Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-102: మా మొదటి ఈవెంట్

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ని[/dropcap]న్న గబగబా పని తెమిల్చేసుకున్నాను. ఎందుకంటే ఉదయం పదిన్నరకల్లా వదిన వాళ్ళ అపార్ట్‌మెంట్‌లో ఉండితీరమని చెప్పింది. ఏవిటి విశేషమంటే… వాళ్ల అపార్ట్‌మెంట్‌లో అందరు ఫేమిలీస్ కల్సి ఆ రోజు సర్దాగా ఫంక్షన్ పెట్టుకున్నారుట. దానిలో ఆటలూ, పాటలూ, పోటీలూ అన్నీ ఉంటాయిట. మొత్తమంతా వదినే నిర్వహిస్తోందిట. తనకి సహాయంగా ఉండడానికి నన్ను రమ్మంది. నాకేమీ తెలీదు వదినా అంటే నే చెపుతా కదా, పదిన్నరకల్లా ఇక్కడుండు చాలు..లాభాల్లో నీక్కూడా కొంతిస్తానులే అంది నవ్వుతూ. తప్పుతుందా…వదిన మాటంటే సుగ్రీవాజ్ఞే కదా.. డబ్బుమాటెలా ఉన్నా వదిన మొట్టమొదటిసారిగా చేస్తున్న ఈవెంట్ ఎలా ఉంటూందోననే కుతూహలంతో సరిగ్గా పదిన్నరకల్లా వదిన ముందున్నాను.

నేను వెళ్ళేసరికి వదిన చుట్టూ బోల్డు బట్టలూ, పేపర్లతో మహా బిజీగా ఉంది. నన్ను చూడగానే “రా…రా.. ఇదిగో.. ఇవి గిఫ్ట్ పేక్‌లు చెయ్యి” అంటూ గంపెడు చిల్లర సామాను నా ముందు పడేసింది.

అందులో చిన్న చిన్న ప్లాస్టిక్ ఫొటోఫ్రేమ్‌లు, బుల్లి బుల్లి రకరకాలయిన భంగిమలతో ఉన్న చైనా బుధ్ధుడి విగ్రహాలూ, ప్లాస్టిక్ పువ్వులూ లాంటి వున్నాయి. తీరుబడిగా అవన్నీ తిలకిస్తున్న నన్ను చూసి “తొందరగా కానీ..ఇంకా బోలెడున్నాయి..” అంది.

“ఇన్ని గిఫ్ట్ లేంటి వదినా..” అంటే “చూద్దూగాని” అంది నవ్వుతూ..

అలా వదిన చెప్పినవన్నీ గబగబా చేసేక ఇద్దరం కింద సెల్లార్ లోకి వెళ్ళేం.

అక్కడ అప్పటికే చిన్న స్టేజిలా కట్టారు. ఎదురుగా కుర్చీలు వరసగా పేర్చి ఉన్నాయి. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న దంపతులలో ఒకరికి పెళ్ళయి పాతికేళ్ళైందిట. అందుకని ఫ్లాట్స్‌లో వాళ్ళందరినీ భోజనానికి పిలిస్తే ఎప్పట్నించో ఇళ్ళల్లో మగ్గిపోతున్న అందరూ సరదాగా దానిని ఆటలూ, పాటలతో సెలబ్రేట్ చేసుకుందా మనుకున్నారుట. ఆ అపార్ట్‌మెంట్‌లో చిన్నాపెద్దా కల్సి ఓ ఏభై మందుంటారు. ఎప్పట్నించో ఏ సందర్భం దొరుకుతుందా అని వేచి చూస్తున్న మా వదిన చటుక్కున ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఈ ఈవెంట్ నేను చేస్తాను అందిట.. అందరి దగ్గరా డబ్బులు కలెక్ట్ చేసి ఆధ్వర్యం తన మీదేసుకుంది.

వదిన బోలెడు కాగితాలు క్లిప్ చేసిన పరీక్ష అట్టలాంటిది ఓ చేతిలో, పెన్ను మరో చేతిలో పట్టుకుని, ఇటు నేనూ, అటు ఇంకో సహాయకురాలు నిర్మల చేతుల్లో ప్లాస్టిక్ సంచుల్లో మేము గిఫ్ట్ పేక్ చేసిన బహుమతులతో నడుస్తుంటే రంగప్రవేశం చేసింది. పదకొండుగంటలనించీ ఒక్కొక్కళ్ళూ రావడం మొదలుపెట్టేరు.

ఐదేళ్ళనుంచీ పదేళ్ళవరకూ ఉన్న పిల్లల్ని ఒకచోట చేర్చి వాళ్లకి చిన్న పరుగుపందెంలాంటిది పెట్టింది వదిన. పది నుంచీ పదిహేనేళ్ళవాళ్లకి ఎదురుగా ఓ స్పూన్‌లో నిమ్మకాయుంచి, దానిని నోట్లో పెట్టుకుని పరిగెత్తమంది. పదిహేనేళ్ళనుంచీ ఇరవైయేళ్ళవాళ్లకి ఎదురుగా సగందాకా నీళ్ళున్న ఓ బకెట్ పెట్టి, వాళ్లకి ఒక్కొక్కరికీ చేతిలో పదేసి రూపాయినాణేలుంచింది. ఓ పదడుగుల దూరంలో వాళ్లని నిలబెట్టి అందులో ఆ నాణాలు వెయ్యమంది. ఎవరు ఎక్కువ వేసారో అన్నీ రాసి పెట్టుకుంది.

ఆ తర్వాత నుంచి ఆడవాళ్లకీ మగవాళ్లకీ విడివిడిగా పోటీలు పెట్టింది. మగవాళ్లకి ఒక్కొక్కళ్ళకీ ఒక్కొక్క పాలియస్టర్ చీర ఇచ్చి మడతపెట్టమంది. ఎవరు ముందు మడతపెడితే వాళ్లకి ప్రైజన్న మాట. అప్పుడు చూడాలి వాళ్ళ అవస్థ.. ఒకతనేమో ఆ ఐదుమీటర్ల చీరని సెల్లార్‌లో కింద పొడుగ్గా పరిచేసేడు. ఓ వైపు నుంచి కొంగు ఎత్తి ఇంకో వైపు తీసికెడుతుంటే మధ్యలో చుట్టుకుపోతోంది. ఇంకొకతను ఆ చీర పట్టుకుని ఓ కుర్చీ చుట్టూ చుట్టేసి దాన్ని మడతలు మడతలుగా పైకి తీస్తుంటే మొత్తం అంతా ఓ కుప్పలా కూలిపోయింది. ఇంకొకతను చేతులు రెండూ బార్లా చాపి ఒకవైపు నుంచి తీస్తూ ఇంకోవైపు వదిలేస్తున్నాడు. నిజం చెప్పాలంటే చీరలు మడతపెట్టడానికి వాళ్ళు పడుతున్న పాట్లు చూస్తుంటే ఎంత నవ్వొచ్చిందో!

ఆడవాళ్లకి మ్యూజికల్ చైర్స్ పెట్టింది. అరవై ఏళ్ళు దాటిన దంపతులకి మెమరీ గేమ్ పెట్టింది.

ఇలా గేమ్స్ ఆడిస్తూనే మధ్యలో ఆడవాళ్లనీ మగవాళ్లనీ విడదీసి అంత్యాక్షరి పెట్టింది. ఆ అంత్యాక్షరి మటుకు ఎంత బాగా జరిగిందో.. ఒకళ్ళనొకళ్ళు ఎదిరిస్తూ, వెక్కిరించుకుంటూ.. నువ్వు పాడింది తప్పంటే నువ్వు పాడింది తప్పంటూ…అహా మహ బాగా సాగింది.

ఈ మధ్యలోనే ఒకసారి కూల్ డ్రింకులు, ఇంకోసారి బాదమ్ మిల్కులూ సప్లై చేయించింది వదిన.

లంచ్‌కి ముందు పాతికేళ్ళ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దంపతులని స్టేజ్ మీద కుర్చీలో కూర్చోబెట్టి దండలు మార్పించింది. అపార్ట్‌మెంట్‌లో కొందరు ఆ దంపతుల గుణగణాలని పొగిడేరు. ఇద్దరూ ఒకరి నింకొకరు పొగుడుకున్నారు. అన్నాళ్ళ దాంపత్యానికి గుర్తుగా భర్త భార్యకి తనిష్క్‌లో కొన్న నెక్లెస్ బహూకరించేడు. అతనంటే తనకున్న ఇష్టం చూపించుకుందుకు ఆ భార్య ఆయనకి ఖరీదైన మొబైల్ బహూకరించింది. వచ్చినవాళ్లందరూ కోరస్‌గా చక్కని పెండ్లిపాట పాడేరు.

ఆ అపార్ట్‌మెంట్ లోనే ఉంటున్నా నా తోటి సహాయకురాలు నిర్మలతో అన్నాను.. “ఎంత ఆదర్శవంతమైన జంట కదా”

నిర్మల నవ్వింది. “తెల్లారిలేస్తే వాళ్ళిద్దరూ పోట్లాడుకోని రోజుండదు. ఈ ప్రేమంతా ఈ ఒక్కరోజే..” అంది.

ఆశ్చర్యంగా చూస్తున్న నాతో “లేకపోతే ఏ మొగుడూపెళ్ళాలూ కొట్టుకోకుండా ఉంటారండీ..” అంది సత్యం చెపుతున్న ధోరణిలో. నేను నోరు మూసేసుకున్నాను.

లంచ్ అయ్యేక దంపతులకి వన్ మినిట్ గేమ్ పెట్టింది. ఒకరు చిన్న ప్లాస్టిక్ బుట్టలాంటిది పట్టుకుని అటు తిరిగి నిలబడితే ఇంకోళ్ళు ఇటువపు తిరిగి అందులో చిన్న చిన్న బంతుల్లాంటివి వెయ్యాలి. అది కూడా సరదాగానే సాగింది. కానీ మధ్యమధ్యలో ఈ ప్రైజు నాకే రావాలని ఒకరూ, వాళ్లకెందుకిచ్చారని ఇంకోరూ మా వదినతో గొడవ మొదలెట్టేరు. వదిన ఎంతో సహనంతో వాళ్ళకి సర్ది చెప్పింది. మధ్యాహ్నం స్నాక్స్, టీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అందించబడ్డాయి. ఆ తర్వాత అందరికీ బహుమతులందజేసింది. మొత్తం అపార్ట్‌మెంటుల్లో ఉన్నవాళ్లందరికీ ఏదో ఒక బహుమతి వచ్చేలా చూసుకుంది. అంత చిన్న చిన్న బహుమతులకి కూడా అంత పోట్లాట వేసుకుంటున్నవాళ్లని చూస్తుంటే నాకెంతో ఆశ్చర్యమేసింది.

మొత్తాని కెలాగయితేనేం వదిన తన మొట్టమొదటి అడ్వంచర్‌ని విజయవంతంగా పూర్తి చేసింది. అందరూ కూడా వదినని అంత బాగా కార్యక్రమం నిర్వహించినందుకు మెచ్చుకున్నారు. మొదటిసారే అంత చక్కగా సారధ్యం చేసినందుకు ఎంతో పొగిడేరు. వదిన మొహం మందారంలా విచ్చుకుంది.

అంతా అయ్యేక నిర్మల తన ఫ్లాట్ లోకి వెళ్ళిపోయింది. నేనూ, వదినా తీరుబడిగా కూర్చుని లెక్కలు చూసుకున్నాం. మొత్తానికి తేలిందేంటంటే వదిన కలెక్ట్ చేసిన డబ్బు కన్న ఇంకా ఆరొందలు ఖర్చు ఎక్కువయ్యిందని. ఆ లెక్క చూసుకుంటున్న వదిన మొహం పాలిపోయింది.

“నీకు డబ్బు లేవీ ఇవ్వలేనేమో స్వర్ణా..” అంది పాపం.

నాకూ బాధేసింది. “బిజినెస్ అన్నాక ఇలాంటివి మామూలే వదినా. ఈ అనుభవంతో ఈసారి ఇంకొంచెం ప్లాన్డ్‌గా చేసుకోవచ్చు” అన్నాను.

ఈసారి ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు కనీసం దారిఖర్చులయినా వస్తే బాగుండు ననుకుంటూ ఇంటి కొచ్చేసేను.

Exit mobile version