మా కథలు 2019 – పుస్తక సమీక్ష

0
2

[dropcap]4[/dropcap]4 మంది రచయితలు/రచయిత్రుల కథలున్న ‘మా కథలు 2019’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ నల్ల భూమయ్య.

~ ~

మన కథలు (మా కథలు – 2019) పుస్తకాన్ని చదివాను. 1962లో మేము 7వ తరగతిలో వున్నప్పుడు మా భూగోళం టీచర్ పాఠ్యపుస్తకంలోని ముఖ్యాంశాల్ని అండర్‍లైన్ చేయమని అనేవాడు. దాంతో ఏదేని పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ముఖ్యం అని తోచిన విషయాన్ని అండర్‍లైన్ చేయడం అలవాటుగా మారింది. ఆ విధంగా అండర్‍లైన్ చేసిన పదాల్ని, వాక్యాల్ని ‘మా కథలు -2019’ నుండి యిక్కడ పేర్కొంటున్నాను.

***

కూతురు రాంరెడ్డి – ‘అతడు మార్గదర్శి’: ఈ కథ నుండి పెండకడి, సడిరికప్పి, శెల్లె పదాలు పల్లెల్లో చదువుకోని వారి వాడుకలో యింకా వున్నాయి…. తల్లిప్రేమ ఆయాసాన్ని మరిచి బిడ్డను అవలీలగా మోస్తుంది. ఇది సత్యవచనం. “కొడుకా! నీకిదే శిక్ష. పసిగుడ్డని చూడకుండా రాక్షసంగా ప్రవర్తించిన నీకు సంసారానికి పనికిరాకుండా జీవితాంతం కుమిలి చచ్చేలా ఎక్కడ తన్నాలో అక్కడ తన్నిన” తగిన గుణపాఠం నేర్పింది.

నండూరి సుందర నాగమణి ‘స్వీట్‍బాక్స్’ కథ మానవత్వానికి మచ్చుతునక.

అరిగే రామారావు ‘సొంతయిల్లు’: మేదకుడు అన్నపదం తెలంగాణాలో అమాయకుడు, నెమ్మదైనవాడు అని అర్థం. “అదొక షో. మిగతావన్నీ బాగానే లాగిస్తాడు. ఇలా ఆరోగ్య సూత్రాలన్నీ పాటించి మరింకెన్నాళ్ళు బతకాలనో మమ్మల్ని చంపడానికి కాకపోతే…..”. కోడళ్ళు ఒక సుళువైన పద్ధతిని కనిపెట్టారు. కింద స్విచ్ నొక్కగానే పైన పెంట్ హౌజ్‍లో బెల్ మోగేది. తాను ప్లాస్టిక్ తాడుకు కట్టిన వైరుబుట్టను కిందకు జారవిడచాలి. స్టీలు డబ్బాల్లో టిఫిన్లూ, అన్నం, కూరలు పెట్టి చిన్న ప్లాస్కుల్లో కాఫీ, టీ పోసి ఆ బుట్టలో పెట్టి మళ్ళీ బెల్‍ కొట్టేవాళ్ళు. తాను వైరు బుట్టను పైకి లాక్కునేవాడు…. ‘వైరుబుట్ట- కోడళ్ళు’ యిద్దరూ మాకు ఈ పీడ విరగడైతే చాలనుకున్నారు. లోపలి సంతోషాన్ని బయటకు కనిపించకుండా, దిగులుగా సాగనంపుతున్నట్లు పంపించేశారు… ఈ మలుపు తనకు మరో గెలుపు. ‘సొంతయిల్లు’ చాల మంచి కథ.

మేడామస్తాన్ రెడ్డి ‘స్పర్శ’: టచ్‍హీలింగ్ ట్రీట్‍మెంట్ – మదర్ టచ్ ఉన్న మహిమను తెలియజేస్తున్నది.

దాట్ల దేవదానం రాజు ‘వొక మెలకువ’: ఊహలు జోడించి ఆలోచనల్ని అందంగా కాగితాలపై వొండగలను – వేటగాడు ఎరవేసి పిట్టల్ని చేజిక్కించుకున్నట్లు పఠనాల అభిరుచుల వలలో అందంగా చిక్కుకుపోతారు – అన్న వాక్యాలు అలంకారికంగా, ఉపమానంగా ఉన్నాయి…. రక్తనాళాల దారి మళ్ళించగల గుండె నాది. అనాదరణ స్మృతి చిహ్నంగా గుణాడ్యుడు కావ్యహోమం చేసినట్లు…. రోడ్డు మీద కుక్క విశ్రాంతంగా పడుకుంది. అడుగుల సవ్వడికి కళ్ళు తెరిచి తలవారగా ఎత్తిచూసింది. తనకేమీ ప్రమాదం లేదనుకుంది కాబోలు, యథాప్రకారం కళ్ళు మూసుకుంది. ఇది పరిసరాల పరిశీలన… ఉత్సుకత ఎంతటి కార్యాన్నైనా చేయిస్తుంది. ఇది మంచి కథ.

విహారి ‘ఆపేక్ష’: నర్మదక్క ఎండిన గన్నేరు కొమ్మలా ఉంది – ఉపమానం. “శక్తి, అవకాశం ఉన్నవాళ్ళు ఇతరుల కష్టాల్లో తోడు నిలవాలి. నమ్మిన వారికోసం కొంచెం ఒదగగలగాలి, నిదానించగలగాలి” ప్రబోధం.

ఎలక్ట్రాన్ ‘అస్తమానూ లడ్డూలేనా’: తలలో నాలుకలు, తలతిక్క వ్యవహారాలు, సిఫారసులు, పైరవీలు, ఏ ఎండకాగొడుగులు ఉద్యోగంలో అందరి ఎదుగుదల ఒకేలా వుండదు. ప్రతివారి ఎదుగుదలకు ప్రమాణాలు వేరు – జీవితసత్యాలు: రామలింగంకు తలనెరిసిపోయింది గానీ రంగేసుకుంటాడు. మాటలకు మట్టుకు రంగేయడం ఆయనకు చేతగాదు. వ్యక్తీకరణ బాగుంది. ఆలోచనలు మహావృక్షాల్లా విస్తరించాలిగానీ, కుండీమొక్కల్లా వుండిపోగూడదు – ఉపదేశం.

పోస్టల్ స్టాంపులు అవసరమున్న వాళ్ళు కేవలం తలమాసిన రచయితలు. పత్రికలిప్పుడు ఇ-మెయిల్ ద్వారా రచనలు స్వీకరించడం ప్రారంభించిన తర్వాత రచయితలకీ స్టాంపుల అవసరం మరింతగా తగ్గిపోయింది. మామూలు ఉత్తరం సరిగ్గా బట్వాడా చేయబడదన్న భయంతో స్పీడు పోస్టులు వచ్చాయి. ఐదు రూపాయల్లో పోయేదానికి నలభైరూపాయలు యిస్తున్నాం…. బుజ్జగిస్తూనే బుర్రమీద బాదడం  భావనారాయణ స్పష్టాస్పష్టమైన పద్ధతి; మానవనైజాన్ని బాగా వ్యక్తీకరించారు, మంచి కథ.

అభిమన్యు ‘అభిమతం’: కథ చాలా బాగుంది. కథ చదువుతుంటే మేము ఐదవ తరగతిలో, 1960లో చదివిన ‘కేసబియంక’ కథ జ్ఞాపకం వచ్చింది. తండ్రి మాటను పాటిస్తూ కేసబియంక అగ్నికి ఆహుతి అయ్యాడే గానీ, తండ్రిమాటను ఉల్లంఘించలేదు.

జగన్‍మిత్ర ‘ఆపద్భాంధవులు’: నువ్వాగమ్మా ఓ కోటీశ్వరుడి మనవరాలి అన్నప్రాసనం ఇంత సప్పగా జరుపుతే, తాతని నా కడుపు తరుక్కుపోదా… రాముడితో రాంబంటుల్లా… రాముడి గురించి రాంబంటు చెప్తూ పరవశించిపోతున్నప్పుడే… ఆపన్నులకు లేపనాలు పూస్తారు. రాజకీయాల మీద రాబందుల్లా విరుచుకుపడతారు. కథనం బాగుంది. రాబందులు కేవలం చనిపోయిన కళేబరాల్నే తిని పర్యావరణానికి మేలు చేస్తుంటాయి. అవి ప్రాణమున్న జీవాల్ని చంపి తినవు. అంచేత రాబందులను క్రూరత్వానికి ప్రతీకగా తీసికోగూడదు.

వడలి రాధాకృష్ణ ‘ఏటి ఒడ్డున ఎడారి’: పచ్చటి ఏటి ఒడ్డున తన ఎడారి బ్రతుకు అదేపనిగా వెక్కిరిస్తోంది. అభివ్యక్తి బాగుంది.

వియోగి ‘కలకాలం’: భర్తను అప్పుడే ICUలో చేర్పిస్తే భార్యకు నిద్రపడుతుందా?

పత్తి సుమతి ‘కలగా – కమ్మని కలగా’: శాస్త్రీయ పంధాలో ఆలోచించడం…. భారతీయ చరిత్రను వైజ్ఞానికంగా రాయడం యిప్పటి తక్షణ కర్తవ్యం. అంతేగానీ శాస్త్రీయ ఆధారాలు ఏమాత్రం లేని పుక్కిటి పురాణాలు విశ్లేషించి (ద్రౌపది) కాలయాపన చేయడం ఈనాటి సాహితీమూర్తులకు పరిపాటి అయిపోయింది. మానవ హేతువాదం నుండి ఆధ్యాత్మిక అంధవిశ్వాసంలోకి సమాజాన్ని దిగజారుస్తున్నారు (Degradation) అసలు ఆధ్యాత్మిక వాదంలో ‘శాస్త్రీయ ఆలోచనలకు’ తావే లేదు. మనిషి పురోగమించడానికి ఆస్కారమే లేదు. గురజాడ, శ్రీశ్రీ, కొడవటి కుటుంబరావు తమ రచనలలో శాస్త్రీయ భావాల్ని వ్యక్తం చేశారు. రచయిత్రివి ఘంటాపథమైన, అత్యంత విలువైన, పాంటింపదగ్గ వచనాలు.

గండ్రకోట సూర్యనారాయణ శర్మ ‘గోడమీదిబొమ్మ’: తీరే కొద్ది ఆమెలో కోరికలు అంతకంతకూ పెరుగుతుండేవి. మనిషి ప్రకృతిని తెల్పారు రచయిత. చల్లని నీటికుండలో నిప్పు పుట్టింది. మీ సరళి సరళ సరళా రేఖ కాదు – ఒక వక్రరేఖ. వాక్య విశేషాలు – మంచికథ.

టి.ఎస్.ఎ కృష్ణమూర్తి ‘చెప్పని కథ’: అదిగో ఆ టీవీలో ఏళ్ళ తరబడి సాగిపోతున్న సీరియల్స్ లాగే సత్యవాక్యం! మంచికథ.

చలసాని వసుమతి ‘చూపు’: పూడుకుపోయిన రక్తనాళాలకు స్టెంటులు వేసినవాడు తన జీవితానికి చెందిన విషయంలో నిర్ణయం తీసికోడానికి ఊగిసలాడుతున్నాడు. …ఇద్దరు యిష్టపడినపుడు ఆ బంధం నేరం కాదు అని కోర్టు తీర్పు చెప్పింది. ఈ బంధాలను ఎవరు కాపాడాలి? సృష్టే ఆగదు, కన్నీళ్ళు ఆగవు, కానీ వాటి దిశ మాత్రం మారుతూ ఉంటుంది. కథనం బాగుంది. చాలా బరువైన యితివృత్తం.

చెన్నూరి సుదర్శన్ ‘జవాను కుటుంబం’:  జవాన్ల కుటుంబం యింటిముందు జనసంద్రం అయ్యింది. ఊరంతా అలలు అలలుగా కడలికి కదలి రాసాగారు. వాక్యం వ్యక్తీకరణ అలంకారికంగా వుంది.

పివిఆర్ శివకుమార్ ‘నీదేగానీ –    ‘నీదే’ కాదు: పడ్డ కష్టానికి దుఃఖపడాలో, ప్రథమ బహుమతికి ఆనందపడాలో తెలియక ఆనందరావు తికమకపడ్డాడు. మన ప్రభుత్వ సంస్థల బేవార్సు నిర్వాకాలకు మచ్చుతునక – మంచికథ.

పాణ్యం దత్తశర్మ ‘పరధర్మో భయావహ’: కథా శీర్షిక మనుధర్మపు నియమం. ఈ ఆధునిక కాలంలో ఏది పరధర్మం. స్వదేశంలోనే ఉద్యోగాలు చేస్తే ‘స్వధర్మం’ అలాంటి ఉద్యోగాలే విదేశాల్లో చేస్తే పరధర్మమా? ఈ ‘కథ’ కథగా లేదు. ఓ మధ్యతరగతి కుటుంబపు దినచర్యను ఏకరువు పెట్టినట్లుగా వుంది.

పి. చంద్రశేఖర్ ఆజాద్ ‘మరణం అసంపూర్ణ కావ్యం’: “….. నేను కర్మ అనుకోను. అలాంటివాటి మీద నాకు నమ్మకం లేదు. ఇదంతా మనుషులు చేస్తున్నదే” అన్నాడు ప్రసాద్.

“నీకు ఇంకో లోకంమీద నమ్మకం లేదా?”

”లేదు. అవి చూసినవారు లేరు”

ఇది హేతువాదం, శాస్త్రీయమైన ఆలోచన.

సింహప్రసాద్ ‘మనుగడ’: అమరావతి పుణ్యమా అని భూదందా తప్ప అన్ని వృత్తులూ, వ్యాపారాలు చతికిలబడ్డాయి. “భూమి నుంచి వేరైన మొక్క బతకదు”….. మనల్ని నమ్మి బ్రతుకుతున్న జనం, మనం వేసే గడ్డికోసం చూసే పశువులున్నాయి. కోదండరామయ్య కళ్ళలో ఆవేదన కదలితే చలపతి కళ్ళల్లో పట్టుదల మెరిసింది…. మన నేతాగణం, అధికార్లూ వ్యవసాయాన్ని అధమాధం చేశారు. భూమి ఒకరికి అమ్మకం సరుకు, కొందరికి మడుపు, ఒకరికి బతుకు తెరువు, జీవనాధారం, ఒకడికి ఆదాయమార్గం, ఒక్కొక్కరిది ఒక్కో దృష్టి. అందుకే ఒకే భూమి ఒక్కొక్కరికీ ఒక్కోరకంగా కన్పిస్తోంది.

రామాచంద్రమౌళి ‘లోపలిఖాళీ’: దాదాపు 15 ఏళ్ళ అపరిచయ పరిచయం తమది. ప్రతిజీవికీ జన్మతః కొన్ని లక్షణాలు సంక్రమిస్తాయి. 1) చేపకు పుట్టగానే ఈత వస్తుంది. 2) పక్షులకు రెక్కలు మొలవగానే ఎరిగే లక్షణం అటువంటిదే. 3) సింహం పిల్లకు పుట్టగానే వేటాడే లక్షణం అబ్బుతుంది. (1, 2 విషయం ఏమోగానీ, సింహంపిల్లకు మాత్రం తల్లి తర్ఫీదు యిస్తుంది – నల్లభూమయ్య)

కూర చిదంబరం ‘గ్రహణం వీడిన మనసు’: …..మరుక్షణం ఆమెలోని తల్లిప్రేమ ఆమెను జయించింది. ఇది వెండి కాదు, ప్లాటినం. బంగారంకంటే ఆరు ఏడురెట్లు ఎక్కువ విలువైంది. (బంగారం ధర తులం వందల రూపాయల్లో ఉన్నప్పుడు ప్లాటినం ధర 6,7 రెట్లు వుండేది. కానీ, యిప్పుడు ప్లాటినం విలువ బంగారం విలువలో సగమే) అయినా ‘నా పిచ్చిగానీ, వాడిప్రేమను బహుమతి వస్తువులతో కొలవడం ఏమిటి’ అనుకుంది.

బి. మురళీధర్ ‘ఒక విధ్వంసక ప్రయాణం’: పదబంధాలకు అంతే అర్థవంతమైన పాదబంధాలతో నర్తిస్తున్నది స్వామి. వ్యక్తీకరణ బాగుంది. ఏదో ఒకదానితో రాజీపడితే తప్ప సుఖంగా వుండలేం. జీవితసత్యం. ఇన్నోసెన్స్ ఇచ్చే ప్రశాంతతను ఇంటిలిజెన్స్ ఇవ్వలేదు. గ్లోబల్ సంస్కృతి దొంగచాటుగా గిరిజన గూడెంలోకి చొరబడుచున్నది – వాస్తవాలు.

వాణిశ్రీ ‘నల్లబంగారం’: మనిషి వంకను మహాలక్ష్మి తీరుస్తున్నది. మనిషికి ధనసంపాదన ధీమాను కలుగజేస్తుంది అన్నవి జీవితసత్యాలు. “పెద్దపిల్లలకు నా రంగే వచ్చింది. స్వాతికి మీ కొడుకు రంగు వచ్చింది. తండ్రి పోలికలొస్తే అదేం చేస్తుంది?” అని అత్త మాటల్ని తిప్పికొట్టింది. పరిగెత్తే అలవాటు తన తలరాతను మారుస్తుందని స్వాతి కలలో గూడ ఊహించలేదు. ఎండిన కోనేరులా కళ తగ్గుతోంది. రాజహంసలా తలెత్తుకుని తిరుగుతోంది అన్నవి అలంకారికంగా వున్నవి. ఇప్పుడు స్వాతి కలువలు, తామరలుతో నిండి కళకళలాడుతున్న కోనేరులా వుంది – ఉపమానం. కరాటే పంచుల రుచి, బీరకాయ పీచు సంబంధాలు అన్న పదబంధాలు బాగున్నాయి.

కె.బి.కృష్ణ ‘అమ్మదొరికింది’, ఉండవల్లి ఎమ్ ‘అంకితం’, గన్నవరపు నరసింహమూర్తి ‘అజ్ఞాతవాసి’, గొర్రెపాటి శ్రీను ‘ఓ ప్రేమ కథ’, అత్తివిల్లి బాలసుబ్రహ్మణ్యం ‘చదువురాని భార్య’, కాండ్రేగుల శ్రీనివాసరావు ‘జనయిత్రి’ కథలు ‘సినిమాటిక్’గా వున్నాయి.

నల్లభూమయ్య ‘హ్యాట్స్ ఆఫ్ టు ద…. ‘: ఉత్సహమే చూపని మనస్సుతో శరీరాన్ని పనిచేయించడం కుదరదు గదా! మా పిల్లలు పరిగెత్తడం నేర్చినాక నడవడం మర్చిపోయారు. తమకు కాళ్ళున్న సంగతే తెల్సిరాదు. సైకిలు కన్పిస్తే తప్ప! పుస్తకాల్లో చదివిన పాఠాన్ని ‘అబ్‍ కరేసో కల్‍ కరో’ అని అర్థం చేసుకున్నారు. కారుచవకగా ‘కారు’ వస్తుందని కొంటే అది తాగే పెట్రోలు నా బతుకును అంటిస్తుంది… దొంగలు ఆవేపు కన్నెత్తి చూసి కూడా మిన్నకుంటున్నారు!…. నాల్గునెళ్ళ తర్వాత కూడా ‘అన్నే’ కిక్కులకు స్టారయింది! పాండవులలోని ‘భీమభాగం’ మా పెద్దవాడిదే!

***

మా కథలు 2019

రచన: బహుళ కథకులు

ప్రచురణ: తెలుగు కథ రచయితల వేదిక

పేజీలు: 348

వెల: ₹ 99/-

ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here