మా బావి కథ-2

0
2

[ఊరికి కాస్త దూరంగా ఉన్న ఇంట్లో ఉన్న రోజుల్లో ఎద్దడి నీళ్ళ బాధలకి, యామిని అశోక్ గార్లే స్వయంగా బావి తవ్వుకున్నారు. మంచి కోసం సంకల్పం చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకం; తమ మీద తమకున్న భరోసా, మీరు చేయలేరు అనేకొద్దీ పెరిగిన పట్టుదల.. ఇవన్నీ తమ చేత ఇంతటి (ఘన)కార్యం చేయించిందంటున్నారు శ్రీమతి యామినిఅశోక్. ఆ స్ఫూర్తిదాయక ఉదంతాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

ఆశా నిరాశేనా?

[dropcap]“అ[/dropcap]బ్బే, అస్సలు లాభం లేదు. ఇంచి కూడా అక్కడ్నుంచి బండని కదల్చలేము. ఆశ వదిలేసుకోండి” అని చక్కా పోయారు. పాపం మరిది వాళ్ళ బావమరిది ముఖం చిన్నబుచ్చుకుని వెళ్లిపోయారు.

ఇక ఈ బావి విషయం అందరికీ తెలిసిపోయి ఆ దారిన వస్తూ, పోతూ, తొంగి చూడటం.. ‘అమ్మో ఇంత పెద్ద బండ పడిందా. లాభం లేదు పూడ్చేయండి. మీవల్ల ఏమౌతుంది?’ అని నీరుగార్చేసేవారు.

వాళ్లు అనే కొద్దీ బాహుబలిలో పట్టుదల పునాదులు వేసుకుంటోంది. మూడు బ్యాచ్‌ల దాకా రావడం, ఎబ్బే అంటూ పెదవి విరిచి పోవడం. కొందరు నాటు పెట్టి బండని పేల్చమని చెప్పారు.

చుట్టూ ఇళ్లు ఉండేదగ్గర అటువంటివి చేయడం కుదరదని మావారు ఖచ్చితంగా చెప్పేశారు.

ఒక వారం గ్యాప్ ఇచ్చాము జనాలు నోరుమూసేంత వరకు. గట్టిగా సంకల్పించుకుని ఒకరోజు పునః ప్రారంభించాము. ఈసారి పలుగు,  పార, తట్టతో పాటు గన్ను, శానం చేరాయి. ఈయన బావిలో దిగి ఆ పడిన పెద్ద బండకి అక్కడక్కడా చిన్న గాట్లు పెట్టి గన్ను (పెద్ద సుత్తి)తో కొట్టేవారు. బండ చీలిక రాగానే ఉత్సాహంగా సాగించారు పని. ముక్కలు ముక్కలు అయిన రాళ్ళని బకెట్లో వేస్తే పైకి లాగేదాన్ని.

ఒక్కోసారి ఉదయం ఏడు గంటలకి తరవాణి తిని, పనిలోకి దిగితే పన్నెండు వరకు ఏకధాటిగా చేసేవాళ్ళం.

అప్పుడప్పుడు మా మామగారు ఒక చేయి వేసేవారు రాళ్లు లాగేందుకు.

భోజనాలు కానిచ్చి రెండు గంటలకు మొదలు పెడితే సాయంత్రం ఆరు వరకూ తవ్వేవాళ్ళు. మేము కట్టుకున్న రెండు గదులకి ప్రక్కన ఉన్న ఏరియా మొత్తం బావి నుంచి తీసిన మట్టీ, రాళ్ళతోనే లెవెల్ చేశాము.

అప్పుడప్పుడు పెద్ద టేప్ తీసుకుని ఎన్ని అడుగులు తవ్వామని కొలవడం, ముందు కంటే కాస్త లోతు ఎక్కువ అనేసరికి ఆనందంగా.. మరింత ఉత్సాహంగా పని చేయడం. ఇలా జరిగేది.

ఈలోపు నీళ్లతాత నేనూ లాగుతాను మట్టి అంటూ వచ్చేవాడు. వద్దు తాతా అని ఆయన్ని వారించేసరికి

మాకు అలుపు వచ్చేది.

ఆయనకి అర్థం అయిపోయింది. తనకి ఈ పని చెప్పరు అని. అయితే ఆయన ప్రతిరోజు ఎంతో పాజిటివ్‌గా మాట్లాడేవారు. “అశోకయ్యా, నువు తలుచుకుంటే సాధ్యం కానిది లేదు. కానియ్. దిగు, బండ పిండి పిండి అయిపోతుంది.” అంటూ చాలా హుషారుగా మాట్లాడేవాడు.

అదే కాలనీలో ఇంకో ఆయన ఉండేవారు. ఆయన ex ఆర్మీ. మంచి వ్యక్తి. కానీ, ఈయన కష్టపడేది చూడలేక ‘నీవల్ల కాదు అశోక్ వచ్చేయ్ పైకి’ అనేవాడు. ఆయన ఎప్పుడు ఇలా అన్నా బాహుబలికి దెబ్బలు తగిలేవి. ఒక్కోసారి ఆయన గానీ వస్తే పనిమానేసి పైకి వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి.

ఒకరోజు కాలనీలో ఆయన అని చెప్పాను కదా! ఆయన వచ్చి, “ఎందుకు అంత శ్రమ పడతారు. అలవాటు లేని పనులు. ఇంతా చేసినా నీళ్లు పడవుగాక పడవు. ఆ బండ చూశావా ఎంత ఉందో..?” అంటూ పూర్తి నిరాశాజనకంగా మాట్లాడారు.

నీళ్లతాత బంధువు ఒకాయన ఉండేవాడు. ఆయనకి వాచాలత ఎక్కువ. ఈయనతో చేరి అంతే వ్యతిరేకంగా మాట్లాడేవారు.

బాహుబలికి అయితేనేమి? మాకైతేనేమి? ఒళ్లు మండి పోయేది.

మనసులోనే శపథాలు చేసుకునే వాళ్ళం. ఈ బావి నీళ్లు ఖచ్చితంగా త్రాగించాలి ఇలా అన్నవాళ్ళతో అని.

వాళ్ళిద్దరూ ఒకరోజు ఇలా మాట్లాడేసి వెళ్లారు.

మనసంతా బాగా డిస్టర్బ్ అయ్యింది. వాళ్ళు వెళ్లిపోయారు. ఈయన బావిలో రాయి పగలగొట్టే పనిలో ఉన్నారు. వేస్తున్న దెబ్బ సరిగ్గా ఎడమకాలి మడమ మీద పడింది.

చర్మం చిట్లి రక్తం వచ్చింది. లోనికి వదిలిన నిచ్చెన మీదనుంచి పైకి రావడానికి కూడా ఇబ్బంది అయ్యింది.

ఎక్స్‌రేలో ఎముకకి ఏమీ డ్యామేజ్ కాలేదన్నారు.

ఇక లోకుల సంగతి చెప్పేదేముంది.?

ఇక్కడ ఇంకో మంచి వ్యక్తిని గురించి చెప్పాలి.

అతని పేరు మస్తానయ్య.

ఈ మస్తానయ్య.. మా కాలనీ మొదలు పెట్టినప్పుడు క్యూరింగ్ కొరకు ఇళ్ళకి నీళ్లు పొసే పనికోసం కుదిరినవారు. ఆయన భార్య అన్నపూర్ణమ్మ. మా ఇంటికి ఎంతో నమ్మకస్తులైన మనుషులు. ఎంత అంటే, మేము ఊరేళ్తుంటే అన్నీ సర్దుకుని వెళ్లేటప్పుడు తాళం కూడా వేయకుండా వెళ్తాము. వచ్చేసరికి, ఇల్లంతా శుభ్రంగా సర్ది, తుడిచి, వాకిట్లో ముగ్గులు పెట్టి, సిద్ధంగా ఉండేవారు.

రాగానే వంట చేసుకునేంత వెసులుబాటు. బయటికి వెళ్తున్నాము అంటే ఆవిడే నాకు జడ వేసేది. ఇక మస్తానయ్య సంగతి చెప్పనవసరం లేదు. అంత సందడి మనిషి. పండుగ అయితే చాలు, చక్కగా తలస్నానం చేసి, ఉతికి, గంజి,నీలం, పెట్టిన తెల్లటి పంచ, జుబ్బా తొడుక్కుని, కండువా వేసుకుని, నుదుటి మీద విభూది రేఖలు దిద్దుకుని వచ్చేవాడు. పండుగ మామూలు కోసం.

ఆయన అల్లురామలింగయ్య లాంటి ఆకారానికి, షారుఖ్ ఖాన్ ముఖం పెట్టినట్లు ఉండేవాడు. అచ్చమైన నెల్లూరు యాసతో.. నవ్వులు పూయించేవాడు. మావారిని, అశోక్ సార్ అనేవాడు, నన్ను అమ్మాయి అనేవాడు.

ఒకరోజు బావి త్రవ్వుతుంటే వచ్చి కూర్చున్నాడు. ఒక ఆటంకవాది (అడ్డుపడేవాళ్లను మేమిలా అంటాము). వచ్చి, “అనవసరంగా వీళ్ళు ఈ పని పెట్టుకున్నారు. చాతనవుతుందా! వీళ్ళకి..!” అనగానే ఆయనకి చాలా కోపం వచ్చి. “నీకు చాతనయితే నువ్వు రా అబ్బయ్యా, చేసేటోళ్లని చేయనీ. గడ్డి వామి దగ్గర కుక్కలు అవి దినవూ, ఇంకోరిని దిననియ్యవూ. అసలు నీకేం పనీడ, వచ్చిన దారిన జక్కంగపో!” అని గసిరేశాడు. ఆయన మొహం మాడ్చుకున్నాడు.

“అశోక్ సారూ. నువ్వేమీ జంకబాకు. ఏయ్ పోటు. ఎట్టొస్తదంటే.. నీళ్లు.. సుల్తాన్ బాయిల జల.. వొచ్చినట్టు అల్లల్లల్లల్లాడుకుంటా.. వచ్చినట్లోస్తాది. నువ్ కానియ్.

అశోక్ సారూ..! ఈ పనికిమాలినోళ్ళ మాటలినబాక” అనేసరికి పిల్లలికి, మాకూ తట్టుకోలేని నవ్వు వచ్చేసింది. నీళ్లు ఎట్లా వస్తాయి తెల్సా! అల్లల్లల్లల్లా అని వస్తాయి అని తెగ నవ్వుకునేవారు.

అతను, నీళ్ళతాత.. ఇద్దరూ మంచిగా హుషారెక్కించే వాళ్ళు.

కల్మషం లేని ఆ మనుషులు ఇద్దరూ.. తెగ ఉత్సాహ పరిచేవాళ్ళు. నీళ్లతాతయితే, “యామమ్మా.. అశోకయ్యకి రొంత టీనీళ్లు పెట్టు.. ఆ చేత్తోనే మాకూ” అని మొహమాటంగా బుర్ర గోక్కునే వాడు. .,😆.

పెట్టిస్తే మరింత హుషారుగా మాట్లాడేవాళ్ళు.

ఇలా కొన్ని వారాలు, గడిచాయి. దాదాపు ఇరవైమూడు అడుగులు, అంటే తొమ్మిది అడుగుల నుంచి పడిన బండని పగలగొట్టుకుంటూ అంత లోతు, అంటే పద్నాలుగు అడుగులు బండని పగలగొట్టారన్న మాట. ఈ లోపు ముచ్చట పడి నేనూ, ఒకసారి బావిలోకి దిగాను. ఇంకోసారి మా తమ్ముడు దిగాడు.

లోనికి వెళ్తే వెచ్చగా ఉంది. మట్టి వాసన మరింత స్వచ్ఛంగా! బావి గోడ అంచులకు చెవి ఆనించి వింటే.. ఎక్కడో ప్రవహించే జలతరంగిణి.. “అక్కడెక్కడో ఉన్నదానివి ఇక్కడకు వినిపిస్తున్నావు. మరి కంటికి కనిపించవేమి గంగమ్మా! ఇంత శ్రమని వృథా చేస్తావా! ఎందరు వెనక్కి లాగినా నీపైన నమ్మకంతో ఇంత దూరం వచ్చాము. కరుణించవా” అని మనసులో ప్రార్థించుకుని.. పైకి వచ్చేశాము.

ఉబికుబికీ ఉరికురికీ

ఆరోజు సాయంత్రం మావారు బండ పగలగొడుతుంటే చేతికి తడి అంటిందట. ఎవరితోనూ చెప్పలేదు. కామ్‌గా పైకి వచ్చేశారు పని ఆపేసి. ఆయనే నిర్ధారించుకోలేక పోయారట.

రాత్రి భోజనాలు చేసి అందరం వాకిట్లో కూర్చున్నాము కబుర్లు చెప్పుకుంటూ.

ఎక్కువ భాగం బావి ముచ్చట్లే ఉండేవి.

తిథి, వార నక్షత్రాలు గుర్తు లేవుగానీ, చెట్ల నిండుగా విచ్చిన ముద్దబంతి పూల మీద వెన్నెల పడి అద్భుతముగా ప్రకాశిస్తోంది. ఆ చంద్రుడు ఒక్కడే పైన. ఆ వెన్నెల కాంతికి బంతి మొక్కల్లో పదులకొద్దీ పున్నమి జాబిల్లులు పూసినట్లు మెరిసిపోతోంది. కన్నుల పండుగగా ఉంది వాకిలి అంతా. ఇంటి కట్టుబడికి తెచ్చిన ఇసుక గుట్ట మీద కూర్చుని పిచ్చుక గూళ్ళు కట్టుకుని ఆడుకుంటున్నాము.

ఉన్నట్లుండి మావారు టార్చి తీసుకుని రమ్మన్నారు.

అది తీసుకుని నేరుగా బావిలోకి ఫోకస్ చేశారు.

టార్చి లైట్ కాంతి ప్రతిఫలించింది బావిలో.

నీళ్ళొచేశాయి.. అంటూ గట్టిగా అరిచేసరికి, ఈయనకంటే ముందు మా మరిది దిగేశాడు లోనికి.. సంతోషం పట్టలేకుండా ఉన్నాం.

వెనకే ఈయన దిగారు. ఇద్దరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. వాళ్ళు బావిలో దిగేటప్పుడు బండమీద అడుగులు పెట్టారు. నీళ్లు కనిపించాయి.

ఎన్నాళకెన్నాళ్ళకెన్నాళ్ళకీ

ఆ సంతోషానికి విలువ కట్టలేము. శ్రమ ఫలించిందన్న సంతోషంతో చెంబునిండా నీళ్లు పట్టుకుని వచ్చేశారు పైకి. దేవుడి దగ్గర ఆ నీటిని ఉంచి.. అందరికీ తీర్థం లా ఇచ్చారు. కొబ్బరి నీళ్ళలా ఉన్నాయి.

మిగిలిన నీళ్లు కాఫీ పెట్టుకున్నాము.

అప్పటికి రష్బండ పగలు విచ్చి నీరు ఊరుతోందన్న మాట.

రెండో రోజే అసలైన ఇబ్బంది. జాగ్రత్త పడాల్సింది. ఇది పొలాల్లో బావి అయితే మెట్లు పెట్టుకుంటూ త్రవ్వుతారు.

వెడల్పు ఉంటుంది. ఇది చుట్టుకొలత తక్కువ. ఉన్నట్లుండి జల పడితే.. బుగ్గలా చిమ్మితే ఎంత వేగంగా వస్తుందో తెలియదు. ఆలోపు వీళ్ళు పైకి వచ్చేయాలి. భయమూ, సంతోషము, ఆందోళన.. ముప్పేటగా మనసులో పేనుకుంటున్నాయి.

భగవంతుని పై నమ్మకం.

ఉదయం ఆయన ఇష్టదైవం వినాయకుడిని స్మరించుకుని దిగారు.

పరుగెత్తే జింకల్లే ఉరికీ ఉరికీ

బండకు ఉన్న చీలికని పగలగొట్టుకుంటూ సాగించారు. అంతర్లీనంగా ఎటో ప్రవహిస్తున్న గంగమ్మ కరుణించి దిశ మార్చుకుని ఉబికి రావడం మొదలుపెట్టింది.

ఇప్పుడు నా పని మారింది. ఇంతకు ముందు మట్టి,రాళ్లు లాగాను పైకి. ఇప్పుడు ఆ రెండింటి తోపాటు నీళ్లు కూడా చేరింది. ఆ నీళ్లు ఒంపేందుకు ఒక కాలువ తవ్వారు. నీళ్లు ఓంపేసి రాళ్లు, బురదమట్టి వేరే వైపు వేయాలి. ఇది మరింత కష్టంగా ఉండేది, కానీ, ఇష్టం గానూ ఉండేది.

నీళ్లు తీస్తూ ఉంటేనే లోన తవ్వెందుకు వీలుంటుంది.

కొంచెం నీళ్లు అయినా తవ్వడం కష్టం అయ్యేది. కొన్ని వారాల తర్వాత.. నీళ్లు తేటబడటం మొదలు పెట్టింది.

కొన్ని రోజులు వదిలేశాము. అందరూ వచ్చి చూశారు.

ఎట్టాగ అయితేనేం సాధించారు. అన్నారు.

నోటితో ఒకమాట, నొసటితో మరో మాట కూడా అన్నారు. మేమేమీ పట్టించుకోలేదు.

మా చెవుల్లో జల తరంగిణి తప్ప మరోటి లేదు. వినిపించదూ.😀

బావికి అటూ, ఇటూ రాటలు పాతి గిలక వేశాము. బొక్కెన(చేద) వేసి నీరు తోడేవాళ్ళం.

ఆర్థికశాస్త్రంలో చెప్పినట్లు. అవసరాలు, కోరికలు, విలాసాలు.. ఇదీ వరుస.

అవసరం కొద్దీ అంత కష్టమూ చేసి బావి త్రవ్వాము.

నీళ్లు చేదడం కష్టం అయ్యి హ్యాండ్ బోరు పంపు పెట్టించాము. కొట్టడం కష్టమయ్యి మోటారు పెట్టించాము.

కొన్నాళ్ళకు ఎండల మిడిసిపాటుకి గంగమ్మ బయటికి రాలేకపోయింది. అంత కష్టపడి త్రవ్విన బావిని మూసేయలేక అందులోనే ఎనభై అడుగులు బోరు వేయించాము. ఇన్నేళ్ళూ మాకు నీళ్లిస్తూ, మా నందనవనానికి ఎనలేని సేవ చేసేది ఆ బావి నీరే.

ఐదేళ్ల క్రితం అనుకుంటా మున్సిపల్ వాటర్ వచ్చింది.

కండలేరు నీరు.. కణ్వమహర్షి శకుంతలని అత్తారింటికి దుష్యంతుడి దగ్గరకు పంపిస్తూ పెట్టుకున్న కన్నీరే కండలేరుగా మారిందంటారు.

గంటసేపు వదిలే మున్సిపల్ వాటర్ కంటే మేము మాకు స్వశక్తితో తవ్విన బావినీటి మీదే మక్కువ ఎక్కువ.

అందుకే పాతాళ గంగ పైకి వచ్చి మమ్మల్ని ఎప్పుడు పలుకరించినా అప్పుడు ఆమెకు పూజ చేసి, పసుపుకుంకుమలు ఇచ్చి, తాంబూలమిచ్చి, అందరం ఆ గంగమ్మలో బెల్లము నివేదన చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటాము. మొన్న ఏకాదశి నాడు ఇలా పూజచేశాము.. మా బావికి.

ఇదండీ # మాబావి కథ.

(మా ఆడపడుచు వాళ్ళు కట్టుకున్న ఇంటికి ఒక్క బిందె నీళ్లు కూడా బయటినుంచి తెప్పించకుండా అంత నీటిని ఆ గంగమ్మనే ప్రసాదించింది.)

రెండు తాబేళ్ళని కూడా వదిలాము. తర్వాత వాటిని ఎవరో అడిగితే ఇచ్చేశారు.

ఇది నిజమైన మా బావి కథనే.. అక్షరం పొల్లు పోకుండా, ఇంత వివరంగా ఎందుకు రాశానంటే.. మా పిల్లల పిల్లలికి కూడా పూర్తి విషయం తెలియాలని.

బావి కథ ఇంతటితో సమాప్తం.

కానీ, మా బావి మాత్రం నిరంతరం మాకు దాహాన్ని తీరుస్తూనే ఉండాలని ప్రార్థిస్తూ🙏🙏🙏

(సమాప్తం)

కొసమెరుపు..

నీళ్ల తాతకు నీళ్లు మోసే పని తప్పింది. కానీ, ఆయన ఎంత మొహమాట పడినా మేము ఒప్పుకోలేదు. రోజూ భోజనానికి రావాల్సిందే, ఎప్పటిలా జీతం తీసుకోవలసిందే. దాదాపు పదేళ్ళపాటు ఆయన వస్తూనే ఉన్నారు. ఆయనకు ముగ్గురు మనవళ్లు. తాతని అపురూపంగా చూసుకున్నారు. ఆయన్ని తీసుకుని రావద్దు. మీరెవరైనా వచ్చి డబ్బులు తీసుకెళ్లండి అంటే పిల్లలు వచ్చేవారు. వాళ్ళల్లో పెద్దవాడు లీఫ్ ఇయర్‌లో పుట్టాడు. వాడిని మొరార్జీ దేశాయ్ అనే వాళ్ళం.

ఆ నెల తాత పిల్లల్ని బ్రతిమాలి ఒక్కసారి చూస్తాను అందర్నీ అంటూ వచ్చి.. కూర్చొని కాసేపు ఉండి, టీ త్రాగి జీతం తీసుకుని వెళ్ళాడు. అదే ఆఖరు. మరి రాలేదు. అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను చనిపోయాక మీరు జీతానికి వెళ్లకూడదని మాట తీసుకుని మరీ పోయాడుట. 😥.

ఆ మొరార్జీ దేశాయ్ పోయిన సంవత్సరం కనిపించి.. వాడు గుర్తు పట్టాడు మమ్మల్ని. మాకు గుర్తు రాలేదు. ఆటో నడుపుతున్నాడు. ఆటోలో మమ్మల్ని ఇంటిదాకా వదిలాడు. డబ్బులు ఇవ్వబోతే.. ఉంచండి మేడం.. పర్వాలేదంటూ రయ్యి మంటూ వెళ్ళిపోయాడు తాత సంస్కారాన్ని నిలబెడుతూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here