మా వాడ నాకొక విశ్వ నగరం..!

0
2

[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘మా వాడ నాకొక విశ్వ నగరం..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మా[/dropcap] వాడలో
రెండు పూల చెట్లున్నాయి
ఒకటి తెల్లని పూలతో
మరొకటి పసుపుపూలతో విలసిల్లుతుంటాయి
ఆ పూల చెట్లెప్పుడూ వాడిపోవు
ఒకవైపు ధవళ వర్ణముంటే
మరొకవైపు పసుపు వర్ణముంటుంది
దారికి ఇరువైపులా
హారతినిస్తున్నట్లుగా పూలగుత్తులుంటాయి..!

మా వాడలో
రక్షణ కవచంలా రెండు కుక్కలున్నాయి
ఒకటి నల్లనిది మరొకటి గోధుమ రంగుది
అవెప్పుడూ పోట్లాడుకోవు
తలెత్తి కనులతో చూస్తుంటాయి
పొద్దంతా పట్టనట్లుగా సోమరిగా
అవెప్పుడూ పడుకునే ఉంటాయి
రాత్రైతే చాలు ఈ చివరి నుండి ఆ చివరికి
నిత్యం తిరుగుతూనే ఉంటాయి
అపరిచితులెవరొచ్చినా మొరుగుతూ
మమ్మల్ని అప్రమత్తుల్ని చేస్తుంటాయి..!

మా వాడలో
రెండు విద్యాలయాలున్నాయి
ఆ చివరన ఒకటుంది
ఈ చివరన ఒకటుంది
ఆహ్లాదం కలిగించే హరివిల్లుల్లా
పిల్లలందరూ అటు కొందరు ఇటు కొందరు
జ్ఞాన సంచులను మోస్తూ నడుస్తుంటారు
కొందరు ఆటోల్లో మరికొందరు సైకిళ్లపై
ఇంకొందరు తల్లుల చేతులను పట్టుకొని
పాద ధూళితోపాటు మాటలను వెదజల్లుతూ
గాలిని పరమానందభరితం చేస్తుంటారు
చూపరులకు కనువిందును కల్గిస్తుంటాయి..!

మా వాడలో
ప్రసిద్ధులైన ఇద్దరు కవులున్నారు
ఒకరెప్పుడు కవిత్వరాగాలు వినిపిస్తుంటారు
మరొకరెప్పుడు కవిత్వ నినాదమై ఊరేగుతుంటారు
ఇద్దరి అక్షరాల్లో పచ్చదనం తొణికిసలాడుతుంది
మార్గాలు వేరువేరు కావచ్చు
ఆ చివర ఈ చివర కలువనట్లుగానే
వాళ్ల భావాలు కూడా సమాంతర రేఖల్లా
దిగంతాల వరకు సాగుతూనే ఉంటాయి..!

మా వాడలో
ఉద్యోగులున్నారు నిరుద్యోగులున్నారు
రైతులున్నారు రైతు కూలీలున్నారు
పెద్ద వ్యాపారులు చిరువ్యాపారులున్నారు
అసమానతలున్నాయి తారతమ్యాలున్నాయి
రాజకీయ నాయకులు కార్యకర్తలున్నారు
సమస్యలను అధిగమించే సమరయోధులున్నారు
కుటిలయత్నాలను తిప్పికొట్టే సారధులున్నారు..!

మా వాడలో
భవంతులపైన డిష్ గొడుగులున్నాయి
అవి లేకపోతే వైఫై సిగ్నల్స్ రిసీవర్సులున్నాయి
ప్రతి ఇంటిని బంధించే ఇనుప గేట్లున్నాయి
సాయంకాలమైందంటే కొందరు వృద్ధ మహిళలు
గేట్ల ముందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు
వాట్సాప్ సమాచారమంతా చక్కర్లు కొడుతుంది
తాజా వార్తలన్నీ కొద్దిసేపట్లోనే పాతపడిపోతాయి..!

మా వాడలో
సబండ వర్ణాల ప్రతిభావంతులున్నారు
భిన్న మతాల పద్ధతులను పాటించే వారున్నారు
ఎవరి కాంక్షలు వారివే ఆకాంక్షలు వారివే
ఒకరికి మరొకరెప్పుడు సారూప్యం కాదు
పట్టుదలలు వారివే ఇండ్లల్లో వేడుకలు వారివే
పరుగెడుతున్న ప్రపంచానికి నమూనా మా వాడ
అందుకనే నేననుకుంటానెప్పుడూ
మా వాడ నాకొక విశ్వ నగరమని..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here