కథా కదంబం ‘మా కథలు 2022’

1
2

[‘మా కథలు 2022’ అనే కథా సంకలనాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

తెలుగు కథా రచయితల వేదిక తరఫున ప్రముఖ రచయిత, సంకలనకర్త శ్రీ సి.హెచ్. శివరామ ప్రసాద్ సంకలనం చేసిన పుస్తకం ‘మా కథలు 2022’. అక్టోబరు 2023లో ప్రచురితమైన ఈ సంకలనంలో 38 కథలున్నాయి. 2023 ప్రముఖ కథకులు శ్రీ సభా గారి శతజయంతి సంవత్సరం కావున వారి జీవితాన్ని, సాహితీ కృషిని స్పృశిస్తూ శ్రీ పలమనేరు బాలాజీ చక్కని వ్యాసం అందించారు.

సహకార పద్ధతిలో ప్రచురితమైన ఈ సంకలనంలోని కథల ఇతివృత్తాలలో, రచనాశైలిలో, నిడివిలో ఎంతో వైవిధ్యం ఉంది. బహుశా ఇలాంటి సంకలనాలకు ఆ వైవిధ్యమే ఏకసూత్రత అవుతుందేమో!

***

గడ్డం దేవీప్రసాద్ గారి ‘అనామిక’ కథలో వర్షం కారణంగా తన ఇంటి వరండాలో నిల్చున్న బ్యాంకు ఉద్యోగిని లోపలికి పిలుస్తుందామె. కొద్దిపాటి సంభాషణ ద్వారా ఆమె ఓ వేశ్య అని తెలుస్తుంది. టీ పెట్టిస్తుంది. వర్షం తగ్గేలా లేదు, ఇక్కడే భోం చేసి వెళ్ళొచ్చని అంటుంది. వద్దంటాడతను. వాన తగ్గి అతను వెళ్ళిపోతుంటే, అతని బుగ్గ మీద అభిమానంగా ముద్దు పెడుతుంది. అందుకు ఆమె చెప్పిన కారణం తెలుసుంటే చదువరులకు బాధ కలుగుతుంది.

పేద, దిగువ మధ్యతరగి కుటుంబాలలో అమ్మల చీరలు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో వైబోయిన సత్యనారాయణ గారి ‘అమ్మచీర’ కథ చెబుతుంది. తల్లి హృదయం, అమ్మ ప్రేమ గురించి అద్భుతంగా చెప్తుందీ కథ. నిజమైన ఎంజాయ్‍మెంట్ అంటే ఏమిటో ఈ కథలోని అమ్మ చెబుతుంది.

ఎప్పుడో పదేళ్ళ క్రితమే తనని విడిచి వెళ్ళిపోయిన కొడుకు అతని తల్లి గొప్ప త్యాగం చేస్తుంది. నడమంత్రపు సిరి మోజులో తల్లిని విస్మరించిన ఆ కొడుకుని అమ్మే ప్రాణాలకు తెగించి కాపాడుకుంటుంది. డా. ఎం. దేవేంద్ర గారి ‘అమ్మత్యాగం’ కథ ఆసక్తిగా చదివిస్తుంది.

ఆత్మహత్య, పూర్వజన్మ జ్ఞాపకాలతో అల్లిన కథ పోరండ్ల సుధాకర్ గారి ‘ఆత్మహత్య చేసుకుందాం రండి’. కథ శీర్షిక అసంబద్ధంగా ఉన్నా, కథ మాత్రం ఆత్మహత్యలు తగవనీ, కుటుంబంలో ఒకరి ఆత్మహత్య వల్ల కుటుంబం మొత్తం ఎంతలా ఛిన్నాభిన్నం అవుతుందో చక్కగా చెబుతుంది.

పి.వి.ఆర్. శివకుమార్ గారి ‘ఆపదలో అబల’ కథలో ఒక చక్కని మెలిక ఉంది. ఆ మెలికే కథని విశిష్టంగా మార్చింది. ఆమె ఆయననా, ఆయన ఆమెనా – ఎవరు ఎవరిని కాపాడారో అర్థమయ్యాక ఓ విభిన్నమైన కథ చదివిన తృప్తి పాఠకులకు కలుగుతుంది.

వడలి రాధాకృష్ణ గారి ‘ఇంతలేసి జీవితాలు’ చక్కని కథ. కరోనా కాలంలో మనుషుల ప్రవర్తన, వాళ్ళ ఆలోచనలు, భయాలు, సందిగ్ధాలను గొప్పగా చిత్రించింది. కరోనా కాలం నాటి అమానవీయతలకి, కరోనా అనంతరం యాదయ్య చూపిన మానవతా ధర్మానికి పాఠకులు జోహార్లంటారు.

స్వంత ఊరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ఇద్దరు అక్కచెల్లెళ్ళ కథ శ్రీమతి దాసరి శివకుమారి గారి ‘ఊరు బాగుండాలి’. భార్య సదుద్దేశాన్ని, ఆదర్శాలని భర్త గౌరవించడంతో సొంతూరికి మేలు చేయాలన్న ఆమె ఆకాంక్ష ఫలిస్తుంది.

తన ఉపాయంతో రక్తపాతాన్ని ఆపిన ఓ యువ ఎస్.పి. కథ డా. యమ్. సుగుణరావు రచించిన ‘ఎన్‍కౌంటర్’. ఎదురుకాల్పులలో ఓ కానిస్టేబుల్‍ని, దళంలో చేరిన అతని కొడుకుని చంపేయాలని ప్రణాళికలు వేసిన పెత్తందార్ల కుట్రని సమర్థంగా ఎదుర్కుంటాడా ఎస్.పి. సివిల్ సర్వీస్‍లోకి రాకముందు వైద్యుడైన ఆయన తనకి ప్రాణం విలువ తెలుసని అంటాడు.

యువ దంపతుల మధ్య నడిచే కథలో కాలింగ్‍బెల్‍ని ఓ పాత్రగా చేసి – భార్యాభర్తల మధ్య అలకలు, కోపాలు, తాపాలు, సరసాలను సందర్భోచితంగా ప్రదర్శించారు డా. ప్రభాకర్ జైనీ తన కథ ‘కాలింగ్ బెల్ నవ్వింది’లో. కేవలం కోరికలు తీర్చుకోడానికే కాకుండా, నిజంగానే రోజంతా ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటే దాంపత్యం బాగుంటుందని చెప్తుంది కాలింగ్ బెల్.

హృదయం మాటలు పెడచెవినపెట్టి, మనసు ఆడించినల్లా ఆడుతూ జీవితాన్ని గడిపిన చంచలరావు తన ఉద్యోగ బాధ్యతల్లో ఎందరినో మోసం చేస్తాడు. జీవితం చివరి దశలో ఎదురుదెబ్బలు తగిలి ఒంటరివాడయ్యాకా అతన్కో పశ్చాత్తపం కలుగుతుంది. సొంతూరి వచ్చి స్థిరపడి బాల్య స్నేహితుడు కూర్మమూర్తి దగ్గర తన గోడును వెళ్ళబోసుకుంటాడు. కూర్మమూర్తి అతనికి ప్రశాంతంగా బతకడమెలాగో చెప్తాడు. తన గురించి అడిగితే తన ఉద్యోగ బాధ్యతలలో తాను విద్యార్థులకు, ఉపాధ్యాయులకి, అవసరం ఉన్న వారికీ తనకి చేతనైనంత మేర సాయం చేశాననీ, చాలామందిని సన్మార్గంలోకి మళ్ళించానని చెప్తాడు కూర్మమూర్తి. మిత్రుడి జీవన విధానంలోని నిజాయితీని, నిబద్ధతని గ్రహించిన చంచలరావు తానూ ఆ మార్గంలోనే నడవాలనుకుంటాడు అంబల్ల జనార్దన్ గారి ‘కొండ – నది’ కథలో.

డబ్బు కోసం మనుషుల్ని పీడిస్తే, ఓ హద్దు వరకూ భరించినా, తరువాత వాళ్ళు తిరగబడితే పరిస్థితి ఎలా ఉంటుందో సి.హెచ్. శివరామ ప్రసాద్ (వాణిశ్రీ) గారి కథ ‘కోరికల రేసుగుఱ్ఱం’ చెబుతుంది. అత్తగారి దాష్టీకానికి మనసు విరిగిన కోడలు ఆమె పట్ల అంతే నిర్దయగా ప్రవర్తిస్తుంది. కుటుంబాలలో డబ్బే ప్రధానమనుకుంటే బాంధవ్యాలు ఎలా పలచనవుతాయో ఈ కథ కళ్ళకు కడుతుంది.

ఒక్క మంచి పని చేస్తే శీనయ్యలో పొద్దున్నుంచీ ఉన్న అలసటంతా ఎలా మాయమయిందో వల్లూరి విజయకుమార్ గారి ‘చెప్పులు’ కథ చెబుతుంది. మనసులో తడి ఉన్న మనుషులు ఇంకా ఉన్నారని చాటే కథ ఇది. థాంక్స్ చెప్పడం రాని మనుషులు!

జీవితం వ్యాపారంగా మారిన వైనాన్ని బండికల్లు జమదగ్ని గారి ‘జాయింట్ ప్రాపర్టీ’ కథ చెబుతుంది. పెళ్ళికి ముందే డేటింగ్ పేరితో కలిసి ఉండడం, తర్వాత డబ్బున్న మరో కుర్రాడిని చూసి అతన్ని పెళ్ళి చేసుకోడానికి సిద్ధం పడడం.. మాజీ ప్రియుడితో జాయింటుగా కొన్న ప్రాపర్టీని బలవంతంగా అమ్మించి అందులో సగం వాటా పట్టుకుపోవాలనుకున్న యువతిని ఈ కథలో చూస్తాం. అయితే ఆ యువతికి ప్లాన్‍లకి ఆమె తండ్రి ఎలా చెక్ పెట్టాడో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

నాణానికి రెండో వైపులా, పెద్ద హాస్పటల్ కట్టించి, అనేకానేక కారణాల వల్ల ఆసుపత్రి సరిగా నడవక, ప్రాక్టీసు లేక దెబ్బతిన్న ఓ వైద్యుడి కథ ఆర్. సి. కృష్ణస్వామి రాజు గారి ‘డబ్బు పాపిష్టిది!’. ఈ కథ చదివాకా మనసు బరువెక్కుతుంది.

ఇంటర్నెట్, ఫోన్, ట్యాబ్ వంటి డివైజ్‍లు – సరిగ్గా ఉపయోగించుకోకపోతే పిల్లలకి ఎంత చేటు చేస్తాయో మువ్వల జ్యోతి గారి ‘తప్పెవరిది’ కథ చెబుతుంది. ఆర్థిక మాంద్యం వల్ల ఊడుతున్న ఉద్యోగాల వల్ల ఐటి రంగంలోని వారికి ఎదురువున్న ఆర్థిక క్రుంగుబాటు కుటుంబాలలో ఎలాంటి చిచ్చు రేపుతుందో ఈ కథ వెల్లడిస్తుంది.

విహారి గారి ‘తీర్పు’ కథ కొందరు నిస్సహాయల అశక్తులను ఆసరాగా చేసుకుని చెలరేగిపోయే కొందరి స్వభావాలని,  జీవితంలోని ఆశ నిరాశలను, కష్ట సుఖాలను ప్రతిఫలిస్తుంది. ఈ కథలో కాలం ఇచ్చిన గొప్ప తీర్పును పాఠకులు కాదనలేరు.

కేతవరపు రాజ్యశ్రీ గారి ‘నా కంటూ ఒక జీవితం..’ తన స్వార్థం కోసం తల్లిని ఇబ్బంది పెట్టిన అనిత కథని చెబుతుంది. కూతురి స్వార్థాన్ని గ్రహించిన తల్లి, ఇండియాకి తిరిగొచ్చేస్తుంది. యథావిధిగా తన జీవితం తాను కొనసాగిస్తుంది. అనిత లాంటి స్వభావాలున్న వారు సమాజంలో తారసపడుతూనే ఉన్నారు.

తల్లితండ్రుల కోరిక, తన ఆశయమైన సివిల్ సర్వీసెస్‍లో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన శోభన – ట్రైయినింగ్‍కి వెళ్ళడానికి ముందు చేయాలనుకున్న పనులు గురించి విన్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. కూతురి నిర్ణయాన్ని హర్షిస్తారు అమ్మానాన్నలు. కూర చిదంబరం గారి ‘నిర్ణయం’ కథ ఆసక్తిగా సాగుతుంది.

తిరుమల శ్రీ గారి కథ ‘పల్లవి’ ఊహకి అందని మలుపుతో ముగుస్తుంది. ఈ కథని పాఠకులు ఎవరికి వారు చదువుకుని ఆ మలుపు ఏమిటో తెలుసుకోవాల్సిందే. పి. రాజేంద్రప్రసాద్ గారి కథ ‘పాఠం’ పనిమనిషి ఇంటి యజమానురాలికి ఓ జీవిత పాఠం నేర్పుతుంది.

తన ప్రమోషన్‍కి అడ్డొస్తున్నాడని కొలీగ్‍ని చంపించాలనుకున్న సుబ్బారావ్‍కి డాక్టర్ విశ్వాస్ సహాయం చేసినట్టే చేసి అతని మనసు మారుస్తాడు సూర్య గండ్రకోట గారి ‘ప్రమోషన్’ కథలో. నల్ల భూమయ్య గారి ‘పెద్దలుసురుమన్న’ సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమైన కథ. కార్మిక నేతగా ఎదిగి – యాజమాన్యంతో కుమ్ముక్కై కార్మికుల ఉసురుపోసుకున్న రావుగారి జీవితం పైపైకి దూసుకుపోయి, కాలగతిలో కిందకి జారి అధోగతి పాలవుతుంది.

పాణ్యం దత్తశర్మ గారి కథ ‘పెంపకాలు’ రెండు భిన్నమైన కుటుంబాల్లో – విభిన్న పరిస్థితుల మధ్య పెరిగిన – ఇద్దరు అమ్మాయిల ప్రవర్తనలోనూ, తీరుతెన్నులోనూ ఉన్న తేడాలను ప్రదర్శిస్తుంది. పెంపకాలలోని వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతుంది. పిల్లల్ని ఎలా పెంచితే, జీవితంలో వాళ్ళు సుఖపడి, పెద్దలనీ సుఖపెడతారో ఈ కథ చెబుతుంది.

తమిళనాడు – శ్రీలంక సముద్ర జలాలలో చేపలు పట్టి పొట్టపోసుకునే జాలర్ల జీవనాన్ని పాఠకుల కనుల ముందు దృశ్యమానం చేస్తుంది సింహప్రసాద్ గారి ‘బతకాలి!’ కథ. రెండు దేశాల మధ్య రాజకీయాలను జాలర్ల సమస్యకు ముడిపెట్టి అల్లిన ఈ కథ పాఠకులకు కొత్త పఠనానుభవాన్ని కలిగిస్తుంది.

వియోగి గారి ‘భద్రత’ కథ కుటుంబం కోసం అప్పులు చేసి, తీర్చలేక చితికిపోయిన చలపతి గాథ. మెతకదనం వదిలించుకుని లౌక్యం నేర్చుకోకపోతే చలపతి లాంటి వాళ్ళు జీవితంలో నెగ్గుకురావడం చాలా కష్టం.

అమ్మానాన్నల మీద కోపంతో ఇల్లొదిలి నానమ్మ దగ్గరకొచ్చేసిన ప్రభాత్‍కి నానమ్మ మంచి మాటలు చెబుతుంది. జీవితం అంటే ఏంటో తెలియజేస్తుంది. ప్రభాత్‍ కోసం వచ్చిన కొడుకు కోడళ్ళ మనసు మారుస్తుంది. కొత్తపల్లి ఉదయబాబు గారి ‘బొమ్మరిల్లు’ తన జీవిత విధానం పైన అత్యంత స్పష్టత ఉన్న పరమేశ్వరి గారిని పాఠకులకు పరిచయం చేస్తుంది.

మామిదాల శైలజ గారి ‘మాధ(వి)వ్’ – కథ పేరే సూచించినట్లుగా పురుషుడిగా పుట్టి స్త్రీగా మారైన వ్యక్తి కథ. తల్లిదండ్రులు తనని నిరాదరించినా, వృద్ధాప్యంలో వాళ్ళకి అండగా నిలవాలనుకున్న థర్డ్ జెండర్ కథ.

ఎవరిమీదైనా నేరం మోపడం సులభమే, కానీ వాళ్ళు ఆ నేరమో (తప్పో) ఎందుకు చేస్తున్నారో కారణం తెలుసుకోకుండా రచ్చ చేయకూడదంటుంది కోనే నాగ వెంకట ఆంజనేయులు గారి కథ ‘మా నాన్న నేరస్థుడు’. ఆర్ద్రమైన కథ.

డా. కె. జె. రావు గారి ‘యంజ్ ఈజ్ ఫీలింగ్’ కథ పులికాట్ సరస్సు నేపథ్యంగా రాసిన కథ. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని నమ్మిన ఓ జంటకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఓ పత్రికా విలేఖరి రాసిన న్యూస్ ఐటమ్‍కి ఆ జంటలోని ఆవిడ మనస్సు నొచ్చుకుని అసలు వయోవృద్ధులంటే ఎవరో చెబుతుంది.

సలీం గారి సైన్స్ ఫిక్షన్ కథ ‘రిసా’ భూమి మీద ప్రకృతిని పరిరక్షించుకోవడం వాతావరణాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో చెబుతుంది. ఒక ప్రళయం తర్వాత భూమి మీద మిగిలిన కొద్ది మంది మనుషులని రిసా గ్రహవాసులు కాపాడి, తమ గ్రహానికి తీసుకువెళ్ళి, అన్ని విధాలుగా సాయం చేసి, మానవజాతిని పునురుద్ధరిస్తారు. కానీ మనుషులు అక్కడ కూడా తమ కుత్సితాన్ని ప్రదర్శించి రిసా గ్రహవాసుల్ని నాశనం చేయాలని కుట్ర పన్నుతారు. మనుషుల నైజం మారకపోతే, భూమ్మీద ఉన్నా, అంతరిక్షంలో ఉన్నా ఒకటేనని ఈ కథ సూచిస్తుంది.

మోని శ్రీనివాస్ గారి ‘వెలిగే చీకటి’ కథ పిల్లలపై చదువుల పేరుతో అధిక ఒత్తిడి కలిగించకూడదని చెప్పే కథ. ఈ కథలోని కొసమెరుపుని పాఠకులు అభినందించకుండా ఉండలేరు.

అంగర వెంకట శివప్రసాదరావు గారి కథ ‘వేణీ సింగారం’ ఓ ప్రముఖ పత్రికలో హాస్యకథల పోటీలో బహమతి గెల్చుకున్న కథ. కాశీ, ప్రయాగ యాత్రల నేపథ్యంగా అల్లిన కథ. భార్యాభర్తలిద్దరూ కాశీకి వెడితే, అక్కడ జరిపే ఓ ఆచారం వేణీ సింగారం. భార్యని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆమెకి జడ వేసి అందులో చివరి ఘట్టంగా వేణి సంహారం అంటే జడ చివర్నించు మూడు వెంట్రుకలు కత్తిరించి గంగలో కలిపిరావాలి. ఈ కథలో స్థూలకాయం ఉన్న భార్యని ఒళ్లో కూర్చొబెట్టుకోడానికి భర్త పడిన అవస్థని చెప్పారు రచయిత.

చెట్టుకు మూలం వేర్లని చెప్పే అవే లేకపోతే, పతనమేనని చెప్పిన కథ గన్నవరపు నరసింహారావు గారి ‘వ్రేళ్ళు’. అభిమన్యు గారి ‘సాహసం సేయవలె’ కథ గ్రామంలోకి జొరబడి పశువుల్ని చంపుతున్న పులిని చంపడానికి గ్రామస్థులు సిద్ధమైతే, వద్దని వారించిన రాము యుక్తితో ఆ పులిని బంధింపజేస్తాడు.

పట్నాల ఈశ్వరరావు గారి ‘సుజాత’ కథ ఒక విద్యార్థినితో, ఆమె తండ్రితో ఓ ప్రధానోపాధ్యాయుడికి ఎదురైన అనుభవాలను చెబుతుంది. ఆ చిన్నారి అభ్యర్థన ఆయనలో ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది. మొత్తానికి తండ్రి మనసు మారి కూతురి సమస్య తీరడంతో ఊపిరి పీల్చుకుంటారయన.

~

సింహప్రసాద్ సాహితీ సమితి నిర్వహించిన మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ 2023 బహుమతి పొందిన మూడు కథలను ఈ సంకలనంలో జోడించారు. భాస్కరాచారి కశీవొజ్జల రాసిన ‘అగ్గిపుల్ల’ కథ ఆటిజం నేపథ్యంగా రాసిన కథ. ఆటిజంతో బాధపడుతున్న ఉషకి ఎంతో కొంత మేలు చేయాలని తపించిన ఓ టీచరు కథ. తోటి పిల్లల్ని చూసి ప్రేరణ పొంది ఆలస్యంగానైనా తనను తాను తీర్చిదిద్దుకుంటుంది ఉష.

మల్లారెడ్డి మురళీమోహన్ గారి ‘రెండు అగ్గిపుల్లలు చెప్పిన కథ’లో రెండు అగ్గిపుల్లలు మనుషులలోని స్వార్థానికి, పగకీ, సాక్షులుగా నిలుస్తాయి.

వెంకట శివకుమార్ కాకు రాసిన ‘చివరి చూపు కోసం’ కెరీర్‍లో ఎదగాలనుకునో, లేక తమ చదువుకు తగ్గ పరిశోధనకు అవాకాశాలుంటాయనో పాశ్చాత్యదేశాలకు వలసపోయి, కుటుంబ సభ్యులకు దూరమయ్యే వ్యక్తుల గురించి రాసిన కథ. ఆలోచింపజేసే కథ.

~

ఈ సంకలనం ఓ కదంబం. కదంబంలోని ఏ పువ్వు సొగసు ఆ పువ్వుదే. ఒకదానితో మరొకదాన్ని పోల్చలేము. పలు రకాల పువ్వులుంటే గుచ్ఛానికి వింత శోభ కలిగినట్టు, వైవిధ్యభరితమయిన కథలున్న ఈ సంకలనం పాఠకులను ఆకట్టుకుంటుదనడంలో సందేహం లేదు.

***

మా కథలు 2022
సంకలనం: సిహెచ్. శివరామ ప్రసాద్
ప్రచురణ: తెలుగు కథా రచయితల వేదిక
పేజీలు: 272
వెల: ₹ 99.00
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/te/products/ma-kathalu-2022

 

 

 

~

శ్రీ సి.హెచ్. శివరామ ప్రసాద్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-ch-sivarama-prasad/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here