[శ్రీ విజయ భాస్కరరెడ్డి, తన స్నేహితుడు దయానందబాబుతో కలిసి జరిపిన వియత్నాం పర్యటన అనుభవాలను అక్షరబద్ధం చేసి అందిస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం. నెరేషన్ విజయ భాస్కరరెడ్డి గారు.]
నవంబరు 11వ తారీఖు:
Marble Hills సందర్శన:
[dropcap]ఈ[/dropcap] రోజు దనాంగ్‌కు సమీపంలోని మార్బుల్ హిల్సు చూచి వచ్చాము. పూర్వం ఇక్కడ చలువరాయి తవ్వి తీసి, విగ్రహాలు చెక్కడానికి, గృహోపకరణాలలో వినియోగించేవారు. ఇప్పుడు మైనింగ్ నిషేధించబడింది.
మార్బుల్ హిల్సు పైకి లిఫ్ట్‌లో కొంత దూరం వెళ్ళి తర్వాత కాలినడకన పైకి వెళ్ళాలి, చలువరాయి తవ్వకాలు జరిపిన గుహల వంటి ప్రదేశాలను చూచాము. కొన్నిచోట్ల బుద్ధుని విగ్రహాలు చెక్కి పెట్టారు. సందర్శకులు కొండ దిగిన తర్వాత, షాపుల్లో చలువరాతి విగ్రహాలు, సావనీర్లు కొనుక్కోవచ్చు. ఈ చలువరాతి గనులు చూడడం మంచి అనుభవం.
నవంబరు 12వ తారీఖు:
NHA TRANG:
నవంబరు 12వ తారీకు దనాంగ్ నుంచి Nha Trang బస్సులో బయలుదేరాం. వియత్నాంలో బస్సులు చాలా ఆధునికంగా, సౌకర్యంగా ఉంటాయి. ప్రతి బస్సు లోను, పరిశుభ్రమైన టాయిలెట్ ఉండడం విశేషం. దారిలో లంచ్ తిని, మధ్యాహ్మానికి Nha Trang చేరి backpackers hostel లో సుఖంగా విశ్రాంతి తీసుకొన్నాము.
నవంబరు 13వ తారీఖు:
నవంబరు 13 ఉదయం పగోడాలన్నీ దర్శించాము. నగరం సమీపములో చిన్న, కొండపైన Long Son పగోడాను, ఆ పగోడా ఆవరణలోని శిల్పాలను సందర్శించాము.
ఇక్కడ చాలా పెద్ద ఆకృతిలో తయారు చేయబడ్డ శిల్పం స్థానిక బౌద్ధ భిక్షువుదని అన్నారు. ఈ పగోడాలో ఆసియా దేశపు శిల్పకళ, కొయ్యచెక్కడం పని – దృష్టిని ఆకర్షిస్తుంది. Long Son పగోడా మెట్ల మార్గంలో శయిగించినట్లున్న బుద్ధ భగవానుని పరినిర్యాణ శిల్పం, దాని సమీపంలో ఆయన శిష్యుల శిల్పాలు అద్భుతంగా చెక్కబడినవి. ఈ పగోడాలో ఏర్పాటు చేయబడ్డ గంట ధ్వని సంగీతం సందర్భకులను ఆకట్టుకొంటుంది. కొండపైకి కారులో కూడా వెళ్లొచ్చు.
ఈ గుట్ట మీడ నుంచి Nha Trang నగర సుందర దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. Nha Trang నగరానికి దగ్గరలో ఉన్న చంపా పాలకుల నాటి ఆలయ సముదాయం తప్పకుండా చూడాలి. గాలి గోపురం, మండప గోపురం, గర్భగుడి.. మొత్తం ఇటుకలతో కట్టిన ఐదు గోపురాలు మాత్రమే మిగిలాయి. రాత్రి Backpackers విశ్రాంతిగృహంలో ఉన్నాము.
నవంబరు 14వ తారీఖు:
నవంబరు 14 ఉదయం బస్సులో బయలుదేరి, మధ్యాహ్నానికల్లా Da Lat నగరానికి వెళ్ళి, Home stay లో దిగాము. మధ్యాహ్నం హోం స్టే వారిచ్చిన స్కూటర్ మీద నగర సందర్శనకు బయలుదేరాము. హోం స్టే వారు, హాస్టళ్ళ వాళ్ళు సైకిళ్ళకు బాడుగ తీసుకోరు. మోటర్ సైకిళ్ళకు మాత్రం బాగా వసూలు చేస్తారు.
ఒక సరస్సు, గోల్ఫ్ క్రీడా మైదానం చుట్టూ దలాత్ టౌన్ విస్తరించింది. టౌన్ సమీపంలో చిన్న చిన్న జలపాతాలు, పైన్ వృక్షాల తోపులు, సహజమైన ప్రకృతి నుడుమ దలాత్ ‘జలపాతాల టౌన్’గా ప్రసిద్ధికెక్కింది.
ఇక్కడ ఏడాది పొడవుగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కనక ఫ్రెంచి వలసపాలకులు తమ సుఖాల కోసం ఈ టౌన్‌ని అభిమద్ధి చేసి పరాసుల శైలిలో గొప్ప భవనాలు నిర్మించారు. ఇది సందర్శకులకు ఆకర్షణ.
సాయంత్రం ఊరి మధ్య సరస్సును సందర్శించాము. సరస్సుకు అటూ ఇటు రోడ్లు, అసురసంధ్య వేళ వెలుగుతున్న విద్యద్దీప కాంతులతో శోభాయమానంగా ఉన్న ఆ సరస్సు ఊటిలోని సరస్సును తలపింపజేసింది.
సాయంత్రాలు పర్యాటకులు, టౌను ప్రజలు సరదాగా సరస్సులో బోట్లలో విహరిస్తూంటారు.
దలాత్ మార్కెట్ చాలా బాగుంది. దుకాణాల్లో వండిన రకరకాల సీ ఫుడ్ నోరూరించేంత అందంగా ప్రదర్శిస్తున్నారు. నా సహ యాత్రికునికి ఆహార విషయంలో కొద్దిగా అసౌకర్యం అయింది గాని, నేను మాత్రం ఆ దేశపు ఆహారం తృప్తిగా తిన్నాను. ఆ రాత్రి దలాత్ స్ట్రీట్ ఫుడ్ రుచి చూశాము. నూడుల్సు, సూపులు, అన్నం, ఫ్రైడ్ రైస్ వంటివి దొరుకుతాయి. కనక మా మిత్రుడు కూడా సర్దుకొని పోయాడు.
నవంబరు 15వ తారీఖు:
నవంబరు 15 ఉదయం Crazy House అనే పద్మవ్యూహం లాంటి చిత్రమైన గృహాన్ని చూడడానికి వెళ్ళాము. అందులో అతిథిగృహాలున్నాయి కూడా. రష్యాలో శిక్షణ పొందిన ఒక మహిళా ఇంజనీరు చిత్రాతిచిత్రంగా Crazy House ని రూపొందించింది. భవనంలో ఎన్నో మెట్లదారులు. సందర్శకులు తరచూ విస్మయానికి, భ్రాంతికి గురవుతారు.
ఇద్దరం మిత్రులం అద్దె సూటర్‍పై దలాత్ అంతా తిరిగి చూణము. పురాతన Linh Phuoc పగోడా రోజంతా చూచినా తనివి తీరదు. గాజు, పింగాణి పెంకుల దిబ్బ మీద నిర్మించారట!
పనికిరాని పింగాణి, గాజు ముక్కలను పగోడాలోని మంటప స్తంభాలను అలంకరించడానికి శిల్పులు వాడుకొన్నారు. స్తంభాలకు డ్రాగన్‍లు చుట్టుకొని ఉన్నట్లు చిత్రించారు. పగోడా వెలుపల ముందు భాగంలో మన గుళ్ళలో నంది విగ్రహం మాదిరి 49 మీటర్ల పెద్ద డ్రాగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ పగోడా లోనే ఒక చలువరాతి విగ్రహం చేతిలో త్రిశూలం ఉంది. భారతీయ శిల్పరీతులు వియత్నాం వరకూ వ్యాపించి, స్థానిక శిల్పకళను ప్రభావితం చేసినట్లు అనిపించింది. ఇక్కడి కొన్ని బుద్ధ విగ్రహాలు జీసస్ విగ్రహాలను గుర్తు తెస్తాయి. ఈ పగోడా మన ఆలయాలను గుర్తుకు తెచ్చింది.
Linh Phuoc పగోడా అంతస్తులు అంతస్తులుగా ప్రవేశ ద్వారం మీద గాలి గోపురం, పెద్ద పెద్ద బుద్ధ విగ్రహాలు, సింహాల బొమ్మలు, ఆలయం ముందు తోటలలో బోన్సాయి వృక్షాలు – అన్నిటికన్నా – అద్దం లాగా అతి పరిశ్రుభ్రమైన పగోడా ప్రాంగణం భారతీయులను ముగ్ధుల్ని చేస్తుంది.
వియత్నాంలో ప్రధాన మతం వజ్రయానానికి సంబంధించిన బౌద్ధ మతం. కైస్తవం, కన్‍ఫ్యూసియస్ మతాల ప్రభావం ఇక్కడి ప్రజలపై ఉంది. ఏ మతస్థులైనా తమ పితృదేవతలను ఆరాధిస్తారు. ఇక్కడి పగోడా ముందు ఉద్యానవనంలో తొట్లలో పెంచిన వెదుళ్ళను పెద్ద ఫ్లవర్‌వేస్‌గా అల్లిక చేసి తీర్చిదిద్దారు.
దలాత్ పగోడాలో బంగారు పోత పోసి తయారు చేసిన విగ్రహం మాదిరి ఉన్న బుద్ధ విగ్రహాన్ని దర్శించుకొన్నాము. దలాత్‍లో రెండు రాత్రులున్నాము.
నవంబరు 16వ తారీఖు:
హోచిమిన్ సిటీ – మారియమ్మ గుడి:
ఉదయం బస్సులో బయల్దేరి, ఐదారు గంటల ప్రయాణం తర్వాత మధ్యాహ్మం హోచిమిన్ సిటీ చేరాము.
హోచిమిన్ సిటీలో మన భారతీయులు నిర్మించిన మారియమ్మ గుడి దర్శించాము. తమిళదేశంలో మాదిరి గాలిగోపురం. గర్భగుడిలో విగ్రహం దుర్గామాత లాగా మాకు అనిపించింది. తమిళులే గుడిని నిర్వహిస్తున్నారు.
వియత్నామీయుల పగోడాలలో వలె గుడి లోపల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. విద్యుద్దీపాలంకరణతో తిరునాళ్ళ రోజుల్లో అలంకరించినట్లు గుడి అలంకరించబడి ఉంది.
నవంబరు 17వ తారీఖు:
హోచిమిన్ సిటీ:
ఈ రోజు మేము మా అంతట మేము నగరమంతా తిరిగాము.
అమెరికా యుద్ధంలో ఓడిపోయిన తర్వాత, సైగాన్ నగరానికి విముక్తి పోరాట జనకులు హోచిమిన్ పేరు పెట్టారు (1975). దక్షిణ వియత్నాంలో హోచిమిన్ సిటీ చాలా పెద్ద నగరం. ఇక్కడ ఎన్నెన్నో వస్తుప్రదర్శనశాలలు, Independence Palace, Reunification Convention Hall, War Remnants Museum వంటి ఎన్నెన్నో చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రదర్శనశాలలు ఉన్నాయి.
సైగాన్‌లో అమెరికా సైనికులతో పోరాటం జరుగుతున్న సమయంలో వియత్నాం కమ్యూనిష్టు గెరిల్లాలు భూగర్భం లోపల లోపల ఎలుకలు, పందికొక్కులు తవ్వినట్లు బొరియలు, చిన్న చిన్న గుహలు తవ్వుకొని రహస్యంగా ఉంటూ అమెరికా సైనికులు పైన ఆకస్మికంగా దాడులు చేసేవారు. అమెరికా సైనికులకు ఆ దేశం, వాతావరణం, భాష అన్నీ కొత్తే. నేపాళం బాబులు, ఫాస్పరస్ బాంబులతో అమెరికా విమాన దళాలు దాడి చేస్తున్నా, గెరిల్లాలు భూగర్భ గుహల్లో ఉండే ఆత్మరక్షణ చేసుకొన్నారు. Cu Chi (క్యూ చి) అనే ఈ గుహల సందర్శన కోసం దేశదేశాలనుంచి పర్యాటకులు వస్తారు. మేము కూడా ఆ చారిత్రాత్మక ప్రదేశాన్ని, భూగర్భ గుహాలను గైడ్ వివరిస్తుంటే ఆసక్తిగా చూచాము.
హోచిమిన్ సిటీలో వియత్నాం యుద్ధంలో అమెరికా ఉపయోగించిన బాంబులు, ఆయుధాలు, టాంకులు, విమానాల మ్యూజియం చక్కగా నిర్వహిస్తున్నారు. మా కళ్ళాముందు జరిగిన ఆ విముక్తి పోరాటంలో శత్రవు వాడిన ఆయుధాలన్ని ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. ఎంతో ఉద్వేగంతో ఈ మ్యూజియం సందర్శించాను. హోచిమిన్ సిటీ సందర్శనలో రెండు రోజులు గడచిపోయాయి.
నవంబరు 18వ తారీఖు:
Phu Quoc:
నవంబరు 18 ఉదయం హోచిమిన్ సిటీలో విమానం ఎక్కి Phu Quoc (ఫు కాక్) ద్వీపానికి వెళ్ళాము. ప్రయాణం గంట సేపే. ఫు కాక్ పర్యాటక కేంద్రాన్ని Sun World సంస్థ నిర్వహిస్తోంది.
మా హోం స్టే వెనుకనే సముద్ర తీరం, బీచి.
ఫు కాక్ రోడ్లు, ఆ రోడ్లలో తిరగడానికి ఎలక్ట్రానిక్ వాహనాలు, హోటళ్లు, గెస్టుహౌస్‌లు, విలాస భవనాలు, మసాజ్ సెంటర్లు, బార్లు. అదొక స్వప్నలోకం.
Sun world సంస్థ ఫు కాక్ ద్వీపానికి సముద్రం మీద కేబుల్ కార్ నిర్వహిస్తోంది, ఇదే ప్రపంచంలో అతి పొడవైన 8.5 కిలోమీటర్ల కేబుల్ మార్గమట! అప్పుడు ఆ కేబుల్ మార్గాన్ని నిర్వహణ కోసం నిలిపి వేశారు. ఆ రోజు సాయంత్రం బీచ్‍లో సూర్యాస్తమయం చూచాము. స్థానికులు బీచిలో కొంచెం ఇసుక తవ్వి గవ్వలు సేకరించి, గవ్వల్లోని పురుగుల మాంసం వండుకొని తింటారు. షాపుల్లో సజీవమైన రకరకాల సముద్ర జలచరాలు అమ్ముతూంటారు. వియత్నామీయులు ప్రధానంగా ఆహారానికి సముద్రం మీద ఆధారపడతారు. ఫు కాక్‌లో జాలర్ల కోసం ప్రత్యేకంగా ఒక నావల రేవుంది.
మరు రోజు స్కూటర్‌పై ఆ ద్వీపమంతా చుట్టి వచ్చాము.
Phu Quoc ద్వీపంలోని Ho Quoc పగోడా, సన్యాసుల ఆశ్రమం (మఠం):
Ho Quoc పగోడా అద్భుత కళాత్మక నిర్మాణం. విశాలమైన స్థలంలో, మఠం, పగోడా, ఉద్యానవనం ఉన్నాయి. పగోడా అంతర శిల్పాలు వర్తించడానికి మాటలు చాలవు, ఈ పగోడాలోని గంట అద్భుతమైన సంగీతాన్ని వినిపిస్తుంది.
రాత్రి మార్కెట్ చూచి వచ్చాము. సముద్ర తీరంలో సేకరించిన, రకరకాల సజీవంగా ఉన్న గవ్వలు, శంఖులు, వగైరాలు మార్కెట్లో అమ్ముతున్నారు. గవ్వలే కాక క్విడ్లు, అక్టోపస్ వంటి సముద్ర జీవులను కూడా మార్కెట్లో అమ్ముతున్నారు, ఎక్కడ కాచాయో, నవంబరు మాసంలోనే మామిడి పళ్ళు అమ్ముతున్నారు.
Phu Quoc లో Soho అనే హోం స్టే లో వున్నాము. దీన్ని నిర్వహిస్తున్న నడివయసు మహిళ మమ్మల్నిద్దరిని స్కూటర్‍పై ఎక్కంచుకుని 3 కి.మీ. దూరంలోని తమ ఇంటికి తీసుకొని వెళ్ళి జ్యూస్ ఇచ్చి గౌరవించింది. ఆమెకు, కుటుంబ సభ్యులకు ఇంగ్లీషు రాదు, సంభాషణంతా గూగుల్ ట్రాన్స్‌లేటర్ ద్వారా సాగింది.
ఆ రాత్రి మరొక పర్యాయం మార్కెట్ అంతా తిరిగి చూచాము.
నవంబరు 21వ తారీఖు ఉదయం విమానంలో హోచిమిన్ సిటీకి తిరిగి వచ్చి, 22న మరొకసారి హోచిమిన్ సిటీలో తిరిగాము.
నవంబరు 23న వియత్నాంకు బైబై చెప్పి, విమానంలో కంబోడియా రాజధాని నాంఫెన్‍కు ప్రయాణమయ్యాము.
(వియత్నాం పర్యటన సమాప్తం)