మా తెలుగు వల్లభుడు

0
2

[dropcap]రా[/dropcap]త్రి తొమ్మిది గంటలైంది. అప్పుడే భోజనం ముగించి పడక్కుర్చీలో అలా చేరగిలపడ్డాను. మాతృభాషోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన నాకు రాజకీయాలంటే ఆసక్తి. టి.వీలో రోజు వార్తలు చూస్తూ వాటిని ఆకళింపు చేసుకుంటూ ఉంటాను. నా భార్య శకుంతల కూడ చివర్లో ‘కొసమెరుపులా’ అదేమిటండీ? అంటూ ప్రశ్నలడుగుతూ వార్తలు వినడంలో భాగస్వామ్యం వహిస్తుంది. ఇంతలో నా ఫోన్ రింగయింది. ‘ఎవరబ్బ?’ అనుకోలేదు. నాకు, శకుంతలకు కూడ తెలుసు అది అమెరికాలో ఉన్న నా కొడుకు నుండీ వచ్చిన ఫోన్ అని. రోజు ఈ టైములో, సరిగ్గా మా భోజనాలు పూర్తికాగానే కాల్ చేస్తాడు నా కొడుకు వేణు. నా కొడుకు గురించి చెప్పడం కాదు కానీ, వాడు నిజంగా బంగారు తండ్రి. ఎక్కడా ఏ విషయంలోనూ మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. చదువుకానీ, ఉద్యోగం కానీ అన్నింటిలోనూ చాలా క్రమశిక్షణగా ఉండేవాడు. అతనిలో నైపుణ్యానికి గుర్తుగా ఎన్నో బహుమతులు అందుకున్నాడు. ‘నీ పద్దతే నీ కొడుక్కి వచ్చింది’ అంటూ బంధువులు, స్నేహితులు అంటూ ఉంటారు. ‘పుత్రోత్సాహము తండ్రికి’ పద్యం గుర్తొస్తుంది వాడిని తలచుకున్నప్పుడల్లా.

“‘తెలుగే కదా’ అంటూ మాతృభాషను చులకన చేస్తున్న ఈ రోజుల్లో పిల్లలకు ఆసక్తి కలిగేటట్లు చక్కటి కథలు, సుభాషితాలతో పాఠం చెప్పడం మీకే చెల్లింది” అంటారు తోటి ఉపాద్యాయులు నా గురించి. పదవిలో ఉన్నంతకాలం ఎన్నో అవార్డులు, పదిమందిచేత ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రశంసలు అందుకున్నాను. నా ఇద్దరు పిల్లలను నేనే ఉన్నతంగా తీర్చిదిద్దగలిగాను. ఇది నేను వినయంగా చెప్పుకుంటున్న మాట. నేనిలా ఆలోచిస్తూ ఉండగానే శకుంతల ఫోన్ తీసింది.

“నాన్నా! వేణు ఎలా ఉన్నారు? కోడలు, మనవడు, నువ్వు అంతా బావున్నారా?” అని అడిగింది.

“బావున్నామమ్మా” అన్నాడు వేణు.

రోజు అ ప్రశ్న అడిగి, బావున్నామనే నా కొడుకు జవాబు  వింటేనేగాని వాళ్ళ అమ్మకు తృప్తిగా ఉండదు.

“ఇదిగో మీ నాన్నకు ఇస్తున్నాను” అంటూ ఫోన్ నాకు ఇచ్చింది.

“ఆ  వేణు, ఏంటి విశేషాలు? మనవడు ఏం చేస్తున్నాడు?” అడిగాను.

“ఆడుతున్నాడు నాన్న, వాడి విషయమే అమ్మతో, మీతో మాట్లాడుదామని ఫోన్ చేశాను” అన్నాడు వేణు.

“ఏంటి చెఫ్ఫు?” అన్నాను అదుర్దాగా.

“కంగారేమీ లేదు నాన్నా! మేము ఈ సంవత్సరం ఇండియా వద్దామనుకుంటున్నాము కదా! కానీ అది కుదిరేటట్లుగా లేదు. మీ కోడలు, నేను ఇద్దరం ఉద్యోగాలకు వెళ్ళడం వల్ల వాడిని ‘డే కేర్ సెంటర్’లో ఉంచాము కదా! సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ తీసుకొచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు వాడు కొంచెం పెద్దవాడయ్యాడు. అక్కడికి వెళ్ళనన్ని ఏడుస్తున్నాడు. అందుకే నేనొకటి ఆలోచించాను నాన్నా! ఈ ఒక్క సంవత్సరం బాబుని మీ దగ్గర ఉంచాలనుకుంటున్నాను. దగ్గరలో ఏదైనా స్కూల్లో జాయిన్ చేద్దాం. అమ్మ, మీరు ఆలోచించండి నాన్నా! బాబు మీ దగ్గర ఉంటే మాకు నిశ్చింతగా ఉంటుంది. మీ పెంపకంలో ఒక్క సంవత్సరమున్నా చాలు. మంచి క్రమశిక్షణతో పెరుగుతాడు. ఈ నిర్ణయం మాకెంతో సంతోషంగా, తృప్తిగా ఉంది నాన్నా! అమ్మ మీరు ఆలోచించండి. బాబు కూడా మీ దగ్గర ఉంటానంటున్నాడు. ఈ ఒక్క సంవత్సరమే ఉంటే మేము కూడా వచ్చేస్తాము కదా!” అన్నాడు వేణు.

“కానీ ఇంతదూరం వాడు మిమ్మల్ని వదలి ఉండగలడంటావా?” అన్నాను వెంటనే ఏం జవాబు చెప్పాలో అర్థంకాక.

“ఉంటానంటున్నాడు. కానీ మీకే ఈ వయసులో బాధ్యత పెరుగుతుందని ఆలోచిస్తున్నా అంతే. తొందరేమీలేదు. మీరూ ఆలోచించండి. పొద్దుపోయింది. రేపు మాట్లాడుకుందాం. అమ్మకు కూడా చెప్పండి. ఉంటాను నాన్న” అని ఫోన్ పెట్టేశాడు వేణు.

“అదేమిటండి? అమెరికాలో పుట్టి పెరిగిన బాబు మన దగ్గర మన ఊళ్ళో ఉంటాడంటారా? ఈ వయసులో మనం వాడిని పెంచగలమంటారా?’ అన్నది శకుంతల.

“తప్పదు శకుంతల! వేణు మనల్ని ఎఫ్పుడు ఏమీ అడగలేదు. మన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకున్నాడే కానీ, ఎఫ్ఫుడు మనల్ని ఇబ్బంది పెట్టలేదు. ఈ రోజు తన కొడుకుని చూసుకోమంటున్నాడు. అంతేకదా! బాబు మనకు పరయివాడేమి కాదు. ఈ ఇంటి వారసుడు. కుదరదని ఎలా చెప్పగలం? చూద్దాం. ఏదన్నా ఇబ్బంది వస్తే అఫ్ఫుడు ఆలోచిద్దాం” అన్నాను నేను.

మర్నాడు ఫోన్‍లో మా అంగీకారాన్ని తెలియజేశాము వేణుకి. చాలా సంతోషించారు. కొడుకు, కోడలు.

పదిరోజుల తర్వాత వేణు, కోడలు, మనవడు కార్తీక్‍ని తీసుకుని ఇండియాకు వచ్చారు. వాళ్ళే దగ్గరుండి మాట్లాడి ఇంటిదగ్గర స్కూల్లో జాయిన్ చేశారు బాబుని. ఓ పదిరోజులుండి ఇద్దరు తిరిగి అమెరికా వెళ్ళిపోయారు. అప్పటికే కార్తీక్‍కు ఇంగ్లీష్ కొద్దిగా వచ్చు. ముద్దు ముద్దు మాటలతో పలికే వాడి ఇంగ్లీషు మా ఇద్దరికీ అర్థం అయ్యేది కాదు. కానీ ఒక నెల రోజుల్లోనే మాతోబాటు చక్కగా తెలుగు మాట్లాడటం నేర్చుకున్నాడు. నానమ్మ, తాతా అంటూ మా వెనకే తిరిగే మా ఇంటి వారసుడు, మాకు ప్రాణ సమానం అయ్యాడు. చాలా చక్కగా తాయారై టైముకు స్కూలుకు వెళ్తున్నాడు. శకుంతల కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు వాడికోసం. నేను వాడిచేత దగ్గరుండి హోంవర్క్ చేయిస్తున్నాను. చిన్న చిన్న కథలు, శతక పద్యాలు నేర్పడం మొదలు పెట్టాను. నా కొడుకు వేణులా మనవడు చాలా తెలివైనవాడు. చాలా తొందరగా చెప్పేది గ్రహిస్తాడు. శకుంతల చిన్న చిన్న పాటలు నేర్పింది. స్కూల్లో టీచర్లు చెప్పే పాఠాలు చాలా సులభంగా అర్థం చేసుకుంటున్నాడు. కాలమిలా గడుస్తూ ఉండగానే. ఆగష్టు 15 వచ్చేసింది. ఒక చక్కటి దేశభక్తిగీతం రాగయుక్తంగా పాడటం నేర్పాను కార్తీక్‍కి. దాంతోబాటు స్వాతంత్రం గురించి ఓ పది వాక్యాలు నేర్పి, స్కూల్లో చెప్పమని పంపాను. నేను శకుంతల కూడా స్కూలుకు వెళ్ళాము ఆ రోజు ప్రోగ్రామ్ చూడటానికి.

వాటిని చక్కని అభినయంతో ఉన్నదున్నట్లుగా ప్రదర్శించాడు కార్తిక్. ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంద’న్నట్లు వాడి గాత్రానికి, అభినయానికి అందరూ ముచ్చట పడ్డారు. ఆవరణమంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. పిల్లలంతా ఇంగ్లీషులో తమ ప్రదర్శనలిచ్చారు. ’గౌరవనీయులైన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు’ అంటూ స్వచ్చంగా మొదలుపెట్టింది నా మనవడొక్కడే. ‘తాత’గా తెలుగుమాష్టారునైనందుకు చాలా గర్వంగా అనిపించింది. చాలా సంతోషించాను. చివరకు బహుమతుల ప్రదర్శన. కార్తీక్‍కి తప్పకుండా మొదటి బహుమతి వస్తుందనుకున్నాను కానీ ఇంగ్లీషులో చెప్పిన పిల్లవాడికి బహుమతి ఇచ్చారు. వాడి అభినయం బావుందన్నారు. అదెల నచ్చిందో నాకు అర్థం కాలేదు. ఏదో అర్థం కాని ఇంగ్లీషు పాటను గ్రూప్‍గా పాడిన బృందానికి రెండవ బహుమతి ఇచ్చారు. కార్తీక్‍కి ఎలాంటి బహుమతి రాలేదు. చాలా  నిరుత్సాహపడ్డాడు. బహుమతి కోసమని కాదుగాని బాబులోని స్ఫూర్తి గ్రహించని స్కూలు యాజమన్యం పట్ల నాకు కోపం వచ్చింది. ప్రోగ్రాం అయ్యేవరకు ఉండి ఆ విషయమే ప్రిన్సిపాల్‍తో మాట్లాడాను. “సారీ సర్! పిల్లలకు తెలుగు ఎలాగూ వచ్చు. వాళ్ళకు రాని భాషను నేర్పాలి. మీ మనవడు కూడా బాగానే చెప్పాడు. కానీ తెలుగులో చెప్పాడు కదా! పేలవంగా ఉంది. అందుకే బహుమతి ఇవ్వలేదు” అన్నాడు. నా మనవడు చెప్పింది పేలవంగా ఉందా? అవును మరి నాలుగు ఇంగ్లీషు ముక్కలు బట్టీపట్టి అప్పజెప్పడం గొప్పగా ఉంటుంది. మాతృభాష అంటే ప్రాణం నాకు. దాన్ని కించపరచినా, అవమానించినా కోపం వస్తుంది నాకు. కానీ నిగ్రహించుకున్నాను. మాతృదేవత. మాతృభాష సర్వదా వందనీయులు. కానీ ఏం జరుగుతోందిక్కడ? ఈ అన్యాయం నా మనవడికి కాదు. మాతృభాషకు జరిగింది అనుకున్నాను.

కాలం ఎవరి కోసము ఆగదు కాదా! బహుమతి గురించి బాబు అప్పుడే మర్చిపోయాడు. నాకు దేశం పట్ల, భాష పట్ల ఉన్న మమకారం అంతా బాబు మీద చూపిస్తున్నాను. వాడు నా ఇంటి పేరుకే గాదు, నా సాహిత్యాభిమానానికి కూడ వారసుడిలా తయారుచెయ్యాలి అనుకున్నాను. రామాయణ, భారతాలు, దేశభక్తుల జీవితచరిత్రలు, దేశం కోసం వారు చేసిన త్యాగాలు ఒక్కొక్కటి చిన్న చిన్న కథలుగా చెప్పాను. అవన్నీ చాలా చక్కగా గ్రహించుకున్నాను. తర్వాత కొన్నాళ్ళకు ‘గాంధీజయంతి’ వచ్చింది. ‘మహాత్మాగాంధీ’ గురించి బాబుకి నేర్పించాను. వక్తృత్వపు పోటీలకి పంపాను. తెలుగులో చాలా చక్కగా చక్కటి ఉచ్చారణతో మాట్లాడాడు. ఈసారి కూడా ప్రోత్సాహమేమీ లేదు. బహుమతి రానందుకు బాధపడినా, కార్తీక్‍లోని పరిపక్వతకు గర్వపడ్డాను.

ఒకరోజు బాబు నాతో “తాతయ్యా! స్కూల్లో తెలుగు మాట్లాడకూడదట. ఇంగ్లీషులోనే మాట్లాడాలట. అలా మాట్లాడకపోతే టీచర్ కొడతారట. క్లాసు బయట నిల్చోబెడతారట” అని చెప్పడంతో అవాక్కయ్యాను. నేను జోక్యం చేసుకోకపోతే బాబు ఇబ్బంది పడతాడేమో అనిపించి, స్కూల్‍కి వెళ్ళీ ప్రిన్సిపాల్‍తో మాట్లాడాను. ‘అమ్మ భాష నుండి దూరం చేస్తే, అమ్మను దూరం చేసినట్లే’ అని నచ్చచెప్పాలని ప్రయత్నం చేశాను.

“ఇది ఇంగ్లీషు మీడియం స్కూల్‍ సార్. తెలుగులో మాట్లాడటం కుదరదు సార్. నెమ్మదిగా వాళ్ళే అలవాటు పడతారు సార్. మాకు పై అధికారుల నుండి ఆర్డర్స్ వచ్చాయి. వాళ్ళను ఇంగ్లీషులోనే మాట్లాడించాలి” అన్నాడాయాన. ఇంక నేను చెప్పేదేదీ వినే పరిస్థితిలో ఆయన లేడని అర్థమైంది నాకు. ఇంటి దారి పట్టాను. నాలో నేను ఘర్షణ పడ్డాను. అభం, శుభం తెలియని పసిపిల్లలను మాతృభాషకు దూరం చేస్తున్న వీళ్ళు కూడా దేశద్రోహులే. మాతృభాషలోనే పిల్లలు తమ భావాలను చెప్పగలుగుతారు. తెలుగు భాషా ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప, గొప్ప పండితులు, కవుల గురించి భావితరానికి ఎలా తెలుస్తుంది. అవన్నీ మరుగున పడవలసిందేనా? ఇలా రకరకాల ప్రశ్నలు నాలో రేకెత్తి, నన్ను కలవరపెట్టాయి. నా మనోవ్యధనంత వేణుతో చెప్పాను.

“అవును నాన్నా! పరిస్థితి అలాగే ఉంది. విదేశాలలో ఉండి నేను తెలుగు గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంటుంది. కానీ మేము చిన్నప్పుడు తెలుగు చాలా చక్కగా నేర్చుకున్నాము. నాతోబాటు నా స్నేహితులు కూడా మీరు చెప్పే మంచి విషయాలు విని, ఆకళింపు చేసుకునేవాళ్ళం. బ్రతుకుదెరువు కోసం రకరకాల వృత్తుల్లో ఇలా స్థిరపడ్డామే గాని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయి కాదు. ఆ విషయంలో ఈ తరానికి, ముఖ్యంగా ఈ తరం పిల్లలకు చాలా అన్యాయం జరుగుతుంది నాన్నా! అందుకే కార్తీక్‍ని మీ దగ్గరికి పంపాను. వాడికి మీ ద్వారా మన భాష పట్ల, సంస్కృతి పట్ల, సంప్రదాయాల పట్ల ఆసక్తి పెరగాలని నా ఆకాంక్ష. వాడు మా దగ్గరుంటే అది సాధ్యపడదు. తెలుగులో చక్కటి మాట తీరు, సంస్కారం నా కొడుకు నేర్చుకోవాలి నాన్నా. అదే నా కోరిక” అన్నాడు వేణు. ఉద్వేగంగా మాట్లాడిన వేణు మాటలకు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

‘కర్మణేవాధికారస్తే మాఫలేషు కదాచన’ శ్లోకం గుర్తొచ్చింది నాకు. మనవడి పట్ల నా బాధ్యత మరింత పెరిగినట్లుగా అనిపించింది. ఆప్యాయంగా వాడిని దగ్గరకు తీసుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here