కనుల ముందు దివ్యక్షేత్రం – ‘మా కాశీ యాత్ర’

0
2

[శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి గారి ‘మా కాశీ యాత్ర’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]భ[/dropcap]క్తి పర్యటనల రచయిత్రిగా పేరుగాంచిన శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి గారు దేశంలోని అనేక ప్రాంతాలలోని ఆలయాలను సందర్శించి వాటి విశేషాలను వివరిస్తూ ‘యాత్రాదీపిక’ అనే సీరిస్‍లో పుస్తకాలు వెలువరించారు. అటువంటి వాటిలో 11వది ‘మా కాశీ యాత్ర’.

~

మొదటగా కాశీ క్షేత్ర్రాన్ని హిందువులు తమ జీవితంలో ఎందుకు ముఖ్యమైనదిగా భావిస్తారో తెలిపారు రచయిత్రి. అనంతరం – సప్త మోక్ష క్షేత్రాలలో ఒకటంటూ – కాశీ క్షేత్రం స్థలపురాణాన్ని సంక్షిప్తంగా వివరించారు. కాశీ క్షేత్రం సందర్శించడానికి ఏ కాలం అనుకూలంగా ఉంటుందో తెలిపారు.

శివునికి ప్రీతిపాత్రమైన ఈ క్షేత్రం విశిష్టతని వివరిస్తూ – శివుడు ఎన్నడూ వారణాసిని వీడడని – అందుకే దీనికి అవిముక్త క్షేత్రం అనీ, అవిముకేశ్వరం అనీ పేర్లు ఉన్నాయని అంటారు రచయిత్రి.

కాశీ నగరం చరిత్రని, గత వైభవాన్ని, వర్తమాన శోభని వివరిస్తారు. సత్యహరిశ్చంద్రుడు, ఆదిశంకరాచార్యులు, గోస్వామి తులసీదాసు వంటి మహనీయులు సంచరించిన నగరమిదని గుర్తు చేస్తారు. ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు ఎలా వచ్చిందో తెలిపారు. కాశీ హిందువులకే కాకుండా, బౌద్ధులకీ, జైనులకీ కూడా ముఖ్యమైనదేనని చెప్తారు. కాశీలో ఇస్లామిక్ సంస్కృతి కూడా గాఢంగా పెనవేసుకుని ఉందంటారు.

కాశీలో గంగా స్నానం పవిత్రమని అంటూ, మధ్యాహ్నం 12 గంటల వేళ మణికర్ణికా ఘాట్‍లో గంగా స్నానం చేయడంలోని ప్రాశస్థ్యాన్ని వివరించారు. సందర్భానుసారంగా గంగా నది ప్రాముఖ్యతనీ, కాశీ లోని వివిధ ఘాట్‍ల గురించి తెలిపారు.

కాశీలో అడుగిడిన రోజు సాయంత్రమే గంగా హారతి దర్శించగలిగామని చెబుతూ గంగా హారతి ఇచ్చే విధానాన్ని వర్ణిస్తారు.

ప్రధాన ఆలయంలో విశ్వేశ్వరునికి ఇచ్చే సప్త ఋషి హారతి గురించి వివరంగా తెలియజేశారు. అక్షి త్రయంలోని కాశీ విశాలక్షి ఆలయాన్ని దర్శించి – అమ్మవారు రెండు రూపాలలో దర్శనమిస్తుందని చెప్తారు.

కాశీ అన్నపూర్ణ గురించి చెబుతూ, దీపావళి సందర్భంగా అమ్మవారిని బంగారు చీరతో అలంకరిస్తారని చెప్తారు. అన్నపూర్ణాదేవి గురించి ప్రచారంలో ఉన్న ఒక కథని పాఠకులతో పంచుకుంటారు.

ప్ర్రధాన ఆలయంలోని ఉపాలయాల గురించి, వారాహీ దేవి ఆలయం గురించి, కాల భైరవ మందిరం గురించి, తులసీ మానస మందిర్ గురించి, గువ్వలమ్మ గుడి గురించి, వ్యాసకాశీ గురించి, తారాదేవి కాళీ మందిరం గురించి, శ్రీ చిమాలేశ్వర్ మహాదేవ్ మందిరం గురించి తెలియజేస్తారు. కేదారేశ్వర మందిరం గురించి చెబుతూ, ఆ మందిరానికి సంబంధించిన పురాణ గాథని వివరిస్తారు.

బెనరస్ హిందూ యూనివర్శిటీ గురించి, ఆ విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం గురించి సంక్షిప్తంగా వివరించారు రచయిత్రి.

కాశీ నుంచి ప్రయాగ వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసి, వేణీ దానంలో పాల్గొంటారు రచయిత్రి. ప్రయాగ గురించి, అక్కడి దర్శనీయ స్థలాల గురించి చెబుతారు.

అక్కడ్నించి అలాహాబాద్ మార్గంలోని సీతామారి సందర్శిస్తారు. సీతమ్మవారు అవతారం చాలించిన ప్రదేశంగా భావించే ఈ క్షేత్రం విశేషాలను వివరిస్తారు.

అనంతరం గయకి వెళ్ళి విష్ణుపాదం ఆలయం సందర్శించారు. ఈ సందర్భంగా గయాసురుడి కథని పాఠకులకు జ్ఞాపకం చేస్తారు.

తరువాత మంగళగౌరి ఆలయాన్ని, బుద్ధగయని, సారనాథ్‌ని దర్శించి ఆ అనుభవాలను పాఠకులకు వివరించారు రచయిత్రి.

కాశీ యాత్రలో తీసుకోవల్సిన జాగ్రత్తలు చెప్పి, చేయకూడని పనులను ప్రస్తావించి యాత్రికులను హెచ్చరిస్తారు.

~

కాశీ క్షేత్రాన్ని ప్రధాన ఆలయాన్ని, ఉపాలయాలను, గంగానదిని, ఘాట్ లను కళ్ళకు కట్టినట్టుగా వర్ణించడం ద్వారా పాఠకులని కూడా వారణాసిలో తనతో పాటే నడిపించారు రచయిత్రి.

***

మా కాశీ యాత్ర (యాత్రా దీపిక-11)
రచన: పి.యస్.యమ్.లక్ష్మి
పేజీలు: 94
వెల: ₹ 120.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 9000413413
అచ్చంగా తెలుగు ప్రచురణలు, (8558899478 వాట్సప్)
రచయిత్రి: 9866001629
ఆన్‍లైన్‍లో:
https://books.acchamgatelugu.com/product/ma-kashi-yatra/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here