Site icon Sanchika

మా బాల కథలు-18

[dropcap]బా[/dropcap]ల అందమైన ఎనిమిదేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

బాల బారేజ్

ఆ రోజుతో బాల పరీక్షలు ఆఖరు. ఊపిరి పీల్చుకుంది అమ్మ, బాల బాగానే చదువుతుంది గానీ, అది చదివేది వేరు రాసేది వేరు ఒక్కోసారి. రాసే వేళకి తన మూడ్ ఎలా ఉంటే అలా రాస్తుంది జవాబు తెలిసినా..

కానీ మందలిస్తే ఇంటిలో ఎవరూ ఊరుకోరు. మార్కులు బాగా రాకపోయినా తననే అ౦టారు సరిగా నేర్పలేదని..

తండ్రి వచ్చాడు ఆఫీస్ నుంచి. కాఫీ తాగాక బాలని ప్రశ్నాపత్రం తెమ్మన్నాడు. అది శ్రీదర్ (బాల తండ్రి) అలవాటు. పరీక్షలు అయ్యాక వాళ్ళు ఏమి రాసారో అడిగి తప్పు అయితే సరి చేస్తాడు. అప్పుడు తప్పు రాసినా కనీసం తరువాతైనా సరి అయిన సమాధానం తెలుసుకుంటే బాగుంటుంది అని నాన్న ఉద్దేశం. బబ్లూవి బాబాయి చూస్తున్నాడు.

ఈసారి బాల బాగానే రాసింది. ‘అమ్మయ్య’ అనుకున్నాడు నాన్న.

“కృష్ణా బారేజ్ ఎక్కడుంది?” అడిగాడు నాన్న చివర ప్రశ్నఅడుగుతూ..

“నరసాపురం” అంది బాల. అది తమ ఊరే.

“అదేమిటి మొన్ననేగా విజయవాడ వెళ్లావు. కృష్ణా బారేజి చూసావు కూడా; అలా ఎలా తప్పు రాసావు?” అన్నాడు చిరు కోపంగా.

“ఎలాగూ ఇక్కడికే వస్తుందిగా”

“ఇక్కడికి ఎలా వస్తుంది?”

“ఆ అది మనకి కావాలి. అత్తను చూసి వస్తూ౦డవచ్చుకదా”.

“కానీ ఇక్కడికి ఎలా వస్తుంది?”

“బాబాయ్ అన్నాడుగా, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకో అని” అంది.

నాన్న మనసు గతంలోకి వెళ్ళింది.

బాల, బాల అమ్మ పెళ్ళికి వెళ్ళారు విజయవాడ. అది శ్రీధర్ అత్తగారి ఊరు కూడా. ఈ మధ్యనే బావమరిది ఉద్యోగ రీత్యా వచ్చారు వాళ్ళు. శలవలు లేక నాన్న వెళ్ళలేదు.

అయితే బాల లేక ఇల్లు చిన్నబోయింది. శ్రీధర్ కూతురి కోసం బెంగ పెట్టుకున్నాడు కూడా. శాంతా, బాలా ఈ రోజు తిరిగి వస్తున్నారు. అందుకే శ్రీధర్ బాల కిష్టమైన ఐస్ క్రీం తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టాడు. సినిమా టికెట్స్ తెప్పించాడు..

ఇంతలో ఒ౦టెద్దు బండి ఇంటిముందు ఆగింది. అందరూ బయటికి వచ్చారు. శ్రీధర్ బండి దగ్గర కెళ్లాడు.

‘నాన్నా’ అంటూ ఒక్క గంతులో మీద కురికి తండ్రిని కావలించుకుంది బాల. బాబాయి పెట్టె దింపాడు. తోటికోడలు శాంత వంక పలకరింపుగా నవ్వుతూ చూసింది.

అందరూ లోపలికి వచ్చారు.

“కొత్త ఊరు బాగుందా?” అడిగాడు శ్రీధర్. “ఏమి చూసావు” అడిగాడు ముద్దుగా.

“దుర్గ గుడి, కృష్ణా బారేజి చూసాను అంతే. ఎక్కడికైనా వెళ్దామంటే అమ్మ రాలేదు. అమ్మమ్మ, పిన్నిల తోటి కబురులు చెబుతూ కూర్చుంది” అంది కినుకగా.

“మొదలెట్టావ్ చాడీలు” అంది చిన్నగా నెత్తిమీద మొత్తుతూ అమ్మ.

“నాన్నా, బారేజి అంటే ఏమిటి?” అడిగింది.

“ఆనకట్ట అంది అత్త. అంటే” అడిగింది మళ్ళీ.

“ఏదైనా నది ఉంటుందా. అవతలి వైపు వేరే ఊర్లు, పొలాలు ఉంటాయి కదా. చుట్టాలు కూడా ఉంటారు కదా. చూడటానికి వెళ్ళాలంటే నది దాటాలంటే బస్సులు, రైళ్ళు లేదా నడిచి వెళ్ళటానికి అన్నమాట”. అన్నాడు సింపుల్‌గా నాన్న.

“మరి మనూరిలో లేదేమి? మన౦ అత్తను చూడటానికి వెళ్ళే వాళ్లము కదా ఎప్పుడంటే అప్పుడు. అది నాకు కావాలి” అంది హఠం చేస్తున్నట్లు.

బాల పెద్దత్త ఉండేది అంతర్వేదిలో. అప్పట్లో వంతెన లేదు.. బాలకి నీళ్ళంటే భయం. పడవ, లాంచీ లాంటివి ఎక్కదు.

బాలని పెద్దత్త ఎక్కువ ముద్దు చేస్తుంది, అందువల్ల బాలకి పెద్దత్త అంటే ఇష్టం.

అందుకే తమ ఊరిలో బారేజ్ కావాలని ఏడుపు మొదలెట్టింది.

“ఈసారి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చెయ్యవే మన ఊరికి” అన్నాడు బాబాయ్. దాని ఏడుపు భరించలేక నవ్వుతూ.

అదీ సంగతి.

“ఎలాగు శలవలకి వెడతాము కదా, ఎలాగూ మనూరు తెచ్చేస్తాము కదా అని రాసాను” అంది బాల.

Exit mobile version