మా కాశీ ప్రయాణం

0
2
?

[dropcap]చా[/dropcap]రిత్రక నవలా చక్రవర్తి, శ్రీ ముదిగొండ శివప్రసాద్‌ రాసిన ‘దశాశ్వమేథ్’ నవల దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం జాగృతి వార పత్రికలో ధారావాహికగా వచ్చింది. విదేశీయుడైన ఓ వ్యక్తి భారతీయ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని గుర్తించి, కాశీ విశ్వనాథుని భక్తుడిగా ఎలా మారిపోయాడనే నేపథ్యంలో అది సాగుతుంది. పితృఋణం తీర్చుకోవడానికి కాశీ వెళుతుంటారని తప్పితే ఆ ప్రాంతం గురించి పెద్దంత అవగాహన నాకప్పటికీ లేదు. అలానే అయోధ్య, మధుర తరహాలోనే కాశీ విశ్వనాథ మందిరం మీద సైతం మహ్మదీయులు దాడి చేశారని, ప్రధాన దేవాలయంను కొంత కూల్చేసి వారి ప్రార్థనా మందిరాన్ని కట్టారనే విషయం కొంత తెలుసు. అప్పటికే విశ్వహిందూ పరిషత్ అయోధ్య, మధుర, కాశీ ఈ మూడు దేవాలయాలను పునర్నిర్మించాలనే ఉద్యమాన్ని మొదలుపెట్టింది. సరే… మొత్తానికీ చట్టప్రకారంగా ఇప్పటికైతే అయోధ్యను దక్కించుకోగలిగింది. ఆ రామజన్మభూమికి నేను వెళ్ళలేకపోయినా… మధురలోని శ్రీకృష్ణాలయాన్ని, దానిలోకి చొచ్చుకొని వచ్చిన ప్రార్థనా కట్టడాన్ని అయితే చూశాను. ఇంతకాలానికి కాశీని సందర్శించుకునే అవకాశం నాకు ఓ వివాహం సందర్భంగా కలిగింది. తాండూరులో ఉండే మా తోడల్లుడు మీదికేరి రాములు గారి అమ్మాయి అఖిల వివాహం ఉత్తరప్రదేశ్ లోని భదోహీ (కార్పెట్ సిటీ)లో ఏర్పాటు చేశారు. అక్కడ నుండి వారణాసి కేవలం 45 కిలోమీటర్లే కావడంతో వివాహానంతరం వారణాసి వెళ్ళి కాశీ విశ్వనాథుడి దర్శనం కూడా చేసుకోవాలని అనుకున్నాం. ముందుగా పది పదిహేను మందిమి వివాహానికి వెళ్ళాలని అనుకున్నా, దానికి కాశీ పుణ్యక్షేత్ర దర్శనం జత కావడంతో ఆ సంఖ్య దాదాపు 30కి చేరిపోయింది.

పాట్నా (దానాపూర్) ఎక్స్‌ప్రెస్‌లో…

సికింద్రాబాద్ నుండి వారణాసి వెళ్ళాలంటే పాట్నావరకూ వెళ్ళే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ సౌకర్యవంతంగా ఉంటుందని మాకు అనిపించింది. సికింద్రాబాద్ లో ఉదయం 9.35కు బయలుదేరే ఆ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ వారణాసికి ఆ మర్నాడు మధ్యాహ్నం 2.30కి చేరుతుంది. అయితే మేం వెళ్ళాల్సింది భదోహీ కావడంతో వారణాసి కంటే రెండు గంటల ముందే జ్ఞాన్ పూర్ రోడ్‌లో ట్రైన్ దిగేశాం. అక్కడ నుండీ భదోహీకి రోడ్డు మార్గంలో 20 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మా హోటల్ కు చేరుకున్నాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని స్టేషన్లలో రైలు ఐదు, పది నిమిషాల పాటు ఆగింది. సరదాగా రైలు దిగి ఫ్లాట్‌ ఫామ్ మీద చక్కర్లు కొడుతుంటే ఎలాంటి సూచనలు, ప్రకటనలు ఇవ్వకుండా ఠక్కున రైలు బయలుదేరడం… మా వాళ్ళంతా పరుగు పరుగున దానిని అందుకోవడం మాత్రం కాస్తంత ఆందోళనకు గురిచేసింది. గతంలో స్టేషన్ లో రైలు బయలుదేరే ముందు గంటలు కొట్టడం, విజిల్ వేయడం, ప్రధానంగా మైక్ లో అనౌన్స్ మెంట్ చేయడం లాంటివి జరిగేవి. కనీసం నాగ్ పూర్ లాంటి స్టేషన్ లో సైతం అలాంటి పని చేయలేదు!

డిసెంబర్ మాసంలో ఉత్తరభారతంలో చలి భరించలేనంతగా ఉంటుందని భావించిన మా అంచనాలను భిన్నంగా భదోహీలో వెచ్చని వాతావరణమే మాకు స్వాగతం పలికింది. అయితే వేకువ ఝామున మాత్రం కాస్తంత చలి ఉండటంతో టీ స్టాల్స్ లో మట్టి ముంతలతో (కుల్లడ్) చాయ్ ను తాగి… ఓ కొత్త రుచిని ఆస్వాదించాం. అలానే అదే రోజు సాయంత్రం ఆ భదోహిలో శ్రీ సేవాలాల్ మౌర్య కుమారుడు అమిత్ కుమార్ మౌర్యతో మా వదినగారి అమ్మాయి అఖిల వివాహం జరిగింది. తెలుగు వివాహ పద్ధతికి కాస్తంత భిన్నంగా జరిగిన ఆ వేడుక ఆద్యంతం మాలో ఓ కొత్త ఉత్సాహాన్ని, ఉత్సుకతను కలిగించింది. ఓ కొత్త సంప్రదాయాన్ని తెలుసుకున్న అనుభూతికి అందరం లోనయ్యాం.

ఛలో కాశీ….

ప్రధానమైన వివాహ తంతు పూర్తి కాగానే మా దృష్టి కాశీ ప్రయాణం మీదకు మళ్ళింది. భదోహీ నుండీ వారణాసి 45 కిలో మీటర్లు. మా 30 మందికి ఓ మినీ బస్ ను పెళ్ళివారు ఏర్పాటు చేశారు. కాశీలో మా కోసం ఓ హోటల్ లో రూమ్స్ సైతం ముందే బుక్ చేశారు. ఒకటిన్న ర రోజు పాటు మేం కాశీలో ఉండేలా ప్లాన్ చేశారు. ఉదయమే అల్పాహారం చేసి, భదోహి నుండీ బస్ లో 11.00 గంటలకు కాశీ బయలుదేరాం. కానీ ఆ దారి అస్సలు బాగోక పోవడం, సింగిల్ రోడ్ కావడంతో మాకు దాదాపు మూడు గంటలసేపు పట్టింది.

ముందు అనుకున్న విధంగా సారానాథ్‌కు చేరిపోయాం. వారణాసికి అది కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది. క్రీస్తుపూర్వం 528లో గౌతమ బుద్ధుడు తన ప్రధానమైన శిష్యులకు బౌద్ధం గురించి బోధించిన స్థలం ఇది. దీనిని ధాయ్ లాండ్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. దాదాపు 81 అడుగుల భారీ బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 1995 నుండి 2005 వరకూ ఈ విగ్రహ రూపకల్పన జరగ్గా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, శిలలు, శిల్పాలు ఏర్పాటు చేయడానికి మరో ఐదారేళ్ళు పట్టింది. మొత్తం మీద 2011 డిసెంబర్ కు ఈ ప్రాజెక్ట్ పనిని పూర్తి చేశారు. భారత జాతీయ చిహ్నంలో ఉంటే అశోకుని ధర్మ చక్ర స్థూపం కూడా ఇదే ప్రాంగణంలో కొలువుదీరింది. మనం ఏదైనా విహార స్థలం లేదా పుణ్య క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడి గైడ్స్ మనకు ఆ స్థల విశేషాలను తెలియచెప్పడం కంటే కూడా అక్కడ లభించే ప్రత్యేక వస్తువులను మనతో కొనిపించే పనిలో ఎక్కువ పడతారు. గతంలో బెంగళూర్ లో మాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇక్కడ సారానాథ్ లోనూ అదే జరిగింది. సారానాథ్ లోని వట్ థాయ్ బౌద్ధ విహార్ దర్శనం తర్వాత మమ్మల్ని బెనారస్ చీరలు అమ్మే ప్రాంతానికి గైడ్ తీసుకెళ్ళిపోయాడు. దాంతో ఆ పక్కనే ఉన్న ప్రసిద్ధ బౌద్ధ ఆర్కియాలజికల్ మ్యూజియంను మేం చూడలేకపోయాం.

 దశాశ్వమేథ్ ఘాట్ లో గంగా హారతి:

కాశీ బయలుదేరే ముందే మా బృందంలోని ఆడవాళ్ళంతా గంగాహారతికి కచ్చితంగా హాజరు కావాలనే నిర్ణయానికి వచ్చేశారు. అయితే సారానాథ్ నుండి వారణాసి నగరంలోకి అడుగుపెట్టేసరికి సాయత్రం ఆరు గంటలు అయిపోయింది. సిటీలో ట్రాఫిక్ విపరీతంగా ఉండటంతో రైల్వే స్టేషన్ సమీపంలోని మా హోటల్ కు ఈ మినీ బస్ వెళ్ళలేని పరిస్థితి. మరో పక్క గంగాహారతికి హాజరు కావాలంటే… కనీసం ఐదు గంటలకే ఆ నదీతీరానికి వెళ్ళాలని స్థానికులు చెబుతున్నారు. దాంతో మా లగేజీని బస్ లోనే వదిలేసి ఐదారు ఆటోలలో గంగాహారతికి బయలు దేరాం. ఘాట్ కు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని ఆటోలను ఆపేశారు. అక్కడ నుండీ కాలినడక… ఉరుకులు పరుగులతో మొత్తానికి గంగాహారతి చివరి దశలో ఘాట్ కు చేరుకుని ఆ దివ్యమనోహర సుందర దృశ్యాన్ని మాలో కొద్దిమందిమి తిలకించగలిగాం. అక్కడే అమ్ముతున్న దీపాలను కొనుక్కుని కాశీ విశ్వనాథుడిని తలుచుకుని గంగా నదిలో విడిచిపెట్టాం.

  

గంగానది నుండీ మేం దిగి వచ్చిన ఘాట్ వైపు తలెత్తి చూస్తే… పైన బోర్డ్ మీద “దశాశ్వమేథ్‌ ఘాట్’ అని రాసి ఉంది. వెంటనే నా మనసు పులకించిపోయింది… ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం చదివిన ‘దశాశ్వమేథ్’ నవల కళ్ళముందు కదలాడింది. ఓ చక్కని రచన మన మీద ఎంతటి ప్రభావం చూపుతుందో, ఇగిరిపోని గంధం తరహాలో మనల్ని ఎప్పుడూ ఎలా మానసికంగా పరిమళింప చేస్తుందో ఆ క్షణం నాకు అర్థమైంది. ఆ దశాశ్వమేథ్ ఘాట్ కు వినమ్రంగా నమస్కరించి, కాశీ విశ్వనాథుని దర్శనానికి బయలు దేరాం.

 

కాశీ అనగానే చాలామంది భయపెట్టిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇరుకైన వీధులు, బురద, ఆవులు మనుషులను తోసుకుంటూ వెళ్ళడం, అసలు ప్రధాన ఆలయం రహదారి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పలేం అని కొందరు వర్ణిస్తే… నాకు ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణం జ్ఞప్తికి వచ్చేది. కాశీలోని ఘాట్ లు ఇప్పుడు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. ప్రధాన దేవాలయ మార్గం ఇరుకుగానే ఉన్నా, మరీ తోపులాట లేదు. భక్తులంతా దాదాపు ఓ అరకిలోమీటరు క్యూలో నిలుచుని ఉన్నారు. దేవాలయంలో నైవేద్య సమర్పణ, హారతి ఇచ్చే సమయం కావడంతో మా దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. తిరుపతి, శ్రీశైలం వంటి విశాలమైన పుణ్యక్షేత్రాలను చూసిన వాళ్ళకు కాశీ విశ్వనాథుని మందిరం అతి చిన్నదిగా అనిపించడంలో తప్పులేదు. బాధాకరం ఏమంటే… విశ్వనాథుని దేవాలయంలోకి అడుగుపెట్టగానే దానికి రెండింతల ఎత్తులో పక్కనే ఓ పెద్ద మసీదు గుమ్మటం మాకు కనిపించింది. ప్రశాంతంగానే విశ్వనాథుని దర్శనం చేసుకున్నాం. గతంలో అయితే… భక్తులంతా శివలింగాన్ని తాకి, మొక్కే అవకాశం లభించేదట. కానీ ఇప్పుడు మాత్రం దూరం నుంచి నమస్కారం చేసుకుని వెళ్ళడమే! అక్కడ నుండీ తిరిగి వస్తూ పక్కనే ఉన్న అన్నపూర్ణ దేవాలయానికి వెళ్ళాం. ప్రశాంత చిత్తంతో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నాం. ఆ వెనుకే అమ్మవారి ప్రసాద వితరణ శాలకు వెళ్ళి దానిని స్వీకరించాం. దాంతో కాస్తంత క్షుద్బాధ తీరింది. ఆ తర్వాత కొద్ది దూరంలో ఉన్న విశాలాక్షి దేవాలయానికి బయలుదేరాం. ఈ రాత్రి సమయంలో ఇరుకు వీధుల్లో ప్రయాణం చేయడం అంత క్షేమం కాదని, మెడలోని బంగారు ఆభరణాలను కాస్తంత జాగ్రత్తగా చూసుకోమని కొందరు సలహా ఇచ్చారు. అప్పటికే రాత్రి 10.30 నిమిషాలు అయిపోయింది. దేవాలయం తెరిచి ఉంటుందనే నమ్మకంతో అక్కడకీ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని కొంతదూరం రిక్షా, మరికొంత దూరం ఆటోలో ప్రయాణించి మేం దిగిన మినీ బస్ ను చేరుకున్నాం. అక్కడ నుండీ హోటల్ రూమ్ కు చేరడంతో ఆ రోజు కార్యక్రమాలు ముగిశాయి.

కాశీలో సుడిగాలి పర్యటన:

తొలిరోజు కాశీలో చేసిన ప్రయాణంతో మాకు అక్కడ మినీ బస్ తో తిరగడం వల్ల ఉపయోగం లేదనే విషయం బోధ పడింది. మూడు నాలుగు ఆటోలు మాట్లాడుకుని చూడాల్సిన ప్రదేశాలకు వెళ్ళడమే బెటర్ అనుకున్నాం. దాంతో మినీ బస్ ను పంపించేశాం. మాలో కొంతమంది పెద్దవాళ్ళు గంగాస్నానం చేయడానికి, మరోసారి కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి ఆసక్తి చూపించారు. వారంతా ఉదయం ఎనిమిది గంటల కల్లా గంగానదీ స్నానానికి వెళ్ళిపోయారు. మరికొందరు పర్యాటక స్థలాలు, గంగా విహారానికి మొగ్గు చూపారు. వాళ్ళూ రెండు ఆటోలలో ఆ దిశగా వెళ్ళారు. మిగిలిన కొందరం మాత్రం దగ్గరలోని దేవాలయాలను చూడాలని అనుకున్నాం. ఆ సమయంలో మాకు తోడుగా నిలిచిన వ్యక్తి ఫౌజీ పండిట్. ఆ రోజు ఉదయమే మా బావమరిది శ్రీనివాసరావు భార్య కిరణ్మయి, కుమార్తె ఉపాసన ఫైట్ లో వారణాసి నుండి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్ళను ఎయిర్‌పోర్ట్ లో దించే సమయంలో శ్రీనివాస్‌కు ఆటో డ్రైవర్ ఫౌజీ పండిట్‌తో పరిచయం ఏర్పడింది. అతను ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ముగ్గురు పిల్లలూ డాక్టర్లట. అతనికి సొంతగా ఏడు ఆటోలు ఉన్నాయట. ‘మరి హాయిగా విశ్రాంతి తీసుకోకుండా ఈ 70 యేళ్ళ వయసులో ఆటో నడుపుకోవడం ఎందుకూ?’ అంటే నవ్వేశాడు. ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం పిల్లల మీద ఆధారపడటం తనకిష్టం లేదని, తానే కొంతమంది కుర్రాళ్ళకు కొలువు ఇచ్చానని చెప్పాడు. అతని సహకారంతో ఓ ఐదారు గంటల పాటు కాశీలోని కొన్ని పుణ్యక్షేత్రాలు చుట్టేసి వచ్చాం.

బెనారస్ లస్సీకి, పాన్ కు ఫేమస్‌. దాంతో పహిల్వాన్ లస్సీ సెంటర్ లో రుచికరమైన లస్సీ తాగి, రబ్డీని తిన్నాం. బనారస్ పాన్ గురించి ఫౌజీ పండిట్ ఓ విశేషం చెప్పాడు. పాన్ షాప్ వాళ్ళు తమ కుమార్తెలను షాపులో కూర్చో పెట్టి పాన్ తయారు చేయనివ్వరట. దానిని ఎలా తయారు చేస్తారో ఆడపిల్లలకు తెలిసిపోతే, వివాహానంతరం వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి, అంత రుచికరమైన పాన్ అక్కడ కూడా తయారు చేస్తే తమకి పోటీ అవుతుందని, తమ ప్రత్యేక కోల్పోతామని వీళ్ళకు భయమట!

తులసీ మానస మందిర్

కాశీలో చూడాల్సిన ప్రధాన ప్రదేశాలలో ఇదొకటి. తులసీదాస్ రామచరిత మానస్ రాసిన ప్రాంతం. ఆయన రాసిన రామాయణాన్ని మార్బుల్స్ మీద చెక్కి గోడలకు అమర్చిన కట్టడం ఇది. క్రింది భాగంలో దేవాలయం ఉండగా, మొదటి అంతస్తులో రామాయణంలోని వివిధ ఘట్టాలను తెలియచేసే మ్యూజియం ఉంది. ఐదు రూపాయల ప్రవేశ రుసుముతో దానిలోకి వెళ్ళి వాటిని చూడొచ్చు. 1964లో దీనిని కట్టారు. దానికి కాస్తంత ఇవతల ఉన్నది త్రిదేవ్ మందిర్. ప్రశాంత వాతావరణంలో కాసేపు ద్యానం చేసుకోవడానికి అనువుగా ఉన్న మందిరం ఇది. అక్కడి మూర్తుల అలంకరణ ప్రత్యేకంగా ఉండి, చూపరులను ఆకట్టుకుంటోంది. ఇక కాశీలోని మరో ప్రధాన దేవాలయం సంకట మోచన్ హనుమాన్ టెంపుల్. 16వ శతాబ్దంలో తులసీదాస్ ఈ దేవాలయంలోనే రామచరిత మానస్ రాశాడనే వారూ లేకపోలేదు. అక్కడి హనుమంతుడు చాలా శక్తిమంతుడని, ఆయనను దర్శించుకుని, ప్రార్థిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీని కాస్తంత దగ్గరలోనే ఉంది దుర్గామాత మందిరం. దీని విశేషం ఏమంటే 18వ శతాబ్దంలో తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) కు చెందిన నాటోర్‌ రాణీ భభానీ దీనిని నిర్మించారట. దేవాలయం మొత్తం సిందూర వర్ణంలో శోభాయమానంగా ఉంది. ఆ తర్వాత మేం కాలభైరవ మందిరానికీ వెళ్ళాల్సి ఉంది. కానీ అప్పటికే ఆ దేవాలయాన్ని మూసి వేస్తారని తెలియడంతో ఆ ఆలోచన విరమించుకుని, మరోసారి గంగాతీరానికి బయలుదేరాం.

బోటులో గంగా విహారం

మొదటి రోజు రాత్రి దశాశ్వమేథ్ ఘాట్ నుండీ గంగానదికి వెళ్ళగా, ఇప్పుడు విజయనగరం ఘాట్, కేదార్ ఘాట్ మధ్య నుండీ గంగానదికి చేరుకున్నాం. పట్టపగలు పెద్దంత జన సంచారం లేకుండా అలా గంగానదిని చూస్తుంటే మనసు పులకించిపోయింది. వెంటనే ఓ బోటును మాట్లాడుకుని గంగా విహారానికి బయలుదేరాం. ముందుగా మనిషికి 500 రూపాయాలు ఇవ్వాలని చెప్పినా… చివరకు రెండు వందల రూపాయలకు బేరం కుదిరింది. మాతో పాటు ఫౌజీ పండిట్ సైతం బోటులో కూర్చోవడం మాకెంతో మంచిదైంది. కాశీ పుణ్యక్షేత్రం విశేషాలనూ ఆయన మాకు చెప్పారు. కాశీ, వారణాసి, బెనారస్ అనే పేర్లు కాకుండా దీనికి అవిముక్త అనే పేరుకూడా ఉందట. ఇక వారణాసి అనేది రెండు నదుల పేర్ల కలయిక. వారణ, అశి అనే నదులవి. ‘నేను వారణ, నీవు అశి..’ అంటూ విజయచందర్ నటించిన ‘కబీర్ దాస్’ సినిమాలో ఓ పాటను వేటూరి రాశారు. ఇటీవలే ఆ పాటను విన్నాను. దాంతో ఆ పాటలో వర్ణించిన వారణాసి వర్ణన నా కళ్లముందు కదిలింది. గంగాతీరంలో అనేక ఘాట్స్ ఉన్నాయి. వాటిల్లో హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక ఘాట్ ప్రత్యేకమైనవి. ఈ రెండు ఘాట్ ల లోనూ దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. వీటిల్లో మణికర్ణిక ఘాట్ ఇంకా చిత్రమైంది. ఈ ప్రాంతం దగ్గరకు ఓసారి శివపార్వతులు వచ్చారట. అక్కడ అమ్మవారి బంగారు ఆభరణాలలో ముక్కెర, కంఠాహారం పోయాయట. ఎంత వెదికినా కనిపించలేదట. దాంతో శివుడు ఆగ్రహించి, ఈ స్థలం ఎప్పుడూ రగులుతూనే ఉండాలని శపించాడట. అప్పటి నుండీ 24 గంటలకూ అక్కడ దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయని చెప్పారు. రాత్రి ఒంటి గంటకు జరిగే శవదహనానికి సంబంధించిన భస్మంను స్థానిక పోలీసు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో సేకరించి, మూడు గంటల సమయంలో విశ్వనాథుడికి ఇచ్చే భస్మహారతిలో ఉపయోగిస్తారట. దీనిని దేవాలయంలోని భక్తుల నుదుటికి పెడతారట. రాజా హరిశ్చద్రకు సంబంధించిన భవనం కూడా ఈ నది ఒడ్డునే ఉంది. ఆ భవనం ఇరువైపులా రెండు పెద్ద పులుల విగ్రహాలు ఉండటం విశేషం. అలానే కాశీ విశ్వేశ్వరుని దేవాలయాన్ని తలపించేలా చిన్న మందిరం ఒకటి గంగానది ఒడ్డున కాస్తంత పక్కకి ఒరిగిపోయి ఉంది. దానికీ ఓ కథ ఉందని ఫౌజీ పండిట్ చెప్పారు. ఓసారి తల్లి కొడుకులిద్దరు కాశీలో విశ్వనాథుని దర్శనానికి వచ్చారట. భక్తుల రద్దీకారణంగా ఆ స్వామిని దర్శించుకోవడం తన వల్ల కాదని తల్లి చెప్పి, తన కోసం విశ్వనాధుని మందిరాన్ని నిర్మించమని కొడుకుని కోరిందట. తల్లి కోరిక నెరవేర్చుతూ తనయుడు అక్కడో దేవాలయాన్ని నిర్మించి, ‘అమ్మా! ఈ దేవాలయ నిర్మాణంతో నీ రుణం నేను తీర్చుకున్నాను’ అని గర్వంగా చెప్పాడట. ‘ఏదో ఒక పని చేసి నంత మాత్రాన తల్లి రుణం తీరిపోతుందా? అమ్మ రుణం ఎప్పటికీ తీర్చలేద’ని చెప్పిన అతని తల్లి, ‘నిజంగానే నీ రుణం తీరిపోతే, ఈ గుడి సక్రమంగా ఉంటుంది, లేదంటే పక్కకి ఒరిగిపోతుంద’ని చెప్పిందట. చూస్తుండగానే ఆ గుడి గంగానదిలోకి కొన్ని వందల అడుగుల మేరకు పక్కకు ఒరిగిపోయిందట! ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను ఆ యా ఘాట్స్ ను చూస్తుండగా మాకు ఫౌజీ పండిట్ చెబుతూనే ఉన్నాడు.

   

ఆ పడవను నడిపే కుర్రాడి చేతిలో ‘కేవట్ గుప్తధన్’ పేరుతో మాకు నచ్చిన మొత్తాన్ని ఇతరులకూ కనిపించకుండా పెట్టమని చెప్పాడు. గంగావిహారం బాగా జరిగిందనే ఆనందంతో ఎవరికి తోచిన మొత్తం వారు, ఆ పడవ నడిపే కుర్రాడికి ఇచ్చారు.ఆ పడవ మీద ప్రయాణిస్తూ కొన్ని ఫోటోలు తీయించుకున్నాం. ఆ ఫోటోగ్రాఫర్ ‘ఆవ్… ఆవ్…’ అంటూ చెయ్యి ఊపగానే పదుల సంఖ్యలో పావురాలు ఎగురుకుంటూ వచ్చాయి. అతను వేసిన ఆహారాన్ని గాల్లోనే అందిపుచ్చుకుని హాయిగా నదిమీద తేలుతూ సాగాయి! అదో చిత్రమైన అనుభూతి! అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు దానాపూర్ ఎక్స్ ప్రెస్ లోనే వారణాసి నుండి సికింద్రాబాద్ కు మా తిరుగుప్రయాణం ఉండటంతో హడవుడిగా గంగామాతకు నమస్కారం చేసి హోటల్ కు బయలుదేరాం. భారతీయ సంస్కృతికి, ఉన్నత విద్యా వ్యాప్తికి మూల స్తంభంగా నిలిచిన బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం చూడాలనే కోరిక మాత్రం సమయాభావం వల్ల మాకు తీరలేదు. ఇక వారణాసి రైల్వే స్టేషన్ సైతం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కాశీ పుణ్యక్షేత్రం సంగీత, సాహిత్య, ఆధ్యాత్మికతల త్రివేణీ సంగమం. దానికి తలపించేలానే సంగీతకారుల చిత్రాలు ఆ రైల్వే స్టేషన్ లోని గోడలపై చిత్రీకరించబడి ఉన్నాయి. ఇక బయట ఉన్న వాటర్ ట్యాంక్ ఆకర్షణీయమైన పెయింటింగ్ వేయడం కొత్తవారికి భలే ఆకట్టుకుంది. ఆ రకంగా ఉత్తర భారతదేశంలోని ఓ ప్రధాన పుణ్యక్షేత్రాన్ని ఈ యేడాది చివరిలో దర్శించుకునే భాగ్యం మాకందరికీ కలిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here