[శ్రీ విజయ భాస్కరరెడ్డి, తన స్నేహితుడు శ్రీ దయానందబాబుతో కలిసి జరిపిన కంబోడియా పర్యటన అనుభవాలను అక్షరబద్ధం చేసి అందిస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం. నెరేషన్ విజయ భాస్కరరెడ్డి గారు.]
నవంబరు 23:
[dropcap]25[/dropcap] రోజుల వియత్నాం పర్యటన విజయవంతంగా పూర్తిచేసుకొని, నవంబరు 22 ఉదయం హోచిమిన్ సిటీకి వీడ్కోలు పలికి బస్సులో కంబోడియా రాజధాని నాంఫెన్‌కు (Phnom Penh) ప్రయాణమయ్యాము. వియత్నాంలో ఉన్నపుడే వీసా తీసుకొన్నాము. సుమారు ఆరుగంటల ప్రయాణం. రెండు దేశాల సరిహద్దులో చెక్ పోస్టు వద్ద బస్ అరగంట పైగా వద్ద ఆగింది. కొందరు టూరిస్టులను ఏవో కారణాలతో ఇక్కడే ఆపేశారట. మాకు కూడా ఏదో గిలిగిలిగా ఉంది. మా కాగితాలన్నీ పరిశీలించి ఇచ్చేశారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొన్నాము.
దారిలో రోడ్డు ప్రక్కన ధాబా వద్ద మధ్యాహ్న భోజనానికి బస్సు ఆపారు. మధ్యాహ్నం 2 గంటలకు నాంఫెన్ చేరి, టాక్సీలో Mad monkey హాస్టల్ చేరాము. కాంబోడియా, వియత్నాంలలో ఒక యాప్ ద్వారా టాక్సీలు, ఆటోలు కుదుర్చుకొన్నాం (విదేశీయులం కనుక రేటు కాస్త ఎక్కవే చెబుతారు). స్థానికులతో మా సంభాషణ అంతా గూగుల్ ట్రాన్స్‌లేటర్ ద్వారానే సాగింది. కొంతమంది ఇంగ్లీషు, ఫ్రెంచి అర్ధం చేసుకోగలరు.
ఉద్యోగ బాధ్యతల్లో నాంఫెన్‌లో ఉన్న పరిచయస్థులు డా. శేషుబాబుగారు మా హాస్టల్‍కు వచ్చి కలుసుకోడమేగాక, మా పర్యటన ఏర్పాట్లన్నీ చేశారు. మూడు రోజులు నాంఫెన్‌లో తిరగడానికి, వారం రోజులు అంకోర్‍వాట్ దర్శించడానికి కేటాయించుకున్నాము.
నాంఫెన్‌లో National Museum, Royal palace, Sihu Pagoda వంటి ముఖ్యమైనవన్నీ తొందర లేకుండా విశ్రాంతిగా చూచాము.
నదీతీరంలో పర్యాటకులు రాత్రి పగలూ, తిరుగుతూనే ఉంటారు. రెస్టారెంట్లు, బార్లు, బజార్లు ఎప్పుడూ కళకళ లాడుతూంటాయి. ఫ్రెంచి వలస పాలకుల పరిపాలనలో నాంఫెన్ అభివృద్ధి చెందింది కనక, ఆ అవశేషాలు కనిపిస్తాయి. స్థానిక ప్రజల భాష ఖేమర్ అయినా, English, French భాషల బోర్డులు కనిపిస్తాయి.
నాంఫెన్ నగరం గుండా ప్రవహించే Mekong, Tonte నదీతీరాల వద్ద పార్కులు, హోటళ్ళు, ఇన్‍లు సందర్శకులతో నిండివుంటాయి. వియత్నాం మీద చైనా సంస్కృతి ప్రభావం విపరీతంగా ఉన్నట్లే, కంబోడియా మీద భారతీయ సంస్కృతి ప్రభావం అడుగడుగునా కనబడుతుంది. తరచూ ఏడు తలల నాగరాజు శిల్పాలు కనిపిస్తాయి. దాదాపు ఏభై ఎళ్ళుగా సోషలిస్టు, అతివాద వామపక్షాలు కంబోడియాను పాలిస్తున్నా దేశాధిపతిగా రాజునే నిలుపుకొన్నారు. నాంఫెన్ నగరం కూడలిలో ప్రిన్స్ నరోద్దం సింహనోక్ విగ్రహం ప్రజల అభిమానాన్ని అందుకుంటోంది.
1975-1979 మధ్య కాలంలో అధికారం చేపట్టిన నియంత పోల్‍పాట్ హిట్లరులాగే ఒక మాస్టరు జాతిని తయారు చెయ్యాలని, నాంఫెన్ నగర ప్రజలందరిని ఉన్న పళంగా గ్రామాలకు తరలించాడు. అందరిని శారీరిక శ్రమలో, వ్యవసాయం పనుల్లో నియోగించాడు. ఈ ప్రయోగంలో తిండి లేక, పస్తులతో, రోగాలతో వేలమంది మరణించారు. పోల్‌పాట్ అనుయాయులు గ్రామాల్లో ప్రజావ్యతిరేకులని ముద్ర వేసి, వేలమందిని కాల్చివేశారు.
పోల్పాట్ పదవీచ్యుతుడైన తర్వాత, కంబోడియాలో సామూహిక హత్యలు జరిపి పాతిపెట్టిన కంకాళాలు బయట పడ్డాయి. పోల్‌పాట్ పాలనలో Security Prison గా Tuol School లో ప్రభ్వుత్వ వ్యతిరేకులు అని ముద్ర వేసిన వారిని బంధించి, అక్కడ 20 వేలకు పైగా ప్రజలను హత్య చేశారు. పర్యాటకులు – ఈ మ్యూజియంను కూడా చూచి ఆ విషాద చరితను గుర్తు చేసుకుంటారు. కంబోడియా అంతర్యుద్ధాలలో, తిరుగుబాట్లుతో చెప్పలేనంత నష్టపోయింది. 2001లో వియత్నాం అనుకూల ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతనే శాంతిభద్రతలు నెలకొన్నాయి.
అంకోర్‌వాట్ ప్రయాణం:
నాలుగో రోజు అంకోర్‍వాట్‍కు బయలుదేరాము. దాదాపు 6 గంటల బస్సు ప్రయాణం. సుమారు 325 కిలోమీటర్ల దూరం. కంబోడియాలో నాంఫెన్ తర్వాత పెద్ద నగరం సయాం రీప్ (Siem Reap) లో Ridge home stay లో ఉండి, రోజూ అంకోర్‌వాట్ శిధిలాలు చూరి సాయింత్రానికి తిరిగి వచ్చేవాళ్ళం. ఒకరోజు ప్రత్యేకంగా అంకోర్‍వాట్‍లో సూర్యోదయం చూద్దామని వేకువనే బయల్దేరి వెళ్ళాము.
అంకోర్వాట్ దేవాలయానికి ఐదు ప్రవేశ ద్వారాలున్నాయి. ప్రతీదీ అత్యంత సుందరమైనదే.
తొలిరోజు మేము కాలినడకనే అంకోర్‌వాట్ తిరిగి చూచాము. ఆ రోజు ఆదివారం.
అంకోర్వాట్ ఆలయం పైకి వెళ్ళనివ్వలేదు. మరురోజు ఏడంతస్తులుగా ఉన్న ఆలయ గోపురం మీదకి ఏర్పాటు చేసిన మెట్ల మార్గంలో వెళ్ళాము. అంకోర్‍వాట్ శిధిలాలు దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో అక్కడక్కడా వెదజిల్లినట్లుంటాయి. మేము వెళ్ళినప్పుడు ఆలయాలలో కొన్నిచోట్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.
మొదట, 11వ శతాబ్దంలో అంకోర్‌వాట్ ఆలయాన్ని విష్ణు అలయంగా నిర్మించినా, నిర్మాత ఆలయం పూర్తికాక ముందే మరణించారని, తర్వాత వచ్చిన వారసుడు దీన్ని బౌద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దినట్లు చరిత్ర. ప్రధాన ఆలయం, ఇతర ఆలయాల గోపురాలు నాలుగు ముఖాలుగా ఉంటాయి. తీర్చబడినవి. మానవ ముఖ రూపంలో ఉన్న గోపురం తలపై త్రికోణాకృతిలో కిరీటం దిద్దబడింది. గోపురాన్ని ఏ వైపు నుంచి దర్శించినా, కిరీటధారి ముఖ రూపంలో కనిపిస్తుంది. అంకోర్‌వాట్ ఆలయాలు సున్నం, ఇటుకతో నిర్మించబడ్డాయి. ఆలయం నాలుగు దిక్కులా, నాలుగు సరస్సులు. వేయి సంవత్సరాల చరిత్ర కలిగిన అంకోర్‌వాట్ ఆలయాల వంటివి మరెక్కడా లేవు. కాలం గడిచే కొద్దీ ఆలయాలపైన మొలిచిన మర్రి, జువ్వి, రావి వంటి వృక్షాలు పెరిగి, ఊడలు దిగి మహావృక్షాలయ్యాయి. భారత పురావస్తు శాఖ ASI ఆలయాలను, ఆలయాలను తమ కౌగిల్లో బంధించినట్లున్న చెట్లనూ కాపాడే విధంగా కార్యక్రమం చేపట్టింది. వృక్షాలు లేకుండా అంకోర్‌వాట్ ఆలయాలను ఊహించాలేము కూడా!
అంకోర్వాట్ ఆలయ సముదాయం మధ్య మధ్య అక్కడక్కడా ఏ మాత్రం దెబ్బతినని నంది విగ్రహాలు, లింగాలు లేని పానవట్టాలు, కొన్ని చోట్ల పానవట్టాలపై బుద్ధుని విగ్రహాలు గమనించాము. కంబోడియా ఒకటవ శతాబ్దికే భారతీయ సంస్కృత ప్రభావంలోకి వచ్చింది. ఇక్కడి శిధిలాలలో సంస్కృత భాషలో, ద్రావిడ భాషల్లో వేసిన శాసనాలు కనిపించాయి. జావా, సుమత్రా, ఇండోనేషియా రాజులు చోళ మండలంలో రాజకుమార్తెలను పెళ్ళాడి వెంటపెట్టుకొని వెళ్ళారట!
Terrace of Elephants
అంకోర్‌వాట్‌లో ఒక విశాలమైన మైదాన ప్రదేశంలో పెద్ద పెద్ద ఏనుగుల శిల్పాలతో ఒక చవికను, వితర్దిని నిర్మించారు. ఫుట్‍బాల్ మైదానం కన్నా పెద్దది, ఎత్తైన వేదిక. దాదాపు పదడుగులకు మించిన ఎత్తైన వేదిక. యుద్ధంలో విజయం చేపట్టి రాజధానికి తిరిగి వస్తున్న సైన్యానికి రాజు ఈ వేదికలాగ నిలబడి స్వాగతం పలికేవాడట! ఈ వేదిక కుడ్యాల మీద అంబారీపై రాజు ఆసీనులైనట్లు పెద్ద పెద్ద శిల్పాలు చెక్కారు.
ఈ వేదిక కుడ్యం పైన అయిదు శిరస్సుల అశ్వం, గరుత్మంతుడి శిల్పాలు, యుద్ధరంగ దృశ్యాలు, నర్తకీమణుల శిల్పాలు చెక్కారు. ఈ వేదిక గోడ కొంతభాగం కూలిపోయినా, కొంత యథాతథంగా ఉంది. కంటితో చూస్తేనే తప్ప నమ్మలేనంత పెద్ద వేదిక, వందల శిల్పాలు.
బయాన్ శిధిలాల సందర్శన:
పూర్వం బయాన్‍ను ‘జయగిరి’ అని వ్యవహరించే వారట! 1980లో ప్రిన్స్ నోర్దమ్ సింహనౌక్ అభ్యర్థనకు స్పందించి, అంకోర్‌వాట్ ఆలయ సముదాయాన్ని కాపాడడానికి ముందుకు వచ్చిన దేశాలలో భారతదేశం మొట్టమొదటిది.
మన ASI సాంకేతిక నిపుణులు పుష్కరకాలం అంకోర్‌వాట్ పునరుద్ధరణలో పాల్గొన్నారు. Ta Prohm Temple పునరుద్ధరణకు 2000లో మన దేశను ముందుకు వచ్చింది. ఈ Tree Temple కంబోడియా ప్రజలకు ఇష్టమైనది. వీళ్ళు అడవులు, ప్రకృతి, వృక్షాలతో మమేకమయ్యారు. పెనువృక్షాల సందిళ్ళలో ఇమిడిపోయిన ఆలయాలనూ, ఆ వృక్షాలను యధాతథంగా కాపాడేందుకు మన సాకేతిక నిపుణులు విధివిధానాలను అమలు చేశారు.
Kulen Mountain Tour:
3వరోజు సయాంరీప్ లో ఆటో మాట్లాడుకుని Kulen Mountain పరిసర ప్రాంతాలు సందర్శించాము. దాదాపు 70 కిలోమీటర్లు దూరం, పోను రెండుగంటలు, తిరిగి రాను రెండు గంటలు పట్టింది. కులెన్ జలపాత పరిసరాలు నెల్లూరు జిల్లాలోని పెంచలకోన దృశ్యాలను గుర్తుకు తెస్తాయి. సుమారైన జలపాతం, చుట్టూ దట్టమైన అడవి. కంబోడియా ప్రజలు జలపాతాన్ని చూడడానికి వచ్చారు, మనలాగే స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ పెద్ద బండరాయిపై శయన బుద్ధ (Reclining Buddha) రూపాన్ని చెక్కారు.
చాలా పెద్ద విగ్రహం. బండ పై భాగానికి వెళ్ళి విగ్రహాన్ని సమీపం నుంచి చూడడానికి మెట్ల దారి ఏర్పాటుంది. కంబోడియా వారు బుద్ధ విగ్రహాన్ని ఆరాధించి, హుండీలో కానుకలు వేస్తున్నారు. పూజారులకు మారు బౌద్ధ సన్యాసులు నిలబడి ఉన్నారు. మన దేశంలో ఉన్నామన్న భావన కలిగింది. జలపాతం సమీపంలోని చిన్న cafe లో భోజనం చేసి, దగ్గరలోనే ఉన్న ‘థౌజండ్ లింగాస్’ చూడడానికి బయల్దేరాము. జలపాతం వద్ద తేనె, మష్‌రూం వంటి కొన్ని పదార్థాలు అమ్ముతున్నారు.
Thousand Lingas:
కులెన్ బౌద్ధవిగ్రహానికి 5-6 కి.మీ. దూరంలో ఒక చిన్న కొండవాగు వుంది, అందులో నీరు చాలా స్వచ్ఛంగా వుంది. నీటి అడుగున శిలలను శివలింగాల ఆకృతిలో చెక్కారు. శివలింగాలున్న ఈ ప్రదేశాన్ని, వేయి లింగాలని అంటారు. సందర్శకులు సెలయేటిలో దిగి నీటిని కలుషితం చేయకుండా చుట్టూ కంచె నిర్మించబడింది. ఆ సమీపంలోనే భూమి లోంచి నీరు ఊరుతూ చెలమ ఏర్పడింది. నీరు పైకి ఉబికి వస్తున్న ఆ ప్రదేశాన్ని కూడా యాత్రికులు దర్శిస్తారు. ఇక్కడ నెలకొన్న బుద్ధ విగ్రహానికి భక్తులు పూజలు చేస్తున్నారు. ఈ రోజు ఆటోలోనే తిరిగి చూచి సాయంత్రానికి హాస్టల్ చేరాము. నాకు పంటినొప్పి మొదలైంది. ఫోనులో నెల్లూరు డాక్టర్ మిత్రులు చెప్పిన మందులు కొని వేసుకొంటే రెండు రోజుల్లో నొప్పి పూర్తిగా ఉపశమించింది.
KOH KER ఆలయ సందర్శన:
మరుసటిరోజు KOH KER ఆలయాన్ని దర్శించడానికి బయలుదేరాము. ఖేమర్ భాషలో PRASAT THOM అంటారు. సియాం రీప్ నుంచి KOH KERకు 120 కి.మీ. దూరం, టాక్సీలో రెండు గంటల ప్రయాణం. దారిలో కొన్ని శిథిలాలయాలను దర్శించాము. ఉత్తర కంబోడియాలో దట్టమైన అరణ్యం మధ్య, జనసంచారం అంతగాలేని వివిక్త ప్రదేశంలోని KOH KER ఆలయం, మన ASI శాఖ పర్యవేక్షణలో ఉంది. శాసనాల్లో KOH KER ‘లింగపుర’ అని పేర్కొనబడింది. నాలుగో జయవర్మ పాలనలో ఈ ప్రదేశం కంబోడియా దేశ రాజధాని. చాలా పెద్ద సరస్సు, 40 ఆలయాలు ఇక్కడ నిర్మించబడ్డాయి. ప్రధాన ఆలయం పిరమిడ్ ఆకారంలో ఏడంతస్తులుగా నిర్మించి, శిఖరం వరకు వెళ్ళడానికి మెట్లు ఏర్పాటు చేశారు. ఈ ఆలయాన్ని, ఇతర ఆలయాలను రోజంతా చూచినా టైము సరిపోలేదు.
KOH KER లోనే మధ్యాహ్న భోజనం చేశాము. మాకు టాక్సీని కుదిర్చిన ఆటో అతను కూడా మా వెంట వస్తానంటే అతన్ని కూడా వెంటపెట్టుకుని వెళ్ళాము. ఇక్కడి ప్రజలు నెమ్మదస్థులు, సౌమ్యులు. ఈ యాత్రకు టాక్సీ అతనికి 75 US డాలర్లు చెల్లించాము.
చివరిరోజు:
Tonle Sap Lake
డిసెంబరు 2వ తారీకు. Tonle Sap Lake లో విహారం.
కంబోడియా వాయవ్య భాగంలో విశాలమైన మంచినీటి జలాశయంలో మధ్య మధ్య మత్స్యకారుల పల్లెలున్నాయి. మెకాంగ్ నది పరీవాహ ప్రదేశంలో ఏర్పడిన ఈ జలాశయంతో పల్లెలను floating villages అని స్థానికులు పేర్కొంటారు, పేకేజ్ టూర్‍లో అరపూట నౌకలో విహరించి, అతడి ప్రజల జీవితాలను గమనించాము.
డిసెంబరు 3వ తారీఖు ఉదయమే సియాం రీప్‌లో బస్సెక్కి నాంఫెన్‍కు ప్రయాణమయ్యాము. ఆ రోజు నాంఫెన్‌లో విశ్రాంతిగా ఉండి 4వ తేది ఉదయం బాంగ్‍కాక్‍కు ప్రయాణమయ్యాము.
(కంబోడియా పర్యటన సమాప్తం)