యుగాలుగా మనుష్యజాతిని చూస్తున్న వాళ్ళకి తమ పథకాన్ని ఆయనతో కమ్యూనికేట్‌ చెయ్యడం అంత కష్టం కాలేదు.

ఒక రోజు ఒంటరిగా టీవీ చూస్తున్న విష్ణువర్ధనరావ్‌కి సడన్‌గా టీవీ తెర మీద ఏదో ఆకారం లాంటిది కనిపించింది. అప్పటిదాకా వస్తున్న ప్రోగ్రాం స్టాప్‌ అయి ఒక గ్రహాంతరవాసి ప్రత్యక్షమయ్యాడు. చూస్తున్న అతను అదిరిపడ్డాడు.

ఆ గ్రహాంతరవాసి “మిస్టర్‌…. మేం మీతో మాట్లాడాలనుకుంటున్నాం. దయచేసి వినండి” అన్నాడు.

విష్ణు మొదట నమ్మలేదు. ఆశ్చర్యపోతూ “నాతోనా మీరు మాట్లాడేది… అయితే చెప్పండి” అన్నాడు.

“ఈ భూమ్మీద మేము ఒక పరిశోధన ప్రారంభించాలనుకుంటున్నాము… దానికి మీ సహకారం కావాలి.”

“తప్పకుండా ఇస్తాను… కానీ నాకేమిటి లాభం?”

“మీకు తప్పకుండా లాభం చేకూరుస్తాము. మీరు కోరుకున్నది ఇస్తాము” అన్నాడు ఆ గ్రహాంతరవాసి.

“ఓకే. అలా అయితే ఓకే..” అని ఒప్పుకున్నాడు. తర్వాత తన మనుషులని ఉపయోగించి భూగృహం నిర్మించాడు. రాముని కిడ్నాప్‌ చెయ్యించాడు. వాళ్ళకి తన పూర్తి సహకారాన్ని అందించాడు.

ఈ విషయాలన్నీ కళ్యాణ్‌కి రాముని తప్పించి తీసుకొస్తున్న రోజు, అతని చేతిలో దెబ్బలు తిన్న విష్ణు అనుచరులు చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కానీ గ్రహాంతర వాసులు చేస్తున్న పరిశోధన దేని పైన అన్నది క్లారిటీ లేదు. ఏ విధంగా మనుష్యజాతిని నాశనం చెయ్యాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. దాని గురించే ఆలోచిస్తున్నాడు.

మిషన్‌ హ్యుమేనిటీ కిల్లింగ్‌.. అంటే మానవత్వాన్ని చంపేసే మిషన్‌ అన్న మాట. అంటే… మనుష్యులలో సహజంగా ఉండే మానవత్వాన్ని చంపెయ్యాలన్న మాట. మనుషుల్లో మానవత్వం అన్నది లేకపోతే… పూర్తిగా స్వార్థపరులుగా మారి… తమ మనుగడ కోసం పక్కవాడ్ని నాశనం చెయ్యడానికి ఏమాత్రం వెనుకాడరు. ఇదే సూత్రాన్ని గ్రహాంతరవాసులు నమ్ముకున్నారు. మనుషుల్లో స్వభావసిద్ధంగా ఉన్న మానవత్వాన్ని పూర్తిగా నిర్మూలించాలనుకున్నారు. దానికోసం పరిశోధన చేసి, ఒక వైరస్‌ కనుక్కుని దాన్ని మనుషుల్లోకి ఎక్కించాలన్నది వాళ్ళ పథకం. అప్పుడు ఆటోమేటిక్‌గా మనుషులు ఒకర్నొకరు చంపుకుంటారు. తాము ఎటువంటి ఆయుధాలు ప్రయోగించకుండా.. ఎటువంటి అనుమానం రాకుండా మానవజాతి మొత్తం నాశనమైపోతుంది. అప్పుడు ఏ విధమైన వినాశనానికి గురి కాని, అందమైన ఈ భూగ్రహం వాళ్ళ సొంతమవుతుంది. ఇదీ వాళ్ళ పథకం. అందుకోసం రాముని కిడ్నాప్‌ చెయ్యించి పరిశోధన ప్రారంభించారు.

కళ్యాణ్‌ మెడికల్‌ జర్నల్స్‌ని తిరగేసి అందులో మనుషుల్లో మానవత్వానికి గల కారణాలని చదవడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా అటువంటి గుణాలన్నిటికీ కారణం మనిషి మెదడు అని తెలిసింది.

మెదడు… మనిషి శరీరంలో అత్యంత శక్తివంతమైన భాగం.

పూర్వకాలంలో ఋషులు అత్యంత ఘోరమైన తపస్సు చేసి సంపాదించిన శక్తులకు మూల కారణం… ఈ మెదడు పైన కంట్రోల్‌ సంపాదించడం. అత్యంత కాంప్లికేటెడ్‌ మరియు శక్తివంతమైన మెదడు మన ఆధీనంలో ఉంటే… చెయ్యలేని అద్భుతమంటూ ఏమీ లేదు. కానీ దురదృష్టవశాత్తు చాల మంది మనుషులు మెదడు తాలూకు శక్తి సామర్థ్యాలని పూర్తిగా వినియోగించుకోలేరు. తమకు తామే తక్కువగా అంచనా వేసుకుని జీవితంలో విఫలం అవుతూ ఉంటారు. భగవంతుడు ఇచ్చిన ఈ మెదడు సామర్థ్యాన్ని బాగా వినియోగించుకున్నవాడే జీవితంలో ఉన్నత శిఖరాలని అధిరోహిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మనుషుల్లో సాధారణంగా కలిగే భయం, కోపం, ప్రేమ లాంటి ఎమోషన్స్ అన్నీ మెదడు లోని ‘లింబిక్‌ సిస్టం’ కంట్రోల్‌ చేస్తుంది. ఈ లింబిక్‌ సిస్టం అనేది మెదడు లోని టెంపొరల్‌ లోబ్‌లో ఉంటుంది. ఇది మెదడు లోని వివిధ భాగాల కలయిక. అయితే ఎమోషన్స్ అన్నీ ప్రోసెసింగ్‌ జరిగేది మాత్రం మెదడు లోని ‘అమిగ్డాలా’ అనే ప్రాంతంలో. ఈ అమిగ్డాలా మెదడు లోని మెమరీ ప్రాంతం నుండి సందేశాలు తీసుకుని, ఈ ఎమోషన్స్‌ని క్రియేట్‌ చేస్తుంది. అంటే… ఏ విధంగా చూసినా ఈ అమిగ్డాలా అనేది మనుషుల ఎమోషన్స్ని కంట్రోల్‌ చెయ్యడంలో కీలక పాత్ర వహిస్తుంది.

ఇదంతా చదివాక కళ్యాణ్‌కి ఒకటి అర్థమైంది.

“రాము అనే కుర్రాడిని గ్రహాంతరవాసులు కిడ్నాప్‌ చేసి, అతని మెదడు పైన ప్రయోగాలు చేసి ఉంటారు. అంటే… అతని మెదడు లోని లింబిక్‌ సిస్టంని… స్లో పోయిజన్‌లా నిర్వీర్యం చెయ్యడం ఎలా అన్న దాని మీద ప్రయోగాలు చేసి ఉంటారు. ఒక వైరస్‌ లాంటిది కనుక్కుని… దాన్ని రాము మెదడు లోని లింబిక్‌ సిస్టం మీద ప్రయోగించి అది సఫలమైతే… ఆ వైరస్‌ని మొత్తం మానవజాతి మీద ప్రయోగించాలన్న పథకం కాబోలు” అని అర్థం చేసుకున్నాడు.

ఈ విషయాలన్నీ ఓ రిపోర్ట్‌లా తయారు చేసి.. ప్రొఫెసర్‌కి వెంటనే పంపించాడు.

(సశేషం)

Exit mobile version