Site icon Sanchika

మా బాల కథలు-8

[dropcap]బా[/dropcap]ల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

బాల మడి

కుక్క పిల్ల అరుపులు విని ఏమయ్యిందో అని పెరట్లోకి వచ్చిన అమ్మకి వంగి నిలుచుని కుక్క మొహంలోకి తొంగి చూస్తూన్న బాల కనబడింది.

“ఏమైందీ? ఎందుకలా చూస్తున్నావు? దాన్నేమీ చెయ్యకు. కరుస్తుంది. నువ్వు రా. స్కూల్‌కి టైం అయ్యింది” అంది.

“ఉండమ్మా, అసలే ఇది మూతి కడిగించుకోవటం లేదు” అంది బాల చికాగ్గా.

“మూతి కడిగించుకోవటము లేదా? అసలెందుకు నువ్వు దాని మూతి కడగటం” అడిగింది ఆశ్చర్యంగా.

“ఇలారా” పిలిచింది బాల.

అమ్మ వచ్చింది. “చూడు. దాని మూతి చూడు” అంది బాల.

వాచిందో, లేక దెబ్బ తగిలిందో అని చూసిన అమ్మకి ఏమీ కనిపించలేదు.

“ఏమి? ఏమయ్యింది, బానే ఉందిగా” అంది.

“బానే ఉందా? అదేమిటి? మెతుకులు లేవు?”

“ఉంటే? ఇప్పుడేగా అన్న౦ వేసాను.. తింది”

“ఉంటే అంటావేమిటమ్మా. మొన్న చెల్లి మూతి సరిగ్గా కడుక్కొకపోతే నాన్నమ్మ ఏమంది?”

శాంతకి గుర్తు వచ్చింది.

మరిది కూతురు ఏది తిన్నా మూతి సరిగా కడిగించుకోదు. లేదంటే నేనే కడుక్కుంటానని గొడవ చేస్తుంది. ఎప్పుడు సగం ఎంగిలి మూతితో తిరిగే దాన్ని చూస్తే అత్తగారికి చిరాకు.

అత్తగారికి అసలే మడి ఎక్కువ. అందుకని దాన్ని కొంచెం భయపెటటానికి ఎంగిలి చెయ్యి, మూతి సరిగ్గా కడుక్కొకపోతే అంటూ, ఎంగిలి అనీ, మడి పాటించక పోతే, అలా ఉంటే దేముడు ముళ్ళు గుచ్చుతాడని భయ పెట్టింది. కానీ నాన్న మాత్రం చిరాకు పడ్డాడు.

“ఏమిటమ్మా నీ మడి,చాదస్తాలన్ని పిల్లలకు నేర్పుతున్నావు” అన్నాడు.

కానీ అత్తగారు అప్పటి మనిషి కదా. ఆచారాలు అంత త్వరగా వదులుకోలేదు. అసలు ఈ కుక్కపిల్లలు అవీ కూడా ఆవిడకి ఇష్టం లేదు. కానీ అదే ఒకరోజు ఎలానో వచ్చింది.

అరుస్తుంటే అన్న౦ వేసారు, అప్పటినుంచి ఇల్లు వదలటం లేదు. కానీ పెరట్లోనే తిరగాలని అత్తగారి ఆదేశం. అలాగే జరుగుతోంది.

పెరుగుతున్న వాతావరణం వల్లనో, జీన్స్ వల్లనో బాలలోను కొంచెం మడి, ఆచారాలు కనిపిస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు.

“ఐడియా” అంటూ, అమ్మ “ఏమిటీ” అని అడిగే లోపలే పరిగెత్తింది. ఓ చెంబుతో నీళ్ళు తెచ్చి దాని మూతి మీద పడేలా విసిరికొట్టింది. అది కుయ్యోమంటూ స్పీడ్‌గా వీధిలోకి పరిగెత్తింది. అదృష్టం కరవలేదు.

శాంత గుండె దడ తగ్గలేదు.

“దా. స్కూల్ టైం అయ్యింది” అంది బాల తల్లి చెయ్యి పట్టి లాగుతూ.

“ఏదీ కుక్కపిల్ల” అడిగింది.

“వెళ్లిపోయింది. కానీ ఫరవాలేదులే” అంది ఆనందముగా.

“ఏం?” అంది.

“మెతుకులు పోయాయిగా”

“ఏమిటా పిచ్చి పనులు? అది కరవదూ” అంది కోపముగా.

“పాపం మరి దాని మూతికి, దేముడు ముళ్ళు గుచ్చితే ఎలా తీసుకుంటుంది? చేతులు లేవుగా” అంది బాల లోపలి నడుస్తూ.

అమ్మకి ఏమి చెప్పాలో తెలియలేదు. అమ్మకి మరో సమస్య వచ్చింది జంతువులకి మడి ఆచారం అక్కరలేదని, దానికి అర్థమయ్యేలా, అదీ అత్తగారు నొచ్చుకోకుండా, ముఖ్యముగా, భర్తకి తెలియకుండా చెప్పటం ఎలా?

Exit mobile version