Site icon Sanchika

మా మధ్య ప్రదేశ్ పర్యటన-4

[ఇటీవల మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]అ[/dropcap]మోఘవచస్కుడు సిద్ధం! మాకు నమస్కరించి చెప్పాడిలా.

“సాబ్ జీ! మనం ఇంకా రెండు సెక్టార్లు కవర్ చేయాలి. ఈస్ట్రన్, సదర్న్. అవి దూరదూరంగా ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల కల్లా మందిరాలన్నీ చూసి లంచ్ చేద్దురు. తర్వాత మిమ్మల్ని స్టేషన్‌లో డ్రాప్ చేస్తాను”

“అలాగే కానీ! అన్నాను.

మొదట, ‘శ్రీ దిగంబర జైన్ శాంతినాథ్ క్షేత్ర’ కు తీసుకొని వెళ్లాడు. అందులో శాంతినాథుని నిలువెత్తు నగ్న విగ్రహం ఉన్న ప్రధాన మందిరం కాక 10 ఉపాలయాలున్నాయి. అన్నింట్లో దిగంబరుడైన జైనగురువు గారి రాతి, పాలరాతి విగ్రహాలు ఉన్నాయి.

మందిరాలన్నీ ‘యు’ షేప్‌లో వరుసగా ఉన్నాయి. మధ్య పెద్ద ఆవరణ. అక్కడ ఏవో సామూహిక వ్రతాలు జరుగుతున్నాయి. తెల్లని చీరలు, కొంగులు నెత్తిన కప్పుకొన్న స్త్రీలు, ముందు కలశాలు, పూజాద్రవ్యాలు పెట్టుకొని, మైక్‌లో ఒకాయన మంత్రాలు చదువుతుండగా, పూజ చేస్తున్నారు. వారి పక్కన భర్తలు లేరు! ప్రధాన మందిరం ముందు ఒక విశాల వితర్దికపై రంగు రంగుల ముగ్గు వేసి ఉంది. అది చాలా క్లిష్టమైన డిజైన్‍లో ఉన్నా, మనోహరంగా ఉంది. దాని మధ్యన పెద్ద కలశం. ఆ ముగ్గు అష్టదళ పద్మంలా అనిపించింది.

ఒకవైపు ఆర్కెస్ట్రా ఉంది. ఒకాయన మధ్య మధ్య జైన కీర్తనలు ఆలపిస్తున్నాడు. అవి అంత మెలోడియస్‌గా లేవు. పైగా మంత్రాలు చదివే ఆయన, సడన్‌గా పాట ఆపేయమంటున్నాడు.

అన్ని ఆలయాలను దర్శించాం, ఫోటోలు తీసుకొన్నాం. మందిరం గోపురాలు, ముఖద్వారం, అటు ఇటు పెద్ద రెడ్ స్టోన్ సింహాలు నయన మనోహరంగా ఉన్నాయి.

టైం పదవుతూంది. చిన్నచిన్న గుడులు, దూరంగా ఉండేవి చూడము, పెద్దవి, ముఖ్యమైనవి మాత్రం చూస్తామని డ్రైవర్‌తో చెప్పాము. మొదట దుల్హాదేవ్ టెంపుల్‍కు తీసుకు వెళ్లాడు. అది శివాలయమే. లోపల పెద్ద లింగం ఉంది. దుల్హాదేవ్ అంటే ‘పవిత్రమైన పెండ్లికూతురు’ అని అర్థమట. ఈ గుడికి ‘కన్వర్ మఠ్’ అని కూడా పేరు. ఇదీ 11వ శతాబ్దపు కట్టడమే. చందేలా వంశపు రాజుల చివరి నిర్మాణం, మదన దేవవర్మ కాలంలో రూపుదాల్చింది. కాన్పూర్ (యుపి) వద్ద ‘జామ్సర్’ అనే మందిరం, ఈ మందిరం, ఒకే విధమైన శిల్పాకృతులను పోలి ఉండటం విశేషం. బాహ్యకుడ్యం ఒక దాని మీద పరమేశ్వరుని విగ్రహం ఉంది. ఆయన ఒక చేత సర్పమును, శిరసున కిరీటమును ధరించి, పద్మాసనస్థితుడై, అర్థనిమీలిత నేత్రుడై, ధ్యానముద్రలో ఉన్నాడు. ఆయన శిరసుకు ఇరువైపులా అందమైన పద్మాలు చెక్కారు. గోడలమీద శృంగార భంగిమలు సరే. దీనిని నిరంధారా టెంపుల్ అంటారు. అంటే మహా మండపం ఉండదు. పరిక్రమ మార్గం లేదు. ముఖ్య గోపురం మూడు వరుసలుగా ఉంది. మౌంట్ కైలాస్‌ను పోలి ఉంది.

పైకప్పు మీద సుందర అప్పరసల శిల్పాలున్నాయి. వారంతా శృంగార రసాధిదేవతలు. గర్భగృహంలోని ప్రధాన లింగం ఉపరితలాన అనేక చిన్న చిన్న లింగాలు చెక్కారు. స్వామిని పూజిస్తే, సహస్ర లింగార్చన ఫలితం దక్కుతుందని ఐతిహ్యం.

“టీ కావాలి సుతా!” అన్నా హిందీలో.

“జరూర్ సాబ్ జీ!” అన్నాడు మా ఆత్మపుత్రుడు. ఎక్కడా విసుగుకోడు. వదనంలో వినయం చెరగడం లేదు. అతనితో తిరగడం మాకు హాయిగా ఉంది.

ఒక చోట టీ కొట్టు కనబడింది. కానీ షుగర్ లెస్ లేదు. ఆల్రెడీ షుగర్ వేసి ఉన్నాడు. యల్లమందకు నో ప్రోబ్లం, నేను తాగేశాను. యోగానందులవారు రాజీపడే రకం కాదు. వాడు తాగలేదు!

తర్వాత ‘చతుర్భుజి’ మందిరం. రెండు సెక్టారులలో కలిసి ఐదు దేవాలయాలు ముఖ్యంగా చూడవలసినవని తేల్చాడు అమోఘ్. నిన్నటిలా కాదు. గుడికి గుడికి మధ్య 4 కి.మీ. దూరం ఉంది. ఇది విష్ణు దేవాలయం. దీనిని జటకారీ మందిరం అని కూడా ఉంటారు. కారణం, పక్కన జటకారి అన్న గ్రామం ఉండటం. చతుర్భుజుడైన విష్ణువు ఇక్కడ ఉన్నాడు. 11వ శతాబ్దంలో చందేలా వంశజుడైన యశోవర్మ మహారాజు దీనిని నిర్మించాడు. దీనిలో శృంగార భంగిమల శిల్పాలు అసలు లేకపోవడం విశేషం.

స్వామి విగ్రహం 2.7 మీటర్ల ఎత్తుతో దక్షిణముఖంగా ఉంది. ప్రవేశపు ద్వార ఆర్చ్, మహామండపం ఉన్నాయి. ఇది సదర్న్ సెక్టార్ లోకి వస్తుంది. స్థలపురాణం ఏమిటంటే మధుకరుడు అనే రాజు, తన రాణి గణేశ్ కువారి కోసం దీన్ని నిర్మించాడు. ఆమెకు శ్రీరామచంద్రుడు స్వప్నంలో సాక్షాత్కరించి, తనకో గుడి కట్టించమని అడిగాడట. మధుకరుడు శ్రీకృష్ణభక్తుడు. రాణి రామభక్తురాలు. అదేమిటో గాని, భార్యాభర్తల అభిరుచులు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయేమో? అనిపిస్తుంది నాకు.

అదే మాట మా మిత్రులతో అంటే, మా యోగాగాడు నవ్వుతూ, “అదేం లేదు. నాకు, మా ఆవిడకూ ఇష్టదైవం శివుడే!” అన్నాడు.

ఖజురహో లోని ఒకే ఒక విష్ణుమందిరం చతుర్భుజి మందిరం.

తర్వాత వామన మందిరం. అది వెస్ట్రన్ సెక్టార్. అది చిన్నది. వామనుడు విష్ణువు అవతారం. ప్రధాన గోపురం మీద చైత్య నిర్మాణపు ఛాయలున్నాయి. స్వామి విగ్రహానికి ఒకవైపు శంఖ పురుషుడు, మరొక వైపు చక్రపురుషుడు ఉండటం విశేషం. మిగతా నిర్మాణ శైలి అంతా ఖజురహో పద్ధతిలోనే ఉంది.

వామన మందిరం

తర్వాత, బహ్మమందిరం చూశాము. ఇది ‘ఖజురహా సాగర్’ అనే సరస్సును ఆనుకుని ఉంది. ఇది బహ్మ దేవుని మందిరం కాదు. లింగమునకే నాలుగు ముఖాలున్నాయి (చతుర్ముఖ లింగం). ఈ గుడిని రెడ్ స్టోన్‌తో కాకుండా, గ్రానైట్ వంటి నున్నని రాతితో కట్టారు. శిఖరం మాత్రం శాండ్ స్టోన్ నిర్మాణమే. గర్భగుడి చతురస్రాకారంలో ఉండి, 12 గ్రానైట్ స్తంభాల మీద ఉంది. క్రింద గంగ, యమునల శిల్పాలు, ఒక త్రిమూర్తి శిల్పం ఉన్నాయి.

జవారి మందిరం

చివరగా జవారి మందిరం చూశాం. ఇది మళ్లీ ఈస్ట్రన్ సెక్టార్. ఇదీ శివాలయమే. విగ్రహం శిధిలమైంది. తల లేదు. ప్రదక్షిణ మార్గం లేదు. మండపం ఉంది. చతుర్భుజి మందిరాన్ని పోలి ఉంది దీని నిర్మాణశైలి. ప్రవేశద్వారం పైన సుందరమైన మకరతోరణం ఉంది. పైకప్పు మీద నవగ్రహాలు శిల్పాలుగా చెక్కారు.

టైం రెండున్నర. శిల్పాల ధ్యాసలో పడి, అంత ఆకలి అనిపించలేదు. పైగా హెవీ బ్రేక్‌ఫాస్ట్. స్టేషన్ రోడ్ లోనే ‘హోటల్ గురుప్రసాద్, శుధ్ సస్యాహరి’ అన్నచోట ఆపాడు. మేమెంత రిక్వెస్ట్ చేసినా మాతో బాటు తినడం లేదు. సున్నితంగా తిరస్కరిస్తున్నాడు

అన్నం, పప్పు, కూర, పెరుగు తినకూడదని నిర్ణయించుకున్నాం. పుల్కాలు, మిక్స్‌డ్ వెజ్ కూర ఆర్డర్ చేశాము. పుల్కాలు వెదురు బుట్టలో తెచ్చి వేడి వేడిగా వీస్తున్నాడు, పొంగి, మృదువుగా బాగున్నాయి. మజ్జిగ తాగాం.

మా మహామానా ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4.30 కి. నిన్న మేం వచ్చిందే. ఊరి బయట ఒక రాతి మంటపంలో సేదతీరాం. చల్లని శాండ్ స్టోన్. చుట్టూ కళాత్మకమైన స్తంభాలు, పైకప్పు పద్మం ఆకారంలో ఉంది.

మూడున్నరకు ఖజురహో స్టేషన్‌లో దింపి వెళ్లిపోయాడు. పెద్దవాళ్లమనేమో వంగి మా ముగ్గురి పాదాలను తాకాడా కుర్రవాడు. నిండు మనసుతో ఆశీర్వదించాము. నేను మూడు వందలివ్వబోతే తీసుకోలేదు. అతడు వెళ్లిపోతుంటే కొంచెం వెలితిగా అనిపించింది.

రైలు మూడవ నంబర్ ప్లాట్‌ఫాం మీద సిద్ధంగా ఉంది. జనరల్ కంపార్ట్‌మెంటులన్నీ కిక్కిరిసి ఉన్నాయి. అంత పెద్ద యాత్రాస్థలం కదా! లిఫ్ట్‌లు గాని, ఎస్కలేటర్లు గాని లేవు. అప్పర్ క్లాస్ వెయిటింగ్ రూమ్ దరిద్రంగా ఉంది. చచ్చినట్లు మెట్టెక్కి ఓవర్ బ్రిడ్జి మీదుగా మా కంపార్ట్‌మెంట్ చేరుకొన్నాం. అదీ ఎ.సి. చెయిర్ కారే. కాని టు సీటర్, త్రీ సీటర్‌లో ఐల్ వచ్చాయి. కూర్చున్నాం. రైలు కదిలింది. అలసిపోయామేమో దాదాపు రెండు గంటలు కూర్చునే నిద్రపోయాం. లేచేసరికి బీనా జంక్షన్ వచ్చింది. ఒక ప్లేటు సమోసాలు (3) తీసుకొని తలా ఒకటి తిని, అద్రక్ చాయ్ (అల్లం టీ) తాగాం. మధ్యలో నో డిన్నర్. కనీసం వాటర్ బాటిల్స్ కూడా రాలేదు. ఇంటి నుంచి యల్లమంద తెచ్చిన పప్పు చెక్కలు కొన్ని తిన్నాం

రైలు 11 గంటలకు భోపాల్ చేరింది. మమ్మల్ని పికప్ చేసుకోడానికి అర్షద్ రడీ!

‘డిన్నర్ చేయలేదు, ముందు ఏదైనా తినిపించమ’న్నాం. స్టేషన్ ఎదుటే ఒక ఉడిపి హోటలుంది! రెండు ప్లేట్ల ప్లెయిన్ రైస్, రెండు కప్పుల పెరుగు, ఆచార్ తెప్పించుకొని, ముగ్గురం షేర్ చేసుకోన్నాం. మేం హోటల్ చేరుసరికి పన్నెండు దాటింది.

డొనేటో వారి అసలు టూర్ ప్రోగ్రాం రేపు ఉదయం నుంచి ప్రారంభం. అర్షద్ డ్యూటీ అయిపోయిందట. రేపు ఉదయం వేరే డ్రయివర్ వస్తాడట. సామాన్లు రూముకు తెప్పించుకొని పడుకున్నాం.

***

రాజహంస హోటల్ నుండి ఉదయం ఎనిమిదిన్నరకు చెక్-అవుట్ చేశాము. వాళ్ల రెస్టారెంటులోనే కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ కానిచ్చాము. ఇడ్లీ, సాంబారు. గ్రీన్ చట్నీ. అదెందుకో నాకు నచ్చదు. ఆయుర్వేద వైద్యంలోని ఆకుపసరులా అనిపిస్తుంది. పుదీనా, కొత్తిమీర, పచ్చి మిర్చి, అన్నీ పచ్చివే కలిపి గ్రైండ్ చేస్తారనుకుంటాను. వాళ్ల దగ్గర ‘టీ’ లేదు! బయట రోడ్డుపక్కనే ఉన్నటీ షాపులో, ‘బినా చీనీ’ టీ తాగాము.

డ్రయివర్ ఉదయాన్నే ఫోన్ చేసి ఉన్నాడు. అతని పేరు ‘రాకేష్ పరిహాస్’ అట. కాని తీరా, సమయానికి అబ్దుల్ వహాబ్ ఏతెంచాడు. పెద్ద గడ్డం, మీసాలు క్లీన్ షేవ్. ముస్లిం వేషధారణ. లగేజ్ అంతా కారు డిక్కీలో అమర్చాడు వహాబ్. యల్లమంద సూట్‌కేస్ కొంచెం పెద్ద ది అదిపట్టకపోతే, పైన లగేజ్ స్టాండ్‌లో పెట్టి ప్లాస్టిక్ తాడు కట్టాడు.

భోపాల్ సిటీ సైట్ సీయింగ్ స్టార్ట్! మొదట ఒక మసీదుకు తీసుకు వెళ్లాడు. అది ఆసియా ఖండం లోనే పెద్దదని చెప్పాడు వహబ్. దాని పేరు ‘దారుల్ ఉలుం తాజుల్ మసీదు’.

చాలా విశాలమైన ప్రాంగణం. ఒకేసారి కొన్ని వేలమంది నమాజ్ చేయవచ్చు. మధ్య్య ఒక సరస్సు ఉంది.

మసీదు ఉన్న ప్రాంతాన్ని పీర్ గేట్ ఏరియా అంటారు. కాలీ బస్తీ అని కూడా. అది నూర్ మహల్ రోడ్‌లో ఉంది. ఈ మసీదు విశేషమేమంటే అదొక విద్యాకేంద్రం. ‘మదరసా’ అన్న మాట. భారతీయ ముస్లిం వేదాంతుల భావజాలాని కనుగుణంగా దీన్ని స్థాపించారు

కళాత్మకమైన పెద్ద పెద్ద స్తంభాలు, జయంట్ సైజ్ షాండిలియర్స్, పై కప్పునిండా పెయింటింగ్‌లు, కళాకృతులు. అంత గొప్ప మసీదును మేము ఇంతవరకు చూడలేదు.

మసీదులో ముస్లిం పిల్లలు చదువుకుంటున్నారు. ముస్లి౦ గురువు వారితో ఉర్దూలో, ఏవో ఖుర్ – ఆన్ సూక్తులు కాబోలు, వల్లె వేయిస్తున్నాడు. వారు క్రిందే కూర్చుని, ఒక వ్యాసపీఠం లాంటి దానిలో పుస్తకం పెట్టుకొని, ముందుకు, వెనక్కు ఊగుతూ, రాగయుక్తంగా పాఠాలు చదువుతున్నారు. నాకు మన వేద పాఠశాలలలోని పిల్లలు గుర్తుకువచ్చారు. కాని మన పిల్లలు అలా ఊగరు.

మొత్తం ఏడెనిమిది క్లాసులు జరుగుతున్నాయి. ఒక క్లాసులో బ్లాక్ బోర్డు, దాని మీద లెక్కలు ఏవో చాక్ పీస్‌తో రాసి ఉన్నాయి. మసీదు ముందు ఆవరణ విస్తర్ణం దాదాపు 30 ఎకరాలు ఉండవచ్చునని పించింది. మసీదు నిర్మాణం 1871 లో జరిగింది. దాని పర్యవేక్షణ పరిపాలన చేసినవారు మౌలానా మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ గారు. నిర్మాణ శైలి ఇండో ఇస్లామిక్ మరియు మొగల్ అర్కిటెక్చర్. దీనికి ధన సహాయం చేసిన వారు నవాబ్ షాజహాన్ బేగమ్ గారు.

మినార్ల ఎత్తు 67 మీటర్లు. డోమ్‌లు 3. లోపలి వైశాల్యం 250,000 చదరపు అడుగులు. మసీదు లేత పింక్ రంగులో ఉంది. గుమ్మటాలు మార్బుల్‌వి. మధ్య లోని కొలనును పవిత్ర స్నానాలకు ఉపయోగిస్తారు. ముఖద్వారం రెండస్తులుగా ఉంది. ఒక స్త్రీల గ్యాలరీ ప్రత్యేకంగా ఉంది (జనానా). సంవత్సరానికి ఒకసారి 3 రోజుల పాటు ‘తబ్లిఘీ జమాత్’ ఉత్సవాలు ఖరుగుతాయి. తర్వాత మోతీ మసీదును దర్శించాము. అది అంత ప్రత్యేకంగా లేదు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. బయట నుంచి చూసి వచ్చేశాం.

తర్వాత మా మజిలీ శ్రీ కాళికాంబికా మందిర్. అమ్మవారు నల్లని విగ్రహం. నాలుక చాపి, పుర్రెల దండ ధరించి, భయంకరంగా ఉంది. ఒక మూల శివలింగం, పెద్దది, బూడిదరంగులో ఉంది. అక్కడ కొళాయిలో చెంబులో నీరు పట్టుకుని వచ్చి, కొందరు భక్తులు స్వంతంగా స్వామికి అభిషేకం చేస్తున్నారు మంత్రాలేవీ లేకుండా.

శ్రీ కాళికాంబికా మందిర్

‘మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, పరమేశ్వరా’ అని పూజ చివర ఫలశృతిలోనే చెప్పుకుంటాము కదా! అన్నిటికీ అతీతుడే భగవంతుడు. ఈ పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, అన్నీ మన మానసిక తృప్తి కోసమే!

ఆంజనేయస్వామి వారు, రాధాకృష్ణులు, ఉపాలయాల్లో వేంచేసి ఉన్నారు ఇంకోచోట నల్లని శిలావిగ్రహం ఎలుక వంటి వాహనం మీద ఉంది. ఆ దేవత ఎవరో తెలియలేదు.

అక్కడ నుంచి బిర్లామందిర్‌కు వెళ్లాము అక్కడ బిర్లా వారి పురాతన శిల్పాల మ్యూజియం ఉంది. చాలా శిల్పాలు ఆరు బయటనే ఉన్నాయి. శిల్పం పేరు, చెందిన కాలం క్రింద రాసి ఉంది. లక్ష్మీనారాయణులు మూలవిరాట్టులు. బిర్లా మందిర్ అంతా రెడ్ స్టోన్ నిర్మాణమే. చుట్టూ గోపురాలు, మధ్యలో శిఖర గోపురం చాలా మెజస్టిక్‌గా ఉంది.

బిర్లా మందిర్

గర్భాలయానికి ఎడమవైపు ఉపాలయంలో దుర్గాదేవి, కుడి వైపు శివుడు కొలువు తీరారు. అన్నివిగ్రహాలు, లక్ష్మీనారాయణులతో సహా, పాలరాతివీ. జీవకళ వాటిలో ఉట్టిపడుతూ ఉంది.

బిర్లా మందిర్ వద్ద మిత్రులతో రచయిత

మందిరం ఒక గుట్ట మీద నిర్మించారు. అది ఉన్న ప్రాంతాన్ని ‘అరేరా హిల్స్’ అంటారు. మొత్తం 7.5 ఎకరాల విస్తీర్ణంలో వాటిలో ఉంది. మందిరం ముందు విశాలమైన పచ్చిక బయళ్లు, అక్కడక్కడ జలయంత్రాలు ఉన్నాయి. మెయిన్ శిఖరం 160 మీటర్ల ఎత్తుంది.

మందిరానికి ఉత్తరాన ‘గీతా భవనం’ ఉంది. మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావళి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. దానిని ‘దేవ్ ధామ్’ అని కూడా అంటారు.

మ్యూజియం లోపల బయట పన్నెండో శతాబ్దానికి చెందిన పురాతన శిల్పాలున్నాయి. వాటన్నిటినీ దర్శించుకున్నాము.

అప్పుడు టైం పన్నెండున్నరైంది. మా లగేజ్ కారు ల్లోనే ఉంది. ఈ రోజు వేరే హోటల్ ఇచ్చారు. దాని చెకిన్ 12 గంటలకి కాబట్టి, అంతవరకు తిరిగాము. హోటల్ పేరు ‘టేస్ట్ ఆఫ్ ఇండియా ఇన్’. లగేజ్ రూములో పెట్టించి, 15 నిముషాలు రిఫ్రెష్ అయ్యి బయలుదేరాం.

అక్కడ నుంచి మా ప్రయాణం ‘భీమ్ బేట్కా’ అన్నచోటికి. అది భోపాల్ నుంచి 45 కి.మీ. దూరంలో ఉంది. భోపాల్ – నాగపూర్ హైవే నుండి, హోషంగాపూర్ వద్ద కుడివైపుకు తిరగాలి. మధ్యలో ‘విదిశ ధాబా’ అన్న చోట లంచ్ చేశాము. ప్లెయిన్ రైస్, కడీ పకోడీ (మజ్జిగ పులుసులో పునుగులు), బైగన్ కిచిడి (వంకాయ పచ్చడి), పుల్కా, దాల్ తడ్కా. మేము రమ్మనకపోయినా అబ్దుల్ వహాబ్ వచ్చి, చొరవగా మాతో బాటు కూర్చున్నాడు. డ్రయివర్లకు ఫుడ్ ఆఫర్ చేయవద్దని డొనేటో వారి నియమం. కాని మనవాడు రోటీలు, భెండీ మసాలా కూడా ఆర్డర్ చేశాడు. గులాబ్ జామున్ కూడా! ఏమంటాం?

“పోనీ లెండి మాస్టారు! పాపం తిననివ్వండి!” అన్నాడు మా యల్లమంద. సాటి మనిషికి తిండి పెట్టడం మన కనీస ధర్మం అని ఆయన అభిప్రాయం!

(సశేషం)

Exit mobile version