Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-21: మా వదిన ఎంత మంచిదో!

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఆ[/dropcap]రునెలల క్రితం…

మా వదిన చెప్పిన సలహాలు పాటించిన వనజ టీవీ సీరియల్స్‌లో అత్తలూ, కోడళ్ళూ కట్టుకున్న చీరలని చెప్పి తన సేల్స్ పెంచేసుకుంది. వనజ చెల్లెలు గిరిజ అక్కగారి అడుగుజాడల్లోనే వదిన దగ్గర సలహా తీసుకుని టీవీలో రియాలిటీ షోలకి వెళ్ళడానికి కావల్సిన ట్రైనింగ్ క్లాసులు పెట్టి తీరికంటూ లేకుండా బిజినెస్ చేసేస్తోంది. వీళ్ళిద్దర్నీ చూసిన వాళ్ళ కజిన్ సరళ బిజినెస్ చెయ్యాలనుందనీ, ఏం చెయ్యాలో సలహా కోసం తనని వదిన దగ్గరికి తీసికెళ్ళమంటూ నా దగ్గరకొచ్చింది. బుధ్ధిగా సరళని తీసికెళ్ళి వదిన ముందు నిలబెట్టేను.

“ఏం చదువుకున్నావు సరళా” అనడిగింది వదిన.

“టెన్త్ క్లాస్ అవగానే ఎదురుకుండా వాడు పెళ్ళికొడుకన్నట్టు మా బావకిచ్చి మేనరికం చేసేసేరండి. తర్వాత సంసారం, పిల్లలూ, బాధ్యతలూ. ఇప్పుడు అన్నీ ఒక కొలిక్కి వచ్చేయండి. నాకంటూ కొంత టైమ్ కూడా ఉందండి. అందుకని ఏదైనా చిన్న బిజినెస్ చేద్దామనుకుంటున్నానండి. మీరు మంచి సలహా లిస్తారని మా వదిన్లు చెప్పేరండి. అందుకని వచ్చేనండి.”

ఇంకా సరళ సంసారం గురించి కొన్నిప్రశ్నలడిగింది వదిన. సరళ పెళ్ళై వెళ్ళేటప్పటికి పదిమందిగల ఉమ్మడి కుటుంబం. సరళ వెళ్ళేకే మరుదుల చదువులూ, ఆడపడుచుల పెళ్ళిళ్ళూ అయ్యేయిట. ఇప్పుడు పెద్దవాళ్లైపోయిన అత్తమామలిద్దరూ ఊళ్ళోనే ఉంటున్నారు. సరళ భర్తది ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. పొద్దున్న వెడితే రాత్రిక్కానీ రాడు. పిల్లలిద్దరూ కాలేజీ చదువులకొచ్చేరు. ఈ మనిషిని చూస్తే నెమ్మదిగా కనిపిస్తోంది. బిజినెస్ అంటే దూసుకెళ్ళిపోయే స్వభావం ఉండాలి. రిస్క్ తీసుకోవాలి. సరళని చూస్తే అలా కనిపించటం లేదు. ఇలాంటి అమ్మాయి ఏం బిజినెస్ చేస్తుందీ..ఆ మాటే అన్నాను వదినతో కాఫీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళినప్పుడు నెమ్మదిగా. సూటిగా చూసింది నావైపు, “సరళకి బిజినెస్ పెట్టడానికి ఏమీ సావకాశమే లేదంటావా! ఆలోచించు..” అంటూ కాఫీకప్పులతో హాల్లోకి వచ్చింది.

నేను కూడా వదిన వెనకే వస్తూ, “బిజినెస్ చేద్దామనుకుంటున్నావు కదా! కొంచమైనా డబ్బు దాచేవా!” అనడిగేను సరళని. ఆ డబ్బుని బట్టి ఏ గాజులకొట్టులాంటిదో పెట్టించొచ్చని నా ఉద్దేశం. తెల్లమొహం వేసింది సరళ.

“డబ్బేమీ దాచలేదండీ. అంతగా అవసరమైతే ఈ జత బంగారుగాజులు అమ్మడం కానీ తనఖా కానీ పెడతాను. ఇవి మా పుట్టింటివాళ్ళిచ్చినవే” అంటూ చేతికున్న గాజులు తీయబోయింది. మా వదిన చటుక్కున ఆపేసింది.

“చదవడం రాయడం వచ్చునా!” అనడిగింది.

తలూపింది సరళ.

“కూడికలూ, తీసివేతలూ వచ్చునా!” అంది.

“ఎక్కాలు కూడా వచ్చండి.” అంది సరళ గొప్పగా ఫీలవుతూ.

“మీ ఇల్లెక్కడ!”

“శంకరమఠం పక్కనండి.”

“మీ ఇంటికి దగ్గరగా ఏమైనా పోర్షన్లు ఖాళీ ఉన్నాయా!” మా ఇంట్లోనే పక్క పోర్షన్ వారం రోజుల్లో ఖాళీ అవుతుందండి.”

“ఎన్ని గదులుంటాయీ!”

“మూడు గదులండి.”

“అయితే నాలుగురోజులయాక ఒకసారి రా. ఆలోచించి చెపుతాను” అంది వదిన. సరళ వదినకి నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది.

నాకేం అర్ధం కాలేదు. బిజినెస్ చేస్తాననేవాళ్లని ఖాళీ ఇళ్ళున్నాయా అనడగడమేంటీ. వదినేదో తెలివైందనుకున్నాను కానీ అబ్బే..అనుకుంటుంటే వదినే నన్నడిగింది.

“సరళలో నీకేం లక్షణాలు కనిపించేయీ!” అంటూ.

“ఏమీ లేవు. చదువు లేదు, డబ్బు లేదు. నాలుగు చోట్ల తిరిగి ఏవైనా ఆర్డర్లలాంటివి తెచ్చుకుందుకు చిన్నపిల్ల కూడా కాదు. దూసుకెళ్ళే స్వభావం కాదు. నెమ్మదిగా మాట్లాడుతోంది. ఇలాంటివాళ్ళు బిజినెస్ యేం చేస్తారూ!” అన్నాను.

వదిన నవ్వింది. డబ్బూ, చొరవే కాకుండా నిజాయితీ, నెమ్మదితనం కూడా పెట్టుబడిగా పెట్టి బిజినెస్ చేసుకోవచ్చు. ఎటొచ్చీ ఇది నువ్వనుకునే బిజినెస్ అనకూడదేమో.. ఏం పేరు పెట్టుకున్నా ఇలా కూడా డబ్బు సంపాదించొచ్చు” అంది వదిన.

“ఎలా!” అన్నాను ఆత్రంగా.

“నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్… అంటారు తెల్సుకదా!” అంది వదిన నావైపు అర్ధవంతంగా చూస్తూ. ఇందులో ఇన్వెన్షన్ ఏముందీ… అర్థం కానట్టు చూసేను వదినవైపు.

“స్వర్ణా, చూస్తున్నావుగా. మారుతున్న రోజులతోపాటు మనుషుల అవసరాలూ, ఆలోచనలూ కూడా మారుతున్నాయి. దానివల్లేకదా ప్రతిరోడ్డుకీ ఇన్ని స్వగృహా ఫుడ్సూ, ఇన్ని కర్రీ పాయింట్లూ, వీధికో నాలుగు మిర్చీబండీలూ వెలిసేయి.”

‘అంటే ఇప్పుడు సరళని ఏ మిర్చీబండో, కర్రీ పాయింటో పెట్టమంటావా!” అనడిగేను.

“ఊహు, సరళకి సహాయం చెయ్యడానికి ఇంకో మనిషి లేరు. పెట్టుకుందుకు కూడా సరిపడ డబ్బు లేదు. కానీ సరళ దగ్గర బోల్డంత ఓర్పూ, సహనమూ ఉన్నాయి. అవే వాడుకుంటూ సాధ్యమైనంత తక్కువ పెట్టుబడితో తను చెయ్యగలిగినదేదైనా చూపించాలి” అంది.

కుతూహలంగా వదినవంక చూసేను.

“స్వర్ణా, మొన్న ప్రసాద్ అంకుల్ ఒకమాటన్నారు గుర్తుందా! వాళ్ల పెద్దన్నయ్యట, డెబ్బయేళ్ళు. ఇక్కడే కొడుకు దగ్గరే ఉంటాట్ట. ఇంట్లో కొడుకూ, కోడలూ. మనవలూ పొద్దున్నే ఆఫీసులకీ, కాలేజీలకీ పోతే మళ్ళీ రాత్రవుతుంటేకానీ ఇల్లు చేరరు. ఎంతసేపని ఒక్కరూ ఆ టీవీ చూస్తూ కూర్చోగలరూ, విసుగొస్తోందిట అన్నారు ప్రసాద్ అంకుల్. ఆయనదీ అలాంటి పరిస్థితేట. అన్నగారికన్న రెండేళ్ళు చిన్నవారంతే. ఇంకా ఇలాంటివాళ్ళు మన లొకాలిటీలో చాలా మందున్నారు. పిల్లలతో కలిసైనా ఉంటున్నారు, లేదా మొగుడూ, పెళ్ళాలు మాత్రమే ఉంటున్నారు. వాళ్లకి పొద్దు గడవడానికి ఒక డే కేర్ లాంటిది పెడితే బాగుంటుంది కదా! సరళ పక్కవాటా అద్దెకు తీసుకుని, పేపర్లూ, పత్రికలూ, చెస్సూ, క్యారమ్సూ లాంటివి పెట్టి సాయంత్రం దాకా వాళ్ళని ఎంగేజ్ చేస్తే ఎంత బాగుంటుందీ! వాళ్లకీ ఒక్కళ్ళూ కాకుండా నలుగురితో కలిసి ఉన్నామనే భద్రతాభావం ఉంటుంది. సరళ కూడా ఒక్కొక్కరి దగ్గర నెలకి తీసుకున్న డబ్బులో కొంత అద్దెకట్టేస్తే నెలకింతని తనకి కూడా కాస్త మిగులుతుంది. సరళకున్న ఓర్పూ, సహనం, నిజాయితీ, నెమ్మదితనమే పెట్టుబడి ఇక్కడ. ఆ పెద్దవాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడుతూ, ఏమన్నా తిన్నారో లేదో, మందులు వేసుకున్నారో లేదో చూస్తూ, వారిని కనిపెట్టుని ఉండడమే సరళ చెయ్యవలసిన పని. ఏ బిజినెస్ కయినా గుడ్‌విల్ అన్నది ముఖ్యం కదా! ఇక్కడ అదే పెట్టుబడవుతోందన్న మాట. “

వదిన ఆలోచనకి నేను తెల్లబోయేను.

“ఇది సాధ్యమేనంటావా!” అనడిగేను అనుమానంగా.

“తప్పకుండా సక్సెస్ అవుతుంది చూడు. పెద్దవాళ్ళు మనుషులకీ, మాటలకీ మొహం వాచిపోయేరు. నలుగురు మనుషులు కనపడి నాలుగు మాటలు మాట్లాడుతుంటే వాళ్లకెంత బాగుంటుందో!” అంది నమ్మకంగా.

వదిన నమ్మకం నిజమయింది. సరళ “అడల్ట్ డేకేర్ సెంటర్” ఓపెన్ చేసింది. ఒక్క ఆరునెలలు గడిచేటప్పటికి చేరిన సభ్యులకి కింద మూడుగదులూ సరిపోలేదు. సరళా వాళ్ళు పై పోర్షన్ లోకి వెళ్ళిపోయి కింద మొత్తం ఆరుగదులూ డేకేర్ సెంటర్ కోసమే ఉపయోగించేరు. మొత్తం ఆరుగదులకి సరిపడ సభ్యులు చేరిపోయారందులో.

ఆరునెలలయ్యాక సరళ వచ్చి మా వదినకి పాదాభివందనం చేసింది.

ఇంత మంచి సలహా ఇచ్చిన మా వదిన ఎంత మంచిదో!..

Exit mobile version