[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘మా దేవుడు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
[మరు జన్మ వున్నదో లేదో.. కానీ మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారం.. పాపం.. పుణ్యం.. విచక్షణను ఎరిగినవారం.. అన్నీ వుండి.. అన్యోన్యంగా వుండే దంపతులకు సంతానం లేదంటే ఏనాటి పాపమో వారి పాలిట శాపంగా మారిందనుకోవలసి వస్తుంది. కృతజ్ఞతా భావం.. ఎంతో గొప్పది.. జీవితాన్ని కల్పించిన కారణంగా.. యజమాని పట్ల విశ్వాసంతో వారి సమస్యను తన రక్తపు ముద్దతో తీర్చే ఔదార్యం.. త్యాగం.. ఎవరికో కోటికి ఒక్కడికే వుంటుందేమో!.. అలాంటి వాణ్ణి దేవుడనడంలో తప్పు లేదుగా!.. కళ్ళకు కనుపించే దేవుడు అతడే!.. రచయిత.]
[dropcap]రా[/dropcap]ఘవరావు శ్రీమంతుడు. అతని భార్య శాంతి.
వారిరువురికి వివాహం జరిగి పది సంవత్సరాలు. ఈ పదేళ్ళలో శాంతి మూడుసార్లు గర్భం దాల్చింది. ఏ జన్మ శాపమో.. ప్రతిసారీ గర్భ విచ్ఛిన్నం జరిగింది. ఆ దంపతులు సంతానం కోసం పుణ్యక్షేత్రాలను దర్శించారు. పవిత్ర నదీ జలాలలో స్నానం చేశారు. ముడుపులు కట్టారు. దానధర్మాలు చేశారు. కానీ ఫలితం శూన్యం.
రాఘవరావు ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు దూరంగా వుంటూ, వున్న పది ఎకరాల భూమిలో వ్యవసాయం సాగిస్తూ.. వూరి అందరికీ ఆదర్శప్రాయంగా మంచి మానవత్వంతో వ్యవహరిస్తూ.. ప్రశాంత గ్రామవాసాన్ని సాగిస్తున్నాడు.
ఆ గ్రామంలో వుండేది మూడు వందల యిళ్ళు.. అందరికీ రాఘవరావుగారి మాటంటే గౌరవం.. మర్యాద. వారి మాటను గ్రామస్థులెవరు జవదాటరు. వారికి వున్న కొరతల్లా సంతానం.
ఆ విషయంలో ఎవరు ఏ సలహా యిచ్చిన గౌరవించి పాటించేవారు ఆ దంపతులు. ఆ యింటికి నమ్మిన బంటు అంజి.
అంజి తండ్రి రాఘవరావు తండ్రిగారైన సత్యానందరావు గారి హయాంలో ఆ యింటి పాలేరుగానే నలభై అయిదు సంవత్సరాలు పని చేశాడు.
అంజికి పదేళ్ళ వయస్సున స్కూలుకు పంపాడు. అతని తండ్రి రంగడు. కానీ.. అంజికి ఆ సరస్వతీ మాత కటాక్షం లభించలేదు. మూడవ తరగతి వరకూ స్కూలుకు వెళ్ళి ఆ తర్వాత మానేసి.. తండ్రితో కలిసి రాఘవరావుగారి యింట్లో పని చేశాడు.
అంజికి పదహారేళ్ళ ప్రాయం. విషజ్వరంతో రంగడు మరణించాడు. రాఘవరావుగారి యింట్లో అంజి తండ్రి స్థానానికి చేరుకున్నాడు.
ప్రక్క వూర్లో అంజి మేనత్త వుంది. భర్త పోయాడు ఆమెకు ఒక కూతురు.. లక్ష్మి. తన అన్న కొడుక్కు తన కూతురికి పెండ్లి చేయాలని లక్ష్మి తల్లి మంగమ్మ నిర్ణయం. అప్పుడప్పుడూ ఆ వూరికి వచ్చి అంజి యోగక్షేమాలను విచారించి వెళుతుండేది. అంజికి మేనత్త అంటే ఎంతో గౌరవం.. రంగడు చనిపోయిన సమయంలో నెల రోజులు అంజి యింట్లోనే వుండి వాడిని ఓదార్చి తనకు తెలిసిన జీవిత సత్యాలను వాడికి చెప్పి వూరట కలిగించింది.
అంజికి యిరవై ఏళ్ళ ప్రాయం.. లక్ష్మికి పదహారు సంవత్సరాలు. యుక్త వయస్సుకు వచ్చి నాలుగేళ్ళయింది.
కూతురికి వివాహం చేయాలని నిర్ణయించుకొన్న మంగమ్మ అంజి ప్రస్తాపాన్ని చేసి.. “లచ్చి!.. నీకు మీ బావంటే యిష్టమేనా!..” అడిగింది.
“ముందు బావకు నేనిష్టమో కాదో కనుక్కో..” అంది లక్ష్మి.
మంగమ్మ ఆ వూరికి వచ్చింది. అంజిని కలిసింది. విషయాన్ని చెప్పింది. “అత్తా!.. నన్ను యింతోణ్ణి సేసింది మా అయ్యగారు!.. నాకు పెళ్ళంటూ జరిగితే ఆయన ఇష్టప్రకారమే జరగాలి. అయినా.. నాకు యిప్పుడప్పుడే పెళ్ళేందత్తా!..” హేళనగా నవ్వాడు అంజి.
“లచ్చికి యీ డొచ్చింది కదరా!..”
“మా అయ్యకు చెప్పు.. మంచి సంబంధం చూస్తాడు” వ్యంగ్యంగా నవ్వాడు అంజి.
రాఘవరావుగారి మాట.. అంజికి వేదవాక్యం అని తెలిసిన మంగమ్మ వారిని కలిసుకొంది.
“దండాలు సామీ!..” చేతులు జోడించింది.
రాఘవయ్య నవ్వుతూ.. “ఏం మంగమ్మ!.. యిలా వచ్చావ్!..” అడిగాడు.
“మీతో ఓ మాట చెప్పాలని వచ్చానయ్యా!..”
“చెప్పు..”
“పిల్ల.. నా కూతురు లచ్చికి యీడు కొచ్చి మూడేళ్ళయిందయ్యా!.. దానికి అంజికీ..”
“పెళ్ళి చేయాలనుకొంటున్నావా మంగమ్మా!” వారి మాటలను.. వరండాలోకి వచ్చిన శాంతి విన్నందున.. నవ్వుతూ రంగమ్మను ఆ మాట అడిగింది. “అవునమ్మగోరూ!..” మెల్లగా చెప్పింది మంగమ్మ.
శాంతి భర్త ముఖంలోకి చూచింది నవ్వుతూ.
“నీవు అంజిని అడిగావా!..” అడిగింది శాంతి. మంగమ్మ తల ఆడించింది.
“ఏం చెప్పాడు?..”
“తన పెళ్ళి.. అయ్యగారే చేస్తారని అన్నాడమ్మా!..” దీనంగా చెప్పింది మంగమ్మ.
“విన్నారుగా!.. మీ నిర్ణయం ఏమిటో చెప్పండి” చిలిపిగా నవ్వుతూ అడిగింది శాంతి.
ఆమె మనోభావాన్ని గ్రహించిన రాఘవరావు.. “రంగమ్మా!.. నేను అంజిగాడితో మాట్లాడుతాను. ఒప్పిస్తాను. సరేనా!..” భార్య ముఖంలోకి నవ్వుతూ చూచాడు రాఘవరావు. శాంతి ఆనందంగా నవ్వింది.
“రంగమ్మా!.. సంతోషంగా వెళ్ళు. త్వరలో ముహూర్తాన్ని పెట్టించి.. అంజికి లచ్చికి పెండ్లి జరిపించే పూచీ నాది” ఆప్యాయంగా చెప్పింది శాంతి. రంగమ్మ ముఖంలో.. ఎంతో సంతోషం. చేతులు జోడించి వారిరువురికి నమస్కరించి ఆనందంగా వెళ్ళిపోయింది.
***
రాఘవరావు రామాలయంలో అంజి లక్ష్మిల వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఊరి జనానికంతా విందు భోజనాలు ఏర్పాటు చేశాడు. అందరూ ఆ దంపతులను మనసారా దీవించారు.
వివాహం అయిన రెండవ రోజున.. పదివేల రూపాయలు అంజికి యిచ్చి తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం పోయి ఆయా దైవ దర్శనం చేసి, వారం రోజులు సరదాగా తిరిగి రండని చెప్పి వారిని సాగనంపాడు.
యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత శాంతి మాట ప్రకారం.. లచ్చి ఆ యింట్లో ఆమెకు సాయంగా పని చేయసాగింది. అంజి తన పాలేరు కార్యక్రమాలను యథావిధిగా నేరవేర్చసాగాడు.
నాల్గవ మారు.. శాంతి గర్భవతి అయింది. అదే కాలంలో లక్ష్మికీ గర్భం నిలిచింది.
శాంతికి రాఘవరావుకు ఒకవైపున ఆనందం.. మరోవైపున యీ గర్భం కూడా గత మూడుసార్లవలే అవుతుందేమోననే భయం..
రాఘవరావు ప్రతినిత్యం ఎంతో భక్తితో దైవాన్ని ప్రార్థించేవారు. తమ చిరకాల వాంఛను తీర్చమని వేడుకొనేవారు. శాంతి తన యిష్ట దైవం అయిన వెంకటేశ్వరస్వామికి ముడుపు కట్టి అంతా సవ్యంగా జరిగితే బిడ్డతో కొండ ఎక్కుతానని మొక్కుంది.
అంజి.. లక్ష్మిని ఎంతో ప్రీతిగా చూచుకొనేవాడు. తన యింట్లో లక్ష్మి చేయవలసిన పనులన్నీ తానే చేసేవాడు. తన యజమానురాలికి గతంలో జరిగిన విషయం అతనికి తెలిసి వున్నందున.. లక్ష్మికి అటూ యిటూ కదలనిచ్చేవాడు కాదు. కానీ లక్ష్మిని.. అతని మాటలకు నవ్వుతూ..
“బావా!.. ఆరోగ్యంతో బిడ్డ పుట్టాలంటే.. కూర్చొని తినకూడదు. నిదానంగా క్రమంగా అన్ని పనులూ కనేవరకూ చేయడం.. తల్లికి బిడ్డకు మంచిది. యివి మా అమ్మ నాకు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు. పాటించడం నా ధర్మం కదా!..” నవ్వుతూ చెప్పేది లక్ష్మి.
ఇరువురికి నవమాసాలు నిండాయి. రాఘవరావుకు శాంతికి ఎంతో ఆనందం.. గర్భం విచ్ఛిన్నం కాకుండా నిలబడి నవమాసములు నిండినందుకు. శాంతి.. లక్ష్మి.. కొన్ని గంటల వ్యవధిలో ఒకే రోజు హాస్పటల్లో చేరారు. రాఘవరావు.. అంజి హాస్పటిల్ వరండాలో ఎంతో ఆత్రుతతో ఫలితాన్ని వినేటందుకు వేచి యున్నారు.
మరుదినం రాత్రి పదిన్నరకు యిరువురికి ప్రసవ వేదన ప్రారంభమయింది. డాక్టర్స్ ముందు శాంతిని పరీక్షించారు. బిడ్డ కడుపులో విపరీతంగా పెరిగినందున.. సాధారణ ప్రసవానికి ఆస్కారం లేదని నిర్ణయించారు.
రాఘవరావు ఎంతో పేరు ప్రతిష్ఠలున్న వ్యక్తి.. పైగా డాక్టర్స్, వారికి బాగా తెలిసిన వారయినందున.. శాంతి కండిషన్‌ను వివరించేదానికి సీనియర్ డాక్టర్ మురారి రాఘవరావును తన గదిలోనికి పిలిచి.. విషయాన్ని విపులంగా చెప్పి ఆపరేషన్ చేయాలని వారి వద్ద నుంచి కాగితంపై సంతకం తీసుకొన్నారు. అయోమయస్థితిలో.. రాఘవరావు కాగితంపై సంతకం చేశాడు.
“నా భార్యను.. బిడ్డను రక్షించండి సార్..” కన్నీటితో బొంగురు పోయిన కంఠంతో చేతులు జోడించాడు రాఘవరావు. డాక్టర్ లోనికి వెళ్ళిపోయాడు. వ్యాకుల వదనంతో రాఘవరావు గది నుండి బయటికి వచ్చాడు. రాఘవరావు ముఖ భంగిమలను చూచి అంజి బెదిరిపోయాడు.
‘నా లచ్చి ఎలా వుందో.. దేవుడా!.. కాపాడు..’ దీనంగా కన్నీటితో మనస్సున తలచుకొన్నాడు.
రాఘవరావు.. అంజి ముఖంలోకి చూచాడు. అతని స్థితీ, తన స్థితిలాగే వుందని గ్రహించాడు. నోరు తెరచి ఏమీ చెప్పలేకపోయాడు. మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు.
యజమాని స్థితిని.. మాట పలుకు లేకుండా వుండడాన్ని చూచి అంజీ భయపడిపోయాడు. అతనూ నోరు కదపలేకపోయాడు.
లోన.. లక్ష్మికి.. సుఖ ప్రసవం జరిగింది. మగబిడ్డ పుట్టాడు.
శాంతికి.. బిడ్డ అడ్డం తిరిగింది. ఆపరేషన్ చేసి బిడ్డను తీయవలసి వచ్చింది.. బిడ్డ ప్రాణాలు పోయాయి. శాంతి మైకంలోకి వెళ్ళిపోయింది.
శాంతికి తగిన ట్రీట్‍మెంటును యిచ్చి ఒక డాక్టర్ నర్స్‌ను ఆమె ప్రక్కనే వుంచి.. డాక్టర్ మురారి తన గదిలోనికి వచ్చి రాఘవరావును పిలిపించాడు. తాను చేసిన విశ్వప్రయత్నాన్ని గురించి వివరించాడు. బిడ్డను కాపాడలేక పోయామని దీనంగా చెప్పాడు.
డాక్టర్ మురారి మాటలు కొంత అర్థమై కొంత కాక పర్యవసానం.. బిడ్డ పోయిందన్న మాటను గ్రహించిన రాఘవరావు భోరున ఏడ్చాడు. సాటి మనిషిగా డాక్టర్ మురారి అతన్ని ఓదార్చాడు.
నర్స్ వరండాలోకి వెళ్ళి అంజి పేరును పిలిచింది. ఓ మూల నేల కూర్చొని వున్న అంజి అశ్రునయనాలతో వులిక్కిపడి లేచి నర్స్‌ను సమీపించాడు. “అంజీ!.. నీ భార్య ప్రసవించింది. బాబు పుట్టాడు. తల్లి బిడ్డ క్షేమం. నీవు వారిని ఒక అరగంట తర్వాత చూడవచ్చు. నేను వచ్చి పిలుస్తాను.” నవ్వుతూ చెప్పి నర్స్ లోనికి వెళ్ళిపోయింది.
డాక్టర్ గారి గది నుంచి ఏడుస్తూ బయటికి వచ్చిన రాఘవరావు.. నర్స్, అంజికి చెప్పిన మాటలను విన్నాడు.
అతని హృదయంలో ఏదో భావన..
ఆ భావనకు మరో పేరు.. ఆశ..
తనకు పుట్టిన బిడ్డ పోయింది. అంజికి పుట్టిన బాబు క్షేమంగా వున్నాడు. తన భార్యకు ఆపరేషన్ జరిగింది. జరిగినా ప్రయోజనం లేకపోయింది. ఆమె మైకంలో వుంది. ఎప్పటికి స్పృహ వస్తుందో!?..
‘స్పృహ వచ్చాక నా భార్య స్థితి ఏమిటి?.. విషయాన్ని విని.. తాను ప్రాణాలతో వుండగలదా!..’
ఆలోచన..
జవాబు.. ‘వుండలేదు. చచ్చిపోతుంది’. ‘శాంతి నా సర్వస్వం.. నా ప్రాణం.. ఆమె చచ్చిపోతే నేను బ్రతకలేను.. నా శాంతి నేను బ్రతకాలి.. యిరువురం బ్రతకాలంటే.. నా శాంతికి బిడ్డ కావాలి.. బిడ్డ.. బిడ్డ!..’
‘అంజికి బిడ్డ వున్నాడు..’
‘ఆ బిడ్డ నా బిడ్డ అయితే!..’
ఆలోచనతో.. పెదవుల మీద వెర్రి చిరునవ్వు..
‘నేను.. శాంతి.. ఆనందంగా బ్రతకగలము..’
‘ఆశ.. యత్నం..’
‘యత్నించాలి.. ప్రయత్నించాలి.. అంజిని అడగాలి..’
‘ఏమని?..’
‘నీ బిడ్డను నాకిచ్చి.. నా భార్య ప్రాణాలను కాపాడమని అర్థించాలి!.. కన్నీరు కార్చాలి.. ఒప్పించాలి’
అది చివరి నిర్ణయం.. హృదయంలో ఆశ.. రాఘవరావు అంజిని సమీపించాడు. భుజంపై చెయ్యి వేశాడు. అతని ముఖంలోకి చూచాడు.
“అయ్యా!.. నాకు బాబు పుట్టాడయ్యా!..” ఆనందంగా చెప్పాడు అంజి. రాఘవరావు తల ఆడిస్తూ.. “విన్నాను అంజి. చాలా సంతోషం రా!..” ఆ క్షణంలో అతని కళ్ళల్లో కన్నీరు.
అతని ముఖంలోనికి చూచిన అంజి.. “అయ్యా!.. తమరు ఏడుస్తున్నారెందుకు?..” ఆశ్చర్యంతో అడిగాడు
రాఘవరావు అంజి చేతిని తన చేతిలోనికి తీసుకొన్నాడు. ముందుకు నడిచాడు. అంజి ఆశ్చర్యంతో అతన్ని అనుసరించాడు.
హాస్పటిల్ బిల్డింగ్‍కు పాతిక అడుగుల దూరంలో వున్న వేపచెట్టు క్రిందికి చేరారు యిరువురు.
అంజి.. యజమాని ఏదో చెప్పాలని అక్కడికి తీసుకొని వచ్చాడని వూహించాడు. రాఘవరావు ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు.
“అంజీ..”
“చెప్పండయ్యా!..”
“మీ అమ్మగారికి బిడ్డ పుట్టి, పోయిందిరా!..” భోరున ఏడ్చాడు రాఘవయ్య.
వారి మాటలు విని ఆశ్చర్యంతో అంజి “అయ్యా!..” అన్నాడు.
“నిజంరా!..” బొంగురు పోయిన కంఠంతో చెప్పాడు రాఘవరావు. అంజి విచారంతో తల దించుకొన్నాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. కొన్నిక్షణాలు వారి మధ్యన మౌనంగా జరిగిపోయాయి.
“అంజీ!..”
“అయ్యా!..”
“నీవు నాకో సాయం చేయగలవా!..”
“అయ్యా!.. నేను మీకు ఏ సాయం చేయగలనయ్యా!..”
“నీవు మీ అమ్మను బ్రతికించాలి!..” దీనంగా చెప్పాడు రాఘవరావు.
“అమ్మ బ్రతకాలంటే!..”
“అది నీ చేతిలోనే వుందిరా!..”
“అందుకు.. నేను ఏం చేయాలో చెప్పండయ్యా. చేస్తాను. మా అమ్మగారు నూరేళ్ళు హాయిగా బ్రతకాలయ్యా!..”
“ఆమె బ్రతకాలంటే!..” ఆగిపోయాడు రాఘవరావు.
“నేనేం చేయాలయ్యా!..” ఆవేశంగా అడిగాడు అంజి.
“నీవు..”
“నేను!..”
“నీ బిడ్డను మీ అమ్మ ప్రక్కకు చేర్చాలిరా!..” మెల్లగా అంజి ముఖంలోకి చూస్తూ చెప్పాడు రాఘవరావు.
అంజి నోరు తెరచి ఆశ్చర్యంతో రాఘవయ్య ముఖంలోకి చూచాడు.
“నీవు నాకు యీ సహాయం చేయాలిరా. యిది మీ అమ్మకు నాల్గవ ప్రసవం. నా వయస్సు యాభై ఆరు. ఆమె వయస్సు నలభై ఎనిమిది. పుట్టిన బిడ్డ చచ్చి పోయిందన్న మాటను మీ అమ్మ వింటే.. తాను బ్రతకదు. గుండె ఆగి చచ్చపోతుంది. నా శాంతి లేకుండా నేను బ్రతకలేనురా” ఏడుస్తూ కన్నీరు కార్చాడు రాఘవరావు.
అంజికి.. తన యజమాని బాధను చూడలేకపోతున్నాడు. అతనికీ ఏడుపొచ్చింది. ఏడ్చాడు.
“అంజీ!.. నీది లక్ష్మిది చిన్న వయస్సు. ఆ దేవుడు దయ తలిస్తే మరో సంవత్సరం లోపల లక్ష్మి గర్భవతి కాగలదు. కానీ.. నా భార్యకు ఆ అవకాశం లేదు. గర్భసంచిని తీసేశారు..” దీనంగా బొంగురు పోయిన కంఠంతో చెప్పాడు రాఘవరావు.
కొన్ని క్షణాల తర్వాత.. అంజి చేతులను పట్టుకొని.. “అంజీ!.. నా భార్య చావు బ్రతుకులు నీ చేతుల్లో వున్నాయి. నీవు తలచుకొంటే నా భార్య బ్రతుకుతుంది. కాదంటే!.. చచ్చిపోతుంది రా అంజీ!..” కన్నీళ్ళతో చెప్పలేక చెప్పాడు రాఘవరావు.
అంజి.. తలపై పిడుగు పడినట్లయింది.
ఆ క్రిందటి వారంలో.. రామాలయంలో హరిదాసుగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
“ప్రతి వ్యక్తీ త్యాగశీలతను కలిగి వుండాలి. త్యాగం భావనకు సమానమైన మరో భావన అంటూ లేదు. ఆ భావన వున్న మనిషి ఎంతో ఉత్తముడనిపించు కొంటాడు.”
పదే పదే గుర్తుకు వచ్చిన ఆ మాటల వలన.. అంజికి తన కర్తవ్యం గోచరించింది. ‘మా అమ్మగారు బ్రతకాలి’ అనుకొన్నాడు. పై పంచతో కన్నీటిని తుడుచుకొని.. వేగంగా హాస్పటల్లోనికి వెళ్ళాడు. నర్స్‌కు చెప్పి తన భార్య మంచాన్ని సమీపించాడు. లక్ష్మి నిద్రపోతూ వుంది. ప్రక్క ఊయలలో బాబు. ఊయలను సమీపించి బాబును చూచాడు..
కొన్నిక్షణాలు..
బాబును చేతికి తీసుకొని తన అమ్మగారున్న గదికి సమీపించాడు. మరో నర్స్ ఎదురయింది. బిడ్డను ఆమెకు అందించి.. “మనం చచ్చేవరకూ యీ విషయం మరొకరికి చెప్పకూడదు. అమ్మా!.. యీ బిడ్డను మా అమ్మగారి ప్రక్కన పడుకోబెట్టండి. నా భార్య బిడ్డను గురించి అడిగితే.. మా అయ్యగారికి అమ్మగారికి పుట్టిన పాప విషయాన్ని చెప్పండి” ఆవేశంగా చెప్పి వేగంగా నడిచి వరండాలోకి వచ్చాడు. నర్స్ అతని చర్యకు, మాటలకు ఆశ్చర్యపోయింది. రాఘవరావు అతనికి ఎదురైనాడు.
“అయ్యా!.. నేను మీ కోర్కెను తీర్చాను. మా అమ్మగారు తప్పక బ్రతుకుతారు. మీరు అమ్మగారు బాబు ఎప్పుడూ ఆనందంగా వుండాలయ్యా!..” ఆవేశంతో గద్గద స్వరంతో చెప్పాడు అంజి.
రాఘవరావు పరమానందంతో అంజికి చేతులు జోడించాడు. ఆనందాశ్రువులు.. అతని కళ్ళ నుండి జలజలా రాలాయి. పరమానందంతో తన భార్య వున్న గది వైపుకు నడిచాడు రాఘవ రావు.
అంజి భార్యను సమీపించాడు. కళ్ళు తెరచి లక్ష్మి ఆనందంగా నవ్వుతూ అతని ముఖంలోకి చూచింది. అతని కళ్ళల్లోని కన్నీటిని చూచింది. ఆత్రంగా ప్రక్కన వున్న ఊయలలో చూచింది. ఆమెకు విషయం అర్థం అయింది. భోరున ఏడ్చింది. అంజి ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని ఓదార్చాడు.
రెండు రోజుల తర్వాత విచారంతో లక్ష్మి.. వారం రోజుల తర్వాత శాంతి ఆనందంగా బాబుతో యిండ్లకు చేరారు. తనకు పుట్టిన బిడ్డ పోయినందుకు లక్ష్మి ఎంతగానో ఏడ్చింది.
అంజి.. లక్ష్మిల మధ్యన.. రెండు వారాలు భారంగా జరిగాయి.
భవంతిలో.. రాఘవరావు శాంతి.. బాబును మధ్య పెట్టుకొని మురిసిపోయారు.
***
“ఏరా! అంజి ఎక్కడ?..” తాను పంపిన మనిషి ఒంటరిగా వచ్చినందుకు అడిగాడు రాఘవరావు.
“అయ్యా!.. నిన్న రాత్రి ఎవరికీ చెప్పకుండా అంజి.. లక్ష్మి వూరు వదిలి ఎటో పోయారటయ్యా!..” వినయంగా జవాబు చెప్పాడు ఆ వ్యక్తి.
ఆ జవాబు విన్న రాఘవరావు ఆశ్చర్యపోయాడు. కొన్ని నిముషాల తర్వాత విచారంగా నవ్వుతూ స్వగతంలో ‘మా దేవుడు వరాన్ని తీర్చి.. వెళ్ళిపోయాడు’ అనుకొన్నాడు. ఆ క్షణంలో వారి కళ్ళు చెమ్మగిల్లాయి.