Site icon Sanchika

మా బాల కథలు-21

[dropcap]బా[/dropcap]ల అందమైన ఎనిమిదేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

బాల – పాపం అమ్మ

రోజూ ఈ పాటికి “ఇంకా జడలేయ్యలేదు, డబ్బా సద్దలేదు, ఆలస్యమైతే మా టీచర్ తిడుతుంది” అంటూ గంతులేసే బాల చడీ చప్పుడు లేకపోవటంతో అమ్మ ఇల్లంతా వెతికి పెరోట్లోకి వచ్చింది.

అక్కడ తనకంటే కొంచెం బరువు తక్కువున్న కోడిని చంకన పెట్టుకుని, అది జారిపోవటానికి చూస్తుంటే, గట్టిగా అదుముకుంటూ పెరడంతా కలయ చూస్తోంది బాల.

“ఆ కోడినెందుకే అలా చంకనేసుకుని తిరుగుతున్నావు? అది పొడుస్తుంది. వదిలెయ్యి” అంది గాబరాగా, చిరాగ్గా శాంత.

“ఉష్. మెల్లిగా. వాళ్ళు వింటారు” అంది పక్కింటి వైపు చూపిస్తూ బాల.

“వినటం ఏమిటే? వాళ్ళదేగా! వాళ్లకి ఇవ్వవా? వాళ్ళు వినటం మాట అలా ఉంచి, నాన్నమ్మ చూసిందంటే వీపు పగల గొడుతుంది.. వాళ్లకి ఇచ్చిరా.. లేదంటే ది౦పేసెయ్యి.. అదే వెళ్లిపోతుంది” అంది.

“అబ్బ మెల్లిగా మాట్లాడమ్మా. ఇచ్చేస్తాలే సాయంత్రం.”

“సాయంత్రమా? ఎందుకు సాయంత్రం వరకు? అప్పటివరకు దీని ఎక్కడ పెడతావు? దీన్ని ఎవరు చూస్తారు? కూసిందంటే పక్కవాళ్ళు వినరూ? నాన్నమ్మ వింటే నీకే కాదు, నాకూ చివాట్లే”

“అందుకేగా ఎవరూ చూడకుండా, కూత వినబడకుండా దూరంగా ఉంచాలని మంచి చోటు కోసం చూస్తున్నా” అంది కలయచూస్తూ.

శాంత విచిత్రంగా చూసింది “నీకేమైనా పిచ్చా? దాన్ని దాచటం ఏమిటి? అసలు ఎందుకు దాచటం? అది పక్కింటి వాళ్లకు తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది? ఎత్తుకోచ్చామని అనుకోరూ?”

“నేనేమీ ఎత్తుకు రాలా, అదే వచ్చింది” అంది పౌరుష౦గా.

“అయినా వెంటనే వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయ్యలిగా! వాళ్ళు వెతుక్కోరూ? అందులో వాళ్ళింటికి చుట్టాలు వచ్చారు కూడా.”

“అందుకేగా ఇది మని౦టి కొచ్చేసింది” అంది.

“ఏమి మాట్లాడుతున్నావే అర్థం లేకుండా.”

నిజంగానే శాంతకి అర్థం కావటం లేదు బాల చెప్పేది.

“అబ్బా. అప్పుడు బాబాయ్ ఏమన్నాడు అంకుల్‍తో” అంది.

“ఏమన్నాడు? గుర్తులేదు. అయినా నాకు చాలా పనుంది.. త్వరగా పద. నిను పంపిస్తే గాని నాకు పనులు కావు” అంది చిరాగ్గా..

“నేను ఈ రోజు బడికి వెళ్ళను. నువ్వు పనిచేసుకో. బాబాయ్ అలా చెప్పాడుగా. దీన్ని వదిలేసి ఎలా వెళ్ళను?” అంది.

“ఏమన్నాడే బాబాయి త్వరగా చెప్పు.. బడికి వెళ్ళకపొతే మీ పంతులమ్మ ఊరుకోదు. నాన్నా ఊరుకోరు” అంది.

“వీళ్ళ కోడి ఒకటి ఎప్పుడూ మనింటిలో తిరుగుతుంటే అంకుల్ ఏమన్నారు?”

శాంతకు గుర్తు వచ్చింది.

పక్క ఇల్లు అసలు తమ చుట్టాలదే.. అందుకే ఖర్చు కలిసి వస్తుందని చుట్టుగోడలో మధ్యది కట్టుకోలేదు (ఇప్పుడు కట్టాలి).

కానీ ఆయన భార్యకు చాలా జబ్బు చేయటం వల్ల ఇల్లు అమ్మి, పట్నం తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ త్వరగా ఎవరూ కొనలేదు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడున్న వాళ్ళు వ్యాపారం కావటం వల్ల వెంటనే ఎక్కువ డబ్బు ఇచ్చి కొనేసారు. ఆయనకున్న వ్యాపారాలలో కోళ్ళ వ్యాపారం ఒకటి..

అయితే ఆ కోళ్ళు మధ్య గోడ లేకపోవటం తోటి, వీళ్ళ వైపు కూడా వచ్చేవి ఎక్కువగా..

బహుశా అత్తగారు పెరటి అరుగు మీద కూర్చుని బియ్యములో ఏరి పడేసే వడ్లు, అలాగే చివరలో పశుపక్షాదులు ఆశతో వస్తాయని ఆకుల్లో మిగిలించే కొంచెం అన్నం (పూర్వం అలా చేసేవాళ్ళు) కూడా కారణం కావచ్చు.

ఒకసారి అలా వచ్చిన కోడిని తీసుకెళ్ళటానికి వచ్చిన ఆ ఇంటాయన “ఏమిటో మా కోళ్ళు ఎప్పుడూ మీ ఇంటిలోనే ఉంటాయి” అన్నాడు వేళాకోళంగా.

అప్పుడు మరిది “మీ ఇంటిలో ఉంటే కూరో, పచ్చడో అయిపోతామని భయమేమో” అన్నాడు తాను కూడా వేళాకోళంగా, దానికి సమాధానంగా నవ్వుతూ.

అదన్నమాట ఇప్పుడు బాల ప్రవర్తనకి కారణం.

‘అయితే ఇప్పడు ఏమి చెబితే బాల కోడిని వదిలేసి, ఎవరితోనూ మాట రానీకుండా బడి కెళ్తుంది’ ఇప్పుడు ఇది అమ్మ సమస్య. పాపం అమ్మ.

Exit mobile version