మా రాజ్యాలు అత్త ది గ్రేట్

0
2

[dropcap]సూ[/dropcap]ర్యుడితో పాటు పల్లె అంతా మేల్కొన్నది. ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి అందంగా తీర్చుకొని అలంకరించారు. పసుపు గడపలు తెలుపు ఎరుపు చుక్కలు, అందంగా పట్టీలు పెట్టిన ద్వారబంధాలు, ఇత్తడి పూలతో అలంకరించిన పెద్ద తలుపులు ఆ ఇంటి సంస్కృతి సంప్రదాయాలు తెలుపుతున్నాయి. బాగా ఎత్తైన అరుగులు. వాటి మీద వేదం నేర్చుకునే వివిధ వయసుల శిష్యులు.

శాస్త్రి గారి రెండవ అమ్మాయి రాజ్యాలు చాలా చురుకైనది. మాటకారి. ఎవరి మాట పడదు. ఊరంతా చుట్టి, బంధువుల్ని స్నేహితుల్ని పలకరిస్తూ ఉంటుంది. ఐదవ తరగతితో చదువు ఆపి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికే ఎనమిదవ ఏట అక్క ఈశ్వరుని పెళ్లి. ఇద్దరు పిల్లలు. ఊళ్ళో జమీందారు సంబంధం చేశారు. అల్లుడు వచ్చి పోతూ మామగారికి కుడి భుజంలా ఉంటాడు.

కొడుకులు ఉన్నా ఎవరి అత్తవారి ఇళ్ళల్లో వాళ్ళు నిత్య పెళ్లి కొడుకులు. అందుకే శాస్త్రి గారు అల్లుడిని దగ్గరగా పెట్టుకోవాలని ఊళ్లో సంబంధం చేశారు.

“రాజ్యాలు నీకు కూడా ఊరి సంబంధం ఉంది, బాగా డబ్బు పొలాలు ఉన్నాయి చేస్తాను. వాళ్ళు మన మాట కాదు అనరు” అని తండ్రి చెపితే, రాజ్యాలు “వద్దు నాన్నా, అక్క ఇక్కడ ఉన్నది, నీకు తోడు బావ ఉన్నారు. నాకు వేరే ఊరు చెయ్యండి. అత్త ఇల్లు, పుట్టినిల్లు భేదం ఉండాలి” అన్నది.

“సరేలే నీ పెళ్లి అయ్యాక నీ చెల్లి పూర్ణని వాళ్ళకి చెప్పి ఊళ్ళో ఉండేలా చూస్తాను. మీ అమ్మ అంత ఓపికమంతురాలు, తెలివి కలది కాదు. పై సంబంధానికి ఎగు పీట దిగు పీట వెయ్యలేదు. అన్నీ అక్క బావ చూడాలి. అయినా నీకు ఇష్టత లేదు అన్నావు కనుక వేరే సంబంధం చూసి చేస్తాను. నువ్వు అస్తమానం బంధువు లింటికి వెళ్ళవద్దు. ఎవరికి వారు నిన్ను చెయ్యమని మధ్యవర్తుల ద్వారా కబుర్లు చేస్తున్నారు సరేనా. నామాట విని ఇంటి పట్టున ఉండి నాలుగు శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు నేర్చుకో, మంచిది” అన్నారు

అలాగే సంగీతం సుబ్బారాయుడు వచ్చి పాఠం మొదలు పెట్టాడు. రాజ్యాలు శ్రద్ధ చేసేది కాదు. పెద్ద అమ్మాయి విని పాటలు నేర్చుకున్నది. మూడో పిల్ల స్వరాలు మొదలు పెట్టింది.

ఈలోగా రెండు బయటి సంబంధాలు చూశారు. ఆడబడుచులు లేరు, ఒకడే కొడుకు. పొలం ఉంది. తండ్రి రాజకీయ నాయకుడు. తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద పేరు.

రాజ్యాలు అయితే సరి, కానీ పిల్లాడు తొమ్మిది చదువుకొని, వేదం నేర్చు కొన్నాడు తెల్లగా ఉన్నాడు సంగీతం వచ్చు వయోలిన్ నేర్చుకున్నాడు, మంచి నెమ్మదస్తుడు ఇంకేమీ కావాలి? సరేనని కుదిర్చి డెబ్భై యోగాల పెళ్ళి చేసి సారె పెట్టి అత్త ఇంటికి పంపారు.

***

అత్తవారింట అన్ని వ్యవహారాలు రాజ్యాలు మామగారు చూస్తారు. కొడుకు కోడలు సుఖంగా ఉండటమే వారికి ఇష్టం. వాళ్ళ ఇద్దరినీ ఎంతో గారంగా చూసేవారు. ఆ ఊరి జమీందారు కోడలు రాజ్యాలు, రామయ్య భార్యగా ఆ ఊరి వాళ్ళు గౌరవిస్తారు.

ఆ రోజుల్లో కోడలికి కొడుక్కి కూడా హిందీ పరీక్షలు కట్టించి చదివించారు. మళ్లీ సంగీతం నేర్పించారు. అది మామగారు జనార్ధన్ గారి గొప్పతనము. అత్త గారు కూడా గారంగా చూసేది. తెల్లగా బొద్దుగా అందంగా ఉండే రాజ్యాలకి ఒంటి నిండా నగలు చేయించి ఆడపిల్ల లేని లోటు లేకుండా కోడల్ని చూసుకునేవారు. ఎంతో మంచితనం ఉంటే గాని అలా చూడలేరు.

కాల గమనంలో ఇద్దరు కూతుళ్లు నలుగురు కొడుకులు కలిగారు. దోస పాదులా ఇంటి నిండా పిల్లలు. మామగారు వంట మనిషినీ, పనిమనిషినీ ప్రత్యేకంగా పెట్టారు. ఎందుకంటే ఎడపిల్లలు చంటి పిల్లలు పురుళ్లు రెండింటికీ శాస్త్రి గారు తీసుకెళ్లారు.

మూడవ నెలల్లో బావగారు అక్క సారెతో తెచ్చి దింపి ఊరంతా పంచారు. పిల్లలను ప్రేమగా పెంచడంలో అత్తమామలు ముఖ్య పాత్ర వహించేవారు.

పొలం నుంచి పాలెళ్లూ వచ్చి నీళ్ళు తోడి వేడి నీళ్లు కాచి వెళ్ళేవారు. అలా పిల్లలు ఎదిగే వయసులో కూడా తాతగారు రాజకీయ నాయకులు కనుక పిల్లలను పెద్ద చదువులు చదివించారు. డాక్టర్, ఇంజినీర్, ఐ.ఎ.ఎస్. చదివారు. ఇద్దరు ఆడపిల్లల తరువాత పిల్లాడు గారం! వాడు ఎంబీఏ చదివాడు.

పెద్దవాళ్ళు ముగ్గురు విదేశాలు వెళ్లి స్థిరపడ్డారు. ఆఖరి వాడు మాత్రం ఊళ్ళోనే కంప్యూటర్ బిజినెస్, పొలాలు చూసుకుంటూ ఉన్నాడు. ఆడపిల్లలను డిగ్రీ అవగానే దగ్గర మేనత్త కొడుకులకి పెళ్లి చేసి పంపేశారు. ఇవన్నీ మామగారి ఒద్దిక లోనే జరిగాయి.

ఇంక ఆఖరి కొడుకుకి మాత్రం – చదువు తక్కువ, ఇంటి పనులు చేసే పిల్లని కట్నం లేకుండా చేసుకున్నారు. కోడళ్ళు పై వాళ్ళు. కొడుకులు విదేశాలకి వెళ్లి – తల్లినీ తండ్రినీ రమ్మనమని పట్టు పట్టారు. కానీ రామయ్య వప్పుకొలేదు.

కారణం ఇండియాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పట్టణాలు చూస్తే చాలు; నేల వదిలి సాము చెయ్యక్కరలేదు అనేవాడు. తనని అయినా రమ్మంటే, ఆయన రాకుండా ఎక్కడికి రానని చెప్పింది రాజ్యాలు.

“మేము చదువుకున్న వారము మాకు అవకాశాలు వచ్చాయి” అని విదేశాలకు వెళ్లారు పిల్లలు, అలా అని ఇండియాలో సొమ్ము వదులుకోరు కదా! వాళ్ళ సొమ్ములో కొంత ఆ ఊరి కాలేజీకి డొనేషన్ ఇచ్చి దానికి తాతగారి పేరు పెట్టించి కమిటీలో వీరి పేరు పెట్టుకున్నారు.

ఆఖరి కొడుకు శ్యామ్ ప్రసాద్ మాత్రం ఇంటిని అమ్మానాన్ననీ అన్ని చూసుకునేవాడు. అతని భార్య కూడా ఇంట్లో బాగా కలిసిపోయింది.

అలా అందరూ హాయిగా జీవిస్తూ ఆ ఊరి అభివృద్ధి గురించి ఎన్నో పనులు చేసేవారు. ‘కన్న తల్లి, ఉన్న ఊరు – ఈ రెంటిటిని మరువ కూడదు’ అనేవారు.

“ఈ ఏడాది తాతగారి శత జయంతి ఉత్సవాలు చెయ్యాలి. ఆయనకి రాజకీయంగా మంచి పేరు ఉన్నది. ఆయన ఎమ్మెల్సీ కూడా చేశారు. మన ఊరికి అప్పటి ప్రధాన మంత్రిని కూడా తెచ్చారు. అటువంటి గొప్ప వ్యక్తి కోడలు కావడం నా అదృష్టం” అంది రాజ్యాలు.

ఆనాడు ఊరి సంబంధం వద్దు అని పొరుగూరు సంబంధం చేసుకోవడం రాజ్యాలు అదృష్టం అని చెప్పాలి. భర్తకి చదువు తక్కువ అయిన సంస్కారం ఎక్కువ ఉంది, పని సామర్థ్యం ఉన్నది. తండ్రి వెనకాల అన్ని తెలుసుకున్నాడు.

***

ఉత్సవాలకి రెండు నెలల ముందు నుంచి ప్లాన్ చేశారు. విదేశాలో ఉండే పిల్లలను ఒక నెల ముందు రమ్మన్నారు. రాజ్యాలకి తెల్లవారగట్ల తులసి పూజ అలవాటు. గో పూజ కూడా వీలున్నప్పుడు చేస్తుంది. రామయ్య తెల్లవారగట్ల సంధ్యావందనం చేస్తాడు. ఏనాటి నుంచో ఇది ఇంటి పద్ధతిగా, అలవాటుగా సాగుతోంది.

పిల్లలు కూడా చిన్నతనంలో స్కూల్ నుంచి వచ్చి స్నానం చేసి హోమ్ వర్క్ చేసి పెందల కడే ఏడున్నరకి పట్టు పంచెలు కట్టి భోజనాలు చేసేవారు. రామయ్య కూడా వారితో పాటు తినేవాడు. ఆయన భోజనం అయ్యాక రాజ్యం తినే సరికి ఎనిమిది దాటేది. అప్పుడు వంట మనిషి తిని వెళ్ళేది.

అలా పిల్లలను గారంగా, పద్ధతిగా పెంచారు. వారు విదేశాలు వెళ్లి స్థిరపడ్డారు. అంతా వారి తాతగారి చలువ ఇది.

చిన్న కోడలికి నలుగురు పిల్లలు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంటర్‍కి వచ్చారు. రాజ్యాలు వెనుక అన్ని చూస్తుంది. కట్నం తక్కువ అయినా, చదువు తక్కువ అయినా పిల్ల మంచి కుటుంబం నుంచి వచ్చిందని పెళ్ళి చేశారు. ఆ అమ్మాయి అలాగే హత్తుకు పోయింది.

విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడి షాపింగ్ తెలియదు. అందుకని ముందుగానే కీర్తిని వెంట పెట్టుకుని సిటీకి వెళ్లి వెండి కమలాలు బంధువులకు పంచి పెట్టడానికి. ఊరు వాళ్ళకి స్టీలు బిందెలు కొన్నది.

మనుమలు – ఆడపిల్లలకి బంగారు గొలుసులు, మగ పిల్లలకి బ్రాస్లెట్స్, కోడళ్ళకి దుద్దులు, అల్లుళ్ళకి ఉంగరాలు, కూతుళ్ళకు గాజులు, కొడుకులకి చిన్న గొలుసులు కొన్నది. అందరికీ పట్టు బట్టలు – మనుమలకి పట్టు లంగాలు మగ పిల్లలకి పట్టు పంచెలు – కొడుకులకి పట్టు పంచెలు, కూతుళ్ళకు కోడళ్ళకి పట్టు చీరలు అల్లుళ్లకి సూట్‌లు కొన్నది.

రామయ్య పెద్దనాన్న పిల్లలు బొంబాయి, ఢిల్లీ, విదేశాల్లో ఉన్నారు. వాళ్ళకి రూమ్స్ బుక్ చేశారు. ఘనంగా మంచి పట్టు చీరలు, సూట్‌లు కొన్నారు.

పల్లెలో పెరగడం వల్ల రామయ్య పెద్ద చదువు లేకుండా గారంగా పెరిగాడు. అయన పనిమంతుడు, నిపుణుడైన వ్యవసాయదారుడు.

ఆ ఊరిలో మేడ కాక నాలుగు ఇళ్లు ఉన్నాయి. అన్నికూడా రంగులు వేయించి, మంచాలు పరుపులు వేయించి ఉంచారు. మేడ వెనుక పెద్ద దొడ్డి ఉంది. అక్కడ శుభ్రం చేయించి గాడి పొయ్యి పెట్టారు అక్కడే వంటలు భోజనాలు. ప్రక్కనే ఉన్న గార్డెన్‌లో చక్కగా స్టేజీ, కుర్చీలు వేశారు. ఖరీదైన సోఫాలు వేశారు.

రాజ్యాలు హడావిడి ఇంత అంతా కాదు. బంగారం లాంటి జీవితం మామగారు ఇచ్చారు. రాజ్యాలకి కోపం వచ్చినా, ఆనందం వచ్చినా పట్టుకోలేము.

ఎప్పుడు వెంకటగిరి జరీ చీరలు కడుతుంది. బయటకు వెళ్లినప్పుడు కంచి పట్టు చీర కడుతుంది. రెండేళ్ల కొకసారి బట్టలు మార్చి కొంటుంది. పాతవి పంచి పెడుతుంది, కొత్తవి మాత్రమే కడుతుంది. విదేశీ చీరలు పిల్లలు తెచ్చినవి, ఏడాది కట్టి – వంటవాళ్ళకి, పనివాళ్ళకి ఇస్తుంది.

వెండి కమలల్లో పసుపు కుంకుమ పెట్టి, చీరలు పాకెట్స్‌లో పెట్టింది. పండితులకు శాలువాలు బంగారు పతకాలు, మెమెంటోలు తెచ్చారు. కొందరు కళాకారులకి అతిథులకు రెసిడెన్సీలో రూమ్స్ బుక్ చేశారు.

విదేశీ కుటుంబాలు వచ్చే లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విదేశీ కుటుంబాలు వచ్చాక కావాల్సిన వాళ్ళని పిలుపులకి పంపింది. ఒకసారి బంధువుల్ని చూసినట్లు ఉంటుంది అని చెప్పింది.

గాడిపొయ్యి తవ్వించి వారం ముందే అరుసెలు, సున్నుండలు, పూతరేకులు, మిఠాయిలు, జంతికలు, చెక్కవడలు, కారం బూందీ, కారం పూస, పాలకోవా, కాజ మైసూర్ పాక్, రవ్వ లడ్డు అన్ని కూడా చేయించి డబ్బాల్లో పెట్టింది. ఎవరి పిల్లలకి ఏది ఇష్టమో అది పెట్టండి అని చెప్పింది

ఇష్టా రాజ్యం భరతుని పట్టం అన్నట్లు పిల్లలు ఆటలు పాటలు మొదలు! ఇల్లంతా లాప్టాప్‍లు సెల్ఫోన్ ఛార్జింగ్ వైర్లూ! చాలా ఏళ్ల తరువాత ఇల్లు కళకళలాడుతోంది అనుకుంది రాజ్యాలు.

ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అమ్మ నాన్నని కూర్చో పెట్టి – “పాత ఇళ్ళల్లో ఒక దాన్ని – వృద్ద ఆశ్రమం; రెండో దానిలో హాస్పిటల్‌కి – వెనుక బిల్డింగ్ లైబ్రరీకి ఇవ్వండి” అన్నాడు సత్యం. దానికి మిగిలినవాళ్ళు ఒప్పుకొన్నారు. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్ని కూడా చక్కగా ఏర్పాటు చేశారు.

ఆఖరి రోజు అమ్మ నాన్నకి కూడా పూజ చెయ్యాలి. అది వారు అనుకున్నది. ఈ ప్లాన్ అంతా ముందు కలెక్టరుకు, ఎం.ఎల్.ఏ, ఎంపి, మినిస్టర్లకి పంపారు.

వారు అంతా ఊరి అభివృద్ధికి చేస్తున్న కృషికి అభినందించారు.

***

ఆ రోజు రానే వచ్చింది. దేవాలయంలో పూజలు అభిషేకాలు చేయించారు. ఇంట్లో శ్రీ గణపతి హోమము, చండీహోమం, నవగ్రహ శాంతి, సూర్య నమస్కారాలు, శ్రీ అలిమేలు మంగా పద్మావతి సహిత శ్రీ వేంకటేశ్వర దీపారాధన, శ్రీ రమా సత్యనారాయణ వ్రతము చేసి ఘనంగా ఊరందరికీ భోజనాలు పెట్టారు.

ఆరోజు మధ్యాహ్నం ప్రముఖుల ఉపన్యాసాలు, సాయంత్రం సంగీత కచ్చేరీలు నృత్యాలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వాళ్ళ మనుమలు కూడా శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు పాడారు. కొందరు నృత్యం చేశారు. మొత్తానికి కళాకారులను, వేద పండితులను సత్కరించి పంపారు. ఆనందంగా అన్ని జరిగాయి.

“మనిషిగా పుట్టినందుకు కొంచెం మానవత్వం, కొంచెం దాతృత్వం ఉండాలి. అది నా బిడ్డలు నిరూపించారు. వాళ్ళు మా తాతల దీవెనల వల్ల సుఖంగా ఉండాలి” అని కొడుకుల్ని రామయ్య రాజ్యాలు దీవించారు.

“మా బావమరుదులు మంచి సేవ చేశారు” అని అల్లుళ్ళు; “వాళ్ళని పెంచిన మా రాజ్యాలు అత్త ది గ్రేట్” అన్నారు ఒక్కసారిగా. అందరూ నవ్వుకున్నారు ఆనందంగా. ఆ భవనంలో పందిరిలో విద్యుత్ దీపకాంతి వెల్లి విరిసింది.

శాంతి. శుభము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here