అందమైన బొమ్మలతో ఆకట్టుకునే కథలు

1
2

[dropcap]శ్రీ[/dropcap]మతి పి.యస్.యమ్. లక్ష్మి గారు పిల్లల కోసం అందించిన కథల సంపుటి ‘మా నానమ్మ కథలు’. బాలబాలికలకు తేలికగా అర్థమయ్యేలా, సరళమైన వాక్యాలలో చక్కని బుద్ధులు నేర్పే కథలివి. ఇంట్లో పెద్దలే కాకుండా, వీలు చిక్కినప్పుడు బడిలో ఉపాధ్యాయులు కూడా పిల్లలకి చదివి వినిపించదగ్గ కథలు ఇవి.

ఈ పుస్తకంలో 13 కథలు ఉన్నాయి. అన్నీ కథలకి తగిన అందమైన చిత్రాలను తుంబలి శివాజీ గారు గీశారు. పిల్లలను, పెద్దలను ఆకట్టుకునే ఈ కథల గురించి తెలుసుకుందాం.

‘పెద్ద మనసున్న చిన్న పిల్లలు’ అనే కథలో తేజ తమ పక్కింటి వాళ్ల కంకర రాళ్ళను రోడ్డు మీదకు విసురుతూ ఆడుకుంటుంటే వాళ్ల అమ్మ వద్దని వారిస్తుంది. ఇంతలోనే తేజ విసిరిన రాయి ఒకటి ప్రభాకర్ అనే కుర్రాడికి తగలడం, అతను నొప్పి అని పరుగు పెట్టడం, వాళ్ల అమ్మ చాలా కోపంగా అరవడం జరుగుతుంది. కాని తేజ వాళ్ల అమ్మ పరిస్థితిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్దాం అనడంతో ప్రభాకర్ వాళ్ల అమ్మకు కూడా కోపం తగ్గి సహకరిస్తుంది. తేజ వాళ్ల అమ్మ తేజకు అలా రాళ్లు విసరడం ఎంత ప్రమాదమో దాని వల్ల ప్రభాకర్‌కు ఎంత దెబ్బతగిలిందో వివరిస్తుంది. ఇంతలో ఇద్దరు పిల్లల మధ్య సఖ్యత ఏర్పడి వాళ్లు ఆడుకుంటూ వుండడం చూసి చాలా సంతోషిస్తారు.

‘రోగం తెలిసింది’ అనే కథలో వరుణ్‌కు కడుపు నొప్పి వస్తుంది, డాక్టరుకి చూపించి, మందులిప్పించినా, నాలుగు రోజులు అయినా తగ్గకపోవడంతో వాళ్ల అమ్మమ్మ తాతయ్యలను పిలిపిస్తారు. వాళ్ల అమ్మమ్మ మనవడి కడుపు నొప్పికి కారణం తెలుసుకుంటుంది. వరుణ్ తల్లిదండ్రులు ఆడుకోవడానికి సమయం ఇవ్వడం లేదని ఎప్పుడు చదువుకోవడమే, అంతేకాక ఎక్కడి వెళ్ళినా చదువు గురించే అందరు మాట్డాడుకోవడంతో తనకు చాలా ఇబ్బందిగా వుందని చెబుతాడు. అప్పుడు వాళ్ల అమ్మమ్మ వాడికి వాళ్ల తల్లిదండ్రుల ఉద్దేశం వివరిస్తుంది. అలాగే తన కూతురు వాళ్లతో కూడా మాట్లాడి పిల్లవాడి అభిరుచులను కూడా అర్థం చేసుకోవాలని చెప్పాలనుకుంది.

‘అతి తెలివి’ కథ మనందరం చిన్నప్పుడు ఎన్నో సార్లు విన్నదే. కాకి దాహం వేయడం, అది నీళ్ల కోసం వెదకడం, ఒక కుండలో నీళ్లు కనిపించడం, కాని అవి అడుగున వుండటం, అప్పుడు కాకి రాళ్లు తెచ్చి వెస్తే ఆ నీళ్లు పైకి రావడం. ఈ కథ అంతా కూడా ఒక కాకి పిల్ల కాకికి తన అనుభవంగా చెబుతుంది. ఒకసారి పిల్ల కాకికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురౌతుంది. అతి తెలివి ఉపయోగించి ఆ పిల్ల కాకి పెద్ద కాకి చెప్పినట్టు రాళ్లు వున్నా కూడా వేయకుండా అక్కడ ఉన్న స్పాంజ్ ముక్కను వెస్తుంది. దాని వల్ల నీళ్లు పైకి రాకపోగా నీరే లేకుండా పోతుంది. దీని వల్ల తెలిసింది ఏమిటంటే కష్టపడితే వచ్చే ఫలితం ఎప్పడూ కనిపిస్తుందనీ, అనుభవజ్ఞుల మాట వినాలనీ.

‘చాలు కదా’ కథలో సహాయం చేయడం గురించి తెలిపారు. తోటివారికి ఎలా సహాయ పడాలో వివరించారు. అలాగే మనం సహాయం చేసిన వాళ్లు దానిని అర్థం చేసుకుంటే మంచిదే అనీ, కానీ – సహయం పొంది కూడా వారు దానిని అర్థం చేసుకోకపోతే వదిలేయాలనీ, వారి గురించి బాధపడకూడదని బాగా చెప్పారు.

‘ఏం తెలివి’ లో ఓ పిల్లవాడు వాళ్ళ అమ్మమ్మకి అద్భుతమైన ఐడియా చెప్తాడు. చదివి ఆస్వాదించవలసిన కథ ఇది.

‘మూడు నీతులు’ కథలో అతి తెలివి ఎలుక తను ఆహారం సంపాదించుకోవడం కోసం తన బొరియ ముందు కాచుకుని వున్న పిల్లని తప్పించుకోడానికి ఒక అమాయకపు ఎలుకను బురిడి కొట్టించి, మాయమాటలు చెప్పి తనతో బయటకు వచ్చేలా చేసి, అది పిల్లికి ఆహరం అయ్యేలా చూసి తాను తప్పించుకుంటుంది. ఇందులో మొదటి నీతి మనకు తెలివితేటలు ఉన్నాయని పక్క వారికి హాని కలిగించరాదు; రెండవది మనని మెచ్చుతున్నారని ఎవరు అమాయకంగా పక్క వాళ్లను నమ్మకూడదు; మూడు – పిల్లిలా ఓర్పుతో వుంటే లక్ష్యం సాదించవచ్చు.

‘హద్దు మీరితే’ అనే కథలో పిల్లలు హద్దు మీరి ప్రవర్తించ కూడదని, తాము చేస్తున్న పనులు పక్క వారికి తమ వారికి హాని కలిగించేవిగా ఉండకుడదని చెప్తారు రచయిత్రి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏది అడిగితే అది ఇవ్వటం కాదని, అది వారి ఎంత వరకు ఉపయోగం తెలుసుకోవాలని అంటారు. పిల్లలు ఏం చేస్తున్నారో, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమిటో కూడా తెలుసుకోవాలని చెప్తారు. లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందో మనకు ఈ కథ చెబుతుంది.

‘ఆశ’ అనే కథలో వరుణ్ అనే పిల్లవాడు ఒక పిట్ట ఇటూ అటూ తిరగడం చూస్తాడు. వాళ్ల అమ్మను పిలుస్తాడు. ఆమె తనుకు పని వుందంటుంది. వాడు అమ్మా నీకు ఎప్పుడూ పని అని అంటావు. ఆ పిట్టను చూడు ఎంత ఖాళీగా తిరుగుతోందో అని వాటికి ఇళ్లు వుండవా? వాటి పిల్లలు ఎక్కడ వుండాయి? వాటికి ఆహారం ఎలా? లాటి ప్రశ్నలు వేస్తాడు. అప్పుడ వాళ్ల అమ్మ వాటిని వివరిస్తుంది. అంతే కాక దాని గురించి వీడియోలు  చూపిస్తాను అంటుంది. అప్పుడు వరుణ్ వీడియోలో కంటే సహజంగా చూడటం బాగుటుంది అంటాడు. అప్పుడ వాళ్ల అమ్మ అయితే నువ్వు చెట్లను పెంచు, అప్పుడు అవి గూడు కట్టుకోవడం చూడవచ్చు అంటుంది. అప్పుడు భావి తరాల వారు కూడా పిట్టలు గూడు కట్టుకోవడం వంటివి చూడవచ్చు.

టి.వి.లో వచ్చే కార్యక్రమాలు పిల్లల మీద ఎంతటి ప్రభావం చూపుతాయి అనేదానికి ‘ఆడపిల్ల’ కథ ఉదాహరణ. ఇందులో వినోద్ అనే పిల్లవాడు టి.విలో చూపించిన ఒక వార్తలో తండ్రే తన కూతురిని చంపడం చూచి చాలా భయపడిపోతాడు. తన తండ్రి కూడా తన చెల్లెలును అలా చంపుతాడా అని తన భయాన్ని తల్లి దగ్గర వ్యక్తం చేస్తాడు. అప్పుడు ఆ తల్లి వాడి భయాన్ని అనుమానాలను దూరం చేస్తూ అన్నింటిని వివరిస్తుంది. ఈ కథ చాలా బాగుంది.

‘సమయస్ఫూర్తి’ కథలో వికాస్ అనే కుర్రవాడు చదువులోనూ, ఆటలలోనూ అన్నింటి లోనూ ముందుటాడు. వాడి తల్లిదండ్రులు కూడా వాడిని ఎంతో ప్రోత్సహించడమే కాక అన్నింటింలోనూ పాల్గొనమని గెలుపు ఓటములు ముఖ్యం కాదని; గెలిచితే సంతోషం ఓడితే బాధపడక గెలిచిన వారిని చూసి సంతోషించి – వారు ఎలా గెలిచారో తాను ఎందుకు ఓడాడో తెలుసుకోడం వల్ల మందు మందు తాను మరో మారు ఓడకుండా జాగ్రత్తపడవచ్చుని చెబుతారు. వాళ్లు ఒకసారి ఊరు వెళ్లటానికి బయలుదేరుతారు బస్సులో. అది ఒక స్టాప్‌లో ఆగుతుంది. వీళ్లు కిందకు దిగుతుంటే వికాస్ అడుగుతాడు, మన సీట్లలో ఎవరైనా కూర్చుంటే అని. వాళ్ల అమ్మ తన షాల్‌ను తమ సీట్లో వేసానని చెబుతుంది. అప్పుడు ఆమె తన చేతి వాచి లేదని గ్రహించి చెబుతుంది. అది తమ సీట్లలోనే పడి వుంటుందని అని ముగ్గురూ లోపలకు వెళతారు, కాని అక్కడ ఎవరో కూర్చుని వుండటేమే కాక వారి షాల్ కిందపడి వుంటుంది. అది తమ సీటు అని చెప్పినా వాళ్లు లేవరు. ఇంతలో కండక్టర్ వచ్చి వాళ్లని లేపుతాడు. వారిలో ఒక ఆమె కొంచెం కంగారుగా భయంగా కనిపస్తుంది. వాచిని వెదకగా అక్కడ కనిపించదు. వికాస్‌కు అనుమానం వచ్చి మంచి ఉపాయంతో వాచీని కనిపెట్టి తల్లికి అప్పచెప్పుతాడు.

‘మా అమ్మమ్మ చెప్పిన కథలు’ చక్కని కథ. ఇందులో ఒక నక్కా, కొంగ మంచి స్నేహితులు. వాటి స్నేహం చూసి మిగతా జంతువులు కుళ్లు కోవడమే కాక వాటికి ఒకరిపై ఒకరికి చాడీలు కూడా చెబుతాయి. ఒకసారి కొంగ నక్కను భోజనానికి పిలుస్తుంది. కాని కొంగ ఇంట్లో పాత్రలన్నీ కోలగా వుండటంతో నక్కు భోజనం చేయలేకపోతుంది. దానికి కొంగ చాలా బాధపడుతుంది. ఇది అవకాశంగా తీసుకుని మిగతా జంతువులు వాటి మధ్య మనస్పర్థలు తెవడానికి ప్రయత్నస్తే, నక్క వాటిని లెక్కచేయదు. కొంగను భోజనానికి పిలుస్తుంది. తాను బాధపడినట్లు కొంగ బాధపడకూడదని వెతికి ఒక గ్లాసు సంపాదించి దానిలో భోజనం పెడుతుంది. అట్లే కొంగ కూడా తన వీలుగా వుండే పాత్రను తెచ్చుకుంటుది తనతో. అది చూసి ఆ రెండూ నవ్వుకుంటాయి. చెప్పుడు మాటలు విని స్నేహాన్ని వదులుకోకూడదనీ, పరిస్థితులను అర్థం చేసుకొని స్నేహంగా వుండాలని ఈ కథ చెబుతుంది.

‘అసలుకే మోసం’ కథలో ఒక నక్క ఆహారం కోసం వెదుకుతూ ఒక ఊరు చేరుతుంది. అక్కడి గ్రామ సింహాలు దానిని తరుముతాయి. అది పరుగెత్తుతూ వచ్చి ఒక ఇంట్లో జొరపడుతుంది. అది బట్టలకు రంగులు అద్దే ఇల్లు. అక్కడ ఒక కుండలో వుంచిన నీలం రంగు నీళ్లలో మునుగుతుంది. అది బయటకు వచ్చాక అది నీలి రంగులోకి మారుతుంది. దానిని చూసి కుక్కలు భయపడతాయి. అది అక్కడి నుంచి అడవిలోకి వెళ్లి తాను బ్రహ్మ చేత సృష్టింపడ్డానని చెప్పి హాయిగా పాలిస్తుంది. ఒక రోజు జంతువులందరితో సభలో ఉన్నప్పుడు దూరంగా నక్కల ఊళ్ళలూ వినిపించి ఇది కూడా ఎంతో ఆనందంగా ఊళలు వేస్తుంది. అది నక్క అని గ్రహించిన మిగతా జంతువులు దానిని చంపుతాయి. అందరినీ అన్ని వేళలా మోసం చేయలేమని ఈ కథ చెబుతుంది.

చివరగా ఛండీఘర్ లోని రాక్ గార్డెన్ గురించి వివరిస్తారు రచయిత్రి.

***

మా నానమ్మ కథలు (బాల సాహిత్యం)
రచన: పి.యస్.యమ్. లక్ష్మి
పేజీలు: 52
వెల: ₹ 100/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత్రి: 9866001629
ఆన్‌లైన్‌లో తెప్పించుకునేందుకు
https://books.acchamgatelugu.com/product/maa-nanamma-kathalu-%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here