Site icon Sanchika

మా బాల కథలు-17

[dropcap]బా[/dropcap]ల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

బాల పంపకం

ఆ రోజు సచ్చు మామ్మ మనవరాలి పుట్టిన రోజు. టీ పార్టీ పిల్లలకి అని, బాలని బబ్లూని పంపమన్న సచ్చు మామ్మ కోరికపై ఇద్దరినీ పంపారు. అది పిల్లలకే కావటం వాళ్ళ పెద్దలెవరూ వెళ్ళలేదు. వాళ్ళ ఇద్దరినీ దెబ్బలాడుకోవద్దని, చిన్న పిల్ల కాబట్టి బాలని జాగ్రత్తగా చూడమని బబ్లూకి అప్పగింతలు పెట్టి పంపింది అమ్మ.

ఎలాగైతేనేమి ఇద్దరూ వెళ్లి వచ్చారు. బాల మొహం వికసి౦చి లేకున్నా, బబ్లూ మాత్రం చాలా ఆనందముగా ఉన్నాడు. రాగానే చెల్లిని తల్లికి అప్పగించి, స్నేహితుల దగ్గరికి వెడతానని వెళ్ళిపోయాడు.

బాల మాత్రం సీరియస్ గానే ఉంది. అమ్మ కారణం అడిగితే చెప్పలేదు. ఇక అమ్మ కూడా ఊరుకుంది.

కొద్ది సేపు అయ్యాక సచ్చు మామ్మ నుంచి ఫోన్ వచ్చింది. చిన్న మామ్మ ఫోన్ కాబట్టి నాయనమ్మే అడిగి తీసుకుంది.

సచ్చు మామ్మ ఫోన్‌కి కారణం పిల్లలు జాగ్రత్తగా ఇల్లు చేరారా అని అడిగింది. కాసేపు కులాసా కబుర్లు తరువాత జామకాయలు ఎలా ఉన్నాయి అని అడిగింది.

సచ్చు మామ్మ ఏది ఎవరికీ ఇచ్చినా ఘనంగా చెప్పుకుంటుంది, ఇచ్చేది కొంచమైనా.

“జామకాయలు ఏమిటి?” అంది నాన్నమ్మ.

“మా ఇంటిలోవి చిన్నవైనా చాలా తీపి. అందరూ మెచ్చుకుంటారు. అందుకే రుచి చూస్తారని పంపాను.” అంది సచ్చు మామ.

“సరే, నేను ఇప్పుడే నిద్రలేచాను, అడుగుతాలే” అంది.

ఫోన్ అయ్యాక అమ్మని పిలిచి అడిగితే బాల గాని, బబ్లూ గాని కాయలు ఇవ్వలేదని చెప్పింది.

నాన్నమ్మకి చాలా కోపం వచ్చింది. ఎవరైనా ఏమైనా ఇచ్చినప్పుడు చెప్పక పోవటం చెడ్డ అలవాటు కదా.

అందుకే అందుబాటులో ఉన్న బాలని పిలిచి అడిగింది.

“చిన్న మామ్మ ఇచిన జామకాయలు ఏవి?”

“సగం నా వాటా. నా స్నేహితులకివ్వాలి అని అన్న తీసేసుకున్నాడు” అంది కోపముగా.

“మిగతావి ఎవరికీ ఎందుకు ఇవ్వలేదు” అడిగి౦ది.

“ఎవ్వరికీ ఇవ్వలేముకదా నాన్నమ్మా, అందుకే ఇవ్వలేదు” అంది

“ఎందుకివ్వలేవు?” అంది ఆశ్చర్యముగా.

“చెల్లికి, నీకు పళ్లు లేవు కదా” అంది.

“మిగతా వాళ్లకి?” అంది నవ్వు కనబడకుండా.

“పిన్నికి జలుబు చేసింది. జలుబు చేస్తే జామకాయ తినకూడదని అప్పుడు చెప్పావు కదా.. నాన్న, బాబాయి ఇంటిలో లేరు. వాళ్లకి అంత ఇష్టం కూడా కావు జామకాయలు.”

“అమ్మకివ్వలేకపోయావా?” అంది కోపం, నవ్వు దాచుకుంటూ.

“అమ్మ కావాలంటే నాది నువ్వు తీసుకో ఫరవాలేదు అంటుంది ఎప్పుడూ. అందుకే ఎవ్వరికీ ఇవ్వలేదు.” అంది.

“మరి అన్నీ తినేసావా ఒక్కసారే? కడుపు నొప్పి రాదూ” అంది కోపంగా.

“అన్నీ తినలేదులే. దాచుకున్నా. రోజు కొకటి తింటాలే”

“ఎక్కడున్నాయి ఫ్రిజ్‌లో లేవే” అంది అమ్మ.

“ఫ్రిజ్‌లో ఉంటే అన్న మళ్ళీ అడుగుతాడు కదా, అందుకే ఎవరూ తియ్యని చోట దాచా”.

“ఎక్కడ?”

పరిగెత్తుకెళ్లి పూజగదిలో నాన్నమ్మ మడి పంచ తెచ్చి౦ది.

“ఇది అయితే ఎవరూ తియ్యరుగా” అంటూ పంచ నేలపై దిమ్మరించింది.. దొర్లుకుంటూ పడ్డాయి గదిలో కాయలు.

Exit mobile version