Site icon Sanchika

మా ఊరి సంక్రాంతి

[dropcap]ప[/dropcap]న్నెండేళ్ల హంసిక శనివారంనాడు బడి నుండీ ఇంటికి వచ్చేసరికి ఆమె తల్లి ఉమ బట్టలు సూట్‌కేసులలో సద్దుతోంది.

“ఏంటమ్మా? మనం ఏదైనా ఊరికి వెడుతున్నామా?”, ఉమను ఆత్రంగా అడిగింది హంసిక.

“అవును. నీకు నిన్న చెప్పాను కదా?! రేపటినుంచీ మీ బడికి సంక్రాంతి సెలవలు. ఈ సెలవులలో మనం తాతమ్మా వాళ్ళ ఊరు వెడుతున్నాం. నాన్న పండుగరోజు అక్కడికి వస్తారు”, చిరునవ్వుతో చెప్పింది ఉమ.

ఆ మాట వింటూనే హంసిక ముఖం చిట్లించి, “అబ్బ! తాతమ్మా వాళ్ళ ఊరా? అది చాలా చిన్న ఊరు. అక్కడ సరదాగా గడిపేందుకు ఏమీ ఉండదు. నాకు అక్కడ ఏమీ తోచదు. బోర్ కొడుతుంది. తాతమ్మనే ఇక్కడకు రమ్మనచ్చుగా!”, అంది పుస్తకాల సంచీని తన గూట్లో పెడుతూ.

“తాతమ్మా వాళ్ళ ఊరు చిన్నదే అయినా అక్కడ సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేస్తారు. నువ్వు ఇంకేం మాట్లాడకుండా మరో గంటలో ప్రయాణానికి తయారవ్వు”, చెప్పింది ఉమ.

చేసేదిలేక హంసిక తన సెల్ ఫోను తీసుకుని తన తాతమ్మ ఊరికి బయలుదేరింది. హంసిక తాతమ్మ జానకమ్మ ఇంకా పాత కాలపు ఆచారాలు పాటిస్తున్న మనిషి. తమకున్న వ్యవసాయ భూములపై వస్తున్న ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ, ఆధునికతకు ఆమడ దూరంగా ఉండే ఆ పల్లెటూళ్ళో తన భర్త శివరామయ్యతో కలిసి సంతృప్తిగా జీవనం సాగిస్తోంది. హంసిక, ఉమలు జానకమ్మ ఇంటికి చేరుకునేసరికి చీకటి పడింది. జానకమ్మ అప్పటికే వంట వండి సిద్ధంగా ఉంచింది. రాత్రి భోజనం ముగించి అంతా పడుకున్నారు. మర్నాడు హంసిక లేచేసరికి ముందుగదిలో జానకమ్మ, శివరామయ్యలు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు.

తన ఫోనుకు సిగ్నల్ సరిగ్గా లేదని చిరాకు పడుతూ ముందు గదిలోకి వచ్చిన హంసిక బొమ్మలకొలువును చూసి, “ఇన్ని బొమ్మలా?!”, అంటూ ఆశ్చర్యపోయింది.

జానకమ్మ ఆ బొమ్మల వెనకున్న తీపి గుర్తులను కథలుగా చేసి ఓపిగ్గా హంసికకు చెబుతూ ఒక్కొక్క బొమ్మనూ కొలువులో పెడుతోంది. ఆ బొమ్మల్లో సగం పైగా హంసిక పుట్టకమునుపు కొన్నవే! పాత కాలపు బొమ్మలకూ ఈ కాలపు బొమ్మలకూ ఉన్న తేడాను గమనిస్తూ, అందమైన బొమ్మలను చేత్తో జాగ్రత్తగా నిమురుతూ, బొమ్మలకొలువు అలంకరణలో తనకు తోచిన సహాయం చేసింది హంసిక. బొమ్మల కొలువు పెట్టడం పూర్తయ్యేసరికి చాలా సమయమే పట్టింది.

“బొమ్మలు చాలా బాగున్నాయి తాతమ్మా!”, అంది హంసిక.

“అమ్మా హంసికా! శ్రీమహాలక్ష్మి అనుగ్రహంవల్ల మన పొలంలో ఈ ఏడు పంట బాగా పండింది. నాతోపాటూ పొలానికి వస్తే నీకా పంటను చూపిస్తా. మనం వచ్చేటప్పుడు కొత్త బొమ్మ కొనుక్కుని వద్దాం”, అన్నాడు శివరామయ్య హంసికతో.

“అలాగే తాతయ్యా!”, అంటూ హంసిక చకచకా తయారయ్యి శివరామయ్యతో వెళ్లి, తమ పొలంలో పండిన పంటలను చూసి, దారిలో బొమ్మల దుకాణానికి వెళ్లి, అక్కడ తలను ఊపే ఏనుగు బొమ్మనూ, రాధాకృష్ణుల బొమ్మనూ కొనుక్కుంది. ఆ సాయంత్రం, వాకిట్లో కూర్చుని పెద్దవాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, హంసిక తన తాతమ్మ ఒడిలో తల పెట్టి పడుకుని ఆకాశంలో ఎగురుతున్న రంగురంగుల గాలిపటాలను చూస్తూ సమయం గడిపింది.

చీకటి పడగానే, “రేపే భోగి. పండుగరోజులు మొదలుకాబోతున్నాయి! ఈ పూట త్వరగా తిని పడుకుంటే రేపు త్వరగా లేవచ్చు”, అంటూ భోజనాలు వడ్డించింది జానకమ్మ.

హంసికకు రాత్రి అంత త్వరగా పడుకునే అలవాటు లేకపోయినా తన ఫోను పనిచేయకపోవడంతో వేరే కాలక్షేపం లేక అందరితో కలిసి భోజనంచేసి పడుకుంది. భోగి నాడు చీకటితోనే హంసికను నిద్ర లేపింది ఉమ.

“ఆమ్మో! చలేస్తోంది. కాసేపాగి లేస్తా”, అంది హంసిక దుప్పటిని కప్పుకుంటూ.

“హంసికా! ఇవాళ మన ఊళ్ళో భోగి మంట వేస్తారు. చూద్దువుగాని రా!”, అని హంసికను లేపి తనతో ఆ ఊరిలోని కూడలికి తీసుకుని వెళ్ళాడు శివరామయ్య.

అప్పటికక్కడ ఊరి జనమంతా చేరి పెద్ద ఎత్తున భోగి మంటలు వేస్తున్నారు. అంత పెద్ద భోగి మంటను హంసిక ఎప్పుడూ చూసి ఎరుగదు. ఆనందోత్సాహాలతో పిల్లలూ, పెద్దాలూ అందరూ కలిసి కేరింతలు కొడుతూ భోగి పండుగ సంబరంలో పాలుపంచుకోవడం చూసి ఆశ్చర్యపోయింది హంసిక. ఒకపక్కన ఉదయిస్తున్న సూర్యకిరణాల వెలుగులోనూ మరొకపక్క భోగి మంటల కాంతిలోనూ అక్కడి పరిసరాలు బంగారువన్నెను సంతరించుకుని ఎంతో అందంగా కనపడుతున్నాయి. హంసిక తన ఫోనుతో చకచకా ఆ దృశ్యాలను నాలుగు ఫోటోలు తీసి తన స్నేహితులకు పంపాలని అనుకుంది. అలా అనుకున్న వెంటనే ఫోటోలను తీయగలిగింది కానీ ఫోనుకు సిగ్నల్ అందకపోవడంతో తన స్నేహితులకు ఆ ఫోటోలను హంసిక పంపలేకపోయింది. దాంతో కాస్త అసహనానికి గురైన హంసిక ముఖం ముడుచుకుని ఇల్లు చేరుకుంది. ఆ సమయానికి జానకమ్మ, ఉమలు ఇంటి బయట పిండితో చుక్కలు పెట్టి, వాటిని రకరకాలుగా కలుపుతూ అందమైన ముగ్గులను తీర్చి దిద్దుతున్నారు.

హంసికను చూసిన ఉమ, “ఏమిటే? ముఖం అలా పెట్టావ్? భోగి మంటలు నచ్చలేదా?”, అని అడిగింది నవ్వుతూ.

“భోగి మంటలు బాగా నచ్చాయమ్మా. కానీ ఆ ఫోటోలు మా స్నేహితులకు పంపుదామంటే నా ఫోనుకు సిగ్నల్ అందటంలేదు”, బుంగమూతితో చెప్పింది హంసిక.

“పొనీలే. మన ఇంటికెళ్ళాక పంపుకోవచ్చు. నాతోపాటు నాలుగు ముగ్గులు వేద్దువుగాని రా!”, అంటూ హంసిక చేత కొన్ని ముగ్గులను పెట్టించి, అందులో రంగులను నింపించింది ఉమ. సహజంగా చిత్రకళ అంటే ఇష్టపడే హంసికకు ముగ్గులు వెయ్యడంలో సమయమే తెలియలేదు.

ఆ తర్వాత హంసిక తలంటుకుని జానకమ్మ సిద్ధంగా ఉంచిన కొత్త బట్టలు వేసుకుంది. ముందురోజు తను కొనుక్కున్న కొత్త బొమ్మలను కొలువులో పెట్టి, బొమ్మల కొలువుకు పూజ చేసి, గుడిలో జరిగిన గోదాకల్యాణం చూసి ఇంటికి వచ్చి, భోజనాలయ్యాక ఉమతో కలిసి బొమ్మల పేరంటం పిలుపులకు వెళ్ళొచ్చింది హంసిక. పిలుపులన్నీ పూర్తి అయ్యాయేసరికి మధ్యాహ్నమయింది. జానకమ్మ తయారుచేసి పెట్టిన అరిసెలనూ, జంతికలనూ తిని విశ్రాంతిగా పడుకుంది హంసిక. ఆ తర్వాత కొద్దిసేపటికే వాళ్ళ ఇంట్లో పేరంటం హడావుడి మొదలైపోయింది. ఊరిలోని ముత్తైదువలందరూ జానకమ్మ ఇంటికి వచ్చి ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. పిల్లలకు భోగి పళ్ళు పోసి, హారతులిచ్చారు. పేరంటానికి వచ్చినవారంతా బొమ్మల కొలువును ఆసక్తిగా పరిశీలించారు. కొత్త బొమ్మల గురించి వివరాలు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. జానకమ్మ, ఉమలు ఇచ్చిన తాంబూలం, శనగలు తీసుకుని వారిని మనసారా దీవించి మళ్ళీ వస్తామని చెప్పి సంతోషంగా వెళ్లారు. ఆ పండుగ వాతావరణం హంసికకు అద్భుతంగా తోచింది.

ఆ మరుసటి రోజు హరిదాసు పాటకు మెలకువ వచ్చింది హంసికకు. తెలతెలవారుతూండగా వచ్చిన హరిదాసు, హరి నామ సంకీర్తనను చేస్తూ ఇంటింటికీ వెడుతూ వారిచ్చే బియ్యం తీసుకుంటున్నాడు. అతడు పాడుతున్న పాటకు, చిడతలతో తాళం వేస్తూ, లయబద్ధంగా నాట్యం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. హరిదాసు పాట మనసుకు ఆహ్లాదాన్నీ, ప్రశాంతతనూ కలిగిస్తోంది. అతడి నాట్యం అతడి ప్రతిభకు నిదర్శనంగా ఉంది.

‘మా ఊళ్ళో ఇలాంటివారు కనపడరేంటీ?’, అనుకుంది హంసిక.

కాసేపటి తర్వాత, గంగిరెద్దును తీసుకుని ఇంటి ముందుకు వచ్చాడు ఒక వ్యక్తి. అతడికి బట్టలను ఇచ్చింది జానకమ్మ. హంసిక గంగిరెద్దుకు అరటిపండును తినిపించింది.

అంతలో అక్కడికి వచ్చిన హంసిక తండ్రి శంకరం, శివరామయ్యనూ, జానకమ్మనూ పలకరించి హంసిక దగ్గరకు వచ్చి, “ఏంట్రా చిట్టితల్లీ? తాతమ్మ ఊరు బోర్ కొడుతోందా?”, అని అడిగాడు హంసికను గారాం చేస్తూ.

“లేదు నాన్నా! నేను ఇక్కడ నాకేమీ తోచదని అనుకున్నా. కానీ మన ఊళ్ళో సంక్రాంతి పండుగకన్నా నాకు ఈ ఊళ్ళో సంక్రాంతి పండుగే బాగా నచ్చింది. నేను వాడే ఎలక్ట్రానిక్ పరికరాలలో కదిలే బొమ్మల కన్నా ఇక్కడున్న బొమ్మల కొలువులోని బొమ్మలు నాకు బోలెడన్ని మంచి కబుర్లనూ, ఎక్కువ కథలనూ చెప్పాయి. నేను ఫోనులో నా ఫ్రెండ్స్‌ని కలవలేకపోయినా చుక్కల్ని అందంగా కలుపుతూ ముగ్గులు ఎలా వెయ్యాలో నేర్చుకున్నా. చలికి మన ఇంట్లోలాగా ఇక్కడ హీటర్ లేకపోయినా భోగి మంటలు అందించే వెచ్చదనం ఎలాంటిదో తెలుసుకోగలిగా! నాకు నచ్చిన విషయాలు ఆన్-లైన్‌లో షేర్ చేసుకోలేకపోయినా మనకున్నది నలుగురితో పంచుకుంటే ఉండే ఆనందం గురించి తెలుసుకోగలిగాను. మన ఊళ్ళో దొరికే క్యాండీలూ, జంక్ ఫుడ్ల కన్నా ఇక్కడ తాతమ్మ ప్రేమతో తయారుచేసిన పిండివంటలు ఎంతో రుచిగా ఉన్నాయి. అవి మన ఆరోగ్యానికి కూడా మంచి చేస్తాయని అమ్మ చెప్పింది. నేను చేసే వీడియో కాల్స్‌లో పలకరింపులకన్నా నిన్నటి పేరంటంలో అందరూ మన ఇంటికి వచ్చి చేసిన పలకరింపులే బాగున్నాయి. ఇక మనం ప్రతి సంక్రాంతీ ఇక్కడే జరుపుకుందాం నాన్నా!”, అంది హంసిక.

“తప్పకుండానమ్మా! మన పండుగలనూ, సంప్రదాయాలనూ కాపాడుకోవడం మన బాధ్యత!”, అంటూ హంసిక నుదుటిపై ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్నాడు శంకరం.

అక్కడే ఉండి హంసిక మాటలు విన్న శివరామయ్య, “హమ్మయ్య! మొత్తానికి మా ఊరి సంక్రాంతి నా మునిమనవరాలికి నచ్చిందన్నమాట!”, అన్నాడు నవ్వుతూ.

Exit mobile version