కాజాల్లాంటి బాజాలు-142: మా వదిన – విడాకులు

2
2

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]ఎ[/dropcap]ప్పట్లాగే పొద్దున్నే వదిన దగ్గర్నించి ఫోనూ. మామూలుగానే పనిలోపడి నేనూ తియ్యలేదు. వదిన ఊరుకుంటుందా! వాట్సప్‌లో మెసేజ్ పెట్టింది. “మీ అన్నయ్యకి డైవోర్స్ ఇచ్చేస్తున్నానూ..” అంటూ.

వదినకీ, నాకూ ఈ డైలాగు అలవాటే. పదిరోజులకోసారి అన్నయ్యకి విడాకులు ఇచ్చేస్తానంటుంటుంది. మళ్ళీ ఆ మర్నాడే అన్నయ్యకి ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంటుంది. అందుకే నేను ఆ మెసేజిని కూడా పట్టించుకోకుండా పూర్తిగా నా పనిలో మునిగిపోయేను.

మధ్యాహ్నం పన్నెండు దాటాక కాస్త పని తీరి, కాఫీ కలుపుకుని, గ్లాసు పుచ్చుకుని తాగుతూ వాట్సప్ మెసేజిలు చూస్తుంటే వదిన దగ్గర్నించి ఏకంగా నాలుగు మెసేజి లున్నాయి.

మొదటిది, ‘మీ అన్నయ్యకి డైవోర్సు ఇచ్చేస్తున్నాను.’

రెండోది, ‘రాత్రి ట్రైన్‌కి వెళ్ళిపోతున్నాను’

మూడోది, ‘కాదు, మధ్యాహ్నమే బస్సెక్కి వెళ్ళిపోతున్నాను.’

నాలుగోది, ‘మీ అన్నయ్యవి నాలుగు జతలు డ్రైక్లీనింగ్‌కి ఇచ్చేను. ఆ మహానుభావుడికి గుర్తు చెయ్యి.’

ఇవన్నీ చదివేక ఈసారి ఏదో పెద్ద గొడవే అయినట్టుంది అనుకున్నాను. అయినాసరే, నేనెప్పుడూ అన్నయ్య పక్షమే కనక,

‘ఎందుకు వదినా, దేవుడులాంటి అన్నయ్యతో దెబ్బలాడతావూ!’ అని మెసేజ్ పెట్టేను.

ఠక్కున జవాబొచ్చింది వదిన దగ్గర్నించి.

“హా.. దేవుడే.. నెత్తి మీద కొబ్బరికాయ కొట్టినా రాయిలా కదలడు, మెదలడు.” అంటూ.

హబ్బో.. ఇదేదో చూడాల్సిన విషయమే అనుకుంటూ, వదినని కాస్త ఏడిపించాలనిపించి వదినకి ఫోన్ చేసేను.

“ఇంతకీ నువ్వు రైల్వే స్టేషన్‌లో ఉన్నావా.. బస్ స్టేషన్‌లో ఉన్నావా!” అనడిగేను.

నన్ను మించిపోయింది కదా మా వదిన. అందుకే,

“రెండూ కాదు.. ఏర్‌పోర్ట్‌లో ఉన్నాను..” అంది.

దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది నాకు.

“బోర్డింగ్ పాస్ తీసేసుకున్నావా!” అన్నాను ఆతృత నంతా గొంతులో పలికిస్తూ.

“ఆహా. అంతా అయిపోయింది” అంది.

అది విన్నాక నాకు వదిన నిజంగా వెళ్ళిపోతోందేమో ననిపించింది.

“అసలేం జరిగింది వదినా!” ప్రేమనంతా గొంతులో గుప్పిస్తూ అడిగేను.

ఆమాత్రం అడిగినందుకే సంబరపడిపోయింది వదిన.

“ఇవాళ వాట్సప్ చూసేవా!”

“ఊ..”

“అందులో ఫ్రెండ్స్ గ్రూప్ చూసేవా!”

“ఊ..”

“చూసి కూడా నీ బుర్రకి తట్టలేదంటే ఏవనాలీ!”

“అబ్బా.. ఏవుందీ అందులో.. మొన్ననే మాతృదినోత్సవం అయిపోయింది కదా! ఇంక అంత మహిళలకి ప్రత్యేకంగా ఏవుందనీ!”

“మన మంగ ఆ సెలిబ్రిటీ వీడియో ఫార్వార్డ్ చేసింది, చూడలేదూ!”

విషయం ఏవిటో అర్థ మవక, “నువ్వు సూటిగా విషయమేవిటో చెప్పకపోతే నేను ఫోన్ పెట్టేస్తాను.” బెదిరించేను.

నిజంగా అన్నంత పనీ చేస్తాననుకుందేమో మరీ.. అసలు సంగతి చెప్పడం మొదలెట్టింది.

“మొదటి వీడియో ఏంటంటే మొన్న మాతృదినోత్సవానికి ఒక సెలిబ్రటీ కోడలు వాళ్ల అత్తగారి చేత ఆవకాయ బిజినెస్ పెట్టించింది. మహిళా ఎంటర్‌ప్రెన్యుయర్ అంటూ అన్ని పేపర్లలో ఫొటోలతో సహా వచ్చింది కూడా.

ఆ సెలిబ్రిటీ అత్తగారు ఆవకాయ ముద్దలు కలిపి అందరికీ రుచి చూడమని ఇవ్వడం, అందరూ తెగ మెచ్చుకోవడం సోషల్ మీడియా అంతా వైరల్ కూడా అయింది.”

“అవునూ!.. అయితే!”

“మరి మళ్ళీ, ఇవాళ సోషల్ మీడియా అంతా ఇంకో వీడియో వైరల్.”

“అదేవిటీ!”

“అంత కష్టపడి ఒక చిన్న బౌల్‌లో ఆవకాయ అన్నంలో కలిపి అందరికీ రుచి చూడమని ఇచ్చి అలిసిపోయిందని వాళ్ళాయన ఆ మహిళా ఎంటర్‌ప్రెన్యుయర్ అయిన అత్తగారిని, రిలేక్స్ అవడానికి మలేషియా తీసికెడుతున్నాట్ట. ఏర్‌పోర్ట్‌లో నవ్వుతూ నిలబడ్డ వాళ్ళిద్దరి ఫొటో వేసి రాసేరు. చూడలేదూ!”

ఇది నిజంగానే నేను చూడలేదు. కానీ అలా అనకుండా “అందులో పెద్ద చెప్పుకోడానికి ఏవుందీ!” అన్నాను తేలిగ్గా తీసేస్తూ.

“అంతే.. అంతే.. ఆ అన్నకి తగ్గ చెల్లెలివే. మీకు తెలీదు సరే ఇంకోళ్ళు చేస్తున్నా చూసి కూడా నేర్చుకోరు.”

“ఇందులో నేర్చుకోడానికి ఏవుందీ! అది వాళ్ల ఫేమిలీ మేటర్. అంతే.” అన్నాను తేలిగ్గా తీసేస్తూ.

“అదే.. అదే.. ఆ ఫేమిలీ మీకు లేదా అని అడుగుతున్నాను. పనివాళ్ళ చేత ఆవకాయ పెట్టించి అలిసిపోయినందుకే వాళ్ళాయన ఆమెని మలేషియా తీసికెడుతున్నాడే.. మరి, స్వయంగా కారం కొట్టించి.. ఆవాలు దంపించి, గానుగ నూనె దగ్గరుండి ఆడించి తెచ్చి.. మావిడికాయలకోసం తోటకెళ్ళి కోయించి తెచ్చి, శుభ్రంగా కాయలన్నీ కడిగి, తుడిచి, దగ్గరుండి నలగకుండా ముక్కలు కొట్టించి, జీళ్ళు తీసి, పొరలు విడదీసి, శుభ్రంగా తడి లేకుండా తుడిచి, పొడులన్నీ సరిగ్గా కొలతల ప్రకారం కలిపి, చేతులు మండిపోతున్నా లెక్క చేయకుండా జాడీలోకి గుచ్చెత్తి, ఏడాదికి సరిపడా మూడు జాడీల ఆవకాయ పెట్టిన నేను మీ ఫేమిలీ లేడీని కాదా! బిజినెస్ కోసం ఆవిడ చేస్తే వాళ్ల ఫేమిలీ ఆవిడ అలిసిపోయిందని ఆరాటపడుతున్నారే.. మరి ఉత్తి పుణ్యానికి పిల్లలకీ, అమెరికాలో ఉన్న ఆడపడుచులకీ ఆవకాయ సప్లై చేస్తున్న నేను మీ ఫేమిలీ లేడీని కాదా!

మీ ఫేమిలీ కోసమే ఈ పని చేస్తున్నాననే గుర్తింపు అసలు మీ అన్నయ్యకి ఏకోశాన్నైనా ఉందంటావా! నాకు కాస్తైనా విశ్రాంతి నివ్వాలని మీ అన్నయ్య బుర్రకి తట్టదు సరే.. ఇలాంటి వైరల్ అవుతున్న వీడియోలు చూసైనా ఆ బుర్రకి ఎక్కదా!”

వదిన ఇస్తున్న ఉపన్యాసానికి నాకు నోట మాట రాలేదు.

“ఇంత కష్టపడినందుకు గుర్తింపుగా మలేషియా కాకపోయినా మాల్దీవ్స్ అయినా తీసికెళ్ళొచ్చు కదా! పోనీ, అదీ వద్దు. ఓ నాల్రోజులు పక్కనున్న మద్రాసయినా తీసికెళ్ళి నాకు కాస్త వంటింటి నించి శెలవు ఇవ్వొచ్చు కదా! అసలా మనిషికి ఇదేమీ పట్టనే పట్టదు సరికదా.. పని కట్టుకుని ఈ వీడియో చూపిస్తే ‘ఓ.. నైస్’ అంటూ వెళ్ళిపోయేరు.”

వదినకి ఏం చెప్పాలో నాకు తోచలేదు.

“ఇంకీ మనిషితో వేగలేను, అయిపోయింది నా ఓపిక, అందుకే వెళ్ళిపోదామనుకున్నాను. ఏం.. సెలిబ్రిటీలు మాత్రమే వెళ్ళాలా రిలేక్సేషన్ అంటూ.. నేనూ ఆవకాయ పెట్టేను. నేనూ అలిసిపోయేను. నన్నూ రిలాక్సేషన్ కంటూ బైటకి తీసికెళ్ళాలికదా మీ అన్నయ్య! హబ్బే.. ‘చెపితే వినడు, గిల్లితే ఏడుస్తాడు’ అన్నట్టు మీ అన్నయ్యకి తెలీదు, చెపితే అంతకన్నా అర్థం అవదు. ఇంక లాభంలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.”

“అన్నయ్యకి అన్నీ డైరెక్ట్‌గా చెపితేనే కానీ అర్థం అవదు వదినా. నీకు చెప్పడం తెలీక మా అన్నయ్యని ఆడిపోసుకుంటున్నావు.”

“నా తల్లే.. ఆ అన్నకి తగ్గ చెల్లెలివే. ఎంత డైరెక్ట్‌గా చెప్పేననుకున్నావ్! ఆ వీడియో చూపించి, చక్కగా పక్కన కూర్చుని, కమ్మటి కాఫీ ఇచ్చి, ‘మరి మనం ఎప్పుడు వెడదామండీ!’ అంటే మీ అన్నయ్యేమన్నారో తెల్సా!

నేను చెవులు ఫోన్‌కి అంటించేసేను.

‘మాగాయకాయ తెచ్చుకుందుకేనా.. రేపు వెడదాంలే.’ అన్నారు.”

ఫక్కున రాబోయిన నవ్వుని బలవంతాన ఆపుకున్నాను. కాస్త శబ్దం వినపడిందేమో,

“నవ్వూ.. నవ్వూ.. మొహమాటం ఎందుకూ!” అంది అవతల్నించి వదిన.

“అయితే ఇప్పుడు నీ ప్రయాణం ఎక్కడికో!” ఆరా తీసేను.

“కేరళలో రిసార్ట్‌కి, ఓ నాల్రోజుల్లో వచ్చేస్తాం”

“వచ్చేస్తామంటే!” అర్థం కాలేదు నాకు.

“వచ్చేస్తామంటే ఇద్దరం కలిసి, అదే నేనూ మీ అన్నయ్య ఓ నాల్రోజులు కేరళలో గడిపి వద్దామని వెడుతున్నాం.”

అసలు వార్త చల్లగా చెప్పింది వదిన.

“హమ్మ వదినా, మొత్తానికి సాధించేవన్న మాట. నెరజాణ వనిపించుకున్నావ్. అయితే డైవోర్స్ మాట లేనట్టేగా!” తేలిగ్గా అన్నాను.

“ప్రస్తుతానికి పక్కన పెట్టేనంతే. మళ్ళీ కావల్సినప్పుడు తీస్తాను.” అంది.

“ఇది అన్యాయం వదినా. నువ్వు ఊరగాయలు పెట్టి అలిసిపోయేవని రిలేక్సేషన్ కోసం అన్నయ్య నిన్ను కేరళ తీసికెడుతున్నాడు కదా. ఇంకా డైవోర్సు మాటెందుకూ! మానెయ్యి. వినడానికి కూడా విసుగ్గా ఉంటోంది.” స్పష్టంగా చెప్పేసేను వదినతో.

“హమ్మా. అలా ఎలా కుదురుతుందీ! ఈ ట్రిప్ నేను పేచీ పెట్టి, పోరు పెట్టి, టికెట్లు కొని, రిసార్ట్ బుక్ చేస్తే ఇంక తప్పదురా భగవంతుడా అని వస్తున్నారు మీ అన్నయ్య. అందుకే ప్రస్తుతానికి డైవోర్స్ మాట పక్కకి మాత్రమే పెట్టేను. ఎప్పుడయితే తనంతట తనే నా గురించి ఆలోచించి, నాకు ఏది ఇష్టమో తెల్సుకుని, ప్లాన్ చేసి, నాక్కావల్సిన చోటుకి సర్‌ప్రైజ్ అంటూ తీసికెడతారో అప్పటిదాకా ఈ మాట పక్కనే అందుబాటులోనే ఉంచుకుంటాను.”

వదిన మాటలకి ఏం చెప్పాలో నాకు తోచలేదు. అసలు ఎప్పటికైనా వదిన అన్న ఈ మాటలు అన్నయ్యకి అర్థం అవుతాయా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here