[dropcap]మా[/dropcap]మిడిచెట్టై మమ్మల్ని పెంచిన అమ్మ
ఆ ఆ లు దిద్దించి
విద్యను పంచిన అమ్మ
రెండు కోసుల దూరం పోయి
మా గొంతులు తడిపే గంగను మోసుకొచ్చిన అమ్మ
ఒంటి చేత్తో ఇంటెడు చాకిరినీ
చుట్టుకొచ్చిన అమ్మ
ఇవాళ అరసున్నాలా
వంగిపోతోంది
ఎలా వున్నావని పలకరించినపుడల్లా
నా బాల్యం నుంచీ నన్నెత్తుకున్న
సంబరాన్నంతా ప్రతిస్పర్శ లోనూ
నాకు పంచిపెడుతోంది
ఎప్పుడూ ఎవరినీ ఏడిపించకూడదని
ఒక్కోసారి కన్నీటితో చెప్పిన అమ్మ
మానవత్వపు పాఠాన్ని
గుర్తుచేస్తునే వుంది
జీవితాన్ని మథించి
అమృతాన్ని పంచిన అమ్మ
దేవతలై ఎలా బతకాలో
చెప్తూనే వుంది
నా కూతురితో కలిసి
నవ్వుతూ కూర్చునే అమ్మ
నా ముంగిట మరో చిన్న తల్లై
ప్రేమ వర్షాన్ని కన్నులలో
కురిపిస్తూనే వుంది
భూమిని దేవతని ఎందుకంటారో
దేవుడని ఎందుకనరో చెప్పే
అమ్మ మాట
మరు జన్మలోనైనా
అమ్మై పుట్టాల్సిన
అవసరాన్ని
గుర్తు చేస్తోంది