Site icon Sanchika

మా మధ్య ప్రదేశ్ పర్యటన-1

[ఇటీవల మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]గు[/dropcap]జరాత్ – రాజస్థాన్ టూర్ చేసి వచ్చి తొమ్మిది నెలలవుతూ ఉంది. అరికాళ్లు దురద పెట్టడం మొదలు పెట్టాయి. తిట్టే నోరూ, తిరిగే కాలూ ఊరుకోదు కదా! అడపా దడపా సాహిత్యసభలకు వక్తగా వెళుతూనే ఉన్నా, లాంగ్ టూర్ వెళ్లినంత ఆనందం వేరు కదా! ఈసారి మా యోగా గాడితో బాటు మరో మిత్రుడు కూడా మాతో చేరాడు. ఆయిన పేరు డా. జెట్టి యల్లమంద. 40 సంవత్సరాలుగా నాకు పరమాప్తమిత్రుడు. 80లలో శ్రీకాకుళం జిల్లా పలాస లోను, 90లలో విశాఖ జిల్లా నర్సీపట్నం బాలుర కళాశాల లోను, ఆయన నాకు సహోద్యోగి. అయన సబ్జెక్టు తెలుగు. నాది సరే ఇంగ్లీషు. అయినా, ‘సాహిత్యం’ మాకు సాన్నిహిత్యం కలిగించింది. ఆయన గుర్రం జాషువా గారి స్మృతి కవిత్యం మీద పరిశోధన చేశాడు. నేను ప్రిన్సిపాల్‌గా వెళ్ళాను, ఆయన డిగ్రీ కాలేజీ ఉపన్యాసకుడిగా వెళ్లారు. మధ్యలో కొంత గ్యాప్ తర్వాత మళ్లీ అప్రతిహతంగా కొనసాగుతుంది మా స్నేహం. మా యోగానంద గురించి మీకిది వరకే తెలుసు. వాడు నా బాల్యమిత్రుడు. వాడెప్పుడూ టూర్లలో నా వెంటే!

మొత్తానికి ‘ముగ్గురు మారాఠీలు’ బయలుదేరాం. అదేమిటి? అనుకుంటున్నారా? మా బ్యాచ్‌కి నేను పెట్టిన పేరది, సరదాగా. 1946లో వచ్చిన అక్కినేని సినిమా గుర్తుందా? ఘంటసాల బలరామయ్యగారు తీశారు. అక్కినేనికది మూడవ సినిమా. సూపర్ హిట్. హండ్రెడ్ డేస్. మొదట్లో నేను మరాఠీలు అంటే మాంత్రికులు అనుకునేవాడిని. ఎందుకో తెలియదు. 1972లో మా కర్నూలు నవరంగ్ టాకీసులో చూశాను. అద్భుతమైన సినిమా. మరాఠీలు అంటే మహారాష్ట్ర రాజకుమారులని, గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబల నట విశ్వరూపం చూడవచ్చు మనం. నాగేశ్వరావుది ‘నూనూగు మీసాల నూత్న యవ్వనం’. గొంతు కూడా పీలగా ఉండేది. అప్పుడే విసుగ్గా మొహం పెడుతున్నారా? తప్పదు మరి. ‘కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత’ అన్నట్లు, నా ట్రావెలాగ్‌లో ఇలాంటి డైగ్రెషన్స్ తప్పవు మరి. లేకపోతే అది డాక్యుమెంటరీలా అయి కూర్చుంటుంది. ఫిక్షన్, హ్యూమర్, హ్యూమన్ ఎలిమెంట్‌తో దాన్ని సుసంపన్నం చేయాలని నా తపన. దానికి మా తమ్ముడు కస్తూరివారి ప్రోత్సాహం ఉండనే ఉంది.

సెప్టెంబర్ లోనే మా ఆస్థాన ట్రావెల్ ఏజెన్సీ ‘డోనట్ ట్రావెల్స్’ వారికి ఫోన్ చేశాను. అందులోని మేనేజర్లు జోజో, సందీప్ నాకు శిష్యులైనారు. ఆ మధ్య డోనట్ సందీప్‌కి కూతురు పుడితే, నాకు ఫోన్ చేసి “మా బేటీకి మంచి పేరు పెట్టండి డాడీ” అని అడిగాడు. నేను ‘సంహిత’, ‘ధృతి’ అని రెండు పేర్లు సూచించాను. ఇప్పుడు ధృతికి ఐదు నెలలు. జోజో భాయ్ ఇలా చెప్పాడు –

“సార్ ఎం.పి. టూర్ ఆరు రాత్రులు, ఆరు పగల్లు (ట్రావెల్స్ వాళ్లలాగే చెబుతారు. ఆరు రోజులంటే పోలా?). పోగ్రామ్ చాక్ అవుట్ చేసి చెబుతాను.”

ఒక గంటలో అతన్నించి ఫోన్ వచ్చింది. అతడు చెప్పింది విని నాకు కోపం వచ్చింది. ఎందుకంటే, మేం గత మార్చిలో జయపూరు నుంచి తిరిగివస్తున్నపుడు, భోపాల్ స్టేషనులో రైలు ఆగింది. మా కస్తూరి తమ్ముడికి ఫోన్ చేశాను. ఆయన సరదాగా, “అన్నగారు, భోపాల్‍లో దిగి, ఖజురహా చూసి రండి” అన్నాడు. నేను నవ్వి, “ఈ సారి మధ్య ప్రదేశ్ టూర్ ప్లాన్ చేద్దాం తమ్ముడు” అన్నా.

జోజో చెప్పిన ప్యాకేజ్‌లో ఖజురహో లేదు! ప్రతి టూరు ఇలాగే చేస్తాడు.

“ఏమయ్యా! ఖజురహో లేకుండా ఎం.పి. టూరేమిటి, మదీయబొంద!” అని తిట్టాను.

“సార్. వినండి. అది దీంట్లో ఇన్‍క్లూడ్ అవదు. భోపాల్‌కు 400 కి.మీ ఉంటుంది ఖజురహో. మరో రెండు రోజులు పెంచి ప్లాన్ చేస్తాను. కాని దానికి ఎక్స్‌ట్రా టారిఫ్ అవుతుంది.”

ఇది వీళ్ల స్ట్రాటజీ యేమో? కానీ, తెలిసినవాళ్లు, మంచి వాళ్ళు. మన మీద గౌరవాభిమానాలున్నవారు.

“సరే, చెప్పు మరి.”

“రేపు వివరంగా ఫోన్ చేస్తాను.”

రేపు రానే వచ్చింది. నిన్న పోనేపోయింది. జోజో భాయ్ చెప్పాడు. “సార్! మీరు హైదరాబాద్ నుంచి భోపాల్ రావాలి. మర్నాడుదయం ఖజురహోకు మహామానా ఎక్స్‌ప్రెస్ ఇంటర్‍సిటీ ఉంది. ఆరుగంటల జర్నీ. మధ్యాహ్నం ఖజురహో చేరుకుంటారు. ఆ రోజు, మర్నాడు ఖజురహో లోని దేవాలయాలను, శిల్పసంపదను దర్శిస్తారు. రెండవ రోజు సాయంత్రం బయలుదేరి రాత్రి పదిన్నరకు భోపాల్ చేరతారు. మర్నాటినుంచి మా ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. అది ఆరు రోజులు. ప్రయాణంతో కలిసి 8+2 = పది రోజల టూర్.”

సంభాషణ అంతా హిందీ, ఇంగ్లీషుల్లో సాగుతోంది. డోనట్ ట్రావెల్స్ వారి హెడా క్వార్టర్స్ ఎర్నాకుళం. వారు ఇంటర్నేషనల్ టూర్ ఆపరేటర్లు.

“సరేనయ్యా, టారిఫ్ మొత్తం చెప్పు మరి. భరించగలమో లేదో చూడాలి కదా!” అన్నాను.

“మీకేం సార్. దండిగా పెన్షన్ వస్తుంది కదా!” అని నవ్వుతున్నాడు జోజో.

“మొత్తం ముగ్గరికి సార్. మనిషికి 28 వేల రూపాయలవుతుంది. ఖజురహోది ట్రెయిన్ ఫేర్+హోటల్ బుకింగ్, కారు, డ్రైవర్ కమ్ గైడ్ – మనిషికి నాలుగు వేలు. మొత్తం 32 వేలు పర్ హెడ్.”

“ఎక్కువనిపిస్తోంది బ్రదర్”

“మొత్తం మీద తగ్గిస్తాను లెండి.”

“ఎంత తగ్గిస్తావ్?”

“మూడు వేలు తగ్గించి ఇవ్వండి.”

“ఇంకో మాట చెప్పు” అన్నా, ‘యమలీల’ లో అలీ లాగా!

“మీ దయ సార్” అన్నాడు వినయంగా.

“సరే! ఐదువేలు తగ్గించు. మాకో బిల్లులేం వద్దు. జి.ఎస్.టి వెయ్యకు.”

“ఒకే. సర్.”

***

మేం ముగ్గురం మాట్లాడుకొని, ఒక అంగీకారానికి వచ్చి, వాళ్లకు డేట్స్ తెలిపాం. నవంబరు 18 నుంచి 27 వరకు. గంటలోనే ట్రయిన్ రిజర్వేషన్స్ చేసి టికెట్లు పంపాడు. ఖజురహా లోని హోటల్ బుకింగ్స్‌తో సహా! ఒక పైసా కూడా అడగలేదు. నమ్మకం! నమ్మకం మీదే జమానా నడుస్తుంది మరి. స్లీపర్ క్లాస్ చెయ్యమన్నాం. వింటర్ కదా!

18వ తారీఖు తెల్లవారు ఝామున 4.30 గంటలకు సికింద్రాబాద్ – సుబేదార్‌గంజ్ స్పెషల్ ట్రయిన్. అది రాత్రి 9 గంటలకు భోపాల్ చేరుతుంది. రైళ్ల రిజర్వేషన్స్ ముగ్గురికీ కలిపి ఎనిమిదివేలు.

యోగానంద కర్నూలు జిల్లా ఆదోనిలో ఉంటాడు. యల్లమంద విశాఖజిల్లా నర్సీపట్నం. వారికి ఇలా చెప్పాను

“యల్లమందా, నీవు తునిలో 17 ఉదయం జన్మభూమి ఎక్కు. రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ చేరతావు. ఒరేయ్ యోగా, నీవు కర్నూలుకు వచ్చి మధ్యాహ్నం తుంగభద్ర క్యాచ్ చేయి. దానికి రిజర్వేషన్ అవసరం లేదు. నీవూ సికింద్రాబాద్‍కు 7.30 కి చేరుకుంటావు. నేను ముందే స్టేషన్ ఎదుటే ఒక రూం తీసుకొని, మధ్యాహ్నం చెకిన్ చేసి ఉంటా. రాత్రి మీ ఇద్దరినీ రిసీవ్ చేసుకోని రూముకు తీసుకెళతా. రాత్రి రెస్ట్. ఉదయం 3 గంటలకు లేచి, స్నానాలు గావించి, స్టేషన్‍కు వెళ్లిపోదాం.”

ఇద్దరూ ఓ.కె. అన్నారు. మావాళ్లెంత బంగారుకొండలంటే, నేనెంత చెబితే అంత! అలా కాదు, ఇలా అని అనరు. నేను టీం లీడర్ అన్నమాట. ఒక నలభై వేలు ట్రాన్స్‌ఫర్ చేశాను డోనట్ వారికి. మిగతాది టూర్ బిగినింగ్‌లో చెల్లిస్తే సరి.

***

రెండు నెలలు ఇట్టే గడిచిపోయాయి. ప్రయాణానికి వారం ముందు, మా మిత్రులు శ్రీ జోస్యుల కృష్ణ బాబు గారిని కలవడానికి సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లాను. ఆయన పెద్దాపురం డిగ్రీ కాలేజ్‌లో తెలుగు లెక్చరర్‌గా రిటైరయ్యారు. నాకూ, యల్లమందకూ మిత్రులే. యల్లమందకు ఆంధ్ర యూనివర్సిటీలో సీనియర్. ఆయన గరీబ్ రథ్‌లో సామర్లకోట వెళుతున్నారు. ఆయన్ను స్టేషన్‌లో కలిశాను. మహదానంద పడిపోయారు. మంచి వక్త, పండితుడు.

పేదల రథం పోయింతర్వాత, ఆల్ఫా హోటల్లో ‘టీ’ తాగి పక్కనే ఉన్న ‘సితార’ హోటల్లో ఒక నాన్ ఎసి రూమ్ బుక్ చేశాను 17వ తారీఖుకు. ఎనిమిది వందలు. నాట్ బ్యాడ్. ఒక్క రాత్రికి చాలు.

నవంబరు 17న మధ్యాహ్నం లంచ్ చేసి, నా బ్యాగులు తీసుకొని, ఊబర్ ఆటోలో ‘సితార’ చేరుకున్నాను. కాసేపు పడుకొని లేచి ఆరుగంటలకు స్టేషన్ దగ్గర ఉన్న గణేష్ టెంపు‌ల్‌కి వెళ్ళాను. నిర్విఘ్నంగా మా యాత్రను సఫలం చేయమని, స్వామివారిని మొక్కుకుని, రేతిఫైల్ బస్ స్టేషన్ లోని ఎంట్రన్స్ ద్వారా ప్లాట్‌ఫారం నంబర్ వన్ చేరుకొన్నాను. ప్లాట్‌ఫారం టికెట్ కొన్నానండోయ్!

జన్మభూమి 7.20కి వచ్చింది. ఎ.సి. చెయిర్ కార్ నుంచి యల్లమంద దిగాడు. ఆనందంగా నన్ను కౌగిలించుకున్నాడు. ఆయనకు 70 సంవత్సరాలు. స్మార్ట్‍గా టక్ చేసుకొని, షూస్ వేసుకొని ఉన్నాడు. నలభై ఏళ్ల నుండి అదే గెటప్ మా మిత్రుడిది.

“చల్లగా ఉంది కదా! ఎ.సి.లో రాకపోతేనేం?” అన్నా నవ్వుతూ.

“మావాడు వినలేదు మిత్రమా!” అన్నాడు నిస్సహాయంగా. నేను నవ్వాను.

“కొడుకులంతే మరి, మనల్ను కంఫర్టబుల్‍గా ఉంచాలనీ వారి తపన. మనం స్లీపర్‌లో వెళ్లి వస్తున్నట్లు మా వాడికి చెప్పలేదు. చెపితే కోప్పడతాడు వెధవ” అన్నాను.

ఇరవై నిమిషాల్లో తుంగభద్ర 10వ నంబర్ మీదకి వస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరం ఎస్కలేటర్ ఎక్కి, ఓవర్ బ్రిడ్జ్ మీదుగా ప్లాట్‌ఫారం మీదికి చేరుకున్నాం. తుంగభద్ర వచ్చి ఆగి ఉంది. కర్నూలు – సికింద్రాబాద్ ఇంటర్ సిటీ అది.

మా యోగా గాడికి ఫోన్ చేశాను.

“ఏరా, దిగావా? ఎక్కడున్నావు. కోచ్ నంబర్ చెప్పు.”

“దిగాను శర్మా. కోచ్ నంబరా? ఏమో నాకేం తెలుసు?”

వాడి ధోరణి అలాగే ఉంటుంది.

“కంపార్ట్‌మెంట్ మీద ఉంటుంది చూడరా వెధవా!”

“ఆ! ఉంది! ‘అన్ రిజర్వడ్’ అని ఉంది”

“నీ మొహం! ఇంజను వైపా, వెనక వైపా”

“ఏమో”

నాకు వాడిని తన్నాలనిపించింది. మా వ్యవహారాన్ని యల్లమంద నవ్వుతూ చూస్తున్నాడు.

“ఆ! ఇంజన్ నుంచి ఐదో పెట్టె. ఇక్కడ బిస్కెట్లు అమ్మే షాపుంది”

వెళ్లి, వాడిని కలిశాము. వాడు నవ్వుతున్నాడు. నా భుజం మీద గట్టిగా కొట్టి “నన్ను తన్నాలనిపించిందా? కొట్టు మరి!” అని నా ముందు వంగాడు వాడు.

“ఏడ్చావులే” అని వాడిని కౌగిలించుకున్నా. వాడు 68, నేను 67. ముగ్గురిలో కుర్రాడ్ని నేనే!

యల్లమందను వాడికి పరిచయం చేశాను.

“నేను అనుకున్నట్లే ఉన్నారు మీరు యోగానంద గారు” అన్నాడు.

“మా శర్మ ఫోన్‌లో మీకు నా గురించి చెప్పి ఉంటాడు సార్. ఏం అనుకోకండి. మా కత ఇట్లే ఉంటుంది.”

“చూడముచ్చటగా ఉందండి.”

ముగ్గురం స్టేషన్ బయటికి వచ్చి, బ్యాగులు లాక్కుంటూ ‘సితార’ చేరుకున్నాం. ఎనిమిదిన్నర. ఇద్దరూ స్నానాలు చేశారు. దగ్గర ఉన్న పద్మజ హోటల్‌కు వెళ్లి భోజనం చేశాము. కాసేపు కబుర్లు చెప్పుకుని పడుకున్నాం. తెల్లవారు ఝాము 3 గంటలకి మోగేలా ఫోన్‌లో అలారం పెట్టాను. ఇద్దరినీ లేపాను. స్నానాలు చేసి, చెక్ అవుట్ చేశాం. ఎందుకో అల్ఫా హోటల్ మూసి ఉంది. స్నేహితులకు అల్ఫా టీ తాగించలేక పోయినందుకు నిరాశపడ్డాను.

మా రైలు, సుబేదార్‌గంజ్ ఎక్స్‌ప్రెస్ ఒకటో నంబర్ లోనే ఉంది. ఇంకా అరగంట టైం ఉంది. ఐ.ఆర్.సి.టి.సి వారి కెఫటీరియా లోకి వెళ్లి చక్కని ఫిల్టర్ కాఫీ తాగాము. నేను, మా యోగా స్వీట్ బాయ్స్‌మి అంటే డయాబెటిక్స్. యల్లమందకు ఆ సమస్య లేదు. మేం షుగర్‌లెస్, అయన షుగర్‌తో తాగి, మా S9 లో ఎక్కి కూర్చున్నాం. మాకు రెండు లోయర్, ఒక మిడిల్ వచ్చాయి.

“విత్రులారా, హాయిగా నిద్రపోదాం” అన్నాను. మిడిల్ బెర్త్ వేసి, ముగ్గురం పడుకున్నాం. మూడు గంటలు గాఢ నిద్ర. లేచి చూస్తే మంచిర్యాల స్టేషన్. ఆగి ఉంది రైలు. అందరూ నార్త్ ఇండియన్స్ ఉన్నారా రైల్లో. వారానికి ఒకసారి నడుస్తుందట. భోపాల్ నుంచి, కాన్పూర్ మీదుగా సుబేదార్‌గంజ్ (యుపి) వెళ్తుంది.

మొహాలు కడుక్కొని ఫ్రెష్ అయ్యాము. ఇడ్లీ వడ, పోహా, బ్రెడ్ ఆమ్లెట్, పూరీ సబ్జీ, సిల్వర్ ఫాయిల్ పాకెట్లలో అమ్ముతూ వచ్చాడొకతను. ఏదైనా యాభై రూయాలు. ఇడ్లీవడ తిన్నాం. బాగానే ఉంది. 12 గంటలకు బలార్షా చేరింది రైలు. అక్కడ మజ్జిగ పాకెట్లు కొనుక్కొని తాగాం. ఉడకబెట్టిన వేరుశనగ కాయలు బుట్టలో తెచ్చిందొకామె. ఇరవై రూపాయలవి కొనుక్కొని, ముగ్గురం తిన్నాం.

మేం లంచ్ ముందుగా ఆర్డర్ చేసుకోలేదు. కాని నాగపూర్‌లో ఒకటన్నరకి లంచ్ వచ్చింది. 150 రూపాయలు. రెండు రోటీలు, దాల్, ఆచార్ పాకెట్, అలూమటర్ కూర, ఇంకో కూర ఏదో ఇచ్చాడు. బాగానే ఉంది. పెరుగు లేదు! దహీ నహీ!

4.30కి ఇటార్సీ జంక్షన్ వచ్చింది. సిరిపూర్ కాగజ్‌నగర్ తర్వాత రైలు మహారాష్ట్రలో ప్రవేశించింది. సిరిపూర్ తర్వాత స్టాప్స్ చాలా తక్కువ. రెండు మూడుగంటలకొక మేజర్ స్టాప్. అంతే. ఇటార్సీలో శ్రీరామనవమి పానకం లాంటి టీ తాగాం. నోరంతా పాడయింది. యోగాగాడు చిన్న ఫోల్డర్‌లో లవంగాలు తెచ్చాడు. తలా ఒకటిచ్చాడు.

“ఆకలేస్తుందిరా!” అన్నా. సాయంత్రం నాకు స్నాక్స్ కావాలి. సమోసాలు రాలేదు.

“నేను మిక్చర్ తెచ్చాను” అన్నాడు వాడు.

“మీ సిస్టర్ జంతికలు, పప్పు చెక్కలు చేసిచ్చింది” అన్నాడు యల్లమంద.

“ఇంకేం! తియ్యండి బయటికి!” అన్నా.

యోగాగాడెంత తెలివైనవాడంటే పేపర్ ప్లేట్లు కూడా తెచ్చాడు. ముగ్గరం స్నాక్స్ తిన్నాం. కబుర్లలో పడిపోయాం.

యల్లమందను ఏదైనా పద్యం పాడమన్నాను. ఆయన మంచి గాయకుడు. కరుణశ్రీ గారి ‘భావోద్యానమునందు క్రొత్తవలపుంబందిళ్లలో కోరికల్..’ అన్న పద్యాన్ని, మధురంగా ఆలపించాడు మిత్రుడు.

ఇద్దరం చప్పట్లు కొట్టాం. పక్క బెర్తులవాళ్లు కొందరు వచ్చికూర్చున్నారు.

“ఏ బాసా కోన్‍సీ హై?” అనడిగాడు ఒకాయన నన్ను.

“తెలుగు” అని చెప్పాను గర్వంగా.

“మా శర్మ కూడా బ్రహ్మాండంగా పాడతాడు సార్” అన్నాడు మా యోగా.

“నాకు తెలియదా అండీ.” అన్నాడాయన.

“ఇంగ్లీషు మాస్టారు! ‘లవకుశ’లోని ‘ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత..’ అందుకోండి!” అన్నాడు.

నేను ప్రిన్సిపాల్ నయినా, ఆయన నన్నలాగే పిలుస్తాడు. పలాసా నాటి పిలుపది. ఆయన్ను నేను పేరు పెట్టి, ఏకవచనంతో పిలుస్తా. అతడు మాత్రం నన్ను ‘మీరు’ అని మన్నిస్తాడు. అలా వద్దని ఎంత చెప్పినా వినడు.

పద్యం పాడాను. మిత్రులతో బాటు ఇతర ప్రయాణీకులూ చప్పట్లు కొట్టారు!

“ఆప్ కా ఆవాజ్ బహుత్ అచ్ఛా హై అంకుల్” అన్నాడో యువకుడు. ‘మ్యూజిక్ హాజ్ నో లాంగ్వేజ్’ అని మరోసారి రుజువైంది!

***

రైలు ఒకగంట ఆలస్యంగా 10 గంటలకు భోపాల్ చేరుకుంది. రెండు గంటలు ముందుగానే డ్రైవర్ ఫోన్.

“దత్తాశర్మాజీ హైనా సాబ్! మై ఆప్ కే లియే ఇంత జార్ కర్ రహ హు జీ, స్టేషన్ పే! ఆప్ గేట్ నం. తీన్ సే బాహర్ నికలియే.”

“తుమ్హారా నామ్?”

“అర్షద్ హై సాబ్.”

రైలు దిగి బయటికి వెళ్లాము.

Images courtesy: Internet

(సశేషం)

Exit mobile version