Site icon Sanchika

చక్కని అనుభూతినిచ్చే ఆత్మకథాత్మక దీర్ఘకావ్యం ‘మా ఊరొక కావ్యం’

[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘మా ఊరొక కావ్యం’ అనే కవితా సంపుటి సమీక్షని అందిస్తున్నాము.]

[dropcap]‘మా[/dropcap] ఊరొక కావ్యం’ ఒక విభిన్నమైన కవితా సంపుటి. నిజానికి ఈ పుస్తకాన్ని ‘కవితా సంపుటి’ అనటం సమంజసం అనిపించదు. ఇందులోని కవితలు వరుసగా రాసినవి కావు. అన్నీ ఒకసారి రాసినవి కావు. పలు విభిన్నమైన సమయాలలో, సందర్భాలలో రాసి పత్రికలలో అచ్చు అయిన కవితలను ఒక పద్ధతి ప్రకారం, కాలగమన క్రమంలో పేర్చి కూర్చటం వల్ల ఈ కవితలు ఒక దానికొకటి సంబంధం లేని వేర్వేరు కవితలుగా కాక ఆత్మకథాత్మక కవితలుగా, వ్యక్తి జీవిత పరిణామ క్రమాన్ని, అతని జీవితానుభవాలను, అనుభూతులను, అనుబంధాలనూ ప్రదర్శించే ‘సుదీర్ఘ వచన కవితా కావ్యం’లా, ఆత్మకథాత్మక కావ్యంలా అనిపిస్తుంది. కవితా సంపుటి అంటే సంబంధం లేని కవితలను సంపుటీకరించిన కవితా పుస్తకంలా అర్థమయ్యే కాలంలో ఒకదానితో ఒకటి సంబంధం ఉండి, ఏకసూత్రతతో బంధితమైన ఈ కవితల సంపుటిని ‘వచన కవితా కావ్యం’ అనటం సముచితం అనిపిస్తుంది.

ఇందులో మొత్తం 35 కవితలున్నాయి. అందమైన ఆహ్లాదకరమైన ముఖచిత్రం – పుస్తకంలోని కవితలు చదవటం పట్ల కుతూహలాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ముఖచిత్రాన్ని అందించిన వాడ్రేవు చినవీరభద్రుడు గారికి అభినందనలు, ధన్యవాదాలు.

‘నిన్ను తలవని రోజుండదు’ అంటూ ఆరంభమై ‘నిన్ను మరిచిన జ్ఞాపకం లేదు’ అంటూ ముగిసే ఆరంభ కవిత కవి జీవనానుభూతుల ప్రపంచంలో  ప్రయాణానికి ఆహ్వానం పలుకుతుంది. మూడ్‍ని స్థిరపరుస్తుంది.

‘నీ చూపుల్లో నేనున్నాను
నా బాల్యపు మదినిండా నీ ఊసులే
నా తొలి అడుగులను ముద్దాడిన
నిన్ను మరువ లేదెన్నటికీ’ (‘మట్టిపొత్తిల్లి’లో)

అంటారు కవి తాను జన్మించి, ఎదిగిన ఊరిని తలచుకొని అక్కడి అనుభూతులను తలచుకుంటూ. తాను అడుగిడి నడిచిన భూమిని ‘నా తొలి అడుగులను ముద్దాడిన’ అనటం అద్భుతం అనిపిస్తుంది. పిల్లవాడి ప్రతి చర్యను అద్భుతం అనుకుంటూ, అతడి పాదాలను తల్లి ముద్దాడుతుంది. భూమాత కూడా అంతే మరి! తల్లి ముద్దాడటం ఒక వయసు తరువాత ఆగిపోతుంది. కానీ, భూమాత, జీవితాంతం తన పిల్లల పాదాలను ముద్దాడుతూనేవుంటుంది.

ఇంకా జన్మించినప్పటి నుంచీ ఊళ్లో తన అనుభవాలు, ఆడిన ఆటలు, పాడిన పాటలు, అనుభవించిన అనుబంధాలు, ఆప్యాయతలు అన్నిటినీ ఈ పుస్తకంలోని కవితలలో ప్రదర్శించారు కవి. అప్పటి పరిస్థితులతో ఇప్పటి పరిస్థితులను పోలుస్తూ, మంచి మార్పులకు సంతోషిస్తూ, జీవాన్ని, బంధాల్ని హరించిన మార్పులకు విషాదం వ్యక్తపరుస్తూ కవితలలో తన ఆలోచనలను  సంధించి అందించారు కవి.

‘గ్లోబల్ వంచనలో
మధురమై బాల్యం గుర్తులు శిధిలమైనవి
వెతలు వినే సౌజన్యమూర్తులు లేరు
దారులను చూపే మార్గదర్శకులు లేరు’ (నా తత్త్వం నీ దేహమే)

అంటూ ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు ‘సౌజన్యమూర్తుల రాహిత్యం’, ‘మార్గదర్శకులు లేకపోవటా’న్ని ఎత్తి చూపిస్తారు కవి.

‘నాగరితక వికాసంలో
పట్టుగొమ్మలైన వృత్తులు ఆగిపోయినా
వాళ్ల యాదిని మాత్రం మరువలేదెప్పటికీ’ (కాలగర్భంలో)

అంటూ ఆ కాలంలో ప్రతి ఇంటి ముందు, లోగిళ్లలో ప్రదర్శితమయ్యే కళానైపుణ్యాన్ని, ప్రతి ఒక్కరి వృత్తుల ద్వారా ప్రకటితమయ్యే సృజనాత్మక కౌశలాన్ని బాగా ప్రదర్శించారు కవి. గమనించ వలసింది, అభినందించ వలసిన విషయం ఏమంటే ఈ కవితలలో ప్రేమ, అవగాహన, ఆప్యాయత, అనుబంధాలు తప్ప, ద్వేషం, క్రోధం, ఆవేశం, అనర్థదాయకమైన వికృతపు విచ్ఛిన్నపుటాలోచనలు అణుమాత్రమైనా కనబడవు.

ఆవేశం అలంకారమై, ద్వేష ప్రదర్శన  అవార్డులకు అడ్డదారి అయిన సమకాలీన సాహిత్య ప్రపంచంలో కవి తన మనో మథనం వల్ల జనించిన హాలాహలాన్ని గళంలో బంధించి హృదయం లోలోతుల్లోంచి పెల్లుబికిన అమృతపుటాలోచనలను తన కవిత్వంలో ప్రదర్శించటం అభినందనీయం,  వాంఛనీయం. ఊరు మార్పు చెందటం, ఆ మార్పుకు తగ్గట్టు మారుతున్న సామాజిక చిత్రాన్ని, వ్యక్తిగత సంబంధాల పరిస్థితులను తన కవితల్లో దృశ్యమానం చేశారు కవి.

మధ్యమధ్యలో ‘ఆదరణ కోల్పోయిన ఎర్రడబ్బా’ అంటూ పోస్టు బాక్స్‌ను తలుస్తారు కవి. పాఠశాలపై అనుభవాల వర్షాన్ని కురిపిస్తారు. తాను చేసిన అల్లరిని, నేర్చిన పాఠాలను, గుణపాఠాలను పలు కవితల్లో ప్రస్తావిస్తారు కవి. గ్రంథాలయాన్ని తలచుకుని శతకోటి వందనాలు అర్పిస్తారు. ‘చెదిరిన స్వప్నాలను/నిత్యం సలుపుతున్న గాయాలను/నిరంతరాయంగా గేయాల్లా సృజిస్తున్నాను’ అంటూ సాంత్వన పొందుతారు.

ఊరిని ప్రేమిస్తున్న కవి నగరంపై ద్వేషం ప్రకటించలేదు, అనేక ఇతర కవులలా. ‘జీవన పథానికి విద్య నందించి తోడునందించిన/ఈ నగరమంటే నాకు వల్లమాలిన ప్రేమ’ అంటారు. ‘ఐదు దశాబ్దాల అంతరంగం’ కవితలో యాభై ఏళ్ళ తన జీవితాన్ని అవలోకనం చేసి ప్రదర్శించారు కవి. విలేఖరిగా తన జీవితం, తండాలలో అనుభవాలు, తాను తిరిగిన దారుల్లో అయస్కాంతంలా అతుక్కున్న అనుభూతులు అన్నింటినీ ఈ కవితల్లో ప్రదర్శించారు కవి గోపగాని రవీందర్.

‘పునర్దర్శన ప్రాప్తిరస్తు’ కవితలో గుండెల్లో గూడు కట్టుకున్న ఊరి స్వరూపాన్ని విహంగ వీక్షణం చేస్తూ, ‘పునర్దర్శన ప్రాప్తిరస్తు’ అంటూ ఈ ఆత్మకథాత్మక వచన కవితా కావ్యాన్ని ముగించారు కవి.

మానవ సంబంధాలే ‘వీకేండ్ టు వీకెండ్’, అయి ,  ‘వీక్’ అయి ‘ఎండ్’ అయిపోతున్న ప్రస్తుత సమాజంలో తను జన్మించిన, ఎదిగిన ఊళ్ళను గుర్తుపెట్టుకుని, నిత్యం స్మరిస్తూ, అనుక్షణం ప్రేమిస్తూ, ప్రతి అనుభూతిని విశ్లేషిస్తూ, మథిస్తూ, అమృతాన్ని కవితల రూపంలో ప్రదర్శించి అందిస్తున్న కవి అభినందనీయులు. చాలా చాలం తరువాత చక్కటి దీర్ఘ ఆత్మకథాత్మక కావ్యం చదివిన అనుభూతి కలిగిస్తుందీ పుస్తకం.

***

మా ఊరొక కావ్యం (కవిత్వం)
రచన: గోపగాని రవీందర్
ప్రచురణ: కస్తూరి విజయం
పేజీలు: 160
వెల: ₹ 270/-
ప్రతులకు:
(ప్రింట్ ఆన్ డిమాండ్)
కస్తూరి విజయం
ఫోన్: 9515054998
kasturivijayam@gmail.com
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Maa-Uroka-Kavyam-Gopagani-Ravinder/dp/8196611684

 

~

గోపగాని రవీందర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-gopagani-ravinder/

Exit mobile version