Site icon Sanchika

మా మధ్య ప్రదేశ్ పర్యటన-10

[ఇటీవల మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]మ[/dropcap]ర్నాడు ఉదయమే మా ఓంకారేశ్వర ప్రయాణం. మధ్యప్రదేశ్ లోని రెండో జ్యోతిర్లింగ క్షేత్రమది. 7.00 గంటలకు చెక్ ఔట్ చేశాము. అక్కడి నుంచి 140 కి.మీ ప్రయాణం. దారిలోనే మహేశ్వర్ క్షేత్రం వస్తుందని కుశాగ్ర్ చెప్పాడు. “కాని మనం ముందు ఓంకారేశ్వర్‌ను దర్శించుకుని వద్దాం, మహేశ్వర్‌లో మనకు రూం బుక్ చేశారు” అన్నాడు. మహేశ్వర్‌లో మాకు ఇడ్లీ సాంబారు దొరికింది. అంత బాగోలేదు. కానీ, బ్రెడ్ బజ్జీ కంటే మేలే కదా! సాంబారు పొగలు కక్కుతూ ఉండి, ఇడ్లీని తినేలా చేసింది. మంచి నెస్‌కెఫే ఇన్‌స్టంట్ కాఫీ కూడా!

మేము ఓంకారేశ్వర్ చేరుకొనే సరికి ఉదయం 11 గంటలు దాటింది. వేలాది మంది యాత్రికులు ఓంకారేశ్వరుని దర్శనం కోసం, ఆ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని చేరుకొన్నారు. ఎటు చూసినా జనవాహిని!

ఒకతను వచ్చి, నర్మదానదిలో పడవపై అటువైపు తీసుకొని వెళతానని, దర్శనం అయింతర్వాత, మళ్లీ ఆదిశంకరుల విగ్రహం ప్రతిష్ఠించిన చోటు దగ్గర, ఒడ్డున ఆపి, వేచి ఉంటానని, మళ్లీ ఇటువైపు ఒడ్డుకు తీసుకువచ్చి వదలి వేస్తానని చెప్పాడు.

“ముగ్గురు ఉన్నాం. ఎంత తీసుకుంటావు?” అని అడిగితే

“మనిషికి వెయ్యి చొప్పున ఇవ్వండి సార్!” అన్నాడు. అంటే మూడువేలు! పదిహేను వందలిస్తామన్నాను. రెండువేల దగ్గర బేరం సెటిలయ్యింది. అతని వెంట వెళ్లబోతుంటే, ఒక తెలుగు కుటుంబం కనపడింది. మేం తెలుగు మాట్లాడుకోవటం విన్నట్లున్నారు.

“సార్! పడవ ఎందుకండీ! నదిలో ప్రయాణించడం తప్ప, దేవుని దర్శనానికి దానికి సంబంధమే లేదు. దర్శనంఐన తర్వాత అంతగా అయితే మనిషికి నూటయాభై ఇచ్చి, నదిలో ఒక అరగంట తిరిగి రావొచ్చు.” అన్నాడు ఆయన.

“థ్యాంక్స్ అండి! మీరు చెప్పకపోతే..” అన్నాను

“అయ్యో! ఆ మాత్రం గైడ్ చేయకపోతే ఎట్లా సార్. మాది అనకాపల్లి. మీది?”

“హైదరాబాద్ సార్.”

“అదిగో కనబడుతుందే హ్యాంగింగ్ బ్రిడ్జ్! దాని మీదుగా వెళ్లి ఎడమ వైపు తిరగండి. కొండ పొడవునా స్కైవాక్ లాంటి క్యూ లైన్ ఉంటుంది. దాని గుండా వెళ్లి ధర్మ దర్శనం క్యూలో ప్రవేశించండి. ప్రత్యేక దర్శనం చేయిస్తామని, కలశంతో నీళ్ళు తెచ్చి, ఓంకారేశ్వరునికి మీ చేతులతో అభిషేకం చేయిస్తామని, పండిత్‌జీలు చాలామంది మిమ్మల్ని అడుగుతారు. అంతా మోసమండీ! మన దగ్గర డబ్బు తీసుకోని, మళ్లీ కనబడరు. శీఘ్ర దర్శనం క్యూ కొంతవరకే. తర్వాత అందరికీ ఒకే క్యూ. కలశమంటే ఏమిటో తెలుసా సార్! చిన్న ప్లాస్టిక్ క్యాన్‌లో నీళ్లు! అసలు శివుని ముందు మనల్ని కొన్ని సెకన్లు కూడ నిలబడనియ్యరు. గుహ సార్ అది!”

“ఇదంతా మీకు ఎలా తెలుసు?” అన్నాను.

“మేం నిన్న మహేశ్వరంలో ఉండి, ఉదయాన్నే ఇక్కటికి వచ్చాము. అంతా స్వానుభవమండి బాబు! మేం మోసపోయినట్లు మీరు కాకూడదని..” అన్నాడాయన నవ్వుతూ. ఆయన పేరు నూకరాజట. అనకాపల్లిలో హోల్‌సేల్ బెల్లం వ్యాపారం.

“చాలా మేలు చేశారండి!” అన్నాను ఆయనకు నమస్కరిస్తూ!

ఎంత సంస్కారం చూడండి. తనకు వచ్చిన కష్టం ఇతరులకు రాకూడదు అనుకోవడం ఎంత గొప్ప వ్యక్తిత్వం? నాలో భారతంలో ద్రౌపదీదేవి గుర్తుకువచ్చింది. ఉపపాండవులను, నిర్దాక్షిణ్యంగా, నిద్ర లోనే సంహరించిన అశ్వత్థామను కట్టితెచ్చి, ద్రౌపదీదేవి ముందు పడవేస్తాడు అర్జునుడు. “నీవు ‘ఊ’ అను! వీడిని ఖండ ఖండాలుగా నరుకుతాను” అంటాడు. ఆ సన్నివేశాన్ని మిత్రులతో పంచుకున్నాను.

“అప్పుడామె ఒక పద్యం చెబుతుంది.. అది..” అంటూ ఆలోచించసాగాను.

“నాకు వచ్చు మిత్రమా! ఆ పద్యం!” అన్నాడు యల్లమంద. అని, పాడి వినిపించాడు.

ఉ॥

“అక్కట! పుత్త్ర శోక జనితాకులభార విషణ్ణచిత్తనై

పొక్కుచు నున్న భంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁ జేసి నేఁ

డిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత, నేఁ

డెక్కడ నిట్టి శోకమున నేక్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో?”

“నాకు కల్గిన పుత్రశోకం, నీ తల్లికి ఎందుకు రావాలి? వద్దు! నాయనా! వెళ్లిపో!”

“అనకాపల్లి నూకరాజు గారిని తెచ్చి, భారతంలో ద్రౌపదీదేవికి ముడిపెట్టారు! పండితులా మజాకా?” అన్నారు యోగానందులవారు. మేమిద్దరం నవ్వాము.

అంత జనంలో, మా యల్లమంద రాగయుక్తంగా పద్యం పాడుతూ ఉంటే, కొందరు ఆగి, భాష రాకపోయినా, విని, ఆనందించారు! మ్యూజిక్ హాజ్ నో లాంగ్వేజ్!

ఒకాయన అడిగాడు యల్లమందను “ఏ కౌన్‍సీ భాషా హై, మహోదయ్?”

“తెలుగు జీ” అన్నాడు యల్లమంద. “చూసారా! హిందీ ఎంత బాగా మాట్లాడానో!” అన్నాడు మాతో పైగా!

సస్పెన్షన్ బ్రిడ్జ్ మీదకు ప్రవేశించాము. నర్మదా నదికి అడ్డంగా దాన్ని నిర్మించారు. 300 మీటర్ల పొడవుంది. అటువైపు ఎత్తైన పచ్చని కొండ! దానిలోని గుహాంతర్భాగంలో స్వామివారు! బ్రిడ్జ్‌ని మధ్య రెయిలింగ్‌తో విభజించారు. దాని వల్ల వెళ్లేవాళ్లు వచ్చివాళ్ల క్లాష్ అవకుండా, ‘వన్ వే’ అయింది. క్రింద వంద మీటర్ల అడుగున నర్మదా నదీమతల్లి ప్రవహిస్తూంది. దూరంగా నర్మదా ప్రాజెక్ట్ కనబడుతుంది. క్రింద ఎన్నో స్టీం బోట్లు యాత్రికులను ఎక్కించుకొని నదిలో తిరుగుతున్నాయి. రంగురంగుల బోట్లు! అందంగా ఉన్నాయి. నదికి ఇరు ఒడ్డులా, భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు.

బ్రిడ్జ్ మీదుగా అటువైపు చేరుకోవడానికి మాకు పావుగంట పట్టిందంటే ఎంత రష్‌గా ఉందో అర్థం చేసుకోండి. అటు నుంచి ఎడమ వైపుకు మరో క్యూ లైన్. అదీ వన్‌వేనే. అది సుమారు 500 మీటర్ల పొడవుంది. కొండనానుకొని ఉంది. ఇటువైపునది. అటు వైపు కొండ అంచు వెంబటి రకరకాల దుకాణాలు వరుసగా ఉన్నాయి.

“హర్ హర్ మహాదేవ్! జై భోలేనాథ్” అన్న శివనామస్మరణ మారుమ్రోగుతూంది. మేమూ వారితో పాటు నినదించాము. మా మనస్సు శివమయం అయింది. నాకు వైబ్రేషన్స్ మొదలయ్యాయి. కంటి వెంట నీరు.

నూకరాజుగారు చెప్పింది నిజమే. దర్శనం త్వరగా చేయిస్తామని, అభిషేకం కూడా చేయిస్తామని, పండి‍త్‍జీ మహరాజ్‌లు క్యూ లైన్ బయట భక్తులను వేధిస్తున్నారు. దాదాపు గంటపైన క్యూ లో ఉన్నాం. అతి నెమ్మదిగా కదులుతూంది. సింగిల్ లైన్ కాదు. ఒక రకంగా దొమ్మీ! తోసుకుంటున్నారు. కొందరు పండిత్‌జీలు రెయిలింగ్ మీదికి ఎక్కి పైకి వెళ్లిపోతున్నారు.

క్యూ మధ్యలో మెట్లు! ఎక్కడం, దిగడం! చిన్న అంత వెలుగు లేని దారులు కేవలం శివాలయాల్లోనే అనుభవమయ్యే ఒక పవిత్ర పరిమళం. అన్ని వేలమంది! కొంత త్రోపులాట ఉన్నా, భక్తుల స్వీయ క్రమశిక్షణ చాలా గొప్పది. వారిని నియంత్రిస్తూన్నది ఓంకారేశ్వరుడు గాక మరెవ్వరు?

కొన్ని మెట్లు దిగింతర్వాత స్వామి దర్శనం అయింది. అడ్డంగా ఒక గ్లాస్ బిగించారు. కేవలం నాలుగంగుళాలు కూడ ఎత్తు లేని జ్యోతిర్లింగం. మెట్ల మీదుగా దర్శనమిచ్చింది.

“మహా దేవ! మహాదేవ! మహదేవ! దయానిదే!

భవానేవ, భవానేవ; భవానేవ గతిర్మమ!”

అని స్వామిని స్మరిస్తూ మెట్లు దిగుతున్నాము. జ్యోతిస్వరూపుడైన ఆ పరమాత్మను రెండు సెకన్ల పాటు కనులారా చూసుకోన్నామో లేదో, అక్కడ నిలబడి ఉన్న, ప్రమథ గణ నాయకుడు లాంటి, ఒక వస్తాదు పండిత్ జీ,

“హర్! వీర్! క్యోం విలంబిత్ కర్తే హైఁ? పీఛే బహూత్ జన్ హై” అని అరుస్తూ మమ్మల్ని అటువైపు తోశాడు.

బయటికి వచ్చే క్యూ కూడా అంతే రష్‌గా ఉంది. సస్పెన్షన్ బ్రిడ్చి అవతలకి వచ్చాము. పుచ్చకాయ ముక్కలు అమ్ముతున్నారు. తలా ఒక దొన్నె తిన్నాము. పది ముక్కలున్నాయి.

నాకెందుకో ఉజ్జయిని మహాకాలేశ్వరునివద్ద ఉన్న ‘ఆర్డర్’ ఇక్కడ లేదనిపించింది. పైగా ఒకే ఒక మందిరం. ఉపాలయాలు లేవు.

నర్మదానది తిరిగే మెలికలలో ‘ఓంకారం’ కనబడుతుందని అన్నారు. మాకు అలా కనబడలేదు. మరి ఆ ‘వ్యూ’ ఎక్కడ నుంచి చూడాలో. ఎం.పి.లో కూడా ఒక కావేరీ నది ఉంది. అది ‘మాంధాత’ అనే ప్రదేశంలో నర్మదా నదిలో కలుస్తుంది. ఓంకారేశ్వర్ ఉన్న పట్టణాన్ని ‘ఖాండ్వా’ అంటారు.

ఇక్షావు వంశీయుడైన మాంధాత, శివుని గురించి తపస్సు చేశాడట. ఆయన తపస్సు చేసిన పర్వతానికి మాంధాత పర్వతం అని పేరు వచ్చింది. ఆయన కోరికపై పరమేశ్వరుడు ఓంకార స్వరూపుడుగా, జ్యోతిర్లింగమై వెలిశాడు.

మరొక ఐతిహ్యం కూడ ఉంది. వింధ్యపర్వతం స్వామిని తన మీద కొలువుండమని ప్రార్థించిందట. మేరు పర్వతం కంటే తాను పొడవైన దాన్ని కావచ్చునని..

ఓంకారేశ్వర లింగం రెండు భాగాలు. మరొకటి అమరేశ్వర్ లేదా మామ్లేశ్వర్‍లో ఉంది. అది మా ప్యాకేజ్‌లో లేదు!

ఓంకారేశ్వర్ ఉన్న ఖాండ్వా ప్రాంతాన్ని, ధార్ పార్మార్లు, మాల్యా సుల్తాన్లు, గ్వాలియర్ షిండియాలు పాలించారు. షిండియా దానిని (మాంధాతను) 1824లో బ్రిటిష్ వారికప్పగించాడు.

దేవాలయం అంతా తిరిగి చూసే అవకాశం లేదు. జనం రద్దీ వల్ల కేవలం దర్శనం మాత్రమే అయింది.

ఓంకారేశ్వర్ (మాంధాత) పర్వతం చుట్టూ, గిరిప్రదక్షిణ చేయడానికి పరిక్రమమార్గం ఉందట. సుమారు 7.3 కి.మీ. వస్తుంది. దారి బాగుండదట. ఎగుడు దిగుడుగా ఉంటుందంట. మేము దాని జోలికి పోలేదు.

మాంధాత పర్వతం మీదే ఆదిశంకరాచార్యుల విగ్రహన్ని నెలకొల్పారు. అది 108 అడుగుల ఎత్తు ఉంటుంది. స్వామి 12 సంవత్సరాల బాలుడిగా ఆ విగ్రహంలో దర్శనం ఇస్తాడు. ఎందుకంటే, ఆయన తన భారతదేశ పర్యటనలో అక్కడికి చేరుకున్నది ఆ వయసులోనే. ఆ విగ్రహాన్ని ‘Statue of Oneness’ అంటారు. అప్పటి ముఖ్యమంత్రికే శివరాజసింహ చౌహాన్ దాన్ని ప్రారంభించారు, 21 సెప్టెంబరు 2023న.

ఫోటో సౌజన్యం: ఇంటర్నెట్

మాంధాత ద్వీపాన్ని ఈ సందర్భంగా మధ్య ప్రదేశ్ ప్రభుత్యం సర్వాంగసుందరంగా తీర్చిదిద్దింది. దానికి 2200 కోట్లు ఖర్చయిందట. అలా, ఉజ్జయిన్, మహేశ్వర్, ఓంకారేశ్వర్ ఒక టూరిజమ్ సర్యూట్‌గా ఏర్పడ్డాయి. శంకరాచార్యులు ప్రతిపాదించిన ‘యూనిటీ, హార్మొనీ’ల ప్రతిబింబం ఆ విగ్రహం.

విగ్రహానికి రూపకల్పన చేసినవారు సంస్కృత విద్యాన్యాస్, ఉబ్బయిన్. విగ్రహాం 27 అడుగుల ఎత్తున్న పద్మదళాల రూపంలోని పునాది మీద నిలబడి ఉంటుంది. ప్రజల నుండి, 2017-18 నుండి సేకరించిన వివిధ లోహాలను కరిగించి శంకరాచార్యుల విగ్రహానికి పోతపోశారు. విగ్రహం బరువు వంద టన్నులు. కంచు, రాగి, ఇత్తడిల మిశ్రమం.

మా దురదృష్టం ఏమిటంటే మమ్మురంగా జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా సందర్శకులను విగ్రహాం వద్దకు అనుమతించడం లేదు! మేం తీవ్ర మైన నిరాశకు లోనయ్యాము.

మా కుశాగ్రుడిలా చెప్పాడు – “సర్‍జీ! మనం వెళ్లేదారిలోనే ఒక చోట కొంత లోపలికి, మన కారు వెళ్లినంతవరకు తీసుకువెళతాను. నర్మదానది తీరమే అది కూడా! అక్కడ ఒక పాయింటు నుంచి విగ్రహం బాగా కనపడుతుంది. అయితే దూరం నుంచి.”

‘కొంచెం మేలే కదా!’ అనుకున్నాము.

అద్వైత మత స్థాపకులు, ఆదిశంకరులవారు మాకు దూరం నుండీ దర్శనం ఇచ్చారు. ఎండలో విగ్రహం మెరుస్తుంది, ముదురు రాగి రంగులో!

“శర్మా! శంకరాచార్యుల మీద ఏదైనా పద్యమో, శ్లోకమో పాడరా!” అని అడిగాడు మా యోగా! యల్లమంద వాడిని సమర్థించాడు.

నేను ముందుగా శివస్తుతి చేశాను

“కైలాసాచల మధ్యస్థం కామితాభీష్టదాయకమ్

బ్రహ్మది ప్రార్ధనా ప్రాప్త దివ్యమానుషవిగ్రహమ్”

తర్వాత ఆదిశంకరుల వారిని ఇలా స్తుతించాను.

“సంయజ్ఞం సంయమీంద్రాణాం

సార్వభౌమం జగద్గురుమ్

కింకరీ భూత భక్తైనః

పంకజాత విశోషణమ్

ధ్యాయామి శంకరాచార్యం

సర్వలోకైక శంకరమ్”

రెండూ ‘భూపాలం’ అనే పాడాను

కుశాగ్ర్ నా దగ్గరుకు వచ్చి, నా రెండు చేతులూ కళ్లకద్దుకున్నాడు. హిందీలో అన్నాడు “ఎందరో టూరిస్టులను తిప్పుతుంటాను సర్ జీ. మీవంటి పండితులు, గాయకులు నాకెప్పుడూ తారసించలేదు. మీ ముగ్గురి స్నేహం కూడా నాకు ఎంతో బాగుంది!”

“జీతే రహో బేటా!” అని అతనిని ఆశీర్వదించాము.

అప్పుడు 3 గంటలు దాటింది. భోజనం స్కిప్ చేయదలచాము. దారిలో ఒక చోట చాయ్ తాగాము. మేము మహేశ్వర్ చేరేసరికి ఐదయ్యింది. హోటల్ బుకింగ్‌లో డొనేటో సందీప్ తప్పులో కాలేశాడు. ఆ ఊర్లో బాలాజీ రెసిడెన్సీ అని, హోటల్ బాలాజీ ఇన్ అనే రెండు ఉన్నాయి. కుశాగ్ర్‌కి లోకేషన్ మొదటిది పంపాడు!

వెళ్లి చూస్తే అదో డొక్కు లాడ్జి! ముక్క కంపు కొడుతూ ఉంది. రిసెప్షన్ లేదు. సందీప్‌కు ఫోన్ చేసి తిట్టాను.

“పాంచ్ మినిట్ దీజీయే, డాడీ!” అని వేడుకున్నాడు. తర్వాత చెప్పాడు

“మాఫ్ కర్నా, సాబ్! గలతీ హోగయా! ఆప్ కే లియే ‘హోటల్ బాలాజీ ఇన్’ బుక్ కియే థే హమ్ లోగ్. ఆప్ ఉదర్ చలియే!”

ఆ హోటల్ ఆగ్రా – భోపాల్ హైవే మీద ఉంది. మహేశ్వర్ నుంచి 20 కి.మీ. దూరం. చాలా బాగుంది. గీజర్ వేసుకొని, స్నానాలు చేశాము. ఒక అరగంట రిలాక్స్ అయ్యాము. మహేశ్వర్ శివమందిరాన్ని, ఇతర ప్రముఖ ఆలయాలను సందర్శించటానికి ఆరున్నరకు బయలు దీరాము. ఆ మర్నాడు ఉదయమే మా తిరుగు ప్రయాణం!.

హోటల్ బయట ఒక చోట వేడి వేడి చనాదాల్ మసాలా వడలు వేస్తున్నాడు. తలా రెండు తిన్నాము. నంచుకోవడానికి పచ్చిమిర్చి ఇచ్చాడు. నేనూ, యోగా శుభ్రంగా, మిరపకాయలు కొరుక్కొని, వడలతో పాటు తిన్నాము. యల్లమంద, “బాబోయ్! కారం!” అన్నాడు. ఎంతైనా రాయలసీమ ఆరిజిన్ కదా మాది! కారం అంటే మమకారం!

మహేశ్వర్‍లో ముఖ్యంగా చూడవలసినది సహద్రార్జున ఏకాదశ జ్యోతిర్లింగాలయం. తర్వాత నర్మదానది ఘాట్ పైనే ఉన్న జగన్నాథ మందిరం, రాకేశ్వర మహదేవ్ టెంపుల్, సిద్ధివినాయక టెంపుల్. ఇవన్నీ చిన్న చిన్నవే. ముందు వాటిని దర్శించుకున్నాము.

రాజరాజేశ్వర స్వామి (మహేశ్వర) ఒక కోటలో కొలువై ఉన్నాడు. కోటని నర్మదానదిని అనుకొని ఒక కొండమీద నిర్మించారు. కోటలోకి ప్రవేశించడానికి బండరాళ్ల స్లోప్ ఉంది. కోట అంతర్భాగమంతా ఒక టౌన్‌షిప్ వ్యాపించి ఉంది. దాదాపు కి.మీ. నడిచి ప్రధానాలయం చేరుకున్నాము.

రాజరాజేశ్వర సహస్రార్జున ఏకాదశ జ్యోతిర్లింగానికి మహాహారతి జరుగుతూన్నది విద్యుత్ చలిత ఢంకా ఒకటి లయబద్ధంగా శబ్దం చేస్తున్నది. స్వామివారు పుష్పశోభితులై దర్శనమిచ్చారు. ఆలయం ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. లోపల శ్రీరామచంద్రులు, వినాయకుడు, సూర్యుడు, ఉపాలయాల్లో కొలువు తీరి ఉన్నారు. అందర్నీ దర్శించి, మెట్లు దిగి నర్మదా తీరానికి వెళ్లాము. ఇటు కోటను, అటు నదిని ప్రకాశింపజేస్తూ లైట్లు వెలుగుతున్నాయి. నర్మదా దేవి ప్రశాంత గంభీరగా ఉంది. నదిలోదిగి ఆ పవిత్ర జలాన్ని శిరస్సుల మీద ప్రోక్షించుకుని, పునీతులమయ్యాము.

వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉందంటే అక్కడ నుంచి రాబుద్ధవలేదు. రాబర్ట్ ఫ్రాస్ట్ అన్న అమెరికన్ కవి మాటలు నాకు గుర్తొచ్చాయి.

“The Woods are dark, lovely and deep, but I have miles to go, not to sleep.”

జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ రెండు లైన్లను ఫేమ్ కట్టించి తన టేబుల్ మీద పెట్టుకునేవారట.

నది మెట్ల మీది నుంచి మహేశ్వర్ దుర్గం సమున్నతంగా దర్శనమిచ్చింది. అంతా రెడ్ స్టోన్ నిర్మాణం. దానిని అహల్యా దేవి కోట అంటారు. అది ఉన్న ప్రాంతాన్ని ‘రాజ్‌వాడ’ అంటారు. మహేశ్వర్ ఖార్గాన్ జిల్లాలో ఉంది. మా కిచ్చిన లాడ్జి ఖార్గాన్ పట్టణం లోనే ఉంది. నర్మదానది ఉత్తరతీరం అది.

హేహయ వంశీయుడైన సహస్రార్జున దానిని ప్రారంభించాడు. తర్వాత హోల్కర్ వంశీయులు దానిని మాల్యాకు రాజధానిని చేశారు. తర్వాత మల్హర్ రావ్ హోల్కర్, రాజధానిని ఇండోర్‍కు మార్చినట్లు చరిత్ర చెబుతుంది.

‘బాహుబలి’ చిత్రంలోని మాహిష్మతి రాజ్యం ఇది. రోమన్లు గ్రీకులు దీనిని ‘మిన్నాగర’ అని పిలిచేవారని తెలుస్తుంది.

మరాఠా మహారాణి, రాజమాత అహల్యాదేవి హోల్కర్ 18 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కోటను, రివర్ ఫ్రంట్‌ను, ఘాట్‍లను ఆమే సుందరీకరించారు. ‘అశోకా’ అన్న హిందీ సినిమాను ఇక్కడ తీశారు. ఎ. ఆర్. రహమాన్ తన మ్యూజిక్ వీడియో ‘మహా శివరాత్రి’ని ఇక్కడే చిత్రీకరించారు. తమిళ సినిమా ‘అల్పయుత్తే’ లోని ‘స్నేహితనే’ అన్న పాటను ఇక్కడే షూట్ చేశారు. ‘ఆరంభం’ అన్న తమిళ సినిమాలోని ‘అడడడా ఆరంబమే’ అన్న పాటను ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా ఇక్కడే చిత్రీకరించారు. జీ టీవి సీరియల్ ‘ఝాన్సీ కీ రాణి’ లోని తొలి ఎపిసోడ్స్ కొన్ని ఇక్కడి చిత్రీకరణ జరుపుకున్నాయి. ‘బాజీరావ్ మస్తానీ’, మన తెలుగు సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లోని కొన్ని భాగాల షూటింగ్ ఇక్కడే జరిగింది. ఈ మధ్య వచ్చిన ‘ప్యాడ్ మ్యాన్’ (అక్షయ్ కుమార్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ కాస్ట్), ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘దబాంగ్ 3’ లోని టైటిల్ ట్రాక్‌ను ఇక్కడే తీశారు సల్మాన్ ఖాన్ 2 వారాలపాటు షూటింగ్‌లో పాల్గొన్నాడు.

సినిమా షూటింగ్‌లు జరిగితే గాని ప్రాంతాల గొప్పదనం తెలియదు మనకు. ఇవేవీ జరగకపోయినా, మహేశ్వర్ అహల్యాబాయి దుర్గం, నర్మదా నదీ, అద్భుతాలే!

మా లాడ్చి ఉన్న టౌన్ ఖార్గాన్ కాదట. ‘ధన్‍మోద్’ అట. హోటలుకు వెళ్లే దారి లోనీ, ‘నెమోడ్ హైవే ధాబా’లో డిన్నర్ చేశాము. మధ్యాహ్నం లంచ్ చేయలేదు కదా! కడుపులు నకనకలాడుతున్నాయి ముగ్గురికీ! పుల్కా, ప్లెయిన్ పాలక్, ప్లెయిన్ రైస్, దాల్, గోబీ మసాలా, పాపడ్. దానిని ‘ఖాండ్వా థాలీ’ అంటారట. ప్లేటు 160/- రూపాయలు. చివర్లో జీరా ఫ్లేవర్డ్ చిక్కని మజ్జిగ. మేం రూం చేరేసరికి తొమ్మిదయింది.

ధన్‍మోద్‍లోని ఓ జైనమందిరం

కుశాగ్రుడు చెప్పాడు “సర్ మనం రేపు ఉదయం ఏడున్నర – ఎనిమిది మధ్యలో బయలుదేరాలి. భోపాల్ 280 కిలోమీటర్లు. మధ్యలో ఇండోర్ – కానీ బైపాస్‌లో వెళతాము. మీ రైలు సాయంత్రం 4 గంటలకు అంటున్నారు. మధ్యలో బ్రేక్‍ఫాస్ట్, లంచ్‌కు గంటన్నర పోతుంది. భోపాల్ సిటీ ఒక గంట పోతుంది. ఫోర్ లేన్స్ అనుకోండి, కాని మినిమం సిక్స్ అవర్ జర్నీ!”

బాగా అలసిపోయాము! హాయిగా బబ్బున్నాము. పడుకునే ముందే బ్యాగులన్నీ సర్దేసుకున్నాము. ఉదయం అరుకు లేచి స్నానాలు చేసి ఏడు కల్లా తయారయ్యాము. బ్రూ కాఫీ రూముకే తెచ్చి ఇచ్చారు. పావు తక్కువ ఏడుకు భోపాల్‍కు బయలుదేరాము. మేము భోపాల్ స్టేషన్ చేరేసరికి 3గంటలు దాటింది! కుశాగ్ర్, మమ్మల్ని దింపి వెళ్లిపోయాడు. ఎ గుడ్ గై!

మధ్యప్రదేశ్‍కి వీడ్కోలు – భోపాల్ స్టేషన్

మా రైలు నిజాముద్దీన్ నుంచి తిరుపతి వెళ్లేది; ఎ.పి. సంపర్క్ క్రాంతి. పావు తక్కువ ఐదుకు బయలుదేరింది. యాత్రా విశేషాలు ముచ్చటించుకుంటూ 8 గంటల వరకు గడిపాము. బిర్యానీలు తప్ప ఏవీ రావటం లేదు. కమలాపళ్ళు, బిస్కెట్లు తిని, బటర్ మిల్క్ తాగి పడుకున్నాము. ఉదయం 8.30 కి రైలు కాచిగూడ చేరింది. ప్లాట్‌ఫాం మీదే వేడి వేడి ఇడ్లీ వడ, కారంగా ఉన్న కొబ్బరిచట్నీ అమ్ముతున్నారు. తిన్నాము. యోగాగాడు అదే రైల్లో కర్నూలుకు వెళతాడు. నేనూ యల్లమంద క్యాబ్ బుక్ చేసుకోని, బయలుదేరాము. మిత్రుడిని సరూర్ నగర్ ఆర్చి ఎదుట, ఆమ్ని హాస్పిటల్ జంక్షన్‌లో దింపాను. ఆయన మిత్రుడు అక్కడికి వచ్చి ఆయనను తన యింటికి తీసుకువెళ్లాడు. సాయంత్రం గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఆయన తునికి వెళ్లిపోతాడు. నేను ఇల్లు చేరేసరికి 10 దాటింది. వనస్థలిపురం! మరొక మెమొరబుల్ ట్రిప్!

(సమాప్తం)

Exit mobile version