మా మధ్య ప్రదేశ్ పర్యటన-7

1
2

[ఇటీవల మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]మ[/dropcap]ర్నాడు ఉదయం ఏడున్నరకు తయారై, ఎదురుగా ఉన్న ‘ఫ్రెష్ ఫ్యూజన్ 369’ రెస్టారెంటులో ‘బినా చీనీ’ కాఫీలు తాగాము. మా యల్లమందకు షుగర్ లేదు. మేమిద్దరమే స్వీట్ బాయిస్! ఆయన ఒక స్పూన్ చక్కెర వేయించుకున్నాడు. చెక్ ఔట్ చేసేశాము.

మళ్లీ డ్రయివరు మారాడు. అతని పేరు కుశాగ్ర్ జోషీ! బ్రామ్మడట! మా వాళ్లు ‘డిగ్నిటీ అప్ లేబర్’ ను పాటిస్తూన్నందుకు అతన్ని చూసి గర్వపడ్డాను. గౌరవనీయమైన వృత్తి ఏదైనా, మంచిదే! అతనికి టీ ఇప్పించాము. చిన్నవాడు. నలభైలోపు!

అక్కడ నుంచి మా ప్రయాణం ఉజ్జయిన్‌కు. అది 220 కి.మీ దూరం. కారు పెద్దది. విశాలంగా ఉంది. హైవే మీద, ఫోర్ లేన్స్ రహదారిలో 3 గంటల్లో ఉజ్జయిని చేరుకున్నాము. ‘మహా కాలేశ్వర మందిర్’ అక్కడ ప్రసిద్ధి. అది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.

దారిలో మాకు ఇంకో మంచి దేవస్థానం చూపించాడు కుశాగ్ర్. అతని పేరుకు అర్థం ఏమిటని మా యోగా అదిగాడు. “కుశ.. అంటే దర్భ. దాని అగ్రం అంటే మొన. వాడిగా ఉంటుంది. నిశితమైన మేధస్సు గల వారిని ‘కుశాగ్రబుద్ధి’ గల వాడంటారు!”. యల్లమందకు ఇది తెలుసు. “మన వైపు ఇలాంటి భావస్ఫోరకమైన పేర్లు తక్కువ కద మిత్రమా!” అన్నాడాయన.

దారిలో మేము చూసింది కూడా శివాలయమే, దాన్ని ‘కుబేరేశ్వర్ ధామ్’ అంటారు.

కుబేరేశ్వర్ ధామ్ ప్రధాన ద్వారం

కుబేరేశ్వర్ ధామ్ భక్తులతో నిండిపోయింది. పవిత్రమైన కార్తీక మాసం మరి! కుబేరేశ్వర స్వామి ఒక పెద్ద బండశిల రూపంలో ఆరుబయటే వెలసి ఉన్నాడు.

ఎదురుగా ఒక మంటపం. దాని మీద భుజగశయనుడైన విష్ణువు విగ్రహం నయనానందకరంగా ఉంది. అటు పక్క, సీతారాములను నది దాటిస్తున్న గుహుడు, సజీవాకృతులతో! ఇంకోపక్క గోపాల్‌జీ మందిర్ ముఖద్వారం వద్ద 300 మీటర్ల ఎత్తున్న మహాశివలింగం, నిర్మాణంలో ఉంది.

సీతారాములను నది దాటిస్తున్న గుహుడు
భుజగశయనుడైన విష్ణువు

మందిరం ఉన్న ఊరి పేరు సేహోర్. దాని పాత పేరు సిద్ధాపూర్. దానిని స్థాపించి అభివృద్ధి చేసినవాడు కథావాచక్ (ప్రవచనకర్త) శ్రీ ప్రదీప్ మిశ్రా గారు. ఆయన మధ్య భారతంలో ప్రముఖ పౌరాణికుడు.

నిర్మాణంలో 300 అడుగుల ఎత్తు మహాశివలింగం

అక్కడ ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో ఒక దుర్ఘటన జరిగిందని కుశాగ్ర్ మాకు చెప్పాడు. ‘శివమహాపురాణ్’ కథా ప్రసంగం, రుద్రాక్ష పంపిణీ, ప్రదీప్ మిశ్రా గారి ఆధ్వర్యంలో జరిగిందట. ఆ వితరణ కార్యక్రమానికి దాదాపు పది లక్షలమంది వచ్చారట. సేహోర్ గ్రామం ఇండోర్ – భోపాల్ హైవే పై ఉంటుంది. భక్తుల తాకిడితో హైవేపై 20 కి. మీ. మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి, దేవాలయం వద్ద తొక్కిసలాట జరిగిందట.

పది కౌంటర్లు ఏర్పాటు చేసి, తొలి రోజే 15 లక్షల రుద్రాక్షలు పంపిణీ చేశారు. భక్తులకు నీడ ఏర్పాట్లు లేవు. బారికేడ్లు వెదురు బొంగులతో ఏర్పాటు చేయడం వల్ల అవి సులభంగా తొలగిపోయాయి. కొందరు భక్తులు మరణించారు కూడా.

కుబేరేశ్వర్ ఉత్సవమూర్తి

“మూఢ భక్తి దీనికి కారణం” అన్నాను నేను. “ఆ రుద్రాక్ష మహిమ సంగతేమో గాని ఎందరో స్పృహ తప్పిపడిపోయారు. కొందరు చనిపోయారు. ఇలాంటి ఈవెంట్స్ బాధ కలిగిస్తాయి” నా మిత్రులు నాతో ఏకీభవించారు.

మేము ఉజ్జయిని మహాకాలేశ్వర్ మందిర్ దగ్గరికి చేరుకున్నాము. దారిలో ఎం.పి. టూరిజం వారి రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేశాము. చాలా పెద్దది అది. మన టిఫిన్స్ అన్నీ ఉన్నాయి. చాలా పెద్ద సైజులో ఉన్న ‘మినప వడలు’ మమ్మల్ని ఆకర్షించాయి. ప్లేటు (2) వంద రూపాయిలు. ఒక పెద్ద గిన్నెలో, ఆల్రెడీ సాంబారులో వడలను నానవేసి ఉంచారు. అవి బాగా నాని, ఉబ్బి, రెండింతలయ్యాయి. మరింత సాంబారు వాటి మీద పోసి, ఒక బౌల్‍లో ఇచ్చారు. పైన నారియల్ చట్నీ కూడ వేశారు. సాంబారు ఘుమ ఘుమ లాడుతూంది. రెండూ తినేసరికి ‘హెవీ’ అయ్యాయి పొట్టలు.

కార్ పార్కింగ్ నుంచి మహాకాలేశ్వర్ ఆలయం కిలోమీటరు పైన ఉంది. ఆ దారిని కాలేశ్వర్ కారిడార్ అంటారు. సీనియర్ సిటిజన్స్‌కు, వికలాంగులకు రావడానికి, పోవడానికి బ్యాటరీ కార్లు ఉన్నాయి. అవి నిశ్శుల్క్! అంటే ఫ్రీ.

మహాకాలేశ్వర్ మందిర్

దారి వెంట రెండు వైపులా అద్భుత శిల్పాలు, విగ్రహాలు, కుడ్యచిత్రాలు కనువిందు చేశాయి.

యల్లమంద అన్నాడు “మిత్రమా, వెనక్కు వచ్చేడప్పుడు నడిచి వద్దాము. ఇవన్నీ నెమ్మదిగా చూస్తూ, ఫోటోలు, వీడియోలు తీసుకుందాము”.

“అద్భుతం తవ ఆలోచనా!” అన్నాను. “ఆవశ్యం ఆచరణీయం”.

“నాకూ అర్థమైందిలే” అన్నాడు యోగా.

సంస్కృతంలోని గొప్పదనం అది. నాకు చిన్నపుడు మా నాన్నగారు వాల్మీకి రామాయణాన్ని నెమ్మదిగా చదువుకోమనేవారు. సంస్కృతంలో ఆ మాత్రం పరిచయం ఉన్నవారికెవరికైనా అర్థమయ్యేంత సరళ సంస్కృతంలో రాశారు వాల్మీకి మహర్షి.

అక్కడ ‘శీఘ్ర దర్శనం’ కౌంటర్ ఉంది. టికెట్టు 25/- రూపాయలు. మూడు టికెట్లు తీసుకున్నాము. ఉచిత దర్శనం 3 గంటల పైనే పడుతుందని, శీఘ్ర దర్శనం అరగంటలోపే అయిపోతుందనీ, మా కుశాగ్రుడు మాకు ముందే చెప్పి ఉన్నాడు.

మేం క్యూ లో ప్రవేశించే ముందే, ఒక దుకాణంలో మారేడు దళాలు, పూలు, అరటి పండ్లు, అగరువత్తులు, ఒక సీలు తీయని వాటర్ బాటిల్, కోవాబిళ్లల పాకెట్ నైవేద్యానికి, కొనుక్కున్నాము. రెండు సెట్లు తీసుకున్నాము.

మహాకాలేశ్వరాలయం చాలా పురాతనం. నల్లరాతి నిర్మాణం – ఎన్నో ఉపాలయాలతో ప్రాంగణం విలసిల్లుతూన్నది. శివనామస్మరణతో పరిసరాలు మార్మోగుతున్నాయి.

“జై భోలేనాధ్! జై మహాదేవ్! జై మహాకాలేశ్వర్!” అని క్యూలో భక్తులు నినదిస్తున్నారు. నాకు దేహము, మనస్సు ఒక అనిర్వచనీయమైన దివ్యానుభూతికి లోనయ్యాయి. కళ్ళ వెంట నీరు కారసాగింది.

గద్గద స్వరంతో స్వామిని ఇలా స్తోత్రం చేయసాగాను.

“బ్రహ్మాండ వ్యాప్త దేహ! భసితహిమరుచో! భాసమానా భుజంగైః

కంఠే కాలాః కపర్దాకలిత శశికలాః చండకోదండ హస్తాః

త్ర్యక్షా రుద్రాక్షమాలా సలలిత వపుషః శాంభవా మూర్తిభేదాః

రుద్రాః శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవా – నః ప్రయచ్ఛన్తు సౌఖ్యమ్!”

నా అలౌకికావస్థను చూసి యల్లమంద కళవళపడుతూంటే, యోగా వారించాడు.

“శర్మ కిది మామూలే. కాసేపటికి తేరుకుంటాడు” అన్నాడు.

ఒక ఎత్తైన ప్లాట్‌ఫారం మీది నుంచి మహాకాలేశ్వరుని దర్శించుకున్నాము. నల్లని శివలింగం. సాలంకృతమై చుట్టూ దీపములతో ప్రకాశిస్తున్నది. మేము నిలబడిన చోటికి ఇరవై అడుగుల దూరంలో ఉంది.

“నమస్తే సర్వరూపాయ నమస్తే సర్వరూపిణే

రక్ష రక్ష మహాదేవ క్షమస్య కరుణాలయ!

భక్త చిత్త సమాసీన! బ్రహ్మవిష్ణుశివాత్మక!”

అని ఆక్రోశిస్తూ, స్వామిని చూస్తూ, ఏడ్చాను. క్యూలోని భక్తులను త్వరగా జరగమని అదిలిస్తున్న ఒకాయన నన్ను ఏమి అనలేదు. ‘ధన్యోస్మి మహాదేవా!’ అనుకుంటూ బయటకు వచ్చాము.

మా యల్లమంద అడిగాడు. “మిత్రమా! అద్భుతమైన స్తోత్రాలు! ఇవి ఎందులోవి?”

“మొదటిది నమకము ముందు వస్తుంది. రెండవది శ్రీశైలప్రభ లోని శివ సూక్తి ముక్తావళి లోది” అన్నాను.

మా యోగా కర్చీఫ్‌తో నా కన్నీటి చారికలను తుడిచాడు. “యల్లమంద సార్, మా శర్మకు జంధ్యం అవసరమా? మొదట్లో నేను మీ మాదిరే కంగారుపడేవాడిని. లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో అయితే అసలు తట్టుకోలేడు” అన్నాడు.

యల్లమంద నా చేతులు తన కళ్ల కద్దుకొన్నాడు. “మీలాంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం!” అన్నాడు.

“మరి నా సంగతి?” అన్నాడు యోగా.

అందరం నవ్వాము!

బయటకి వచ్చి ఉపాలయాలన్నింటినీ దర్శించసాగాము. ఒక చోట ఒక మంటపం, అందులో చిన్న శివలింగం కనబడినాయి. అక్కడ ఉన్న ఒక పండిత్‍జీని

“మేము ఈ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చా జీ!” అనడిగాను హిందీలో.

“జరూర్ కర్ సక్తే!” అన్నాడాయన.

ఒక బ్యాగులో పంచెలు ఉత్తరీయాలు కూడ తీసుకొని వెళ్లాము. ఇదంతా ప్రీప్లాన్డ్! గుడిలో ఎలాగు చేయనివ్వరు. ప్రాంగణంలో ఏదైనా శివలింగం ఉంటే, అవకాశముంటి, ముగ్గురం అభిషేకం చేసుకుందామని మిత్రులతో ముందే చెప్పాను. పూజాద్రవ్యాలు కూడా అందుకే తెచ్చేసుకున్నాము.

మంటపం మీద ముగ్గురం శివలింగం చుట్టూ కూర్చున్నాము. “కార్తీక మాస పుణ్యతిథౌ, మహాకాలేశ్వర దివ్య సన్నిధౌ అన్యోన్య సహాయేన ఏకవార రుద్రాభిషేకం కరిష్యే” అని సంకల్పం చెప్పించాను. ముగ్గురి గోత్ర నామాలు, భార్యా, పిల్లల, మనుమల పేర్లు చెప్పి, స్వామిని ఆవాహన చేసి, నేను నమకము, చమకములోని మొదటి పనస చదువుతూ ఉండగా, అందరం, సీల్డ్ వాటర్ బాటిల్ లోని నీటిని, మూడు డిస్పోసబుల్ గ్లాసుల్లో పోసుకొని, స్వామికి చక్కగా అభిషేకం చేశాము. మా నాన్నగారి దయ వల్ల నాకు నమక చమకాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, మహన్యాసం అన్నీ నోటికి వచ్చు.

శివలింగాన్ని టవల్‌తో తుడిచి, విభూతి, గంధం పెట్టాము. పువ్వులు, బిల్వదళాలతో అర్చన చేశాము. శివాష్టోత్తరం చదివాను. పూర్తిగా రాదు కాని, ముఫై నలభై నామాల వరకు చెప్పగలను.

“ఓం శివాయనమః, మృత్యుంజయాయ నమః, హాలాహల భక్షణా యనమః, కపాలినే నమః, శూలినేనమః, భస్మోద్ధూళిత విగ్రహాయ నమః, వృషారూఢాయ నమః, పిశాచగణ సేవితాయ నమః, పార్వతీ పతయేనమః, ఓం మహాదేవాయనమః “ అంటూ నామాలు చదువుతూ ఉంటే మిత్రులిద్దరూ పూజ చేశారు.

తర్వాత ఉదొత్తులు వెలిగించాము. కోవాబిళ్లలు నైవేద్యం పెట్టాము. కర్పూరం వెలిగించి, స్వామికి హారతిచ్చాము.

“భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే।

కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్॥

సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ।

అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్॥”

అని శివ మంగళాష్టకములోని రెండు శ్లోకాలు పఠించాను. మంత్రపుష్పం చెప్పాను. ఫలశృతితో ముగించాను.

మేము పూజ చేస్తూండగా, చూడడానికి కొందరు భక్తులు గుమిగూడారు. కొందరు వీడియో తీశారు. కొందరు నాకు నమస్కరించారు.

తీర్థప్రసాదాలు తీసుకున్నాము. మా యల్లమంద పర్సు లోంచి వెయ్యిన్నూటపదార్లు తీసి నా కివ్వబోయాడు.

“వద్దు మిత్రమా! సంభావన తీసుకుంటే పౌరాహిత్యమవుతుంది. దక్షిణగా ఒక రూపాయి ఇవ్వు చాలు. నేను నీ మిత్రుడినే సుమా!” అన్నాను.

యోగాగాడు నవ్వుతూ చూస్తున్నాడు.

“కార్తీకమాసంలో, ఈ మహాక్షేత్రంలో, జ్యోతిర్లింగ సన్నిధిలో మాతో రుద్రాభిషేకం చేయించావు. ధన్యులమయ్యాము. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోము?” అన్నాడు యల్లమంద. ఎందుకో కొంత కదిలిపోయి ఉన్నాడు.

“బయటకు వెళ్లిన తర్వాత మంచి ‘టీ’ తాగించండి. చాలు” అన్నాను నవ్వుతూ.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here