[dropcap]మొ[/dropcap]న్నొకసారి మా మనవడు అడిగాడు. ఎంత సేపూ నువ్వు చెప్పే కథలేనా మీ అమ్మమ్మ నీకు కథలు చెప్పలేదా అవి కూడా చెప్పు అని. మా అమ్మమ్మ మాకు కథలు చెప్పింది, మా చిన్నప్పుడు చాలా మంచి కథలు చదువుకున్నాము కూడా. కానీ అన్నీమరచిపోయాను. ఎప్పటివో కదా!
మనవడు అడిగాడు కదాని చిన్నప్పటి కథలు గుర్తు చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నా. అలా గుర్తొచ్చింది ఈ కథ. అప్పటి కథ అలాగే గుర్తు రాలేదు. నేను చేర్చిన విశేషాలు వుండచ్చు.
పూర్వం ఒక అడవిలో ఒక నక్క, ఒక కొంగ చాలా స్నేహంగా వుండేవి. రోజూ కాసేపు కలసి కబుర్లు చెప్పుకుని ఎవరిళ్ళకు అవి వెళ్ళిపోయేవి. కొంగకీ నక్కకీ స్నేహమేమిటి, అవి రోజూ కలసి కబుర్లు చెప్పుకోవటమేమిటి అని ప్రశ్నలు వెయ్యకండి. మాకా అనుమానాలు రాలేదు, మేమా ప్రశ్నలు వెయ్యలేదు. అమ్మమ్మ చెప్పిన కథలు, కథ చివర వాళ్ళు చెప్పే నీతితో సహా చాలా శ్రధ్ధగా వినేవాళ్ళం. మళ్ళీ మళ్ళీ అవే కథలు అడిగి చెప్పించుకునేవాళ్ళం. ఈ కాలం పిల్లలకి తెలివి ఎక్కువైంది.
సరే, సరే, కథలోకే వస్తున్నాను. కొంగా, నక్కా బాగా స్నేహంగా వుండేవని చెప్పాను కదా. వాటి స్నేహం చూసి మిగతా జంతువులు ఓర్వలేక పోయాయి. వాటిని ఎలాగైనా విడదీయాలని “కొంగ నీకు మంచి స్నేహితుడంటావు కదా. రోజూ అన్ని చేపలు పడుతుంది, ఎప్పుడైనా నిన్ను వాళ్ళింటికి భోజనానికి పిలిచాడా ఈ స్నేహాలివ్వన్నీ ఉత్తుత్తి కబుర్లేగాని” అంటూ నక్కతో ఏవో చాడీలు చెప్పసాగారు. అలాగే కొన్ని జంతువులు కొంగ వైపుజేరి కొంగకి తామే ఆప్తులమన్నట్లు లేనిపోనివన్నీ కల్పించి నక్కమీద చెప్పాయి.
కొంగా, నక్కా వాళ్ళ మాటలన్నీ విన్నా పట్టించుకోలేదుగానీ, స్నేహితుణ్ణి ఒకసారి భోజనానికి పిలుస్తే బాగానే వుంటుందికదా అనుకున్నాయి. అనుకున్నదే తడవు కొంగ ఆ రోజు సాయంత్రం నక్కని వాళ్ళింటికి భోజనానికి పిలిచింది. నక్క కూడా సరేనంది.
ఆ రోజు సాయంకాలం కొంగ ఇంటికి భోజనానికి వెళ్ళటానికి తయారయింది నక్క. కొంగ చేపలు బాగా పడుతుంది. తనకి రకరకాల చేపలు తినే అవకాశం రాదు. ఇవాళ కొంగ తనకోసం రకరకాల చేపలు వండిస్తుందని నోరూరుతుండగా కొంగ ఇంటికి చేరింది నక్క. కొంగ కూడా నక్కని చూసి ఎదురువెళ్ళి కౌగలించుకుని, ఆప్యాయంగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది.
కొంచెం సేపు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నాక కొంగ “భోజనం చేద్దామా నక్క బావా” అని అడిగింది. “అలాగే కొంగ బావా, నువ్వు పట్టిన చేపల రుచి చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాను. నేను రెడీ” అంది నక్క.
కొంగ రెండు పొడవీటు జగ్గులలో రకరకాల చేపలతో చేసిన అద్భుతమైన పదార్దం తీసుకొచ్చి నక్క ముందొకటి పెట్టి తానొకటి తీసుకుంది. వంటకం వాసన గుబాళిస్తోంది. ఆకలితో వున్న నక్క ఆత్రంగా తినాలని చూసింది. కానీ అంత పొడుగు జగ్గునుంచి నక్క ఎలా తినగలుగుతుంది కొంగకి పొడుగు మూతి వుంది కనుక ఆ జగ్గులో పదార్ధాన్ని గబగబా తినేసింది. ‘ఏమి నక్క బావా, ఏమీ తినటంలేదు మా వంటలు నీకు నచ్చలేదా?” అని ఆశ్చర్యంగా నక్కని అడిగింది.
నక్క బేలగా జగ్గువంక చూసింది, తాను అందులోంచి తినలేనన్నట్లు. కొంగ ఏమీ చెయ్యలేకపోయింది. మరి వాళ్ళింట్లో వున్న సామానంతా వాళ్ళు వాడుకోవటానికి వీలుగా వుండేవి. వాటిలో నక్క తినలేకపోయింది. కొంగ చాలా బాధ పడ్డది. నక్కని క్షమాపణ వేడింది. “సారీ నక్కబావా, మా ఇంట్లో సామాను మాకు అనువుగా వుండేది. నిన్ను భోజనానికి పిలిచినప్పుడు నేనీ సంగతి ఆలోచించలేదు. నన్ను క్షమించు. నిన్ను భోజనానికి పిలిచి నీకు తినటానికి ఏమీ పెట్టలేదు. వెరీ సారీ.”
ఆకలితో కడుపు మాడుతున్నా అంతగా బాధ పడుతున్న కొంగని చూసి నక్క ఏమీ అనలేకపోయింది. “పర్వాలేదులే కొంగబావా, నువ్వు మాత్రం ఏం చెయ్యగలవు?“ అని చెప్పి ఇంటికి బయల్దేరింది.
నక్క స్నేహితులంతా జరిగిన విషయం తెలుసుకుని సంతోషించారు. ఇంక వీళ్ళిద్దరి స్నేహం అయిపోయిందనుకున్నారు. అయినా ఎందుకైనా మంచిది ఇంకో ప్రయత్నం కూడా చేద్దామని కొంగని భోజనానికి పిలవమని నక్కని పోరు పెట్టారు. కొంగ తినటానికి వీలుగా మీ ఇంట్లో వస్తువులుండవు కదా. దానితో నువ్వు వాళ్ళింట్లో ఎలా బాధపడ్డావో అలాగే కొంగా ఇక్కడ బాధ పడుతుంది. బలే వుంటుంది అని సంబర పడ్డారు.
తర్వాత ఒక రోజు నక్క కొంగని భోజనానికి పిలిచింది. నక్క ఇంట్లో కూడా అన్నీ వాళ్ళకి పనికి వచ్చే సామానే వుందిగానీ కొంగ తినటానికి వీలుగాలేవు. కానీ నక్కా, కొంగల మధ్య వున్నది నిజమైన స్నేహం. తెలియక తనని ఇబ్బంది పెట్టినందుకు కొంగ బావ కూడా చాలా బాధ పడ్డాడు. అందుకే నక్క కొంగని బాధ పెట్టాలనుకోలేదు. తమ మధ్య తంపులు పెట్టే వాళ్ళ మాట పట్టించుకోలేదు. వాడకుండా పక్కన పెట్టేసిన గ్లాసు తీసి శుభ్రంగా కడిగి పెట్టింది. కొంగకి భోజనం దానిలో పెడితే ఇబ్బంది పడకుండా తింటుందని. స్నేహితుడి గురించి ఎదురుచూస్తూ కూర్చుంది.
కొంగ రానే వచ్చింది. కొంగ తనతో తెచ్చిన చిన్న జగ్గుని చూసి నక్క ఆశ్చర్యపోయింది. “ఇదెందుకు కొంగబావా?” అని అడిగింది. “ఏమనుకోకు బావా, మా ఇంటికి వచ్చి నువ్వు భోజనం చెయ్యలేక ఇబ్బంది పడ్డావు. దానితో నాకు ఆలోచన వచ్చింది. మీ ఇంట్లో కూడా మీకు వీలుగా వుండే సామానే వుంటుందిగానీ నా కోసం వుండదు కదా. నువ్వా రోజు తినకుండా రావటంతో నేనీ రోజు దాకా భోజనం సరిగ్గా చెయ్యలేకపోతున్నాను. నాకుమల్లే నువ్వు బాధ పడకూడదని ఇది తెచ్చుకున్నా. నువ్వు నాకు భోజనం మీ పళ్ళాలలో కాకుండా దీనిలో పెడితే నేను బాగా తినగలుగుతాను. నీకు బాధ వుండదు. ఎలా వుంది మన అవుడియా?” మిత్రులిద్దరూ పెద్దగా నవ్వుకున్నారు.
కొంగ నక్క స్నేహం, భోజనానికి పిలవటం, జగ్గులో పెట్టటం, అసలు కథ. తర్వాత కథ నేను మార్చేశానని తెలుస్తూనే వుందికదా. పిల్లలూ, మీరు తెలుసుకోవల్సింది ఏమిటంటే మిత్రులవల్ల మనకెప్పుడయినా బాధ కలిగినా వెంటనే వాళ్ళని అపార్థం చేసుకోకుండా ఏ పరిస్ధితుల్లో అలా జరిగిందో తెలుసుకుని స్నేహాన్ని కాపాడుకోండి.