Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-68: మా ఆఫీసురూమ్

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap]మధ్య అందరం లాక్‌డౌన్ బాధితులమయ్యామన్న మాట అందరికీ తెలిసిందే..

అలాంటి లాక్‌డౌన్ సమయంలో మా అన్నయ్య, వదినల మధ్య జరిగిన సంఘటన ఆ తర్వాత వదిన నవ్వుతూ చెప్పింది. దానిని అందరితో పంచుకుందామని వదిన చెప్పినది చెప్పినట్టు మీ ముందుంచేస్తున్నాను..

ఆరోజు మధ్యాహ్నం పాపం వదిన నిద్రపోతోందికదా లేపడమెందుకని పెద్దమనసుతో టీ పెట్టుకుందామని వంటింట్లో కెళ్ళిన అన్నయ్యకి అక్కడ స్టౌకి మూలగా ఒక పుల్లలగుట్ట కనిపించింది. ఏ చీమలపుట్టో అని ఖంగారుపడిపోయిన అన్నయ్య నెమ్మదిగా అట్లకాడ పుచ్చుకుని దాన్ని కదిపితే కాల్చిపారేసిన అగ్గిపుల్లలు చెల్లాచెదరుగా పడ్డాయి.

“ఛి ఛీ.. చెత్త ఎప్పటికప్పుడు బైట పడైకుండా ఇలా కప్పెడుతుందేవిటో..” అనుకుంటూ వాటిని బైట పడేసేడు.

అలికిడి విని నిద్ర లేచి అటు వచ్చిన వదినని చూసి “ఈ చెత్తంతా ఇలా పేరిస్తే ఎలా! నువ్వెప్పుడూ ఇంతే..” అని విసుక్కున్నాడు.

వదిన తనలోని సృజనాత్మకతను హత్య చేసిన అన్నయ్యని కాల్చిపారేసేటట్టు చూసింది. అవునుమరి.. ఈ మొగుళ్ళందరూ ఇంతే.. కట్టుకున్న భార్యలోని ప్రతిభని గుర్తించి, గౌరవించలేని భర్తకి ఏ శిక్ష విధిస్తే బాగుంటుందా అని తీవ్రంగా ఆలోచిస్తున్న వదినని చూసి,

“ఏవిటా చూపూ.. భస్మం చేసేస్తావేవిటీ కొంపతీసి..” అంటూ తన మాటలని జోక్‌గా మార్చేయబోతున్న అన్నయ్య తెలివిని అంతకన్నా తెలివైన వదిన ఇట్టే గ్రహించేసింది.

అసలు అన్నయ్య సంసారంలో వదినకి నానాకష్టాలూ తెచ్చిపెట్టిన పాపం మటుకు ఈ లాక్‌డౌన్‌దే. మామూలుగా అయితే మొగుడూపెళ్ళాలిద్దరూ ఒకరి కొకరు సద్దుకుపోతూ ఏదో గుట్టుగా సంసారాన్ని నడుపుకొచ్చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ లాక్‌డౌన్ మొదలయిందో అప్పట్నించీ వాళ్ల కాపురంలో లుకలుకలు మొదలయ్యేయి.

అదేవిటో సరిగ్గా ఈ లాక్‌డౌన్ మొదలైన పదిరోజులకి టైమ్ చూసుకుని అన్నయ్యింట్లో లైటర్ పాడైపోయింది. లైటర్ లేకపోతే అస్తస్తమానం స్టౌ వెలిగించడమెలా! ఇదివరకైతే ఎంచక్క ఎప్పుడేది కావాలంటే అప్పుడు రెండు వీధులవతలున్న మెయిన్ రోడ్ మీద కెళ్ళి అక్కడున్న షాపుల్లో కావల్సినవి కొనేసుకునేవారు. మిక్సీ బుష్ పోయినా, కుక్కర్ గాస్కెట్ పోయినా ఇట్టే వెళ్ళి అట్టె తెచ్చుకునేవారు. అలాంటిది ఇప్పుడవన్నీ ఆన్‌లైన్‌లో కొనుక్కోవలసొస్తోంది. అందుకే ఆన్‌లైన్‌లో సెర్చ్ మొదలుపెట్టేరు.

లైటర్ కోసం అన్నయ్య సెర్చ్‌లో కొడితే వందరూపాయిల లైటర్ ఖరీదయితే డెలివరీ ఛార్జెస్ రెండువందలు కలిపి టోటల్ మూడొందలని కనిపించింది. అదేమిటో అర్ధంకాక వివరాల్లోకి వెడితే ఆ సైట్ వాడు ఆ లైటర్‌ని కోయంబత్తూర్ నుంచి తెప్పిస్తాట్ట.

“ఏదో సామెత చెప్పినట్టు మరీ ఇంత ధరేంటీ.. నాకేం పరవాలేదు, నేను మెయిన్ రోడ్ దాకా వెళ్ళి ఆ లైటర్ ఒక్కటీ కొని తెచ్చేసుకుంటా..” అని వదిన ఆవేశపడిపోయింది.

“ఓ వీరనారీ, నువ్వు వెడతావు సరే… కానీ అక్కడ షాప్ తీసుండొద్దూ!” అంటూ వదిన ఉత్సాహం మీద నీళ్ళు చల్లేసి, ఆ లైటర్‌కి ఆర్డర్ పెట్టేసేడు అన్నయ్య. ఆ పెట్టిన ఆర్డర్ డెలివరీ డేట్ మరో పదిరోజులకి కానీ లేదనీ, ఆ లైటర్ ఇంటికొచ్చేక కూడా ఇంకో వారంరోజులు అసలా పేకట్టే ముట్టుకోడానికి వీల్లేదనీ అన్నయ్య వేసిన హుకుం విని నీరుకారిపోయింది వదిన.

అంటే ఇంచుమించు ఇరవైరోజులపాటు ఈ అగ్గిపుల్లతో సావాసం తప్పదన్నమాట అనుకుంటూ అందులోనుండే ఆనందాన్ని వెతుక్కుంది ఆదర్శనారయిన మా వదిన.

పొద్దున్న కాఫీటైమ్‌లో కొన్ని, బ్రెక్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఇంకొన్ని, వంట చేస్తుంటే ఇంకా కొన్ని అగ్గిపుల్లలు భారీగానే ఖర్చవుతున్నాయి వదిన చేతిలో. కొన్ని సగందాకా కాలి చివర్లు నల్లబడితే, ఇంకొన్ని మొదట్లోనే చివర్లు నల్లగా కనపడుతున్నాయి. ఇంకొన్ని చివరిదాకా కాలేక చివర్లు నల్లగా కనిపిస్తున్నాయి.

అలా వాటిని చూస్తుంటే వదినలోని భావుకత్వం మేల్కొంది. సృజనాత్మకత గుండెల్లోంచి తన్నుకుని వచ్చేసింది. గబగబా ముందుగదిలోకి వెళ్ళి అక్కడున్నఏ మేగజైన్ల మీద అట్ట గట్టిగా ఉందో చూసింది. ఆలా బాగా దళసరిగా ఉన్న ఒక మేగజైను అట్ట పీకేసి దాన్ని వంటింట్లోకి తెచ్చింది. వంటింటి గట్టు మీద దాన్ని పెట్టి, చివరిదాకా కాలిపోయిన అగ్గిపుల్లలు దాని మధ్యలో గుండ్రంగా పేర్చింది. సగందాకా కాలినవి వాటికి మధ్య మధ్యలో పెట్టింది. పొడుగ్గా మిగిలిన పుల్లలని వాటికింద కాడగా పెట్టింది. అంతే.. అతి సుందరమయిన రెక్కలుగల పూవు, దానికోకాడ… ఆహా.. ఎంత బాగుందీ.. మురిసిపోయింది. ఆ అట్టమీద ఆ కాలిన అగ్గిపుల్లలు అలా ఓ పువ్వులాగా, వాటి మధ్యలో కాడలాగా పేర్చిన తన సృజనాత్మతకి మురిసిపోయింది. వెంటనే అలమార్లో ఉన్న ఫెవికాల్ తెచ్చి వాటిని అట్ట మీద అంటించింది. అది కొంచెం ఆరేక, ఆ పుల్లలు అట్టకి పూర్తిగా అంటుకున్నాక అన్నయ్యకి తన కళాఖండం చూపించి, అతను తనలోని సృజనాత్మకతను ఆకాశాని కెత్తేస్తే మురిసిపోవాలనుకుంది.. పారేసే చెత్తనుంచి కూడా అద్భుతాలు ఎలా సృష్టించవచ్చో ఒకపుస్తకం రాయాలని కూడా నిర్ణయించేసుకుంది. అలా ఆ కళాఖండం చూసుకుంటున్న వదినకి అందులో చిన్న తేడా కనిపించింది. అన్ని పుల్లలూ ఒకేలాగ కాలలేదు. అందుకని ఆ కళాఖండం అంత అందంగా కనిపించటంలేదు అనుకుంటూ దానిని అలమర్లో పై అరలో పెట్టేసి, రెండురోజుల్నించీ అగ్గిపుల్లల్ని ఎంతవరకూ కాల్చాలో చూసుకుంటూ అంతవరకూ కాలగానే వాటిని ఆపేస్తోంది. ఒకవేళ ఆ టైమ్‌కి స్టౌ ఏదైనా సమస్యతో అంటుకోకపోతే ఇంకో అగ్గిపుల్ల వెలిగిస్తోంది తప్పితే, వాటి సైజులకి మటుకు ఎక్కడా రాజీ పడకుండా అలా కాలిన అగ్గిపుల్లల్ని స్టౌకి మూలగా ఒకచోట జమచెయ్యడం మొదలెట్టింది వదిన.

అదిగో ఆ పుల్లలగుట్టనే ఇప్పుడు అన్నయ్య చీమలపుట్ట అనుకుని తీసి బైట పడేసింది. వదినకి ఖోపం వచ్చిందంటే రాదూ మరీ! అయినాసరే కాస్త సహనం పాటించి అన్నయ్యని కాస్తయినా ఎడ్యుకేట్ చెయ్యాలనుకుంది.

“అహా.. అదికాదు. మొన్న ఫేస్‌బుక్‌లో మీ కొలీగ్ వనజ పెట్టిన కళాఖండానికి లైకు కొట్టి, “బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్..” అని పూలగుత్తితో కామెంట్ పెట్టేరు కదా! అందుకని మీలో కళాహృదయం ఉందనుకున్నాను లెండి..” అంది నర్మగర్భంగా..

“ఎందుకులేదూ! తప్పకుండా ఉంది. మొన్న పాప్ కార్న్‌తో వనజ మాల చేసి, దేవుడిపటానికి అలంకరించిన హారం ఎంత బాగుందీ. అచ్చం మల్లెలమాలలా లేదూ!” పరవశించిపోయేడు అన్నయ్య.

“అవునులెండి.. హాయిగా సినిమా చూస్తూ ఎంజాయ్ చెయ్యడానికి వాడుకునే పాప్ కార్న్ పేకట్లని బోల్డు డబ్బులెట్టి ఓ పది కొనేసి, వాటిని సూదులతో గుచ్చి, దారాని కెక్కించి, దండ కింద చేసి, దేవుడి పటానికి వేసిన ఆవిడ కళామతల్లి ముద్దుబిడ్ద…పాపం..అయితే అసలు సంగతి తమకి తెలీదేమో. రెండోనాటికే వాటిని చీమలు శుభ్రంగా తినేసి ఖాళీ దారాన్ని మటుకు అట్టిపెట్టేయి దేవుడికి.” మూతి మూడు వంకర్లు తిప్పింది వదిన.

తెల్లబోయిన అన్నయ్య తేరుకుని “మర్నాడూ, మూడోనాడూ ఏదయితే ఎవడు చూడొచ్చేడూ నీలాంటివాళ్ళు తప్ప..”

అన్నయ్య ధోరణికి చిర్రెత్తుకొచ్చింది వదినకి. “అయితే కళంటే అదేనంటారు..” అంది కసిగా..

“ఆహా.. తప్పకుండానూ..ఏదైనా చేస్తే అలా కళ్ళకి ఇంపుగా ఉండాలి కానీ ఇలా నల్లగా అగ్గిపుల్లలు మాడిస్తే కళాహృదయం మాటటుంచు….ఉన్న హృదయం కూడా ఎక్కడో చెట్టెక్కి కూర్చుంటుంది. అయినా ఇలా నల్లగా మాడిన అగ్గిపుల్లలగుట్ట ఎవరైనా వంటింట్లో ఉంచుకుంటారా! కాసేపటు చూస్తే వాంతొస్తుందని బైటకి విసిరేసేను.”

అంతే.. బ్రహ్మాండం బద్దలయింది.

అన్నయ్య మీదమీదకి వెడుతూ, ”అసలు మీరు నా ఆఫీస్ రూం లోకి ఎందుకొచ్చేరూ!” అంది దబాయింపుగా.

“నీ ఆఫీస్ రూమా!” తెల్లబోయేడు.

“కాపోతే.. మీరు పని చెసుకుంటూ కాగితాలూ, పెన్నులూ అటూ ఇటూ పడేసినప్పుడు నేను వాటిని నీట్‌గా సర్దితే మీరేమంటారూ! ‘ఇది నా ఆఫీస్ రూమ్.. నా ఇష్టమొచ్చినట్టు పడేసుకుంటాను. నువ్విలా నీట్‌గా సద్దితే నాకు పని చేసుకోబుధ్ధి కాదు. పేపర్లూ, పెన్నులూ అలా చిందరవందరగా ఉంటేనే నాకిష్టం. ఇంక నువ్వు వాటి జోలికి రాకు..‘ అని చెప్పేరా లేదా!” నిలదీసింది.

“అన్నానూ.. అయితే.. నువ్వలా కాగితాలు సర్దితే అవసరమైనవి ఏమైనా బైట పడేస్తావేమోనని చెప్పేను. అయినా వంటిల్లు నీ రూమేంటీ!” అర్థంకాక అడిగేడు అన్నయ్య.

“కాపోవడమేంటి.. పొద్దున్నలేచి మేవీ వంటింట్లోనే పని చేసుకోవాలి. మాకు ముఖ్యమైనవన్నీ ఇక్కడే ఉంటాయి. రోజులో ముఖ్యమైన సమయమంతా మాకిక్కడే గడిచిపోతుంది. అందుకే మేవీ చిన్న ప్రపంచంలోనే అలసటని మర్చిపోడానికి ఇక్కడే రేడియో వింటాము, ఇక్కడ్నించే ఫోన్లు చేసుకుంటాము. ఇంకా ఇక్కణ్ణించే మాలో వున్న సృజనాత్మకతను కూడా చూపించుకుంటాము. అలాంటి మా ఈ ఆఫీసురూమ్ లో మేం పుల్లలగుట్టలైనా పెట్టుకుంటాము.. చీమలపుట్టలైనా చేరనిస్తాము. కాదనడానికి మీరెవరు! అలా అంటే కంచంలోకి ముద్ద రాదని తెల్సుకదా! అందుకని ఇంకేం మాట్లాడకుండా వెంటనే మా ఆఫీసురూమ్ లోంచి వెళ్ళిపొండి.. “

అధికారికంగా చెప్పిన వదిన మాటలకి సమాధానంగా “వెళ్ళకపోతే..” అన్నాడు అన్నయ్య నడుం మీద చేతులుంచుకుని.

“ఏవుందీ! పాపం.. కార్టూనిస్టులు చాలామంది సరదా పడుతుంటారుకదా…లేనిదానిని చూపిస్తూ.. అదే లావాటి పెళ్ళాం చేతిలో దెబ్బలు తింటున్నట్టున్న మొగుణ్ణి.. వాళ్ల సరదా నెందుకు కాదనాలీ! అంత లావు లేకపోయినా వాళ్ళ కోరిక తీరడానికి ఆయుధపాణిని మటుకు తప్పక అవుతాను..” అంది అట్లకాడ చేతిలోకి తీసుకుంటూ..

వదిన చేతికి అందుబాటులో అప్పడాలకర్ర లేనందుకు ఆనందపడుతూ అన్నయ్య వదిన ఆఫీసు రూము నుండి బయటపడ్డాడు. వదిన చెపుతున్న ఈ పై కథ వింటున్నంతసేపూ నేను నవ్వాపుకుందుకు చాలా కష్టపడ్డాను. మరి మీరో!..

Exit mobile version