మా బాల కథలు-12

0
3

[dropcap]బా[/dropcap]ల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

బాల – కొత్త పావడా

బాలకి చాలా మంది చిన్న పిల్లల లానే కొత్త బట్టలంటే చాలా ఇష్టం. తన పుట్టిన రోజుకే కాక ఇంటిలో ఎవరి పుట్టిన రోజైనా మారాము చేసి,  లేదా గొడవ చేసి తనకీ కొనిపించుకునేది. డబ్బు సమస్య లేకపోవటం వల్ల కొంత, చిన్నపిల్ల కదా సరదా తీర్చాలని కొంత, ఎవరికీ పడితే వారు నాన్నమ్మా, బాబాయ్, అత్తా కొంటూనే ఉంటారు. ముఖ్యముగా నాన్న.

బాల నాన్న కొత్త రకం, అందమైనవి కనబడితే తెచ్చేస్తాడు సిటీలో ఉద్యోగం కాబట్టి.

ఒకరోజు చాలా అందమైన, డిజైనర్ పావడా తెచ్చాడు. అయితే అది చాలా పొడుగయ్యింది. ఎక్కువ ఖరీదు కూడా.

అసలు బాల అమ్మకి ఎదిగే పిల్లలకి ఎక్కువ ఖరీదు పెట్టి, ఎక్కువగాను కొనటం ఇష్టం ఉండదు. ఎందుకంటే త్వరగా పొట్టి అయిపోతాయి. లేదా అంటే పిల్లలు జాగ్రత్తగా వాడలేరు కాబట్టి పాడు చేసుకుంటారు. వాటి విలువ తెలియదు కూడా. అందుకే మామూలువి, లేదా అవసరాన్ని బట్టి అవసరమైనట్లుగా కొంటే చాలు. వాళ్ళుకి కొంచెం ఊహ వచ్చాక అంటే ఆ దర్జా ఆనందించి, కొంచెం జాగ్రత్త పరచుకోగలిగే సమయం వచ్చినప్పుడు ఎక్కువగా కొంటే బాగుంటుంది అంటుంది.

అందులో బాల నాన్నకి సెలక్షన్ కూడా సరిగా రాదు. అయితే పొడుగవుతాయి లేకపోతే పొట్టి అవుతాయి. కానీ ఖరీదు మాత్రం ఎక్కువ పెట్టేస్తాడు. అందుకే అతన్ని బాల బట్టలు ఎక్కువగా తేవద్దంటుంది. చెప్పినప్పుడు తెమ్మంటుంది. కానీ కొత్త బట్టలు చూడగానే బాల మొహములో కనపించే ఆన౦దం చూడటం తండ్రిగా అతనికి సంతోషం. అందుకే తెచ్చేస్తాడు వద్దన్నా.

ముఖ్యముగా బాల బట్టలే సమస్య. తమకైతే చీరల వాళ్ళు అన్ని ఊర్ల నుంచి ఇంటికే తెస్తారు. అత్తగారి రోజుల్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళటం, తెచ్చుకోవటము ఉండేది కాదు కదా. అదే అలవాటు ఇప్పుడూ కొనసాగుతోంది. పిల్లలవి పట్టు లంగా బట్టలు మాత్రం తెస్తాడు. అస్తమాను పట్టువి కొనరు కదా. మామూలువి, గౌన్లు లాంటివి తేడు. అందువల్ల బాల నాన్న తేవడం, అవి సరిగ్గా లేకపోవటం,ఇద్దరూ వాదించుకోవటం అలవాటు అయిపోయింది.

ఇప్పుడూ అంతే. లంగా చాలా పొడుగయ్యింది.

శాంతకు చికాకు వేసింది. “అసలు మీరెందుకు అస్తమాను బాలకి బట్టలు తెస్తారు. మీకు సైజూ తెలియదు, సెలక్షన్ రాదు. ఈ లంగా దానికి ఇంకో అయిదేళ్ళు వచ్చాక గానీ సరిపోదు. అన్నాళ్ళు పక్కన బెడితే అది ఊరుకుంటుందా? పోనీ ఫిల్టు వేయిడ్డామంటే డిజైన్ మధ్యలో వచ్చి డిజైన్ అందం పోతుంది.” అంది

“పోనీ లేవే ఏదో సరదా పడి తెచ్చాడు. సతాయించకు. తడిపితే తగ్గుతు౦ది లే” అంది నాయనమ్మ. అన్నీ అలా కావు. కానీ నాన్నమ్మకి ఎవరినైనా, ఏదైనా అంటే తనే అనాలి. వేరే వాళ్ళు అంటే సహించదు. ముఖ్యముగా కొడుకుల్ని. భార్యలైనా సరే. ఆ సంగతి తెలిసిన శాంత మౌనముగా ఉండిపోయింది.

ఆ రోజు సీతమ్మ గారి మనవరాలి పుట్టినరోజు. శాంతకు తప్పక చాలా జాగ్రత్తలు చెప్పి బాల సైజ్ గౌను తెమ్మంది.

నాన్న ఎప్పటిలానే చాలా పొడుగు సైజు తెచ్చాడు. శాంతా ఏమన్లేక తల కొట్టుకుని “ఇంత పెద్దదా” అని ఊరుకుంది. ఏమైనా అంటే అత్తగారు ఊరుకోదు. భర్తా ఊరుకోడు. నాన్న రాగానే దగ్గర చేరే బాల అక్కడే ఉంది. తండ్రిని అంటే బాలా ఊరుకోదు. పైగా ఏమైనా అంటే బాల నాన్న “నువ్వే తెచ్చుకో” అంటాడు. కానీ తనకి ఇల్లు కదలడం, అందులో సిటీకి వెళ్ళడం అంత సులభం కాదు.

అందుకే అందరి పిల్లలూ బాలలా ఉండరుగా. పెద్దయ్యాక వేస్తారులే అనుకుని బీరువాలో పెట్టింది.

తీరా పేరంటానికి వెళ్ళే రోజు చూస్తే గౌన్ కనబడలేదు.

“అవలేదే ఇంకా” అంటూ వచ్చింది అత్తగారు.

“అయిపోయిందత్తయ్యా. నేను తయారయ్యాను. గౌన్ ఇందులోనే పెట్టాను.అదే వెతుకుతున్నా”

“అమ్మా కొత్త గౌనా” అంది బాల.

“అవును నువ్వు చూసావా” అంది ఆత్రముగా.

“అవును. తడిపి అరేసానుగా. దొడ్లో ఉంది”

“తడిపి ఆరేసావా, నీకేమైనా పిచ్చా? కొత్తది తడిపి ఇస్తారా బహుమతిగా” అంది కోపంగా.

“నువ్వేగా అన్నావు. చాలా పొడుగ్గా, పెద్దగా ఉందన్నావే నాన్నతో ఆ రోజు. నువ్వు పనిలో ఉన్నావుగా”

“అయితే”

“తడిపితే తగ్గుతుందని నాన్నమ్మ అ౦దిగా. అందుకే తడిపి ఎండేసాను” అంది.

“ఖర్మ” తల బాదుకుంది అమ్మ.

ఇప్పుడెలా? ఇంకొకటి తెచ్చే సమయం లేదే. సరే అదే ఇస్త్రీ చేసి ఇవ్వాలి అంటూ అమ్మ దొడ్డి వైపు వెళ్ళింది.

అమ్మ దొడ్డి గుమ్మం దగ్గర అలా నిలబడి పోవటం చూసి నాయనమ్మ “ఏమయ్యిందే” అంటూ వెళ్ళింది. వెనకాలే అందరూ.

గౌన్ కలర్ ఒకటి, ఇంకా పువ్వులు అన్నిరంగులుతో ఉండటముతో, తడపగానే అన్నిరంగులూ కలసి పోయి, హోలీ నాడు వేసుకున్న గౌన్‌లా అయ్యింది.

పాపం అమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here