మా బాల కథలు-9

0
4

బాల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

బాల… పాలవాడి గోల

“అమ్మా… పాలూ” పిలిచాడు పాలవాడు. ఎవరూ పలకలేదు.

మళ్ళీ కొంచెం గట్టిగా పిలిచాడు. కానీ ఎవరూ రాలేదు. పలకలేదు

బాల హాలులో కూర్చుని బొమ్మలు ఆడుకుంటోంది..

“బాలమ్మ… అమ్మ లేదామ్మా..”

“ఉంది, వంట చేస్తుంది”

“పిన్నమ్మ….”

“పప్పు రుబ్బుతోంది.”

“నాన్నమ్మ గారు…

“పూజ చేస్తోంది చాలా… ఇంకా వివరాలు కావాలా. అసలే మగ పెళ్ళివారు వచ్చేస్తున్నారు” అంది గాభరాగా పెళ్లికి బొమ్మలు సద్దుతూ.

“అందరూ ఇంట్లోనే ఉన్నారా….” అడిగాడు సందేహం చాలక.

“అందరూ ఇంట్లోనే ఉన్నారు. అయినా ఆడవాళ్లు పని మానేసి పొద్దునే ఎక్కడికి వెళ్తారు” అంది ఆరిందాలా.

“మరి ఎవరూ రారేమి” అని మరోసారి గట్టిగా పిలిచాడు. ఈసారీ ఎవరూ పలకలేదు.

“బాలమ్మా. అందరూ పనిలో ఉన్నట్లు ఉన్నారు. నువ్వు తేమ్మా గిన్నె” అన్నాడు.

“నేను తేను. చూడటం లేదు? నేను ఆడుకుంటున్నాను కదా! అయినా వినబడే ఉంటుంది. వస్తారు ఎవరో ఒకరు” అంది.

ఈసారి పాలవాడికి కూడా బాల తేనని అనేసరికి కోపం వచ్చింది

“పా…లూ…” అరచినట్లుగా పిలిచాడు.

ఈసారి ముగ్గురూ వచేసారు మూడు గిన్నెలతో.

పప్పు రుబ్బుటున్న చేత్తో పిన్ని, జపమాలతో బామ్మా, గరిటతో అమ్మ, ఎడం చేతులో గిన్నెలతో..

“ఎందుకంతలా అరుస్తున్నావు మెల్లగా పిలవచ్చుగా” అంది అమ్మ చికాగ్గా. అమ్మకు ఎవరూ గట్టిగా మాట్లాడటం ఇష్టం ఉండదు.

“పిలిచానమ్మా మెల్లిగానే నాలుగు సార్లు. ఇది అయిదో సారి. వేరే ఇళ్ళ వాళ్లు కోపం అవుతారు కదా తొందరగా పోకపోతే అందుకే…” అన్నాడు వినయం చూపిస్తూ మెల్లిగా.

“అయ్యో.. వినబడలేదే. అయినా బాలా ఇక్కడే ఉన్నావుగా. వినలే? చెవుడు అనుకుంటారు. పోయించుకోలేక పోయావా” అంది నొచ్చుకుంటూ అమ్మ.. అమ్మకు ఎవరూ ఇబ్బంది పడటం ఇష్టం ఉండదు. అదీ తన మూలముగా.

“వినటం కాదమ్మా. నేను గిన్నె తెమ్మంటే తేను అన్నారు కూడా” అన్నాడు కంప్లైంట్ లాగా.

“అవునా. బాలా తప్పు కదూ.. అతను వేరే ఇళ్ళకు వెళ్లాలి కదా. ఇదివరకు మేము పనిలో ఉంటే పోయించుకునే దానివి కదా. ఈ మధ్య నీకు గారం ఎక్కువయిపోయింది. ఎంతసేపు అల్లరి. లేకుంటే ఆటలు” అమ్మ మందలించింది. పాలవాడి చేత మాట పడటం పిన్నికి కూడా ఇష్టం ఉండదు. కానీ బావగారి కూతురిని ఏమీ అనలేదు కదా అందుకని ఊరుకుంది.

“అవునమ్మా దీనికి బద్ధకం పెరిగింది. ఇంకా పోతే దాని పనులన్నీ కూడ నాకు అంట కడుతున్నారు చిన్నపిల్ల అంటూ.” అన్నాడు అప్పుడే వచ్చిన బబ్లూ ఉక్రోశంగా.

“ఆపండి నాకు చెముడు లేదు, బద్ధకం కూడా లేదు. బామ్మ నన్ను తీసుకోవద్దని అంది” బాల కూడా కోపముగా.

అమ్మ ఆశ్చర్యపోయింది.

“నాన్నమ్మ ఎందుకు చెబుతుంది”

“అవును చెప్పింది. నేను పోయించుకుంటే చిన్న పిల్లనని తక్కువ పాలు పోస్తున్నాడుట. అందుకని నువ్వు పోయించుకోకు. అడిగినా గిన్ని ఇవ్వకు అంది. అందుకే ఇవ్వలేదు” కోపంగా అంది బాల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here