మా బాల కథలు-6

0
6

[dropcap]బా[/dropcap]ల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

నాన్నా పెళ్ళెప్పుడు?

బాల నాయనమ్మ కొంచెం విచిత్ర స్వభావం కలది, నిక్కచ్చిగా ఉంటుంది. పెద్ద వాళ్ళయినా సరే, చిన్న వాళ్ళయినా సరే. తప్పు చేసినా, సరిగా చేయకున్నా ఊరుకోదు.

పెద్ద వాళ్ళు అయితే ఇంత పెద్దయినా తెలుసుకోకపొతే ఎలా అంటుంది. చిన్న వాళ్ళు అయితే మొక్కై వంగనిది మానై వంగుతుందా అంటుంది. అందుకని ఎవరికైనా శిక్ష తప్పదు కాబట్టి నాన్నమ్మ అంటే అందరికి భయమే.

ఆ రోజు బాలా హోం వర్క్ చెయ్యకుండా ఊరికే తల్లిని విసిగిస్తోంది. ఆటలాడుతోంది. చూస్తున్న నాయనమ్మకి కోపం, విసుగు వచ్చాయి.

“దీనికి చదువు రాదు గానీ, త్వరగా పెళ్ళి చెసేయ్యండి. పద పనైనా చేసికోవచ్చు” అంది లేచి నిలబడుతూ.

తల్లి కూడా లేచింది.

“అలాగే ఆడు హోంవర్క్ చేయకుండా. రేపు వచ్చి టీచర్ తిట్టిందని ఏడుస్తావు” అంటూ లోపలి కెళ్ళింది నాయనమ్మతో పాటు.

“అక్కా పెళ్ళంటే ఏమిటి?” అడిగింది బాబాయ్ కూతురు నీలిమని.

“అప్పుడు చూసాముగా అత్తది అయింది” అంది నీలిమ.

“ఎప్పుడు” అంది

“అదే అప్పుడు మనింటికి బోలెడు మంది వచ్చారు. నాన్నమ్మ మనిద్దరికీ పట్టు లంగాలు కుట్టించింది” గుర్తు చేసింది.

“అవును అప్పుడు బోలెడు లడ్డూలు కూడా తిన్నాము కదా” అంది.

“అవును”

“మావయ్య నగలు కూడా వేసాడు అత్త మెడలో”

“అవును అదే”

తండ్రి ఇంటికి వచ్చాడు. పడుకున్న బాలని చూసి “చిట్టి తల్లి అప్పుడే పడుకుందేమి ఈ రోజు” అన్నాడు. అతను వేరే ఊరిలో ఉద్యోగం. రాగానే బాలని చూసి మాట్లాడకపోతే తోచదు.

“నేనేమి పడుకోలేదు. నీ కోసమే చూస్తున్నా” అంది లేచి తండ్రి దగ్గరకు వస్తూ.

“ఎందుకురా?” అన్నాడు ముద్దుగా.

“నా పెళ్ళి ఎప్పుడు చేస్తావ్” అడిగింది సీరియస్‌గా

“ఎందుకు?”  అడిగాడు ఆశ్చర్యముగా నవ్వుతూ.

“పెళ్ళయితే కొత్త బట్టలొస్తాయి, నగలొస్తాయి, స్వీట్లు బోలెడు తినచ్చు.. స్కూల్‌కి వెళ్ళక్కర లేదు. హోం వర్క్ ఉండదు. టీచర్ తిట్టడు” అంటూ, “ఇంకా ఇలా దా” అని తండ్రిని ఒంగోమంది. చెవిలో “నాన్నమ్మ తిట్లు కూడా ఉండవు కదా” అంది రహస్యముగా.

“సరే చేస్తాలే” అని నవ్వుతూ స్నానానికి వెళ్ళాడు.

ఆ తరువాత నాలుగైదు సార్లు బాల అడిగినా తండ్రి పెళ్ళి చేయలేదు.

అమ్మ నడిగితే నాన్నని అడగమంటుంది

నాన్న సరే నంటాడు, నవ్వుతాడు. కానీ చెయ్యడు. ఈ సారి మాత్రం “పెళ్ళి చెయ్యాలంటే డబ్బులు కావాలిగా. కొన్నాళ్ళు ఆగు” అన్నాడు

“నా దగ్గరున్నాయిగా” అంది

“ఎన్నున్నాయి?” అడిగాడు గట్టిగా నవ్వుతూ

“8 రూపాయలు “అంది రహస్యముగా.

“సరే దాచు” అన్నాడు ఇంకా ఘట్టిగా నవ్వుతూ వెళ్ళిపోతూ. నాన్నే కాదు అక్కడున్న పిన్ని, బాబాయ్, అమ్మా కూడా నవ్వారు.

బాలకి ఇంకా కోపం వచ్చింది. తనమాట వినలేదు. సరే. కానీ నాన్నమ్మే చెప్పిందిగా “త్వరగా పెళ్ళి చేసేయండి” అని. అయిన వినటంలేదు.

ఎప్పుడూ నాన్నమ్మ ఏది చెప్పినా వెంటనే చేసేస్తాడు మరి. త్వరగా పరీక్షలు వచ్చే లోపు చేసేస్తే బాగుంటుంది కదా, చదవక్కర లేదు హాయిగా.

నాన్నమ్మ నిద్రపోతోంది. నాన్నమ్మ రోజూ అంతే. త్వరగానే నిద్ర పోతుంది.

“రేపు నాన్నమ్మకే చెప్పాలి నాన్న నీ మాట కూడా వినటం లేదు చూడు. నువ్వే పెళ్ళి త్వరగా చేయించు పరీక్షల లోపు” అనుకుంది నిద్ర పోబోతూ బాల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here