మా మధ్య ప్రదేశ్ పర్యటన-5

1
2

[ఇటీవల మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]రెం[/dropcap]డున్నరకు ‘భీమ్‌బేట్కా’ చేరుకున్నాము. హోషంగాపూర్ దాటి పక్కకు మళ్లినప్పటి నుండి దట్టమైన అడవి ప్రారంభమయింది. రెండు పైపులా సమున్నతమైన కొండలు. పచ్చని చెట్లతో కనువిందు చేస్తున్నాయి. కారు పార్కింగ్ నుంచి రెండు వందల మీటర్లు నడిచాము.

భీమ్‌బేట్కా గుహల వద్ద రచయిత

రాతి బండలు ఎత్తుగా, గుహలుగా, వివిధ శిలాకృతులుగా ఏర్పడ్డాయి. వాటిని 1957లో కనుగొన్నారట. వేల సంవత్సరాల క్రిందట ఆదిమానవులు అక్కడ గుహల్లో కొండ సానువుల్లో నివసించినట్లు ఆధారాలు దొరికాయి. గుహ కుడ్యాలమీద వారు వేసిన బొమ్మలు ఫేడ్ అయ్యి, వాటి remains అస్పష్టంగా కనబడుతున్నాయి. ప్రకృతిలో సహజంగా ఏర్పటిన అద్భుతాలు ‘భీమ్‌బేట్కా’ గుహలు.

భీమ్‌బేట్కా గుహల వద్ద మిత్రునితో రచయిత

వాటిని ‘రాక్ షెల్టర్స్’ అంటారు. భారత పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్నాయి. అవి ప్యాలియోలితిక్, మెసోలితిక్ యుగాలకు చెందినవి. శిలాయుగపు ఆనవాళ్లు. అవి మధ్యప్రదేశ్ లోని రైజెన్ జిల్లా క్రిందికి వస్తాయి. అవి యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడ్డాయి. మొత్తం ఏడు పర్వత శ్రేణులు, 750 ‘రాక్ షెల్టర్స్’ ఉన్నాయి. 10 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. దాదాపు 100,000 సం॥ క్రిందట మానవులు అక్కడ నివసించి ఉంటారని అంచనా.

‘రాక్ షెల్టర్స్’ వద్ద మిత్రులతో
‘రాక్ షెల్టర్స్’ వద్ద మిత్రునితో

వేట వృత్తిగా.. తర్వాత వ్యవసాయం వైపు మళ్లిన జాతులను సూచిస్తాయి. వారి బొమ్మల ఆనవాళ్లలో pre-historic spirituality ద్యోతకం అవుతుంది. ఆ బొమ్మలలో పక్షులు, జంతువులు, నృత్యములు, వేట; గుర్రాల మీద యోధులు ఇలా క్రమ పరిణామాన్ని.. అంటే శిలాయుగం నుంచి ఆహారయుగం వరకు సూచిస్తాయి. వేలాది సంవత్సరాలు గడవడం వలన, ఏ బొమ్మలూ మాకు కనబడలేదు. అలుక్కుపోయిన రంగులు వెలిసిపోయినవి కనబడినాయి.

‘భీమ్‌బేట్కా’ అంటే భీముని ప్రాంగణం అని అర్థం. స్థానిక విశ్వాసాల ప్రకారం, భీమసేనుడు, అజ్ఞాతంలో అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడని ప్రతీతి.

మొదటగా వీటిని గురించి ప్రస్తావించినవాడు W. Kincaid అను బ్రిటిష్ ఇండియా అధికారి. అది ఒక పరిశోధనా పత్రంలో 1888లో ప్రచురించబడింది. ఆయన ఆదివాసీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దానిని రాశాడు. 1970లో వీటిని గురించిన ప్రాముఖ్యత తెలిసింది.

వాటిలో ప్రధానమైనది ‘ఆడిటోరియమ్ కేవ్’. అక్కడ గిరిజనుల సమావేశాలు ఖరిగిందుకు వీలుగా విశాలంగా ఉంది గృహంతర్భాగం. అది ఒక ‘Cathedral’ ను పోలి ఉందని అంటారు.

ఇవి వింధ్య పర్వత శ్రేణుల్లో ఒక భాగమే. గుహల లోపల చాలా చల్లగా ఉంది. కొన్ని రాక్ షెల్టర్స్ చూడటానికి 700 మీటర్ల వరకు నడవాలి. మొత్తానికి ‘భీమ్‌బేట్కా’ రాక్ షెల్టర్స్ సందర్శనం ఒక అద్భుత అనుభవం.

“ఆదిమ మానవులు ఎన్ని కష్టాలు పడి జీవించారో, పాపం!” అన్నాడు మా యోగా.

“ఎప్పటి జీవితవిధానం అప్పటికి సహజంగానే ఉంటుంది. యోగానంద!” అన్నాడు మా యల్లమంద. “నాగరికత పెరిగేకొద్దీ, సౌకర్యాలు పెరుగుతూ ఉంటాయి. మన చిన్నపుడు మన అమ్మ కర్రల పొయ్యి మీద వంట చేసేది. మంట చేయడానికి ఒక గొట్టం, పచ్చి కర్రలు మండక, పొగ కళ్లల్లోకి పోయి అవస్థపడేవారు. గిన్నెలన్నీ మసిపట్టేవి. కానీ అప్పుడు అది జీవితం కాబట్టి కష్టం అనిపించేది కాదు.”

“ఎంత బాగా చెప్పావు మిత్రమా!” అని అతన్ని ప్రశంసించాను. అడాప్టబిలిటీ అనేది మానవునికి భగవంతుడిచ్చిన వరం!

అప్పుడు నాలుగున్నర అయింది. మా తర్వాత మజిలీ భోజ్‌పురి శివమందిరం. అదో అద్భుతం. ‘భీమ్‌బేట్కా’ నుంచి అరగంట ప్రయాణం. ఎత్తయిన గుట్ట మీద, 10వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించారు.

భోజ్‌పురి శివమందిరం మహాద్వారం
భోజ్‌పురి శివమందిరం

మోకాలి ఎత్తు మెట్లు సుమారు 30 ఎక్కాలి. ఎక్కలేని వాళ్లకు అంటే మాలాంటి వాళ్లకు గుట్ట పక్కనుంచి స్లోప్ ఉంది. కొంచెం దూరమైనా అంతంత ఎత్తున్న మెట్లు ఎక్కడంకంటే బెటరే కాదా! గుడి మందు రెండు మంటపాలున్నాయి. అవి శిధిలావస్థలో ఉన్నాయి. లోపల, ఆరడుగుల ఎత్తు, మూడడుగుల వ్యాసం గల నాచురంగు లోని పెద్ద శివలింగం ఉంది. గుడి అంతర్భాగమంతా శివలింగం, దానిని ప్రతిష్ఠించిన పెద్ద పానవట్టం, పూర్తిగా ఆక్రమించాయి. అంత పెద్ద శివలింగాన్ని మా జీవితంలో చూడలేదు. మొత్తం లింగం, పానవట్టం కలిసి పది చ.మీ. ఏరియాను ఆక్రమించింది. భక్తులు క్రిందికి దిగి వెళ్లి పూలు, బిల్వపత్రాలు. ఉమ్మెత్త కాయలు సమర్పిస్తున్నారు.

గుట్ట అంతా పెద్ద పెద్ద కొండముచ్చులు తిరుగుతున్నాయి. గుడి దిగువన పూజాసామగ్రి, స్వీట్స్, సమోసాలు, కచోరీలు, పిల్లల బొమ్మలు అమ్మే దుకాణాలతో తిరునాళ్లలా, సందడిగా ఉంది. గొప్ప దేవాలయం. కానీ అంతా ఒకే మంటపం. అదీ గర్భగుడి. అందులో గురుతర లింగాకృతి. నాకు ‘కొండంత దేవునికి కొండంత పత్రి పెట్టలేం కదా’ అన్న సామెత గుర్తొచ్చింది.

స్లోప్ మీదుగా వెళ్లి శివదర్శనం చేసుకున్నాము. ‘చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్, చంద్రశేఖర, చంద్రశేఖర, చంద్రశేఖర రక్షమామ్!’  అన్న మార్కండేయ కృత శివ స్తోత్రాన్ని పఠించాను.

‘చంద్రశేఖరమాశ్రయే మమకింకరిష్యతి వై యమః’ అన్న మకుటంతో సాగుతుంది చంద్రశేఖరాష్టకం.

స్లోప్ మీదుగా తిరిగివస్తుంటే యల్లమంద అడిగాడు – “మిత్రమా! మకుటం అర్థమైంది. ‘చంద్రశేఖరుని ఆశ్రయించిన నన్ను యముడేమి చేయగలడు?’ అని కదా?”

“నీకు చెప్పగలవాడినా? నీకన్నీ తెలుసు. అయినా నన్నడుగుతావు” అన్నా నవ్వుతూ.

“అమ్మమ్మమ్మ! నీ సంగతి వేరు. మకుటంలో ‘వై’ ఎందుకు?”

“ ‘వై’ అనేది అవ్యయం. ‘తు.. హి.. వై- పాదపూరణే – అన్నారు. ఛందస్సులో ఒక మాత్ర (లఘువు) లేదా గురువు తక్కువైతే వాటిని తీసుకోవచ్చు.” అన్నాను.

భోజ్‌పురి శివమందిరం ప్రాంగణంలో పరశురాముని విగ్రహం వద్ద రచయిత

యోగాగాడికి మరో డౌట్!

“ఒరేయ శర్మా, ‘తు.చ. తప్పకుండా’ అంటారు కదా! అవేమిట్రా?’’

“అవీ ఇలాంటివే. సంస్కృతంలో శ్లోకాల్లో వస్తాయి. ‘తు’ అంటే ‘అయితే’ అని, ‘చ’ అంటే కూడా అని అర్థం. ‘భీష్మ౦చ, ద్రోణంచ, జయద్రధం చ’ అని చెప్పేటపుడు ‘చ’ వాడతారు. ‘కవిర్దండీ, కవిర్దండీ! భవభూతిస్తు పండితః’ – అంటే దండి మహకవి, ఇక భవభూతి అయితే పండితుడు అని అర్థం.”

యల్లమంద అందుకున్నాడు

“ఉదార చరితాణాంతు వసుధైక కుటుంబకమ్ అనే దానిలో ‘తు’ ఉంది!”

“గుడ్! దటీజ్ ది స్పిరిట్” అన్నాను.

“అట్లా చెప్పడానికి నాకీవే రావే?” అన్నాడు యోగా, నిస్సహాయంగా.

నేను నవ్వి, వాటిని అక్కున చేర్చుకున్నా. “ఒరేయ్! నీవడిగినందుకే కదా ఇవన్నీ వచ్చాయి! ఇంతకూ ‘తు.చ. తప్పకుండా’ అంటే అర్థమైందా?” అన్నాను.

“అర్థమైంది. శ్లోకంలో అవి కూడా వదలకుండా అని అంటే ప్రతి చిన్న డిటైల్‌ను వదలకుండా, సంపూర్ణంగా చెప్పడం.”

“శభాష్! దటీజ్ యోగా!” అన్నాను. వాడు కాలర్ ఎగరేశాడు!

క్రింద పురావస్తు శాఖ వారి కొన్ని నోటీసు బోర్డులున్నాయి. అవి చదివాము.

దీనిని భోజేశ్వర్ మహదేవ్ మందిర్ అంటారు. ఇది ఉన్న ఊరు భోజపూర్. పక్కనే వేత్రావతి నది ప్రవహిస్తుంది. ‘విదిశ’ ఇక్కడికి దగ్గర. దీనిని ‘మధ్యభారతపు సోమ్‌నాథ్’ అంటారు. ఈ మందిరాన్ని కట్టించి, బృహత్తర శివలింగాన్నిప్రతిష్ఠించిన రాజు పార్మార్ వంశీయుడైన ధర్‌భోజ్ (1010 AD- 1053 AD). వేత్రావతిని ‘బేట్వా’ అని కూడా అంటారు

కుంతీదేవి, తాను పూజించుకోవడానికి, ఒక మందిరాన్ని నిర్మించమని పాండవులను కోరిందట. వారు ఒక్క రాత్రిలో నిర్మించాలనుకుంటే, పూర్తి కాలేదు. ఉదయపూర్ ప్రశస్తి అను శిలాశాసనంలో మందిరం గురించి ఉన్నది. మాళవరాజ్యంలో భోజపురి అంతర్భాగంగా ఉండేది. ఇక్కడ మకర సంక్రాంతికి, శివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి. మహావీరుల సమాధుల మీద ఈ మందిరం నిర్మించారని కూడా అంటారు. ఇలాంటి దేవాలయాలను ‘స్వర్గారోహణ ప్రాసాదాలు’ అంటారట.

పూర్తిగా శిధిలం కాబోతున్న మందిరాన్ని, పునరుద్ధరించి, బాగు చేసే కార్యక్రమం 2006-07 లో పురావస్తు శాఖ చేపట్టింది. దాని పర్యవేక్షణాధికారి కె. కె. మహమ్మద్ కావడం విశేషం.

తిరిగి భోపాల్‍కు బయలుదేరాము. దారి మధ్యలో ‘చాయ్’ కోసం ఆగాము. అక్కడ, పల్చని, నల్ల జీలకర్ర వేసిన, కరకరలాడే నిప్పట్లు లాంటివి తిన్నాము. చాలా రుచిగా ఉన్నాయి.

మా డ్రయివర్ అబ్దుల్ వహబ్‌కు, ఆ చాయ్‌వాలాకు మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి వాగ్యుద్ధం జరిగింది. డ్రయివరు ప్రో కాంగ్రెస్. చాయ్‍వాలా మోదీజీ వీరభక్తుడు.

“తలక్రిందులుగా తపస్సు చేసినా మీ కాంగ్రెస్ గెలవదు. మళ్లీ బి.జె.పి.యే అధికారంలోకి వస్తుంది” అన్నాడు

మేము శ్రోతలం మాత్రమే! రెండు వారాల తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలతో చాయ్‌వాలాయే నెగ్గాడు!

రూం చేరేసరికి ఏడయింది. గీజర్ వేసుకొని హాయిగా స్నానాలు చేశాము. ఎనిమిదిన్నరకు క్రిందికి వెళ్లి, టేస్ట్ ఆఫ్ ఇండియా వారి రెస్టారెంటులోనే మసాలా దోసె, ఉప్మా తిని, మసాలా మజ్జిగ తాగాము. “మసాలా దోసె అంతంత మాత్రం గాని, ఉప్మా మటుకు సూపర్!” అన్నాడు మా యోగా. వాడు ఉప్మాప్రియుడు. ఉప్మాప్రియులు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోకండి. చాలామంది ఉంటారు. నేను కూడా! మా యల్లమంద తటస్థవిధానం అవలంబించి, నవ్వుతూ చూస్తున్నాడు. తటస్థంగా నవ్వడం కూడా ఒక కళేనండోయ్!

***

ఉదయం 7.30కి రడీ అయ్యాము. కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ తొమ్మిదికట.

“ఎగ్గొట్టడానికే ఆ టైం పెట్టారు దొంగవెధవలు!” అన్నా నేను. టూరిస్టులంతా ఎనిమిదికల్లా సైట్ సీయింగ్‍కు బయలుదేరతారు కదా, తొమ్మిదికి బ్రేక్‌ఫాస్టా? బుద్ధిలేకపోతే సరి!

రోడ్డు కవతల ఒక హోటల్ కనబడింది. దానిపేరు ‘ఫ్రెష్ ప్యూజన్ 369’ అదేం పేరో మరి! పేరు పోష్ గాని, రెస్టారెంటు సింపుల్ గానే ఉంది. `పోహా’ పొగలు కక్కుతూ ఉంది. ‘మిర్చీబడ’ (బజ్జీ) కూడ వేడిగా వేస్తున్నాడు.

‘ఫ్రెష్ ప్యూజన్ 369’ లో టీ

“శర్మా! ఉగ్గాని బజ్జీ లేని లోటు ఇక్కడ తీరేలా ఉంది” అన్నాడు యోగా. పోహా (అటుకుల ఉప్మా) బాగుంది. కానీ ‘మిర్చీబడ’ లో బంగాళాదుంప కూర స్టఫ్ చేసి, ఇంతింత వేశాడు. కారం అసలు లేవు. మా రాయలసీమ వాళ్లకు బజ్జీలు చురుక్కుమనాలి నాలుకకు.

“ఇవేం బజ్జీలు?” అని చప్పరించేశాము (బజ్జీలను కూడా). టీ మాత్రం మా కోసం స్పెషల్‌గా తయారు చేశాడు. సూపర్!

ఈ రోజు డ్రయివరు మారాడు. అతని పేరు అలీ. అతనికీ టీ అఫర్ చేశాము.

“సార్, మనం ఈ రోజు సాంచీ, గుఫామందిర్ ధామ్, భారత భవన్, మ్యూజియం అప్పర్ లేక్, బోట్ క్లబ్, లోయర్ లేక్ కవర్ చేయాలి” అన్నాడు. ఆ మేరకు నాకు డొనేటో ట్రావెల్స్ నుండి నిన్న రాత్రి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. “మరి ఇందిరా గాంధీ మానవ సంగ్రహాలయ్?” అనడిగాను.

“అది కూడా సార్” అన్నాడా అబ్బాయి నవ్వుతూ. చిన్నవాడే. ముఫైలోపే.

భోపాల్ నుంచి ‘సాంచీ’ 65 కి.మీ. ఉంది. హైవేనే గంట పట్టింది. ‘సాంచీ’ దేశంలోని అతిపెద్ద బౌద్ధస్తూపానికి ప్రసిద్ది. టూరిస్టులతో కిటకిటలాడుతుంది.

 

పశ్చిమ మహాద్వారం

పార్కింగ్ దగ్గరే ‘సెటియాగిరి విహార’ అన్న బౌద్ధ దేవాలయం ఉంది. దానిని సిలో‌న్‍కు చెందిన ‘మహాబోధి సొసైటీ’ వారు నిర్మించారు. అది పురాతనమైందేమో కాదు 1952లో కట్టారు. ముందు, పెద్ద మార్బుల్ ఏనుగుల బొమ్మలు ఠీవిగా నిలబడి ఉన్నాయి.

‘సెటియాగిరి విహార’ వద్ద

లోపల బుద్ధుని విగ్రహం ధ్యాన భంగిమలో ఉంది. బహుశా అది ‘చైత్యగిరి’ కావచ్చు. బుద్ధ దేవునికి జోతలర్పించాము. సాంచీ, విదిశ పట్టణం నుంచి కేవలం 8 కి.మీ. దూరంలో ఉంది.

సాంచీ స్తూపం ఒక ఎత్తయిన గుట్టమీద ఉంది. పైకి వెళ్లడానికి మెట్లు కాకుండా, స్లోప్‌ను నిర్మించారు. మా లాంటివారికి హాయి! స్తూపము ఒక పెద్ద గుమ్మటం ఆకారంలో ఉంది. దానికి నాలుగు మహ ద్వారాలు కళాత్మకంగా ఉన్నాయి. లోపల, స్తూపం చుట్టూ నడవడానికి నాలుగడుగుల వెడల్పున్న దారి ఉంది. రెండు చోట్ల మెట్లున్నాయి. అవి ఎక్కి వెళితే స్తూపం మధ్యవరకు వెళ్లవచ్చు.

తూర్పు మహాద్వారం

‘ది గ్రేట్ స్తూప ఆఫ్ సాంచీ’గా అది ప్రసిద్ధి కెక్కింది. అది మౌర్య నిర్మాణశైలిలో నిర్మించబడింది. నిర్మాణ కాలం 3వ శతాబ్దం BCE.

ఉత్తర మహాద్వారం

స్తూపం ఎత్తు 54 అడుగులు వ్యాసం 120 అడుగులు. పూర్తిగా రాతి కట్టడం. మౌర్యచక్రవర్తి యైన అశోకుడు, బుద్ధుని అవశేషాల మీద దీనిని నిర్మించాడు. స్తూపం మీద ఒక ఛత్రం ఉంది. అశోకుని అర్థాంగి ‘దేవి’. ఆమె విదిశ లోని ఒక వ్యాపారస్థుని కూతురు. సాంచీ లోనే ఆమె పుట్టింది. వారి వివాహం కూడ సాంచీ లోనే జరిగింది. ఒకటో శతాబ్దం BCE లో నాలుగు మహ ద్వారాలు, తోరణాల ఆకృతిలో ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఎన్నో స్తూపాలకు సాంచీ కేంద్రం. సాంచీకి 2 కి.మీ. దూరంలో 40 చిన్నచిన్న స్తూపాలున్నాయి. వాటికింద సారిపుత్ర, మహా మొగ్గల్లన వంటి బౌద్ధ సన్యాసుల అవశేషాలున్నాయి.

దక్షిణ మహాద్వారం

రెండువందల రూపాయల నోటు వెనుక నుంచీ స్తూపం ముద్రించబడి ఉంటుంది. సాంస్కృతిక చిహ్నంగా దాని ప్రాముఖ్యతను ప్రభుత్వం అలా గుర్తించింది. అశోకస్తంభం ప్రత్యేక ఆకర్షణ. శుంగులు, శాతవాహనులు దీనిని పరిరక్షించి, అభివృద్ధి చేశారు.

గాంధార శిల్పరీతి, నిర్మాణంలో ద్యోతకమవుతుంది. మహాయాన బౌద్ధం దీనికి అవలంబన. మాయాదేవి స్వప్నం,  మహాభినిష్క్రమణం లాంటి దృశ్యాలు రాతిలో చెక్కారు.

గ్రీకులు, యవనులు కూడా ఈ సూపాన్ని సందర్శించేవారు. గ్రీకు రాయబారి హేలియోడొరస్ (100 BCE) విదిశకు వచ్చి, ఈ స్తూపాన్ని సందర్శించాడు.

ప్రస్తుతం మాతోబాటు ఎందరో శ్రీలంక, మలేసియా, నేపాల్, భూటాన్ యాత్రీకులు వచ్చారు. శ్రీలంక వారు సింహభాగం ఉన్నారు. శ్రీలంక భాష (సింహలీస్‌) లో, గైడ్స్, వారికి స్తూపం పాశస్త్యాన్ని వివరిస్తున్నారు.

మా యోగానంద స్వాములవారు, ఏదో తెలిసినట్లు వెళ్లి వారి గుంపులో నిలబడి కాసేపు విని వచ్చాడు.

“ఒక్క ముక్క అర్థం కాలేదు” అన్నాడు.

“ఒరేయ్, నీకు తెలుగు తప్ప ఏ భాషా రాదు కదా! సింహలీస్ భాషను వినడానికి తగదునమ్మా అని ఎందుకు వెళ్ళావురా?” అనడిగాను నవ్వుతూ.

“నీవున్నావు కదా! అందుకే నీ వెంట వచ్చాను” అన్నాడు వాడు. యల్లమంద మా ఇద్దర్నీ నవ్వుతూ చూస్తున్నాడు.

‘చైత్యగిరి విహార’ క్రిందకూడ బుద్ధుని అస్థికల అవశేషాలు ఉన్నాయి. మొదటవాటిని ట్రోఫీలుగా మార్చి, ఇంగ్లండ్ లోని విక్టోరియా, ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంచారు. శ్రీలంక, భారత బుద్ధిస్టులు – ‘మహాబోధి సొసైటీ’ గా ఏర్పటి, వాటి కోసం పోరాడి, వెనక్కు తెచ్చుకున్నారు. ఇది 1947లో జరిగింది. సాంచీ లోని ‘చైత్యగిరివిహర’ 1952లో కట్టారు.

సాంచీ స్తూపం అంతర్భాగాన బుద్ధుని చితాభస్మం ఉందని ఐతిహ్యం. మహాద్వారాలను ‘తోరణాలు’ అంటారు. స్తూపం ఒక hemispherical dome. అండాకారంలో ఉంది. మధ్యలో ఉన్న రాతి రెయిలింగ్‌ను ‘హార్మిక’ అంటారు. మధ్యలోని స్తంభాన్ని ‘యాష్టి’ అంటారు. పైన ఛత్రం మూడు భాగాలుగా ఉంది, బౌద్ధ సిద్ధాంతాలైన బుద్ధుడు, ధర్మము, సంఘములను ప్రతిబింబిస్తుంది.

ఒక చైత్యపు శిధిలాలు

మహాద్వార తోరణాలు అచ్చెరువు కల్గించే కళాకృతులకు నిలయాలు. కుడ్యములపై జాతక కథలు, కొన్ని బౌద్ధచిహ్నాలు చిక్కారు. విదిశ లోని ఐవోరీ (ఏనుగు దంత) కళాకారుల పేర్లు కొన్ని చెక్కి ఉండడం విశేషం.

12వ శతాబ్దం తర్వాత స్థూపం శిధిలమవుతుంటే, 1818లో, బ్రిటిష్ పాలకుడు జనరల్ హెన్రి టేలర్, దానిని సందర్శించి, పునరుద్ధరణకు ఆదేశించాడు. 1898లో ప్రారంభమైన పునరుద్ధరణ పనులు 1919లో ముగిశాయి. వాటిని, ఇండియన్ ఆర్కియలాజికల్ సర్వీసంస్థ డైరెక్టర్ జనరల్ జాన్ హ్యుబర్ట్ మార్షల్ పర్యవేక్షించాడు. 1989లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. మొత్తం స్తూపమంతా సందర్శించడానికి గంట పైనే పట్టింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here