Site icon Sanchika

డా. వేదగిరి రాంబాబు స్మారక పురస్కారాల ప్రదానోత్సవం, ‘మా కథలు 2023’ కథాసంకలనం ఆవిష్కరణ సభ – నివేదిక

[డా. వేదగిరి రాంబాబు స్మారక పురస్కారాల ప్రదానోత్సవం, ‘మా కథలు 2023’ కథాసంకలనం ఆవిష్కరణ సభ నివేదికని అందిస్తున్నారు శంకర కుమార్.]

[dropcap]14[/dropcap] అక్టోబరు 2024న, హైదరాబాదులోని రవీంద్రభారతి సమావేశమందిరంలో డా. వేదగిరి రాంబాబు స్మారక పురస్కార ప్రదానం, ‘మా కధలు 2023’ కథాసంకలన ఆవిష్కరణ ఒకే వేదికపై జరిగాయి. ఇవి గాక మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. సింహప్రసాద్ సాహిత్య సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.

‘మా కథలు 2023’ సంకలనం ప్రముఖ రచయిత, ‘సహస్ర కథానికాచక్రవర్తి’ మాన్యులు వాణిశ్రీ (సి.హెచ్. శివరామప్రసాద్) గారి సంపాదకత్వంలో వెలువడింది. దానిని శ్రీయుత రమణాచారి గారు ఆవిష్కరించారు. 296 పేజీలు, 38 కథలున్న ఈ చక్కని కూర్పును కేవలం 99/- రూపాయలకే పాఠకులకు అందిస్తున్న వాణిశ్రీ గారు ప్రశంసార్హులు.

సభకు ప్రముఖ రచయిత, కవి, విమర్శకులు, న్యాయనిర్ణేత, అజో.వి.భొ. ఫౌండేషన్ ప్రతిభా పురస్కార గ్రహీత శ్రీ విహరి గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విశ్రాంత ఐ.ఎ.ఎస్ అధికారి శ్రీ రమణాచారిగారు, విశిష్ట అతిథిగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, తెలంగాణ తొలి బి.సి. కమిషన్ చైర్మన్. శ్రీ బి. ఎస్. రాములు గారు, ఆత్మీయ అతిథిగా, నేషనల్ బుక్ ట్రస్ట్ సంపాదకులు శ్రీ పత్తిపాక మోహన్ గారు, ప్రత్యేక అతిథిగా, ఎమ్.వి.ఆర్. ఫౌండేషన్ అధ్యక్షులు, ప్రముఖ రచయిత శ్రీ మట్టగుంట వెంకట రమణ గారు విచ్చేశారు. అతిథులను శ్రీ పాణ్యం దత్తశర్మ వేదిక పైకి సగౌరవంగా ఆహ్వానించగా, డా. వేదగిరి రాంబాబు గారి కుమారులు చి. విజయ్ చంద్ర వారికి ఫలాలను అందజేశారు.

కథకుల గురువు శ్రీమాన్ కాళీపట్నం రామారావు గారికి, వారి శతజయంతి సందర్భంగా, ‘మా కథలు 2023’ ను అంకితం ఇచ్చారు. అంకిత పత్రాన్ని శ్రీ పాణ్యం దత్తశర్మ సమర్పించారు. అతిథులు, వేదగిరి రాంబాబు గారు కథానికకు తమ జీవితాన్ని, ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని ఎలా వెచ్చించారో గుర్తు చేసుకోని ఆ మహనీయుని ప్రశంసించారు. గత 15 సంవత్సరాలుగా ‘మా కథలు’ సంకలనాలను అవిశ్రాంతంగా తీసుకొని వస్తున్న వాణిశ్రీ గారిని అతిథులు ప్రశంసించారు.

తర్వాత, డా. వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారాన్ని, ‘బాలబాట పిల్లల పత్రిక’ సంపాదకురాలు, శ్రీమతి కె.యస్.వి. రమణమ్మ (విశాఖ) గారికి, కథానికా పురస్కారాన్ని శ్రీ హుమాయూన్ సంఘీర్ (హైదరాబాదు) గారికి ప్రదానం చేశారు.

శ్రీశ్రీ గారి ‘కాదేదీ కవితకనర్హం’ అన్న మాట స్ఫూర్తిగా, ‘కాదీదీ కథకనర్హం’ అన్న కాన్సెప్ట్‌తో సింహప్రసాద్ సాహిత్య సమితి వారు నిర్వహించిన కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. సర్వశ్రీ బండారి రాజకుమార్, బొడ్డేడ బలరామస్వామిమ్ వజ్జీరు ప్రదీప్ గార్లు ఈ బహుమతులు స్వీకరించారు.

సంకలనంలో కథలున్న రచయితలలో, సభకు హజరయిన వారికి కథాసంకలనం ప్రతులను శ్రీయుత రమణాచారి గారి చేతుల మీదుగా అందజేశారు.

Exit mobile version