Site icon Sanchika

మా సిడ్నీ పర్యటన

[box type=’note’ fontsize=’16’] “అద్భుతమైన చారిత్రకకట్టడాలు…అత్యాధునిక ఆకాశహర్మ్యాలు… సుందర ఉద్యానవనాలు… విలువైన వారసత్వ నిర్మాణాలు… అందమైన బీచ్‌లు, సముద్ర తీరాలు… ఇలా ఎన్నింటికో నెలవై దేశ, విదేశాల పర్యాటకుల్ని నిత్యం ఆకర్షిస్తూ, ఆస్ట్రేలియా దేశానికి తలమానికమై భాసిల్లుతున్న సౌందర్యాల నగరమే సిడ్నీ” అంటున్నారు పి.వి.ప్రసాద్. [/box]

[dropcap]గ[/dropcap]తేడాది ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ఉంటున్న మా పెద్దబ్బాయి దగ్గరకు వెళ్లినపుడు సిడ్నీ టూర్‌కి వెళ్లివచ్చాం. మా కుటుంబ సభ్యులమంతా కలిసి అడిలైడ్ నుంచి విమానంలో సిడ్నీ చేరుకున్నాం. అక్కడ ముందుగా రిజర్వు చేసుకున్న రాడిసన్ హోటల్‌లో 3 రోజులు బసచేసి సిడ్నీలో ముఖ్యమైన ప్రాంతాలన్నీ తిరిగి చూసాం. ఆస్ట్రేలియాలోని మహా నగరాలలో సిడ్నీ ఒకటి. ఇది సౌత్‌వేల్స్ రాష్ట్రానికి రాజధాని. సిడ్నీ భౌగోళిక విస్తీర్ణం 12144.6 చదరపు కిలోమీటర్లు. జనాభా దాదాపు 54 లక్షలమంది ఉంటారు. జనాభాపరంగా ఆస్ట్రేలియాలో ఇది పెద్ద నగరం. ఇక్కడ ప్రపంచం నలుమూలలనుండి వచ్చిన విభిన్న సంస్కృతుల జనసమూహం ఉంది. ప్రపంచంలో అత్యంత జీవించదగిన 10 ప్రధాన నగరాలలో సిడ్నీ ఒకటి. 1788లో ఆర్ధర్ ఫిలిప్ మొదటి బ్రిటిష్ స్థావరాన్ని సిడ్నీలో స్ధాపించారు. సిడ్నీ పట్టణ ప్రాంతం కోస్తానదీ మైదానంలో ఉంది. పట్టణ ప్రాంతంలో అనేక నౌకాశ్రయాలు, సముద్ర తీరాలు ఉన్నాయి. వారసత్వ జాబితాలో నమోదైన అనేక భవంతులు ఉన్నాయి. సిడ్నీలో ఆస్ట్రేలియా రిజర్వ్ బ్యాంక్ కేంద్ర కార్యాలయం మరియు అనేక బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ సగానికన్నా ఎక్కువ ఆస్ట్రేలియా ప్రముఖ సంస్థలూ, పలు బహుళ జాతీయ సంస్థలకు చెందిన ప్రాంతీయ కేంద్రాలూ ఉన్నాయి.

మొదటిరోజు  ఉదయం 8-30కల్లా అల్పాహారం చేసి హోటల్ నుంచి బయలుదేరాం. ముందుగా డార్లింగ్ హార్బర్ ప్రాంతానికి వెళ్ళాం. ఇది సిటీకి ఆనుకుని ఉంటుంది. ఇక్కడ డార్లింగ్‌ బ్రిడ్జితో పాటు హార్బరు శివారు ప్రాంతంలోని మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, అంతర్జాతీయ సమావేశ కేంద్రం (ఐసిసి), ఆస్ట్రేలియా జాతీయ మారిటైం మ్యూజియం, స్టార్ కాసినో వంటివాటిని బయటనుంచే సందర్శించాం. తరవాత సముద్ర జీవులుండే సిడ్నీ ఆక్వేరియంకి వెళ్ళాం. ఇక్కడే వన్య ప్రాణుల ప్రపంచం, మేడమ్ టుస్సాడ్స్‌లూ ఉన్నాయి. వీటిని దర్శించడానికి టిక్కెట్లు కొనాలి. సిడ్నీలో కొన్ని ఆకర్షణీయ కేంద్రాల దర్శనార్ధం మూడింటికి కలిపి ఒక కూంబోప్యాక్ ఉంటుంది. పెద్దలకు 58డాలర్లు, పిల్లలకు 39డాలర్లు పెట్టి మేం కూంబోప్యాక్‌ పాస్ కొనుక్కొని ముందుగా ఆక్వేరియంకి వెళ్ళాం.

చూడచక్కనివి…

సముద్రజీవుల్ని చూడ్డానికి సిడ్నీ ఆక్వేరియం చాలా మంచి వేదిక. ఇందులోని రకరకాల చేపల అందాలను వీక్షించేందుకు ఏటా వేల సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. దాదాపు 650 ఆస్ట్రేలియా జాతులకు చెందిన 12వేలకు పైగా సముద్రజీవులు ఇక్కడ ఉన్నాయంట. ఇవన్నీ సందర్శకులకు కనువిందు చేస్తుంటాయి. చిన్న చిన్న చేపలతోపాటు పెద్ద పెద్ద డగాంగ్స్, షార్క్ లు, స్టింగ్‌రేలు, ఉష్ణమండల చేపలు, తాబేళ్ళు, పెంగ్విన్‌లను కూడా ఇక్కడ దర్శించవచ్చు. ఆక్వేరియంను చూస్తుంటే అద్భుతంగా తోచింది. ఇందులోనే ఆక్రిలిక్‌తో నిర్మించిన సొరంగమార్గాల ద్వారా నడుస్తూ చుట్టూ రంగురంగుల చేపలూ, రకరకాల ఆక్టోఫస్‌లూ, త్రిభుజాకారంలో ఉన్న తోకచేపలు, సొరచేపలు, సీహార్స్ లు,  తిమింగలాలను దగ్గరగా చూస్తుంటే ఓ వింత అనుభూతి కలుగుతుంది. ఇక్కడ మంచుగడ్డల్లో ఏర్పాటుచేసిన హిమవాతావరణంలో వున్న పెంగ్విన్‌లను  బోట్‌లో వెళ్ళి దగ్గరగా చూడవచ్చు. ఈ ఆక్వేరియం యూనివర్శిటీలు మరియు ఇతర సంస్థలకు సముద్రజీవులపై పరిశోధనలకుగాను అన్ని సహాయసహకారాలు అందిస్తుంది.

తరవాత మేడమ్‌టుస్సాడ్స్ మ్యూజియంకు వెళ్ళాం. ఈ భవనంలో మైనంతో చేసిన పలు బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక్కడ దేశ విదేశీ నాయకులూ, సినిమా ప్రముఖులూ, క్రీడాప్రముఖులూ, సంగీత మరియు ఇతర రంగాల ప్రముఖులూ, సూపర్‌మేన్ లాంటివి ఏర్పాటు చేశారు. మన జాతిపిత మహాత్మాగాంధీ, బాలీవుడ్ తారలు ఐశ్వర్యారాయ్, షారుఖ్‌ఖాన్, ప్రియాంకచోప్రా మరియు క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్‌ల విగ్రహాలను ఇక్కడ చూసి మేం పులకించిపోయాం. ఏ బొమ్మ చూసినా మనిషి నిలుచున్నట్లే అనిపించింది. ఒకదాన్ని మించి మరొకటి జీవకళ ఉట్టి పడుతూ వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. మేం గాంధీజీ మరికొంతమంది ప్రముఖుల బొమ్మల ప్రక్కన నిలబడి ఫొటోలు దిగాం. సమయాభావం వల్ల వైల్డ్ లైఫ్ సెంటర్‌కి వెళ్ళలేకపోయాం.

బీచ్ సోయగాలు…

అక్కడ నుంచి బోండిబీచ్‌ చూడ్డానికి బస్సులో బయలుదేరాం. సిడ్నీకి తూర్పు శివారులో సిటీ నుంచి 7 కి.మీ దూరంలో బోండిబీచ్ ఉంది. ప్రపంచంలోని ప్రధాన బీచ్‌లలో బోండిబీచ్ ఒకటి. ఆస్ట్రేలియాలో ఎక్కువమంది సందర్శించే పర్యాటక కేంద్రాలలో ఇదీ ఒకటి. బీచ్‌లోకి అడుగు పెట్టగానే అక్కడి అందాలు, ప్రకృతి రమణీయతలు మమ్ముల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. నీలి సాగర జలాలు, పిండిలాంటి మెత్తని ఇసుక, సర్ఫింగ్ క్రీడాభ్యాసాలు, జనం మధ్య సంచరించే అందమైన పక్షులు..వంటి ప్రత్యేకతలతో ఈ బీచ్ పర్యటకులకు కనువిందు చేస్తుంది. మా మనుమడు, మనుమరాలు అయితే కేరింతలతో అలల్ని తాకుతూ, నీళ్ళలో తేలియాడుతూ పరవశించిపోయారు. బీచ్ ఒడ్డున ఉన్న కేఫ్‌లు, రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. తరవాత అక్కడ నుంచి హోటల్‌కి చేరుకుని విశ్రాంతి తీసుకున్నాం. ఆ రాత్రి చైనా బజార్‌కి వెళ్ళాం. సందర్శకులతో కిటకిటలాడిపోతోంది. ఇది బహుళ సాంస్కృతికసమాజ మార్కెట్. ఇక్కడ ప్రధానంగా చైనా దేశానికి చెందిన పలు రకాల వస్తువులు దొరుకుతాయి.  ఇక్కడున్న చిన్న చిన్న షాపులు, పుడ్‌స్టాల్స్  సందర్శకుల్ని ఊరిస్తుంటాయి.

 

అనుపమాన సౌందర్యం…

మర్నాడు ఉదయాన్నే బయలుదేరి మెట్రోరైల్లో సర్కులర్‌క్వే ప్రాంతానికి వెళ్ళాం. ఇది పర్యటకులతో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. సిడ్నీ విహార ప్రదేశాలలో ఇది ముఖ్యమైనది. ఇక్కడ ఒపేరాహౌస్ మరియు హార్బర్‌వంతెనలు అద్భుతమైన వీక్షణలు. ముందుగా సిడ్నీ హార్బర్‌లో కొలువుదీరిన  ఒపేరాహౌస్‌కి వెళ్ళాం. అది చూడ్డానికి మహా ఆకర్షణీయంగా ఉంది. అసమాన సౌందర్యంతో చూపరులను కట్టిపడేస్తుంది. ఒపేరాహౌస్ అనేది బహుళవేదికా ప్రదర్శన కళల కేంద్రం. ఇది 20వ శతాబ్దం యొక్క అత్యంత ప్రసిద్ధమైన మరియు ప్రత్యేకమైన భవనాలలో ఒకటి. దీనిని డానిష్ వాస్తుశిల్పి జోర్న్ఉట్జన్  రూపకల్పన చేశాడు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఇది ఒకటి. తెరచాపల్లాంటి పై కప్పులతో చిత్రమైన ఆకారంతో ఉండే దీని నిర్మాణం 14ఏళ్ళు పట్టింది.  సముద్రపు ఒడ్డున ఒద్దికగా నిలిచివున్న దీన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇందులో ఐదు సమావేశ మందిరాలు, ఒక పెద్ద కచేరీ మందిరం మరియు నాటక మందిరాలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి మొత్తం 5738 మంది కూర్చోవడానికి వీలుంది. ఈ వినూత్న అద్భుత కట్టడాన్ని కళాత్మకతకు నిలువెత్తురూపంలో నిర్మించారు. అలరించే ఈ భవన అందాలను కెమెరాలో బంధించి చెంతనే ఉన్న మరో అపురూప వీక్షణం హార్బర్‌బ్రిడ్జి వైపు కదిలాం.

బ్రిడ్జివిశిష్టతలు…

సిడ్నీ హార్బర్‌వంతెన అనేది హార్బర్‌పై ఉక్కుతో నిర్మించిన విల్లువంటి వంతెన. సిడ్నీ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ మరియు ఉత్తర తీరాల మధ్య వాహనాలు, పాదచారుల రాకపోకలకై ఇది నిర్మించ బడింది. 1149 మీటర్ల పొడవుతో ప్రపంచంలోని ఐదవ అతి పెద్ద పరిధి గల వంపు వంతెనగా పేరు గాంచింది. ఈ వంతెన శిఖరాగ్రం సముద్రమట్టానికి 440 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీని నిర్మాణ శైలి అద్భుతం. వంతెనయొక్క మొత్తం ఉక్కు బరువు 52800 టన్నులంట. వంతెనపై ద్వారాలను గ్రానైట్‌తో చెక్కారు. ఈ వంతెన మొత్తం 8 మార్గాలను కలిగి ఉంటుంది. దీని ప్రధాన రోడ్డు మార్గాన్ని బ్రాడ్‌ఫీల్డ్ హైవే అని పిలుస్తారు. సిడ్నీ యొక్క నూతన సంవత్సర వేడుకల్లో ఈ వంతెనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆ సమయంలో ఇక్కడ బాణాసంచా ప్రదర్శనలతో సందడి చేస్తారు. ఏటా ఒక్కొక్క నమూనాతో బాణాసంచా కాంతిలో వంతెన కన్పించే విధంగా రూపకల్పన చేయడం ఓ విశేషం.  మేం ఫెర్రీలో కూడా పయనిస్తూ ఒపేరాహౌస్, హార్బర్‌వంతెనల అందాలను మరింత దగ్గరగా ఆస్వాదించ గలిగాం. అలా విహరించడం మాకు ఆనందానుభూతినిచ్చింది.

సుందర ఉద్యానవనం…

ఒపేరాహౌస్‌కి దగ్గరగా ఉన్న రాయల్ బొటానికల్ గార్డెన్‌ని కూడా సందర్శించాం. దీని విస్తీర్ణం 74 ఎకరాలు. ఇది ప్రపంచంలోని అతి ముఖ్యమైన బొటానికల్ సంస్థలలో ఒకటి. ఇది 4 ఆవరణలుగా ఉంటుంది. వాటిని లోయర్, మిడిల్, ప్యాలెస్‌గార్డెన్లు మరియు బెన్నెలాంగ్ ఆవరణలుగా పిలుస్తారు. వీటిల్లో అనేక రకాల చిన్న తోటలు మరియు పచ్చికమైదాన ప్రాంతాలు ఉంటాయి. ఈ ఉద్యానవనం అంతులేని ప్రకృతి సంపదతో అలరారుతూ దర్శనమిస్తుంది. ఇక్కడ కాలినడకన వెళ్ళలేని వారు టిక్కెట్లతో ‘చూచూ’ అనే చిన్న రైల్లో వెళ్లి చూసిరావచ్చు.   చిన్న చిన్న మొక్కలనుంచి మహావృక్షాల వరకు అరుదైన వృక్షజాతులెన్నో ఇక్కడ కనులవిందు చేస్తుంటాయి. ఆ చెట్లన్నీ మళ్ళీమళ్ళీ సిడ్నీ రమ్మని సందర్శకులను ఆహ్వానిస్తున్నట్లుంటాయి.

ఆకాశపు అంచున…

ఆ సాయంత్రం సిడ్నీటవర్‌ని చూడ్డినికి వెళ్ళాం. ఇది మార్కెట్‌స్ట్రీట్‌లో నిర్మితమై నగరానికి ఓ ఐకాన్‌గా ఉంది. ఈ టవర్ ఎత్తు 309 మీటర్లు. టవర్ 4 విభాగాలుగా ఉంటుంది. మొదటి 3 లెవెల్లలో బార్‌లు, రెస్టారెంట్లు, బఫెట్, స్టూడియో ఉంటాయి. 4వ లెవల్‌ని అబ్జర్వేషన్‌డెక్ అని అంటారు. దీనినే సిడ్నీటవర్‌ఐ అని కూడా పిలుస్తారు. ఇది భూమట్టానికి 820 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనికి వెళ్ళాలంటే టిక్కెట్లు కొనాలి. అయితే మేం మొదటి రోజు కొన్న కూంబోపాస్‌ని 3వ ఆకర్షణ కింద ఇక్కడ వాడుకున్నాం. డెక్‌కి చేరుకోవడానికి అతివేగవంతమైన 3 డబుల్‌డెక్ లిప్ట్లున్నాయి. ఈ అబ్జర్వేషన్‌డెక్‌కి వెళ్ళగానే సిడ్నీ గురించి 4డీ సినిమా ఒకటి ప్రదర్శిస్తారు. అది చూస్తున్నప్పుడు సిడ్నీ సోయగాలు మన కళ్ళముందే ప్రత్యక్షమై చిత్రమైన అనుభూతి కలుగుతుంది.  తరవాత డెక్ ప్లాట్‌ఫాం అంతా తిరిగిచూశాం. నగరాన్ని 360 డిగ్రీల్లో వీక్షించే వేదిక అది. టవర్ నుంచి రాత్రివేళలో కిందకు చూస్తుంటే నగరమంతా విద్యుత్తు కాంతుల్లో తళుకులీనుతూ సందర్శకులను అలరిస్తుంది. మనం ఆకాశపు అంచున ఉన్నామన్న భావన కలుగుతుంది.

అపురూప వారసత్వభవనం…

మూడోరోజు ఉదయం జార్జిస్ట్రీట్‌లోని విక్టోరియా భవనం చూడ్డానికి వెళ్ళాం. బేసిమెంటుతో కలిపి ఇది 4 అంతస్తుల భవనం. దీనిలో గ్యాలరీలు, రకరకాల షాపులు, కాఫీకేఫ్‌లు లాంటివి చాలా ఉన్నాయి. బిల్డింగ్‌ అండర్‌గ్రౌండ్‌లో కూడా షాపింగ్‌మాల్స్ ఉన్నాయి. ఈ భవనంలో ఉన్న స్మారక చిహ్నాలు, చారిత్రక దృశ్యాలు చూపు తిప్పుకోనివ్వవు. రాయల్‌క్లాక్ మరియు గ్రేట్ ఆస్ట్రేలియన్‌క్లాక్ అనే రెండు పెద్ద యాంత్రిక గడియారాలు ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణలు. ఇంకో విశేషమేమిటంటే 1986లో ఎలిజిబెత్‌రాణి-2చే రాయబడిన లెటరు ఒకటి ఈ బిల్డింగ్ డోమ్‌లో ఓ చోట సీల్డ్ కవరులో ఉంచబడిందట. 2085లో దీనిని సిడ్నీ మేయర్ ప్రజల సమక్షంలో తెరిచి చదివి వినిపించాలని ఓ శిలాఫలకంపై లిఖించబడి ఉంది. దానిని ఆసక్తిగా అందరూ చదువుతూ ఫొటోలు తీసుకోవడం ఓ సరికొత్త అనుభూతినిచ్చింది. ఎన్నో విశిష్టతలున్న ఈ భవనం ఆస్ట్రేలియా వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.

తరవాత దగ్గరలోని కొన్ని మాల్స్ కూడా సందర్శించి హోటల్‌కి వెళ్ళాం. అలా మూడురోజుల మా సిడ్నీ యాత్రలో చాలానే చూశాం. ఇవన్నీ చూడటానికి మేం రోజుకు కనీసం 5,6 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. అయినప్పటికీ కాలుష్య రహితమైన సిడ్నీలో ఎంత దూరం నడిచినా బడలిక తెలియలేదు. అణువణువూ అందాలతో తొణికిసలాడే సిడ్నీ పర్యాటక స్వర్గధామంగా అలరారుతూ సందర్శకులకు ఒక మంచి అనుభూతిని మిగులుస్తుంది. ఆ అనుభూతితోనే మేం తిరిగి వచ్చాం.

Exit mobile version