మా ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) యాత్ర

0
2

[ఇటీవల ద్వారకా తిరుమల దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

మొన్న జనవరి 6న విజయవాడ బుక్ ఫెస్టివల్‌లో జరిగిన ‘సరియైన ఉచ్చారణ’ అన్న పుస్తకావిష్కరణకు సమీక్షకుడిగా, ప్రధాన వక్తగా వెళ్లాను. విశాఖపట్నానికి చెందిన సత్తి సునీల్ రెడ్డి (విశ్రాంత జాయింట్ డైరెక్టర్, సెంట్రల్ ఇంటెలిరెన్స్ బ్యూరో) గారు దానిని వ్రాశారు. మరొక వక్తగా మా మిత్రులు డా॥ జెట్టి యల్లమంద గారు ఆహ్వానితులు.

ఏ సాహిత్యసభకు వెళ్లినా, ఆ చుట్టుపక్కల, 100 కి. మీ. దూరం లోపు, పుణ్యక్షేత్రాలనో, చారిత్రిక ప్రదేశాలనో పనిలో పనిగా చూసి రావడం నాకు అలవాటు. విజయవాడకు ఎలాగూ వెళుతున్నాము, ఏలూరు దగ్గర ద్వారకా తిరుమల క్షేత్రం ఉంది, అక్కడ కొలువై ఉన్న వేంకటేశ్వరుని దర్శించుకుందామని ముందుగానే ప్లాన్ వేసుకొన్నాము. ప్లాన్డ్‌గా లేకపోతే ప్రయాణాలు, యాత్రలు, సౌకర్యవంతంగా ఉండవు కదా! అన్‍ప్లాన్డ్‌గా వెళితే అన్‍లిమిటెడ్ ఇబ్బందులు ఎదురౌతాయి. అందుకే ‘ఉపాయం లేని వాడిని ఊర్లోంచి వెళ్లగొట్ట’మని సామెత!

నేను సికింద్రాబాద్ నుంచి ఉదయం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాను, ఉ॥ 6గంటలకు. స్లీపర్ క్లాస్ లోయర్ బెర్తు. అది నానా స్టాపుల బండి. ప్రతి పావుగంటకు ఒక స్టేషన్‍లో ఆగుతుంది. మా వనస్థలిపురంలోనే విజయవాడ హైవేలో, ఏదో ఒక బస్సు ఎక్కవచ్చు. అదీ ఆరుగంటలు పడుతుంది. హాయిగా కాళ్ళు చాపుకుని విశ్రమించవచ్చు కదా! అని ట్రెయిన్ ప్రిఫర్ చేశాను. ఈ వయసులో బస్సు ప్రయాణాలు చేయలేం సుమండీ!

ఒంటిగంటకు విజయవాడ చేరాల్సిన ‘కృష్ణా’ రెండుంబావుకు చేరింది. దారిలో ఇడ్లీవడ, ఉడకబెట్టిన వేరుశనక్కాయలు, ఆనియన్ సమోసాలు తిన్నాను. నా ఆహార విహారం మీకు తెలిసిందే కదా!

నన్ను రిసీవ్ చేసుకోడానికి నా అభిమాని, పోలీసు ఉన్నతాధికారి శ్రీ మురళీ మోహన్, స్టేషన్‍కు వచ్చారు. తమ పోలీసు వాహనమందు నన్ను మాకిచ్చిన గెస్ట్ హౌస్‌కు తీసుకొని వెళ్లారు.  అది గురునానక్ కాలనీలో, ‘గురుద్వారా’ దగ్గర ఉంది. అక్కడికి దగ్గరలోనే ‘నోవాటెల్’ హోటలుంది.

నేను భోజనం చేయనని, మూడు గంటలు కావస్తోంది, ఏమా తిననని మా మురళికి చెప్పాను. “అయితే ‘పెరుగువడ’ తినండి. లైట్‌గా” అని బలవంతపెట్టాడాయన. తిన్నాను.

మా మిత్రుడు డా. జెట్టి యల్లమంద, నర్సీపట్నం నుంచి, డైరెక్ట్‌గా బస్సులో వచ్చి నోవాటెల్ దగ్గర దిగి, ఫోన్ చేశాడు. గెస్ట్ హౌస్ కేర్ టేకర్ వెళ్లి ఆయనను తీసుకువచ్చాడు. ఆయన ‘నల్లజర్ల’ లోనే కర్డ్ రైస్ తిన్నారట. గ్రంథ రచయిత, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, శ్రీ సత్తి సునీల్ రెడ్డిగారు ఉదయం ‘వందే భారత్’కే వచ్చి, అక్కడే విడిది చేసి ఉన్నారు. వారు మా రూంకు వచ్చి మమ్మల్ని కలిశారు.

కాసేపు విశ్రాంతి తీసుకొని, అందరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరుగుతున్న విజయవాడ పుస్తక మహాత్సవం వెన్యూ చేరుకున్నాము. శ్రీ కేతు విశ్వనాథరెడ్డి సాహితీ వేదికపై, పుస్తకావిష్కరణ జరిగింది. నేను పుస్తకాన్ని సమీక్షిస్తూ, ప్రధాన ప్రసంగం చేశాను. యల్లమంద కూడా ప్రసంగించాడు. సభ విజయవంతమైంది.

“ద్వారకా తిరుమల యాత్ర అన్నావు కదా! దాని సంగతి చెప్పు మహానుభావా?” అంటున్నారా? వస్తున్నా.. అక్కడికే వస్తున్నా.. ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అంత అయిందా! ‘ప్లీజ్ బేర్ విత్ మీ కామ్రేడ్స్’.

ఉదయం ఐదున్నరకు తయారయ్యాము. ముందు సునీల్ గారిని రైల్వేస్టేషన్ దగ్గర దింపాము. ఆయన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‍కు వైజాగ్ వెళ్లిపోతారు

డ్రైవర్‍ను “మాంఛి టీ తాగించురా అబ్బాయి!” అనడిగాము.

“షాలిమార్ టీ ప్యాలెస్ అని రెండు కి.మీ. దూరం సార్. చాయ్ చాలా ఫేమస్. కానీ బస్టాండు మళ్ళీ దూరం” అన్నాడు. అతని పేరు పైడిరాజు. “మాకు తొందరేమీ లేదు. టీ ముఖ్యం!” అన్నా. “చాయార్థం న దూరభూమిః అని విప్రసంహితలో ఉంది మిత్రమా!” అన్నాను మా యల్లమందతో.

అతడు పకపక నవ్వాడు! “శాస్త్రప్రమాణం ఒకటి! అప్పటికప్పుడు సరదాగా, అదీ సంస్కృతంతో కల్పించావే, దటీజ్ దత్తశర్మ!” అన్నాడు.

పైడిరాజు వెనక్కి తిరిగి “నిజంగా సారు ఏదో శాస్త్రం చెబుతున్నాడనుకున్నాసార్. నిన్న బుక్ ఫెస్టివల్‍లో సారు ఎంత బాగా చెప్పినాడు! జోకా?” అని ఆశ్చర్యపోయాడు. “మా సారుకు (మురళీమోహన్) ఈ సారంటే చాలా గౌరవం సార్.” అన్నాడు.

షాలిమార్ టీ ప్యాలెస్ దగ్గర చాలా రద్దీగా ఉంది. బోర్డుమీద రకరకాల టీల పట్టక ఉంది. పైడిరాజు వెళ్లి, టోకెన్ల తీసుకోని వచ్చాడు. డబ్బు ఇస్తే పుచ్చుకోలేదు, మురళీ సార్ ఇచ్చాడట. కారులోకి తెచ్చిస్తానంటే వద్దన్నాము. అలా ‘మజా’ రాదు. ఆ జనంలో, ఎత్తుగా ఉన్న గుండ్రటి బల్ల దగ్గర నిల్చుని, తాగులేనే ‘కిక్కు’ వస్తుంది. దమ్ చాయ్! బంగారు రంగులో పొగలు కక్కుతుంది. హ్యాండిల్ ఉండి, అందమైన, లతలు పువ్వులు ఉన్న గాజు కప్పు తెచ్చాడు. అది రాజవంశీయులు తాగే పానపాత్రలా అనిపించింది నాకు.

మమ్మల్ని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద దింపి వెళ్లిపోయాడు పైడిరాజు. వెళ్లేముందు, వాళ్ల అధికారులకు చేసినట్లు సెల్యూట్ చేసినాడు!

ఏలూరు బస్సులు ఉండే ప్లాట్‌ఫారం నంబరు 1 అని చెప్పారు. మేం వెళ్ళేసరికి ‘ద్వారకా తిరుమల’కు వెళ్ళే డైరెక్ట్ ఎక్స్‌ప్రెస్ బస్ సిద్ధంగా ఉంది. 6.45కు బయలుదేరుతుందని డ్రయివర్ చెస్నాడు. ఇంకా పది నిమిషాలుంది. బ్యాగులు ర్యాక్‌లో పెట్టి, బాత్ రూమ్‌కు వెళ్లివచ్చాం. అది ముఖ్యం కదా!

సీనియర్ సిటిజన్స్‌కు కేటాయించిన సీట్లలో ఇద్దరం కూర్చున్నాం. కండక్టరు వచ్చి, 25% రాయితీ టికెట్లు రెండు ‘కొట్టాడు’. టికెట్లు ఇవ్వరు! కొడతారు! అదేమిటి? అంటే ఆర్.టి.సి. భాష అది! ఎవరి భాష వాళ్లకంటుంది!

టికెట్ మీద చూస్తే దూరం 102 కి.మీ. అని ఉంది. హనుమాన్ జంక్షన్‌లో ఆపాడంతే. తర్వాత ఏలూరు. ఏలూరు తర్వాత నాన్‌స్టాప్. పావుతక్కువ తొమ్మిదికి ద్వారకా తిరుమల చేరాము.

మురళీమోహన్ గారు ద్వారకా తిరుమలలో మా కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. మేం ఏలూరు దాటగానీ, దేవస్థానం ప్రోటోకాల్ ఆఫీసు నుండి ఒకాయన నాకు ఫోన్ చేశారు. అతని గొంతులో వినయం ఉట్టిపడుతుంది.

“సార్! ఎంతవరకు వచ్చారు? సారు మాకు నిన్ననే చెప్పారండి. మీరు కారు పార్కింగ్ లో పెట్టి, ఫోన్ చేయండి సార్! ఎవర్నయినా పంపుతాను”

“మేం విజయవాడనుంచి బస్సులు వస్తున్నాం బ్రదర్” అన్నాను.

ఆయన ఆశ్చర్యపోయాడు! “బస్సు లోనా!” అన్నాడు. అంత పెద్ద పోలీస్ అధికారి రెఫరెన్స్ అంటే కారులో వస్తారనుకున్నాడేమో? మా మురళీమోహన్ అసలు కారునూ, డ్రైవర్‍ను పంపిస్తానన్నాడు. మేమే వద్దన్నాం. మన మీద ఆయనకున్న గౌరవాన్ని మరీ అంతగా ఉపయోగించుకోకూడదు కదా! ప్రోటోకాల్ ఆఫీస్ ఉద్యోగి ఇలా అన్నాడు

“సార్, అయితే మీరు బస్ స్టాండ్ వరకు వెళ్లకండి. గరుత్మంతుని విగ్రహం దగ్గర దిగిపొండి. అక్కడ కొండ మీదికి దేవస్థానం వారి ఫ్రీ బస్సు ఉంటుంది. మా వెహికల్ అక్కడికే పంపుదామంటే.. సమాయానికి లేదు. మీకు లేటవుతుంది..”

“పరవాలేదండి. బస్‍లో వచ్చేస్తాం” అన్నాను.

గరుత్మంతుని విగ్రహం కూడలిలో సమున్నతంగా నిలబడి ఉంది. రెక్కలు ధరించి, వాడి నాసికతో, భక్తి ఉట్టిపడే కళ్లతో, ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు గురుత్మాన్. శ్రీవైష్ణవులు ఆయనను అలా పిలుస్తారు.

“మిత్రమా! ఆకలి!” అన్నాను. మా యల్లమంద అన్నాడు నవ్వుతూ  – “నీ జఠరాగ్ని నిరంతరం ప్రజ్వలిస్తూనే ఉంటుంది! పద! అక్కడ ఏదో టిఫిన్ సెంటరుంది.”

“టిఫిన్ చేసింతర్వాత, లంచ్ వరకు పచ్చి గంగ ముట్టను!” అన్నా భీషణ ప్రతిజ్ఞ చేస్తూ.

“11 గంటలకు మళ్లీ టీ కావాలంటావు. వాడి దగ్గర ఏమైనా కనబడితే తింటావు. నీ సంగతి నాకు తెలియదా?” అన్నాడు మిత్రుడు నవ్వుతూ.

చిన్న హోటలది. ఒక ప్లాస్టిక్ ప్లీటులో చిన్న అరిటాకు ముక్క వేసి, రెండేసి చొప్పన మైసూరు బోండాలు వేసి యిచ్చిందామె. లేత బంగారు రంగులో వేడిగా ఉన్నాయి. ఎలాస్టిక్‌లా సాగక తుంచితే ముక్క వస్తూంది. లోపల పిండి చక్కగా ఉడికింది. కొబ్బరి చట్టి, ఎర్రని అల్లం చట్నీ చేసింది. ఒకాయన, ఆమె భర్త కాబోలు, ఒక మూల బాండీలో పూరీలు వేస్తున్నాడు. చాలా పెద్దవి. రెండు సింగిల్ పూరీలు చెప్పాము. ప్లేటు (2) తినలేమని వాటి సైజు చూస్తేనే తెలిసిపోయింది. టిఫినంతా కలిసి 70 రూ అయింది. చౌక అనిపించింది.

“మిత్రమా! నీది వర్ణనాచాతుర్యమేగాని, భుజించే పరాక్రమం కాదు. చూస్తుంటా కదా! తినేది తక్కువ! తపన ఎక్కువ” అన్నాడు.

నేను నవ్వాను. ఎదురుగా దేవస్థానం వారి ఉచిత బస్సు వచ్చి అగింది. చాలా జనం తోసుకోని ఎక్కుతున్నారు.

“యల్లమందేశ్వరా! అలా మనతో కాదుగాని, ఏకంగా మనమే ఒక ఆటో మాట్లాడుకుని వెళదాం” అన్నాను.

ఒక ఆటోను పిలిచి, కొండమీద ప్రోటోకాల్ ఆఫీసు దగ్గర దింపడానికి ఏం తీసుకొంటావని అడిగాను.

“వందివ్వు బాబాయి!” అన్నాడు. “షేరింగ్ అయితే మనిషికి ఇరవై. పదిమంది నెక్కిస్తాం. మీరు పెద్దోరు కదా! ఆయ్!” అన్నాడు.

సరే అని ఎక్కాము. ఆటో షూట్ రోడ్డు ఎక్కసాగింది.

***

ద్వారకా తిరుమల కొండ చిన్నదే. రెండు మూడు కి.మీ. ఉంటుంది. మెలికలు కూడ అంతగా లేవు. పది నిమిషాల్లో ప్రోటోకాల్ ఆఫీసు దగ్గర ఆపాడు. లోపలికి వెళ్లబోతుంటే, సెక్యూరిటీ వాడు ఆపి, అటు పక్క కిటికీ దగ్గర కంత దగ్గరికి వెళ్లి మాట్లాడమన్నాడు. నేను వెళ్లి నా పేరు చెప్పగానే అక్కడ ఉన్న ఎ.ఇ.ఓ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు) గారు దిగ్గున లేచి, బయటకు వచ్చాడు. సెక్యూరిటి అతన్ని మందలించాడు.

“సారీ సార్ ! లోపలికి రండి!” ఆహ్వానించాడు. తన అసిస్టెంటుతో “దత్తశర్మగారు! సారు విజయవాడనుంచి ఫోన్ చేశారు కదా! రెఫరెన్స్ చూడండి” అన్నారు.

“సార్, రాను రాను జనం పెరుగుతారు. మీరు దర్శనం చేసుకుని కాటేజికి వెళ్లడం మంచిది. తలనీలాలు ఇస్తారా?”

“లేదండి! ఉదయం స్నానం చేసి వచ్చాము. పెద్ద వయసు కదా! టిఫిన్ కూడా చేశాము. డయాబెటిక్స్‌మి. అంతసేపు నిరాహారంగా ఉండకూడదు.”

“అయ్యో! దాని దేముందండి! మనసు ముఖ్యం స్వామివారికి. మీరు విజయవాడ సార్ గారికి గురుతుల్యులని చెప్పారు. మీకు చెప్పగలిగినవాడినా?”

వినయశీలం అలా ఉంటుంది. స్వామివారి తత్త్వాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు!

బ్యాగులు ఆఫీసులో పెట్టించాడు ఎ.ఇ.వో. మా వెంట ఒకతన్ని పంపించాడు. ముందే రెండు జంట గోపురాలు ఉన్నాయి. నల్ల రాతి మీద లేత పసుపురంగులో దేవతల విగ్రహాలు చెక్కారు.

ప్రధాన దేవాలయం అర కి.మీ. మాత్రమే ఉన్నా, వృద్ధులు, వికలాంగుల కోసం బ్యాటరీ కార్లున్నాయి. నైన్ సీటర్లు. అవి ఉచితంగా సేవ చేస్తాయని మా వెంట వచ్చిన కుర్రవాడు చెప్పాడు. అతని పేరు రాఘవ అట. దేవస్థానం సిబ్బంది అందరూ తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. నుదుట గంధం, కుంకుమ.

ఉచిత దర్శనం క్యూలు కిటకిటలాడుతున్నాయి. వంద రూపాయల టికెట్, రెండు వందల రూపాయల టికెట్ దర్శనాలకు వేరే క్యూలున్నాయి. ఒక పెద్ద, విశాలమైన ప్రాంగణంలో క్యూ లైన్ ఎన్నో మలుపులు తిరిగి ఉంది. నిరీక్షించడానికి కుర్చీలు కూడ వేశారు. కొందరు వాలంటర్లు, క్యూ లైన్ల లోని భక్తులకు మంచినీరు అందిస్తున్నారు.

మమ్మల్ని నేరుగా, దాదాపు వంద వీటర్ల పైగా పొడవున్న ముఖమంటపం గుండా తీసుకొని వెళ్లాడు రాఘవ. గోవిందా, గోవిందా! అని భక్తులు చేస్తున్న నామధ్యానాలు! నాతో ఏదో కదలిక ! వైబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి!

మంటపం ఇరవై అడుగుల వెడల్పు ఉంది. రెండు వైపులా నల్ల రాతి అరుగులు కళాత్మకమైన స్తంభాలు! వాటి మీద దశావతారాలు, ఏనుగులు, గుర్రాలు, ఇంకా రకరకాల దేవతామూర్తులు శిల్పాలుగా విరాజిల్లుతున్నారు.

దర్శనం పూర్తి చేసుకొని బయటకువచ్చేవారు ముఖమంటపం గుండా రావాలి. మంటపం పైకప్పుమీద అరడుగుల కొకటి అష్టదళపద్మాలు చెక్కారు.

అప్రయత్నంగా “తండ్రీ! వేంకటనాథా! పాహిమాం!” అని నినదించాను

‘గోవింద గోవింద యని కొలువరే/గోవిందా యని కొలువరే’ అన్న అన్నమాచార్యుల కీర్తనను బిగ్గరగా ఆలపించసాగాను. నా కళ్ల వెంట ఆనందాశ్రువులు. క్యూలతో సంబంధం తీకుండా, డైరెక్ట్ గర్భాలయం దగ్గరికి చేరుకున్నాము. ద్వారకా తిరుమలాధీశాడు, చిన్న తిరుపతి వెంకన్నబాబు అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, పుష్ప, స్వర్ణాభరణ భూషితుడై విరాజిల్లుతున్నాడు. ఆ దివ్య మంగళ విగ్రహాన్ని తనివి తీరా దర్శించుకున్నాము. నాకు గొంతు పూడుకు పోయింది. స్వామిని చూస్తూ వెక్కివెక్కి ఏడ్చాను. రాఘవ కంగారు పడుతూంటే మా యల్లమంద – “సారు స్వామిసన్నిధిలో అలా పరవశం చెంది దుఃఖిస్తారు. తట్టుకోలేరు!” అని చెప్పాడు.

పూజారిగారు మాకు తులసి ఆకులు, తీర్థం, ఇచ్చి, బంగారు శఠగోప స్పర్శ మా తలలకు చేయించారు. అమ్మవారి దర్శనం కూడ అయింది.

బయటకు వచ్చింతర్వాత, రాఘవ నా రెండు చేతులూ తన తన కళ్ల కద్దుకున్నాడు.

“సార్! ఎంత అదృష్టవంతులు మీరు!” అన్నాడంతే – నిజమే! భగవంతుని సాన్నిధ్యంలో ఒక అలౌకికమైన అనుభూతికి లోనుకావడం ఆయన అనుగ్రహమే!

“మేం కాసేపు ఉండివస్తాము అబ్బాయ్!” అని చెప్పి అతన్ని పంపించాము. దేవాలయం ఆవరణ అంతా తిరిగాము. ఒక మూల ‘శ్రీవారి కళాతోరణం’ అన్న వేదిక కనబడింది. అందులో హరికథలు, సంగీత కచేరీలు జరుగుతాయట.

ప్రధానగోపురాన్ని, ఉపగోపురాలను, ముఖమంటపం లోని విగ్రహాలను ఫోటోలు తీసుకున్నాము. రెండు చోట్ల మా నరసింహస్వామి వారున్నారు. ఒక విగ్రహం హిరణ్యకశిపుని తొడలమీద పెట్టు కొని, పొట్ట చీలుస్తున్నది, రెండవది కూడ భీకరమే. స్వామివారి పాదాలు చక్కగా తలపెట్టి నమస్కరించేలా ఉన్నాయి. అక్కడ ఫోటోలు దిగాము. ముఖ మంటపంలో ఒక అరుగు మీద ప్రశాంతంగా కూర్చున్నాము.

 

ద్వారకా తిరుమల ఏలూరు జిల్లా లోని ఒక మండలం. ఈ పర్వతాన్ని శేషాద్రి అంటారు. స్వామి స్వయంభువు. ద్వారకుడు అనే మునీశ్వరుడు వెంకటేశ్వరస్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీశాడట. అందుకే ఈ పేరు వచ్చిందంటారు. ఇది సుదర్శన క్షేత్రం. తిరుపతి తర్వాత అంతటి ప్రసిద్ధి పొందింది. అందుకే దీనిని ‘చిన్న తిరుపతి’ అని కూడా అంటారు.

ద్వారకామహర్షి ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక, ఆయనకు ప్రత్యక్షమైన స్వామివారు దక్షిణాభిముఖుడై ఉంటాడు. మూలవిరాట్టు అలా దక్షిణాభిముఖుడుగా ఉండటం అరుదని ప్రతీతి. ఒక వేళ భక్తులు తిరుపతిలో తమ మొక్కు తీర్చుకోవడానికి అవకాశం లభించకపోతే, చిన్నతిరుపతిలో తీర్చుకొన్నా, ఫలితంలో తేడా ఉండదని అంటారు. కాని, చిన్న తిరుపతిలో మొక్కుకొన్నవారు పెద్ద తిరుపతిలో తీర్చుకోకూడదట.

ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలుంటాయి. ఒక విగ్రవం సంపూర్ణం. రెండవది, స్వామి వారి పై అర్ధ భాగం మాత్రమే కనిపిస్తుంది.

మరొక ఐతిహ్యం ఉంది. ద్వారకుడు అనే బ్రాహ్మణోత్తముడు, ఆయన గృహిణీ సునంద, ప్రతిఏటా తిరుపతికి వెళ్లి స్వామిని దర్శించుకునేవారట. వృద్ధాప్యంలో అంత దూరం పోలేక అలమటిస్తూ ఉంటే స్వామివారు ఇక్కడ వెలిశారట.

మరొకటి – కట్టెలు కొట్టి అమ్ముకొని జీవించేవారు ఈ ప్రాంతంలో ఉండేవారని, దారువులు అంటే చెట్లు ఎక్కువగా ఉంటే ప్రాంతంలో, మెట్టప్రాంతానికి ద్వారం కావడం వల్ల ఈ పేరు వచ్చిందని.

ఈ క్షేత్రం త్రేతాయుగం నాటిదని ప్రజల నమ్మకం. దశరథ మహారాజు కాలం నాటిదట. ద్వారక మహర్షి స్వామివారి పాదసేవా భాగ్యం కోరాడట. అందుకే మనకు స్వామి వారి పై సగ భాగం మాత్రమే కనబడుతుంది.

విశిష్టాద్వైత మతస్థాపకులైన రామానుజాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి, స్వామివారి పూర్ణ విగ్రహాన్ని ప్రతిప్ఠించారని అంటారు. స్వయంభూమూర్తికి వెనుక వైపు పీఠం మీద, ఈ విగ్రహం వైఖానసాగమం ప్రకారం ప్రతిష్ఠించారు. అర్ధభాగం మాత్రమే ఉన్న స్వామి మోక్ష ప్రదాతగా, పూర్ణస్వామి దర్మార్థ కామ పురుషార్థ ప్రదాతగా, భక్తులను కరుణిస్తున్నాడు.

విగ్రహం క్రింద చీమలపుట్ట ఇప్పటికే ఉంది. అందుకే వాటికి ఇబ్బంది కలుగకుండా, స్వామివారికి ఇక్కడ అభిషేకం చేయక పోవడం విశేషం.

ప్రతి సంవత్సరం, వైశాఖ, అశ్వయుజ మాసాలలో స్వామివారికి రెండు కల్యాణోత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతాయి.

పాదుకామంటపంలో స్వామివారి పాదాలున్నాయి. బ్రహ్మ కడిగిన పాదపద్మాలవి!

1762 -1827 ప్ర్రాంతంలో ఆ ప్రాంతాన్ని పాలించిన నూజివీడు సంస్థానాధీశుడు ధర్మా అప్పారావుగారు ప్రస్తుత ఆలయం, విమానం, మంటపం, గోపురం, ప్రాకారాలను కట్టించారు. బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు రాణీచిన్నమ్మ రావు గారు ( 1877-1902) సమర్పించారు

ప్రధానాలయానికి వాయవ్యదిశలో కొండమల్లేశ్వరస్వామి, భ్రమరాంబికా దేవిల ఆలయం ఉంది. స్వామి ద్వారకా తిరుమల క్షేత్ర పాలకుడు. మొత్తం కొండ అనంతుని ఆకారం. తలపైన శివుడు, పైన విష్ణువు వెలిశారని భక్తుల నమ్మకం.

ఆలయం తూర్పున ‘శివోద్యానం’ అన్న పూల వనం, పక్కనే ఎ.పి. టూరిజం వారి ‘పున్నమి’ గెస్ట్ హౌస్ ఉన్నాయి. కొండపై భాగమంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

భీమడోలుకు వెళ్లే దారిలో కుంకుళ్ళమ్మ గుడి, సంతాన గోపాల స్వామి గుడి ఉన్నాయి. అక్కతికి ఉచిత బస్సు వెళతుంది.

ద్వారకా తిరుమల మద్రాసు కలకత్తా జాతీయ రహదారిపై, భీమడోలు గ్రామానికి 18 కి.మీ. లోపలికి ఉంటుంది. భీమడోలులో రైల్వేస్టేషన్ ఉంది కాని, ప్యాసెంజరు రైళ్లు, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఆగుతాయట. ఏలూరు నుండి ప్రతి ఇరవై నిమిషాలకు, విజయవాడ నుండి ప్రతి గంటకు బస్సులున్నాయి.

1890లో ఈ క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర వైఖానస ఆగమ పాఠశాల ప్రారంభమైంది. వందమంది వేద విద్యార్థులకు ఉచితంగా వసతి, భోజనం, విద్య అందుతాయి. ప్రవేశ, వర, ప్రవర అనే కోర్సులు నడుస్తున్నాయి. 1960లో సంస్కృతోన్నత పాఠశాలను ప్రారంభించారు.

ప్రోటోకాల్ ఆఫీసుకు వెళ్లాము. వారు ఒక ఆటో అతన్ని మాకు సంధానపరచారు. అతని పేరు సూర్యచంద్రరావు.

ఎ.ఇ.వో. అతనికి ఇలా చెప్నారు.

“అబ్బాయి! సారు వాళ్ల వెంట నీవు రేపుదయం వరకు ఉండాలి. ‘శ్రీ ధర్మ అప్పారాయ నిలయం’ లో వారికి కాటేజ్ ఇచ్చాము. నీవు ముందు వారిని సి.ఆర్.వో. (సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీసు) కు తీసుకువెళ్లు. రూం కీస్ తీసుకొని కాటేజు వెళ్లు. వాళ్లు బస్ ఎక్కేంతవరకు నీదే బాధ్యత. తర్వాత నాకు వచ్చి కనపడు.”

“ఆయ్! చిత్తమండి!” అన్నాడా అబ్బాయి.

అంగీకరించడానికి, ఏకీభవించడానికి, గోదావరి జిల్లాల్లో ‘ఆయ్!’ అంటారు. అది వినయవాచకం. ‘సరే’ అని దానర్థం.

సి.ఆర్.వో. కార్యాలయంలో థంబ్ ఇంప్రెషన్ వేసి, ఆధార్ కార్డులు సమర్పించి, రిజిస్టరులో సంతకాలు చేశాము. ‘ధర్మ అప్పారాయ నిలయం’ చాలా పెద్ద వసతిగృహం. దాని ఎదుటే ‘మాధవం’ ఉంది. మా కాటేజీ బాగుంది. కొండ మీద ఉంది. చక్కని రోడ్లు, డివైడర్లు. కూడలిలో సర్కిళ్ళు, కొండ అంతా పచ్చని చెట్లు.

అప్పుడు పన్నెండు కావస్తూంది. సూర్యచంద్ర “నేను ఒక గంటలో వత్తానండి. తవురు రెడీగుండండి. వకుళమాత అన్నదాన వితరణ కేంద్రానికి అట్టుకెళతాను. ఆయ్!” అన్నాడు.

రిఫ్రెష్ అయ్యాము. అన్నదాన సత్రం కి.మీ. దూరం. ఆటో అతన్ని ఎందుకిచ్చారో అర్థమైంది. సత్రం చాలా పెద్దది. ఒకేసారి వెయ్యి మంది భోంచేయవచ్చు. భోజనం అమృతోపమానంగా ఉంది. దోసకాయ పప్పు, కొబ్బరిపచ్చడి, బంగాళా దుంపల గ్రేవీ కూర, సాంబారు, మజ్జిగ. హల్వాలాంటి సీటు కొద్దిగ.

సాంబారు ఘుమఘుమలాడుతూ, వేడిగా ఉంది. అన్నం పొగలు కక్కుతూ ఉంది. అరిటాకులలో వడ్డించారు. తిరుపతి తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద భవనంలోని భోజనం లాగానీ ఉంది. చాలా సంతృప్తిగా అనిపించింది. స్వామివారి ప్రసాదం మరి!

మళ్లీ మమ్మల్ని కాటేజీ దగ్గర దింపాడు. “సార్, నాలుగు గంటలకు వత్తాను. కొన్ని గుళ్లు సూపింతాను. చెక్‍పోస్టు కాడ టిపినీ చేసుకుని రూముకు వద్దురుగాని, ఆయ్!” అన్నాడు.

కాసేపు పడుకున్నాం. క్యాంపస్ లోనే క్యాంటీను ఉంది. టీ తాగాము. షుగర్ లెస్ లేదు!

సాయంత్రం క్షేత్రంలోని కొన్ని ఇతర ఆలయాలు దర్శించుకున్నాము. ఎనిమిదికి చెక్‍పోస్టు దగ్గరికి చేరుకోన్నాం. వరుసగా మొబైల్ క్యాంటీన్లున్నాయి. చక్కగా కుర్చీలు, టేబుళ్లు!

ఒక చోట ఆపాడు. అక్కడ ఉన్న ఆమెతో, “అమ్మా! ముందు రెండిడ్లీ వేడిగా ఇవ్వు. తర్వాత పెసరట్టుప్మా చెప్పు” అన్నాను

ఆమె నవ్వింది! “బాబాయ్! రెండిడ్లీలు తింటే, పెసరట్టు ఉప్మా తినలేరు! పెద్దోరు కదా! నా మాటినండి. ఆయ్!” అన్నది.

ఇడ్లీలు అరచేయంత ఉన్నాయి. పెనం మీద కాలుతున్న పెసరట్టును చూశాం. చాలా పెద్దది. దాని మీద పెద్ద గరిటెడు ఉప్మా వేశాడు – ఉల్లి తరుగు వేశాడు.

“సరే తల్లీ!” అన్నాను నవ్వుతూ!

నిజమే! పెసరట్టు ఉప్మా తోనే కడుపు నిండిపోయింది! పక్కనే షుగర్‌లెస్ కాఫీ, అదీ ఫిల్టర్ కాఫీ దొరికింది. పెసరట్టు కమ్మని వాసతోన ఘుమఘుమలాడుతూంది. మూడు చట్నీలు ఇచ్చారు. ఏమైనా గాని టిఫిన్స్ మజా గోదావరి జిల్లాలలోనే. హైదరాబాద్ రెస్టారెంట్లలో ఫ్రిజ్‍లో పెట్టిన, నిన్నటి, మొన్నటి, చల్లని ఐస్ క్రీంలాంటి చట్నీ ఇస్తారు కక్కుర్తి రాయుళ్ళు!

కాటేజీ చేరి విక్రమించాం. ఉదయం ఎనిమిదిన్నరకు రమ్మన్నాం సూర్యచంద్రను. మర్నాడు స్నానాలు చేసి రడీ అయ్యాం. మమ్మల్ని ముందు ‘రాయల్’ అన్న టిఫిన్ సెంటర్‌కి తీసుకొని వెళ్లాడు. మైసూరు బజ్జీలంత ఉన్న రవ్వ పునుగులు చెరో రెండు తిని, ఉల్లి రవ్వ దోసె తిన్నాం. మాతో పాటు తినమని ఎంత బతిమిలాడినా సూర్యచంద్ర ససేమిరా అంటాడు.

మమ్మల్ని ద్వారకా తిరుమల బస్ స్టాండ్‌లో దింపాడు. నాకు ఏలూరు నుంచి, జన్మభూమికి మా అమ్మాయి రిజర్వేషన్ చేసి ఉంది. ఏలూరు బస్ రడీగా ఉంది. ఎక్కాము. సూర్యచంద్రకు ఐదు వంద లివ్వబోయాను. కంగారుపడి, “ఆయ్! ఎ.యి.ఓ గారు మీ దగ్గర డబ్బులు తీసుకొన్నానని తెలిస్తే సంపేత్తారండి బాబు” అన్నాడు.

“ఆయనకు తెలిస్తే కద!” అని నోటు అతని జేబులో పెట్టాను. “జాగర్తగా ఎల్లి రండి బాబు” అని చెప్పి వెళ్లిపోయాడా అబ్బాయి. మా యల్లమంద భీమడోలులో దిగిపోయాడు. అక్కడ ఆయనకు విజయవాడ – టెక్కలి ఎక్స్‌ప్రెస్ సిద్ధంగా ఉంది. నన్నొకసారి హగ్ చేసుకున్నాడు. తునిలో దిగిపోయి నర్సీపట్నం వెళతాడు అక్కడి నుంచి. నేను ఏలూరు స్టేషన్ దగ్గర దిగిపోయాను. జన్మభూమి 11.15కు వచ్చింది. త్రీ టయర్ ఎకానమీ కోచ్. ఎ.సి. లోయరు బెర్త్. విజయవాడ వరకు కూర్చొన్నాను. తెనాలిలో పెరుగన్నం, అరటిపండు తిని హాయిగా పడుకున్నాను. సాయంత్రం 6.45కు సికింద్రాబాద్ చేరాను.

ద్వారకా తిరుమలవాసా! వేంకటేశా! నమోనమః

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here